4, మార్చి 2026, బుధవారం

బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

04-03-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

---------------------------------------


మిధునం


దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


కర్కాటకం


ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------


సింహం


అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------


కన్య


ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

---------------------------------------


తుల


ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

---------------------------------------


వృశ్చికం


వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


ధనస్సు


గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.

---------------------------------------


మకరం


గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి.

---------------------------------------


కుంభం


వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి.

---------------------------------------


మీనం


ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 3 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                

           *14వ భాగం*


*బ్రహ్మాండం - అర్థనారీశ్వర స్వరూపం ఆవిర్భావం*```


శౌనకాది మునులు సూత మహర్షిని "బ్రహ్మాండం అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణువులలో నిజమైన సృష్టికర్త ఎవరు?" అని అడిగారు.


సూత మహర్షి సమాధానం చెబుతూ "అనంతమైన ఈ విశ్వాంతరాళాన్ని అవ్యక్తం అని కూడా అంటారు. సృష్టికి పూర్వం నిరాకారంగా శూన్యంలో ఉన్నది అవ్యక్తమే. అవ్యక్తము నుంచి పరబ్రహ్మ స్వరూపం వ్యక్తమైంది. పరబ్రహ్మ సృష్టికి సంకల్పంచేశాడు అప్పుడు పరబ్రహ్మం రోమకూపాల నుంచి అనంత విశ్వంలోకి పంచభూతాత్మకమైన అనేక బ్రహ్మాండాలు వెలువడ్డాయి. ప్రతి బ్రహ్మాండాన్ని ఆవరించి ఏడు ఆవరణలు ఏర్పడ్డాయి.


అన్నిటికన్నా పైన మహత్తత్త్వం ఉంటుంది. దీనిలోపల అహంకార తత్త్వం ఉంది. అహంకార తత్త్వం లోపల ఆకాశ తత్త్వం, ఆకాశ తత్త్వం లోపల వాయు తత్త్వం, వాయుతత్త్వం లోపల తేజోతత్త్వం, తేజతత్త్వం లోపల జలతత్త్వం, జలతత్త్వం లోపల పృధ్వీ తత్త్వం ఉంటాయి. 

ఈ సప్త ఆవరణలు ఒకదానికన్నా ఒకటి పది రెట్లు పెద్దవి. ఒకదానిలో మరొకటి ఇమిడి ఉంటాయి. సప్త ఆవ రణలు ఈవిధంగా కలిగి ఉన్నదానిని బ్రహ్మాండం అంటారు.


ప్రతి బ్రహ్మాండంలోను పద్నాలుగు లోకాలు ఉన్నాయి. సుఖాలు ఇచ్చేవి ఊర్థ్వలోకాలు, దుఖాలు ఇచ్చేవి అధోలోకాలు. సుఖదుఃఖాలు ఇచ్చేది మధ్యనున్నభూలోకo. మూడురకాల అనుభవాలు ఇచ్చేవి కనుక మూడింటిని త్రిలోకాలు అంటారు. సృష్టికర్త ఆద్యుడైన పరబ్రహ్మ మాత్రమే. ఎందుకంటే పరబ్రహ్మ నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవించాయి. అందుకని పరబ్రహ్మను పరమాత్మ అని, నారాయణుడు అని, సర్వేశ్వరుడు అని అంటాము.


బ్రహ్మాండాలలో సృష్టికార్యం కోసం నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మలను సృష్టించాడు. చతుర్ముఖ బ్రహ్మల ద్వారా ఆయా బ్రహ్మాండాలలో సృష్టి కార్యం జరుగుతుంది. పరబ్రహ్మ చేసే సృష్టి అద్వారక సృష్టి, స్వయంసృష్టి అయితే, చతుర్ముఖ బ్రహ్మలు చేసే సృష్టిని సద్వారక సృష్టి లేదా పరోక్ష సృష్టి అంటారు. ప్రతి బ్రహ్మాండంలో 

ఆ బ్రహ్మాండానికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మ సంకల్పించిన సృష్టి కార్యాన్ని పూర్తి చేస్తాడు.


ఈ చతుర్ముఖ బ్రహ్మలకు ఒకరితో మరొకరికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ పరబ్రహ్మను అందరూ తమ సృష్టికర్తగా, తమకి తండ్రిగా భావిస్తారు. పరబ్రహ్మము నుంచి చతుర్ముఖ బ్రహ్మల ద్వారా సకల సృష్టి జరుగుతుంది. అలాగే మహా లయం జరిగినప్పుడు బ్రహ్మలతో కలసి సకలం పరబ్రహ్మం లోనే విలీనం అవుతుంది"


విన్న శౌనకాదిమునులు ఆనందంతో నమస్కరించి "మహర్షీ! ఈ కథనం విన్నాక పరబ్రహ్మఅయిన శ్రీమహావిష్ణువు దివ్యలీలలు మీ నుంచి తెలుసుకోవాలనే కుతుహలం మరింత పెరిగింది. మన బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు సృష్టి తరువాత చతు ర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యం ఎలా ప్రారంభించాడో వివరించి చెప్పండి" అని కోరారు.


సూత మహర్షి సరేనని "పద్నాలుగు లోకాల సృష్టి జరిగిన తరువాత పద్నాలుగు లోకాల నివాసులను సృష్టించడానికి శ్రీమహావిష్ణువు సహాయం కోరుతూ అష్టాక్షరి మంత్ర జపంచేస్తూ ధ్యానంలో నిమగ్నుడైనాడు. చాలా కాలం తపస్సు చేసిన తరువాత పరబ్రహ్మ ప్రసన్నుడై జరగబోయే సృష్టి తత్త్వము బ్రహ్మకు తెలియజేయాలని అర్థ నారీశ్వర రూపంతో బ్రహ్మముందు ప్రత్యక్షమైనాడు.


సగం పురుషుడు, సగం స్త్రీగా తనముందు సాక్షాత్కరించిన దివ్య రూపం చూసి మొదట బ్రహ్మ ఆశ్చర్యం చెందాడు. తరువాత ఆ రూపానికి గల మహత్తు అర్థం చేసుకున్నాడు.


"పరబ్రహ్మము నుండి సృష్టి కోసం పురుషుడు, స్త్రీ రూపంతో ప్రకృతి అవతరించారని. సృష్టి ముందుకు సాగడానికి పురుషునికి ప్రకృతి సహచర్యం అవసరమని" బ్రహ్మ దేవుడు అవగతం చేసుకున్నాడు. ఇందుకోసం తనకు మార్గదర్శనం చేయమని ఆ అర్థనారీశ్వరుడిని కోరాడు.


అర్థనారీశ్వరుడు బ్రహ్మను చూసి "చతుర్ముఖా! జన సృష్టి నీవు చేయాలంటే సంతానప్రదాయిని, జీవసృష్టికి అధిదేవత అయిన ‘సావిత్రీదేవి’ ని ప్రసన్నం చేసు కోవాలి" అని చెప్పగానే బ్రహ్మ విస్మయం చెంది "ఈ సావిత్రీదేవి ఎవరు? ఎక్కడ ఉంటుంది? అసలు అర్థనారీశ్వరుడైన మీరెవ్వరు?

నాకు తెలిసినది నారాయణ స్వరూపం ఒక్కటే" అని నమస్కరించి అడిగాడు.


అర్థనారీశ్వరుడు "బ్రహ్మదేవా! ప్రకృతి పురుషుల కలయిక తోనే సృష్టి జరుగుతుంది. నేను సృష్టి స్థితి లయ కార్యం కోసం శ్రీమన్నారాయణుని నుంచి అవతరించిన ‘పరమేశ్వరుడి’ని. 

నేను,విష్ణువు ఏకాత్ములము. కేశవుడిగా విష్ణువు ఉంటే శివుడిగా ఈ రూపంలో నేను ఉన్నాను. శివకేశవులం అయిన మేమిద్దరం ఒకటే. మాలో ఎటువంటి భేదం లేదు.


నా అర్థశరీర భాగమైన స్త్రీ స్వరూపము గురించి వివరిస్తాను. పరదేవత అయిన ఈ శక్తి స్వరూపం నా నుంచి ఉద్భవించి నాలో సగమై ఉంటూ నాతో కలసి ఉంది. పరాశక్తిగా నా అర్థనారీశ్వరి ఐన ఈ ప్రకృతి విష్ణువు వక్షస్థలంలో లక్ష్మీదేవిగా నివసిస్తుంది. త్రిమూర్తులమైన మనకు ఈ శక్తిస్వరూపం తోడు లేకపోతే సృష్టి స్థితి లయ కార్యాలు జరుగవు. గాయత్రిగా, సరస్వతిగా నీ వద్ద ఉండేది ఈ శక్తి స్వరూపమే అని గ్రహించుము. వీరి వలన నీకు బ్రహ్మజ్ఞానం, సర్వశాస్త్ర వేదజ్ఞానము

లభించింది. కానీ జీవసృష్టి నీవు చేయాలంటే నీ వద్ద సృష్టికి అధిదేవత అయిన సావిత్రీదేవి ఉండాలి. సావిత్రీదేవి గోలోకంలో కృష్ణుని సేవిస్తూ కృష్ణుడి సన్నిధిలో ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకుని నీవద్దకు తెచ్చుకొనుము. జీవసృష్టి చేయ గలుగుతావు" అని ఆశీర్వదించి అర్థనారీశ్వరుడు అదృశ్య మయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 3 మార్చి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣5️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*

            

                    *152వ రోజు*                    

*వన పర్వము సప్తమాశ్వాసము*


                 *సావిత్రి*```


“యమ ధర్మరాజా! సతికి భర్త సేవయే పరమార్ధం. నా మనస్సు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్య చంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు ఔతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాటలాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను. కనుక నా కోరికను మన్నించుము" అని అడిగింది. 


అందుకు యమధర్మరాజు సంతోషించి "సావిత్రీ! నీకు మరొక వరం ఇచ్చెదను కోరుకొనుము" అని చెప్పాడు. 


అందుకు సావిత్రి "యమధర్మరాజా! ఇప్పటి దాకా నువ్వు ఏ వరం కోరుకొమ్మన్నా నీ పతి ప్రాణములు దక్క అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా! సతికి పతియే దైవము. పతి లేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభ కార్యానికి ఆమెను పిలువరు. కనుక సాళ్వభూపతి తనయుడైన సత్యవంతుని పునరుజ్జీవుని చేయుము”అని కోరింది. 


ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతడి శరీరంలో ప్రవేశ పెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో "సావిత్రీ! నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు. నీకు నూరుగురు కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలవు ఔతావు" అని చెప్పి వెడలి పోయాడు.```


*సావిత్రి సత్యవంతులు తిరిగి వెళ్ళుట*```


సావిత్రి వెను తిరిగి సత్యవంతుని దేహమున్న చోటుకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు. 


సత్యవంతుడు "ఏమిటి సావిత్రీ! ఇంతసేపు నిద్రపోయాను లేపలేదా. కాని ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది. అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు" అన్నాడు. 


సావిత్రి "నాధా! ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మీ తల్లి తండ్రులు మనకోసం ఎదురు చూస్తుంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి" అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. 


అప్పటికే ద్యుమత్సేనుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. 


సావిత్రి "మహారాజా! నా భర్త సత్యవంతునికి ఈ రోజు మరణం అని చెప్పారు కదా. అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడి పోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకు పోవుచుండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా భర్త ప్రాణములు. మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట. నాల్గవది నా భర్త ప్రాణములు" అన్నది. సాళ్వభూపతి "అమ్మా! ఆపత్సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు. నీ పుణ్య చరితము కీర్తనీయము" అన్నాడు. 


ఆ తరువాత సాళ్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకుని మరణించారని ద్యుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు. 


ద్యుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. 

కనుక ధర్మరాజా పతివ్రత అయిన ద్రౌపది కూడా మీకు శుభములు చేకూరుస్తుంది" అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు.


               *సశేషం*``

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగం 04.03.2026 Wednesday,

  ఈ రోజు పంచాంగం 04.03.2026 Wednesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన  విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస కృష్ణ పక్ష ప్రతిపత్తి తిథి సౌమ్య వాసర పూర్వఫల్గుని నక్షత్రం ధృతి యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు. 

  


శ్రాద్ధ తిథి: పాడ్యమి 


 

నమస్కారః , శుభోదయం

అద్భుతాన్ని గమనించండి

  అద్భుతాన్ని గమనించండి


మొదటి శ్లోకాన్ని తిరగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది


రెండో శ్లోకాన్ని తిరగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది


తం భూసుతాముక్తిముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీః


శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముతాసుభూతం


మొదటి శ్లోకం శ్రీరాముని స్తుతి


రెండవ శ్లోకం శ్రీకృష్ణుని స్తుతి


ఇది ఒక్క సనాతన ధర్మం లోనే సాధ్యం


భక్తి తరంగాలు

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - ప్రతిపత్ - పూర్వా ఫల్గుణి -‌‌ సౌమ్య వాసరే* (04.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*