16, మే 2023, మంగళవారం

స్వామివారి హాస్యచతురత

 స్వామివారి హాస్యచతురత


పరమాచార్య స్వామివారి సల్లాపము, హాస్యచతురత చాలా హుందాగా ఎవరిని బాధపెట్టకుండా ఉంటుంది. మహాస్వామివారు నన్ను చెల్లం (ప్రియమైన), కిత్తువాయ్(నత్తి ఉన్నవాడు), రిక్షా ఓట్టి (రిక్షా లాగేవాడు) అని పిలిచేవారు.


మిరాజ్ నగరానికి దగ్గర్లోని వినాయక దేవాలయంలో మకాం చేస్తున్నాము. తరువాత మేము ఉండబోయే చోటుకు వెళ్లి, అక్కడ ఉండడానికి వసతులని చూసిరమ్మని స్వామివారి ఆజ్ఞ.


వారి ఆదేశానుసారం పని ముగించి, వినాయక దేవాలయం లోపలకు వెళ్ళాను. స్నానం చేసిన తరువాత శ్రీకంఠన్ మామను కలిశాను.


“రాత్రి నుండి స్వామివారు పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు. పాలు, పళ్ళు ఏమీ తీసుకోవడం లేదు. స్వామివారిని ఒప్పించడానికి మేము ఎంతగానో వేడుకున్నాము, కాని ఫలితం లేదు. నువ్వు చిన్న పిల్లాడివి. నువ్వు వెళ్లి అడిగితె, బహుశా పరమాచార్య స్వామివారు అంగీకరించవచ్చు” అని నాకు చెప్పారు.


పరమాచార్య స్వామివారికి వందనం చేసి, పనిపై నేను వెళ్ళిన చోట అక్కడి భక్తులు ఇచ్చిన పళ్ళను స్వామివారికి సమర్పించాను. 


“నువ్వు భోజనం చేశావా?”


లేదన్నాను.


“వెళ్లి నీ భోజనం ముగించి తరువాత రా”


శ్రీకంఠన్ మామ నాకు చెప్పిన విషయాన్ని ప్రస్తావించడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. “పెరియవా భిక్ష స్వీకరించిన తరువాత నేను భోజనం చేస్తాను”.


మహాస్వామివారు తినమని ఒత్తిడి చేసిన తరువాత అక్కడి నుండి వెళ్తూ, “నేను తరువాత భోజనం చేస్తాను” అని అన్నాను. అయిదు నిముషాల తరువాత స్వామివారి నుండి పిలుపు. నేను స్వామి వారి వద్దకు వెళ్లాను.


స్వామి వారు ఎదురుగా ఉన్న పళ్ళ నుండి రకానికి ఒక పండు తీయమని చెప్పారు. తీసి స్వామివారికి ఇచ్చాను. ప్రతి పండుని స్వామివారే కోసి సగం పండును నాకు ఇచ్చి రుచి ఎలా ఉందో చెప్పమన్నారు. వగరుగా లేని పళ్ళ సగాన్ని స్వామివారు స్వీకరిస్తారు అనుకుని వాటిని తీసుకుని తిన్నాను.

ప్రతి పండు యొక్క రుచిని అడిగారు స్వామివారు. నేను చెప్పాను.


“ఇప్పుడు నీ ఆకలి తీరిందా?” అన్నారు స్వామివారు.


ఎంతటి సహజమైన మాటలు. ‘చూడు నిన్ను ఎలా మోసగించానో’ అన్న అతిశయం లేకుండా!! నాకు ఏడుపు వచ్చింది. మా అమ్మే గుర్తుకు వచ్చింది. నేను ఆకలికి తాళలేను అని వేళ కాని వెల నాకు అన్నం - రసం వండిపెట్టేది. గొంతు గాద్గదికమైంది. శ్రీకంఠన్ మామ బాధను స్వామివారికి తెలిపాను. 

“నిన్న ఆదివారం. కాని నేను పాలు పళ్ళు తీసుకున్నాను. దానికి ప్రాయశ్చిత్తంగానే, ఈరోజు భిక్ష లేకుండా ఉన్నాను. ఈరోజు ప్రదోషం కదా, ప్రదోష పూజ ముగించిన తరువాత నేను భిక్ష చేస్తాను”


నాకు ప్రాముఖ్యతను ఇచ్చి స్వామివారు సమాధానం ఇచ్చినందుకు నేను గర్వ పడాలా? లేక చిన్న దోషం కోసం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నందుకు నేను కరిగిపోవాలా? నాకు అర్థం కావడం లేదు.


ఆదివారం రాత్రి ఉపవాసం పాటించాలన్నది శాస్త్రవిధి. అందుకే శ్రీమఠంలో ఆదివారం సూర్యాస్థమయానికి ముందే ఏమైనా స్వీకరించడం పరిపాటి. ఆదివారం రాత్రి వంటింటిలో పని చెయ్యడం ఉండదు. అందుకనే స్వామివారు నన్ను ఇలా ఆదేశించారు.


కులకర్ణి అనే భక్తుడు స్వామివారు ముందు ఒక చేతి గడియారాన్ని ఉంచాడు. దాన్ని ఒకసారి చూసి, “ఇది ఎందుకు?” అని అడిగారు స్వామివారు.


“మేకు కైంకర్య చేసే వారికి ఎవరికైనా ఇస్తారని తీసుకుని వచ్చాను. స్వామివారు దీంతో ఇష్టమైనది చెయ్యవచ్చు”


స్వామివారు ఆ వాచీని చేతిలో తీసుకుని దాన్ని అటు ఇటు తిప్పి చూశారు. తరువాత నన్ను పిలిచి దాన్ని నా చేతికి కట్టుకోమన్నారు. “ఇది ఎప్పుడూ నీ చేతికి ఉండాలి. నేను ఎప్పుడు సమయం అడిగినా, నువ్వు చెప్పాలి” అని ఆదేశించారు.

ఆ చేతివాచీ ఇప్పటికీ నావద్ద ఉంది. అదొక గొప్ప ఐశ్వర్యంగా దాన్ని కపాడుకుంటున్నాను.


“ఒక వంద లేదా వందాయాభై బంగారు కాసులను తయారుచేసి, వెంటనే ఒక సేసాలో నావద్దకు తీసుకునిరా” అని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. ఒక్క నిముషం పాటు నాకు ఏమీ అర్థం కాలేదు. తరువాత, స్వామివారు చెప్పిన విషయం అర్థమై, అక్కడి నుండి కదిలి బయటకు వచ్చాను.


స్వామివారి దర్శనం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. స్వామివారు నాతో చెప్పిన మాటలు ఖచ్చితంగా వీరందరూ వినే ఉంటారు. కొద్దిమందికి నమ్మకంగా ఉంది, “వంద, వందాయాభై బంగారు కాసులు అంటే, నాకు కూడా ఖచ్చితంగా ఒక రెండు మూడు కాసులు దొరుకుతాయి. వాటిని నేను పూజలో ఉంచుకుంటాను . . .”


అందరూ నన్ను చుట్టుముట్టారు. “నాకోసం రెండు మూడు కాసులు” అని నన్ను అభ్యర్థించారు. “ఆహా!” అని అక్కడినుండి వెళ్ళిపోయాను.


పరమాచార్య స్వామివారి దర్శనం కోసం వేదపండితులు, శాస్త్రాధ్యయనం చేసినవారు వస్తుంటారు. వారిని తగిన విధంగా గౌరవించదలచి వారిని తగు రీతిన సన్మానిస్తుంటారు.


అక్కడి నుండి నేను వేగంగా వెళ్ళిపోతుండగా మైలాపూరుకు చెందిన ఒక మహా పండితుడు నన్ను మర్యాదగా పిలిచి, “నువ్వు నాకోసం ఒక పడి పన్నెండు బంగారు కాసులు ఇవ్వాలి” అని చెప్పాడు. “సరే”


అసలు పరమాచార్య స్వామివారు చెప్పింది కేరళలో విరివిగా లభించే పొడవైన అరటిపళ్ళను గుండ్రంగా తరిగి వేయించి తీసుకుని రమ్మని. ఒక గంట తరువాత వాటిని సిద్ధం చేసి, మైలాపూర్ పండితుడు నన్ను అడిగిన విషయం స్వామివారికి చెప్పగా, “అతణ్ణి పిలువు” అన్నారు స్వామివారు. ఆ పండితుడు లోపలకు వచ్చారు.


“రెండు చేతులూ చాపు” ఆ పండితుడు లోపల చాలా సంతోషపడుతూ అత్యంత వినయంగా చేతులు చాచాడు. పరమాచార్య స్వామివారు చేతినిండుగా వాటిని తీసుకుని అతని దోసిలిలోకి వేశారు. ఆ పండితునికి ఏమీ అర్థం కాలేదు. కాని పరమాచార్య స్వామివారిని ఎలా అడగడం? ఏమని అడగాలి?


వాటిని తీసుకుని బయటకు వస్తూ, “నాకు పెరియవా ఎందుకు చిప్స్ ఇచ్చారు?” అని పండితుడు నన్ను అడిగాడు.


“మీరు అడిగినదే కదా!”


“నేనా? నేనేదుకు వారిని చిప్స్ అడగాలి? ఎప్పుడు అడిగాను?”


“గంట క్రితం మీరు నన్ను అడిగారు; నేను అదే స్వామివారికి తెలిపాను”


“కాని నా చెవులకు బంగారు కాసులు అన్నట్టుగా వినబడిందే”


“అది ఇదే. పరమాచార్య స్వామివారు అర్దోక్తిగా అన్నది ఇదే”


ఆ పండితునికి ఎంతో నిరాశ. “పెరియవా ఇచ్చిన ప్రసాదం” అని తమాయించుకున్నాడు.


--- ఇందువాసన్, వలాజపెట్టై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: