16, మే 2023, మంగళవారం

హనుమజ్జయంతి ప్రత్యేకం - 5/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  5/11 

         (ఈ నెల 14వతేదీ హనుమజ్జయంతి) 

         

V. హనుమ - ఆచార్యుడు 


   "భగవంతుని పొందాలి"  అనే ఆర్తి జీవునిలో కలిగినపుడు, భగవానుడే ఆచార్యుని ఎంచి, జీవుని వద్దకు పంపుతాడు. 

    ఆచార్యుడు వేద సంపన్నుడు, భగవదనుభవము పొందినవాడు కావలెను. 

   "శ్రోత్రియమ్ బ్రహ్మనిష్ఠమ్" అని ఆచార్యుని అర్హతగా చెబుతుంది శ్రుతి. 


అ) శ్రోత్రియుడు (వేద సంపన్నుడు) 

    వేద పండితుడవడానికి సరియైన శిక్షణ - ధారణ - ప్రయోగము అనేవి ప్రధానం. 


    హనుమ మొదటగా రామలక్ష్మణులను కలసి మాటలాడినప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమను గూర్చి ప్రశంసించిన విషయం అతిగొప్పది. 

    హనుమ ఋగ్వేద, యజుర్వేద, సామవేదములను అధ్యయనము చేసిన పరిపూర్ణుడని, 

    మూడు వేదాలకి సంబంధించి వరుసగా "వినీతః, ధారిణః, విదుషః" అనే మూడు విశేషణాలతో పొగడబడ్డాడు. 


(i) వినీతః 


    ఋగ్వేదమున ప్రతివర్ణానికీ స్వరముంటుంది. గురువు వద్ద ఎంతో శిక్షణ పొందినగానీ దానిని సరిగా చదువలేరు. అందుకని హనుమను "ఋగ్వేద వినీతుడు" అన్నాడు రాముడు. 

   'వినీతుడు' అంటే 'శిక్షితుడు" (Trained). 


(ii) ధారిణః 


    యజుర్వేదంలో ఒక అనువాకంలో వాక్యము మరొక అనువాకంలో కనబడుతూంటుంది. అవి కలియకుండ ధారణ అవుసరం. 

    అందుచే "యజుర్వేద ధారిణః" అన్నాడు. 

   "ధారణ" అంటే జ్ఞాపకశక్తి (Memory). 


(iii) విదుషః 


    సామవేదము గాన ప్రధానము. 

    గానములో మార్పులు చేయు జ్ఞానము "విదుషత్వము". 

    అది కలవాడని హనుమను శ్రీరాముడు "సామవేద విదుషః" అని గుర్తించాడు. 

   "విదుషిత్వము" అంటే సరియైన ప్రయోగము (Proper practical application). 


    కాబట్టి హనుమ త్రయీ అని, మూడుగా నున్న వేదాలకు సంబంధించి, 


* శిక్షణ పొందినవాడు,  

* జ్ఞప్తియందుంచుకొనేవాడు,  

* ప్రయోగించువాడు అని 

      మెచ్చుకోబడి శ్రోత్రియుడయ్యాడు. 


ఆ) బ్రహ్మనిష్ఠుడు (భగవదనుభవము పొందినవాడు) 


    వేదాధ్యయన జ్ఞానముతో అభ్యాసము చేయుచూ, భగవత్తత్త్వము అనుభవించుట బ్రహ్మనిష్ఠ. 


    రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై ఆసీనులను చేసి, సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్ళాడు హనుమ. 

    తద్వారా, పరమాత్మతో ప్రత్యక్ష అనుభూతి పొందినవాడై, బ్రహ్మనిష్ఠుడయ్యాడు. 


    పరమాత్మ 

  - వేదజ్ఞానపరాయణుడైన హనుమను గుర్తించి, 

  - తాను హనుమకు పరమాత్మానుభూతి కూడా కలిగించి ఆచార్యుని చేశాడు. 


ఆచార్యుడు - జీవుడు 


   "లంక" అనే దేహంలో, 

   "సీత" అనే జీవుని, 

   "రావణుడు" అనే ఇంద్రియాలు బంధించి యుంచితే, 

    ఆ "సీత" అనే జీవుడు 

        "రాముడు" అనే పరమాత్మను పొందాలని ధ్యానిస్తున్నప్పుడు, 

   "హనుమ" అనే ఆచార్యునితో అక్కడకు, 

  

   "అంగుళీయకము"తోపాటు తన సందేశాన్ని భగవంతుడైన శ్రీరాముడు పంపాడు. 


మనకి మార్గదర్శకం 


    మనం కూడా ఆ సందేశం పొందాలి. 


    సరియైన విషయమై 

  - శిక్షణ(Training), 

  - జ్ఞప్తి(Memory), 

  - జీవితంలో ఆచరణ (Application/Interpretation), అనే మూడిటితో శ్రోత్రియునిగా తయారుచేసి, తద్వారా, 

      సాధనలో అనుభూతితో బ్రహ్మనిష్ఠునిగానూ చేసి, 

      మనలను తావలెనే మార్చి అనుగ్రహిస్తాడు హనుమ. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: