16, మే 2023, మంగళవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 61*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 61*


సింహళవాసుల్లో ఒకడు నవ్వి "విశేషమే గురుదేవా ! మగధసేనాధిపతుల్లో ముఖ్యులైన బలబద్ర, బాగురాయణులు ఇప్పటికీ మహానందుల వారి భక్తులే... నంద వారసుడు బ్రతికే వున్నాడని తెలిస్తే చాలు, సైనిక పటాలంలో చీలిక తెచ్చి అధికభాగాన్ని చంద్రగుప్తుల వారికి అనుకూలంగా మార్చి వేస్తారు" అని చెప్పాడు సిద్ధార్థకుడు. 


చాణక్యుడు నొసలు చిట్లించి "సరి. సరి. ఇందులో అనుకున్నంత విశేషమేముంది ? నిపుణకా ! నీ దగ్గర సమాచారం ఏమిటి ?" అడిగాడు. 


నిపుణకుడు నమస్కరించి "ఒకప్పుడు పాంచాలాధీశుడు పురుషోత్తముడితో నందులు సంవత్సరానికి రెండు లక్షల సువర్ణములు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలెగ్జాండర్ దండయాత్ర అనంతరం బలహీనపడిన పురుషోత్తముడు తన సైనిక బలగాన్ని వృద్ధి చేసుకోవడానికి నందులు రెండు లక్షల బదులు ఏటేటా అయిదు లక్షల సువర్ణాలు చెల్లించాలని వార్త పంపించాడు" అని చెప్పాడు. 


"నందులు అంగీకరించారా ?" ఆతృతగా ప్రశ్నించాడు చాణుక్యుడు. 


నిపుణకుడు నవ్వి "లేదు. నందసోదరడు, కోశాధికారి అయినా ధర్మనందుడు లోభికదా నందుల మంత్రి ఒకరిని లోబర్చుకుని 'అలెగ్జాండర్ చేతిలో పరాజితుడైన పురుషోత్తముడికి పూర్వపు ఒప్పందాన్ని పాటించి రెండు లక్షలు కూడా ఇవ్వనవసరం లేదనీ, ఇప్పుడు బలహీనుడైన పురుషోత్తముడు మగధను కన్నెత్తి చూడలేడని' చెప్పించాను" అన్నాడు. 


"ఆ మాట నచ్చి, డబ్బు ఆదా అయినందుకు ఆనందించిన నందులు 'నీకు ఒక్కకాసు కూడా ఇవ్వము. నీ చేతనైంది చేసుకో' అని వర్తమానం పంపించి ఉంటారు. అవునా?" అడిగాడు చాణక్యుడు.


నిపుణుడు తల ఊపి "అంతా తమరు వూహించినట్లే జరిగింది" అని చెప్పాడు. 


చాణక్యుడు నవ్వి "భేష్ ! నువ్వురా చాణక్యుడి శిష్యుడివంటే...." అని మెచ్చుకున్నాడు. 


"అయ్యో ! అదేమిటి స్వామీ ! ఇప్పుడే పాంచాల భూపతి మగధపై దండెత్తి వస్తే....?" ఆదుర్ధాగా ప్రశ్నించాడు చంద్రగుప్తుడు. 


చాణక్యుడు నవ్వి "అవును. పాంచాల ప్రభువు నందుపై దండయాత్రకి సర్వం సిద్ధం చేస్తాడు. కానీ .... నిన్ను మగధాధీశుని చెయ్యడానికి సహాయంగా వస్తాడు. నువ్వు చక్రవర్తివయ్యాక ఒకప్పుడు నందులు అతనితో ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు నీ సార్వభౌమత్యాన్ని అంగీకరిస్తూ ఏటేటా కప్పం చెల్లించేలా నీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు ఆ ప్రభువు" అని చెప్పాడు గంభీరంగా. చంద్రగుప్తుని వదనం పూర్ణచంద్రబింబంలా వికసించింది. 


చాణక్యుడు అదోలా మొదటి శిష్యుని చూస్తూ "సిద్ధార్థకా ! నిపుణకుడి తంత్రం విన్నావా... అదిరా చాకచక్యం అంటే...." అని కవ్వించాడు. 


సిద్ధార్థకుడు మొహం మార్చుకొని "నేనూ చూపించానులెండి, నిపుణకుడి పాటి చాకచక్యం.... మహాపద్మనందుడికి ఇచ్చిన మాటకోసం నందులను రాక్షసుడు భరిస్తున్నాడనీ, నిజానికి బ్రాహ్మణద్వేషులైన నందులను అధికారపీఠాన్నించి దించి వెయ్యడానికి అదనుకోసం రాక్షసుడు ఎదురుచూస్తున్నాడని, బ్రాహ్మణ సంతర్పణల పేరిట బోలెడంత ధనాన్ని నందుల చేత ఖర్చు చేయిస్తూ వారిని బ్రాహ్మణ ద్వేషులుగా రాక్షసుడే ప్రచారం చేయిస్తున్నాడనీ... ధర్మశాలలో చాణక్యగురుదేవులకు జరిగిన అవమానం, ఒక పథకం ప్రకారం - నందులను బ్రాహ్మణ ద్వేషులుగా బహిరంగంగా నిరూపించడానికి రాక్షసుడే - జరిపించాడనే అనుమానాన్ని నందుల్లో రేకెత్తించి, నందులకీ రాక్షసునికీ మధ్య విభేదాలకు అంకురార్పణ చేసి మరీ... తమ దర్శనార్థం వచ్చానులెండి" అని చెప్పాడు. 


"శభాష్ ....! ఇదిరా చాకచక్యమంటే... అనుకోకుండా జరిగిన సంఘటనలను సైతం 'అనుకూలంగా' మార్చగలవాడే అసలైన చారుడు. ఈ ఏడుపు ముందే ఏడ్చావు కావేం ?" అన్నాడు చాణక్యుడు మెచ్చుకుంటూ. 


సిద్ధార్థకుడు బింకంగా "ఏదీ, తమరు నన్ను పూర్తిగా ఏడవనిస్తే గదా...." అని నవ్వాడు. 


చాణక్యుడు వాత్సల్యంగా అతని భుజం తట్టి "ఇక అక్కడ జరగాల్సిందంతా 'ఇందుశర్మ' నడిపిస్తాడు. మీరు ప్రచ్ఛన్న వేషాల్లో పాటలీపుత్రంలో సంచరిస్తూ అతడి నాటకానికి అనుకూలంగా మీ పాత్రలు మార్చుకుంటూ కథను రక్తి కట్టించండి" అని చెప్పాడు శిష్యులను వెళ్లిపోవచ్చన్నట్లు సూచిస్తూ. 


"చిత్తం. మీ దర్శన భాగ్యం ఏడాది కాలం తర్వాత ఈనాడు లభించింది. ఈ ఏడాదికాలంలో తమరొక ఇంటి వారయ్యారని విన్నాం. ఆ విశేషాలు మాకూ కాస్త వినిపిస్తే, ఆ సంతోషాన్ని మేమూ...." నసిగాడు నిపుణకుడు. 


(ఇంకా ఉంది)...


 *సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: