ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, మార్చి 2026, శుక్రవారం
మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*శుక్రవారం 13 మార్చి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣6️⃣3️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*163 వ రోజు*
*విరాట పర్వము ప్రథమాశ్వాసము*
*పాoడవులు ద్రౌపది వారివారి పనులను నిర్ణయించు కొనుట*```
ధర్మరాజు భీమసేనుని చూసి.. “భీమసేనా! బకాసుర, కిమ్మీరాదులను చంపిన నీవు సేవకా వృత్తి ఎలా చేస్తావు?” అన్నాడు.
భీమసేనుడు “అన్నయ్యా! నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా. వంటలవాడిగా విరాటరాజు కొలువులో చేరతాను. పైగా నాకు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా. అతని కొలువులో మల్ల విద్యా ప్రదర్శనలు ఇస్తూ అందరికి వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ధర్మరాజు కొలువులో వంటవాడిగా ఉన్నానని చెప్తాను” అన్నాడు.
ధర్మరాజు అర్జునుని చూసి.. “అర్జునా! నీ సంగతి ఏమిటి నీవు ఎలాంటి కొలువు చేస్తావు?” అని అడిగాడు.
అర్జునుడు “అన్నయ్యా! నేను దేవేంద్రుని దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను ఊర్వసి కామించగా నిరాకరించాను. అప్పుడు ఊర్వశి నపుంసకుడివి కమ్మని శపించింది. దేవేంద్రుడు నన్ను ఆ శాపాన్ని అజ్ఞాతవాస కాలంలో అనుభవించమని చెప్పాడు. అజ్ఞాతవాసం కాగానే శాపవిమోచనం కాగలదని చెప్పాడు. ఆ శాపవశమున నేను విరాటరాజు కొలువులో పేడి రూపం దాల్చి విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. నాకు నాట్య విద్యలో ప్రవేశం ఉంది. నేను అంతఃపుర కాంతలకు నాట్యం నేర్పుతాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ద్రౌపది అంతఃపురంలో నాట్యాచారుడిగా ఉన్నానని చెప్తాను” అని అన్నాడు.
తరువాత నకులుని చూసి “ఇతడు చాలా సుకుమారుడు, అందగాడు ఇతడు తన నిజ రూపమును ఎటుల దాచగలడు. ఒరులను ఎలా సేవించ గలడు?” అన్నాడు.
నకులుడు “అన్నయ్యా! నాకు అశ్వ శిక్షణలో ప్రవేశమున్నది. నేను అశ్వ శిక్షకుడిగా విరాటుని కొలువులో చేరతాను. అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాను. తామ్రగ్రంధి నామంతో సంచరిస్తాను. ఇంతకు పూర్వం నేను ధర్మరాజు కొలువులో అశ్వశిక్షకుడిగా పనిచేసానని చెప్తాను” అన్నాడు.
ధర్మరాజు నవ్వి సహదేవుని వైపు చూసాడు.
సహదేవుడు “అన్నయ్యా! నాకు పశు పోషణలో అనుభవం ఉంది. తంత్రీ పాలుడనే పేరుతో గోరక్షకుడిగా విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. ఇంతకు పూర్వం ధర్మరాజు కొలువులో గోరక్షకుడిగా పని చేసానని చెప్తాను” అన్నాడు.
ధర్మరాజు ద్రౌపదిని చూసి.. “సుకుమారి ఇంత వరకు పనులు చేయించుకున్నది కాని ఎవరిని సేవించి ఎరుగదు. ఇంతటి ఉదాత్తచిత్త ఏ పని చేయగలదు” అని మనసులో బాధపడ్డాడు.
అది గ్రహించిన ద్రౌపది “నేను సైరంధ్రీ వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళతాను. విరాటరాజు భార్య సుధేష్ణను ప్రసన్నం చేసుకుంటాను. అందరూ గౌరవించే విధంగా సైరంధ్రీ వ్రతం సాగిస్తాను” అన్నది.
అందరికి అన్ని పనులు కుదిరాయి. మనం అందరం అజ్ఞాత వాసాన్ని నిరపాయంగా గడుపుదాం. ధౌమ్యుల వారు అగ్ని హోత్రం రక్షిస్తుంటారు. మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళతారు. ఎవరైనా మా గురించి అడిగితే ద్వైతవనం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి” అని ధర్మరాజు ఆదేశించాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
14మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁శనివారం🍁*
*🌹14మార్చి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*
*తిథి : దశమి* ఉ 08.10 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : ఉత్తరాషాఢ* రా 04.49 తె వరకు ఉపరి *శ్రవణం*
*యోగం : వరీయాన్* ఉ 10.43 వరకు ఉపరి *పరిగ*
*కరణం : భద్ర* ఉ 08.10 *బవ* రా 08.48 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*మ 02.00 - 03.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *రా 09.56 - 11.40*
అభిజిత్ కాలం : *ప 11.53 - 12.41*
*వర్జ్యం : ఉ 11.38 - 01.21*
*దుర్ముహూర్తం :ఉ06.16- 07.52*
*రాహు కాలం :ఉ 09.16 - 10.47*
గుళికకాళం : *ఉ 06.16 - 07.46*
యమగండం : *మ 01.47 - 03.17*
సూర్యరాశి : *కుంభం/మీనం*
చంద్రరాశి : *ధనస్సు/మకరం*
సూర్యోదయం :*ఉ 06.26*
సూర్యాస్తమయం :*సా 06.26*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.16 - 08.40*
సంగవ కాలం :*08.40 - 11.05*
మధ్యాహ్న కాలం :*11.05 - 01.29*
అపరాహ్న కాలం :*మ 01.29- 03.53*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ బహుళ ఏకాదశి*
సాయంకాలం :*సా 03.53 - 06.17*
ప్రదోష కాలం : *సా 06.17 - 08.41*
రాత్రి కాలం :*రా 08.41 - 11.52*
నిశీధి కాలం :*రా 11.52 - 12.40*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.40 - 05.28*
౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*
*కలవేణురవావశగోపవధూ*
*శతకోటివృతాత్స్మరకోటిసమాత్*
*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*
*తప్తకాంచనసఙ్కాశం*
*నానారత్న విభూషితమ్*
*ఉద్యద్బాలార్కవదనం*
*త్రినేత్రం కుణ్డలోజ్వలమ్.!!*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
*శ్రీ మహావిష్ణు పురాణం* `
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శుక్రవారం 13 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం* ``
*24వ భాగం*
*మహావిష్ణువు కపిల మహర్షి అవతారం (2)*```
దేవహూతికి తొమ్మిది మాసాలు నిండాయి. నారాయణుడు కపిలుడిగా దేవహూతి గర్భం నుంచి ప్రపంచంలోకి రావలసిన శుభ ఘడియలు వచ్చేసాయి. ఇందుకోసమే వేచి ఉన్న దేవ దుందుభులు మ్రోగాయి. మంగళనాదాలు, శంఖారావాలు, ఘంటానాదాలు ముల్లోకాలలో మధురంగా ప్రతిధ్వనిస్తుండగా శ్రీహరి దివ్యతేజస్సులు విరజిమ్ముతూ కపిల వర్ణ ఛాయలో దేవహూతి గర్భం నుండి శిశువుగా జన్మించాడు.
ఆకాశం నుండి దేవతలు, మహర్షులు మరియు ఇతర ఆకాశగణాలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు శిశువు గుణగణాలు గానం చేసారు. బ్రహ్మదేవుడు ఆనందంతో "నారాయణుడు నరుడిగా తొలిసారి భూమి మీద జగత్కళ్యాణానికి స్త్రీ మాతృగర్భాన తొమ్మిది మాసాలుండి జన్మించాడు" అని ఆనందపడి కపిల దర్శనం కోసం బయలుదేరి వెళ్లాడు.
నారాయణుడి కపిల అవతారం భూమి పై మొదటి మానవ జన్మ కావడంతో దేవతలందరు సంతోషముతో దర్శనానికి బయలుదేరారు.
లోకసంచారంలో ఉన్న నారదుడు విషయం తెలుసుకుని "మా తండ్రికి తండ్రి, నాకు ఆరాధ్య దైవం నారాయణుడు ధరించిన మొదటి మానవ అవతారాన్ని దర్శించి ధన్యుడి నవ్వాలి" అని ప్రకటించి కర్దముని ఆశ్రమానికి బయలుదేరాడు.
నవ ప్రజాపతులు, సనకసనందాదులు నారాయణ అవతార దర్శనం చేసుకోవాలి అని నారదుని వెంట బయలుదేరారు. స్వాయంభువ మనువు కూడా దౌహిత్రుని జనన వార్త విని భార్యా పుత్రులతో కర్దముని ఆశ్రమానికి బయలుదేరాడు.
కర్దముడు పుత్రుని చూడటానికి బ్రహ్మాది దేవతలు, మహర్షులు, మామగారు అత్తగారు బంధువులతో రావడం చూసి సంతోషముతో పొంగిపోయాడు. అందరికి సాదరంగా స్వాగతం పలికాడు. బ్రహ్మాది దేవతలు శిశురూపంలో ఉన్న నారాయణుని అనేక విధాలుగా స్తుతించారు. బ్రహ్మ సూచనతో కర్దమ మహర్షి పుట్టిన శిశువుకి కపిలుడు అని నామకరణం చేశాడు.
బ్రహ్మ కర్దమ మహర్షిని చూసి "మునీంద్రా! నారాయణుడు కర్మబద్దులైన జీవులను ఉద్దరించడానికి మాతృగర్భం నుండి తొలిసారిగా కపిల అవతారంలో మానవుడిగా జన్మించారు. ఇతడు సాంఖ్య యోగ ప్రవర్తకుడై ప్రసిద్ధి చెందుతాడు. ఈ కపిలావతారము ముల్లోకాలకు పూజనీయమై బ్రహ్మకల్పాంతవరకు ఉంటుంది" అని పలికాడు.
సకల విద్యాదేవత సరస్వతీదేవి కపిలుని చూసిన ఆనందంతో తన్మయురాలై "సర్వ విద్యా శాస్త్రాది దేవతైన నేను, నాకు గల వాక్కు, శబ్దం, అక్షరం, ఛందస్సు, శ్రుతి, స్మృతి, యోగ కరణాది సకల విద్యలను ఈ క్షణం కపిలునికి అనుగ్రహిస్తున్నాను. ఇతడు సాంఖ్య యోగ తత్త్వోపదేశాలతో ముల్లోకాలను ఉద్దరిస్తాడు" అని ఆశీర్వదించింది.
శిశురూపంలో కపిలుడు “ధన్యుణ్ణి మాతా" అని నోరు తెరిచి పలకడంతో బ్రహ్మాదులందరు ఆశ్చర్యం చెందారు. అందరు చూస్తుండగానే కపిలుడు ఐదు సంవత్సరాల బాలునిగా మారి ఉయ్యాల దిగి తల్లిదండ్రులైన కర్దమ దేవహూతిలకు నమస్కరించి "తల్లీ తండ్రులారా! దేహము ధరించినప్పుడు దేహ ధర్మము పాటించాలి.
సరస్వతీదేవి అనుగ్రహంతో సకల శాస్త్ర వేదవిద్యలు లభించాయి. కానీ జన్మించిన దేహికి ధర్మానుసారం ఐదవ ఏట విధి విధాన పూర్వకంగా ఉపనయనం, బ్రహ్మోపదేశం జరిగిన తరువాత మాత్రమే వేద విద్యార్హత లభిస్తుంది. అందుకే ఐదు సంవత్సరాల బాలకుడనయ్యాను. నాకు ఉపనయనం జరిపించండి. పిదప ఈ దేహమునకు బంధువులైన నా సోదరీమణులు, మీ కుమార్తెలు తొమ్మిది మందికి వివాహం జరిపించి మీ బాధ్యతలు పూర్తి చేయండి" అని ఉపదేశించాడు.
బ్రహ్మదేవుడు కపిలుని మాటలు విన్న తరువాత కర్దమునితో "కర్దమ మునీంద్రా! కపిలుడి చెప్పినది నిజం. నీ తొమ్మిదిమంది పుత్రికలను నా పుత్రులైన తొమ్మిదిమంది ప్రజాపతులకు ఇచ్చి కన్యాదానం చేసి వివాహ విధులను పూర్తి చేయుము. వీరికి చక్కటి సంతానం కలిగి సృష్టి వృద్ధి చెందుతుంది" అని చెప్పాడు.
బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో కర్దమ దంపతులు ముందుగా కపిలుడికి ఉపనయనం, బ్రహ్మోపదేశం చేశారు. గాయత్రీదేవి కపిలునికి సకల మంత్రాలను ఉపదేశం చేసింది.
అనంతరం కర్దమ మహర్షి తన తొమ్మిదిమంది కుమార్తెలను బ్రహ్మ మానస పుత్రులు తొమ్మిదిమందికి ఇలా ఇచ్చి వివాహం చేశాడు. మరీచికి కళని, అత్రికి అనసూయను, అంగీరసుడికి శ్రద్ధను, పులస్త్యుడికి హవిర్భువుని, పులహుడికి గతిని, క్రతువుకి క్రియను, భృగువుకి ఖ్యాతిని, వసిష్టుడికి అరుంధతిని, అధర్వుడికి శాంతిని ఇచ్చి వివాహం జరిపించాడు.
కపిలుడు తొమ్మిదిమంది వరులకు వివాహ సంప్రదాయం ప్రకారం పాదపూజ చేసి నమస్కరించాడు.
సాక్షాతు మహావిష్ణువు కపిలుడిగా తమ పాద పూజ చేసినందుకు బ్రహ్మ మానస పుత్రులు పొంగిపోయారు. వివాహ విధులు ముగిసిన తర్వాత వధువులు తమ భర్తలతో వారి నివాసాలకు వెళ్లి పోయారు. తరువాత కర్దమ మహర్షి కపిలుని ఏకాంతంగా కలుసుకుని "నారాయణా! కపిలుడిగా మాకు కుమారుడవై జన్మించి మమ్మల్ని ధన్యులని చేశావు. నీ నిజపాద సన్నిధి పొందడానికి నన్ను సన్యాస దీక్ష స్వీకరించడానికి అనుమతించుము" అని ప్రార్ధించాడు.
కపిలుడు మందహాసంతో "తండ్రీ! నీవు మోక్షము కోరుకునేవాడవు. వైరాగ్య ప్రాప్తి నీకు ఎప్పుడో కలిగింది. దేహానికి సంబంధించిన ఋణ బంధాలు తీర్చుకున్నావు. మోక్షానికి అర్హత సాధించావు. సన్యాస దీక్ష స్వీకరించుము" అని అనుమతి ఇచ్చాడు.
కర్దమ మహర్షి భార్య దేవహూతి అనుమతి తీసుకుని సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సుకి వెళ్లి పోయాడు.
*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
మహాకవిభారవి
*
☘️ మహాకవిభారవి 🙏
*చాటుమాటుగానే తప్ప బహిరంగంగా పొగడని వ్యక్తిని భారవి తండ్రి అంటారు. భారవి సంస్కృతంలో గొప్ప కవి. అతడి కిరాతార్జునీయం పంచకావ్యాల్లో ఒకటి. దేశమంతా భారవి మహాకవి అని ప్రస్తుతిస్తున్నా, తండ్రి మాత్రం 'వాడి మొహం, వాడిదో కవిత్వమా?' అని బహిరంగంగా తక్కువ చేసి మాట్లాడుతుండేవాడు. ఇది సహించలేని భారవి ఓ రాత్రి తండ్రిని చంపటానికి బండ తీసుకొని మచ్చు మీద ఎక్కి కూర్చున్నాడు తండ్రి నెత్తిన వెయ్యటానికి . తండ్రిగదిలోకి ప్రవేశించబోతుండగా ఆయన తల్లి అంది లోకమంతా భారవిని పొగుడుతుంటే మీరు మాత్రం వాడికి ఏమీ తెలియదు అని చెప్తున్నారు అని అనగానే భారవి తండ్రి పిచ్చిదానా నాకు మనసులో సంతోషమే కొడుకు ప్రయోజకుడైనందుకు తానెంత గర్విస్తున్నా అతడికి దిష్టి తగులుతుందనో, అతడు విర్రవీగి చెడిపోతాడనో అలా చులకనగా విమర్శిస్తున్నానని చెప్తున్న తండ్రి మాటలు విని పశ్చాత్తాప పడతాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారవి చెప్పిన ఒక్క సూక్తి గణనీయమయింది. అది 'సహసా విదధీత నక్రియా' మనేది. తొందరపడి ఏపనీ చేయగూడదని దాని భావం. భారవిక వి దిగివచ్చి తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు తగిన శిక్ష వేయమంటాడు ఏమీ వద్దన్నవినడు అప్పుడు తండ్రి అత్తగారింటి కి వెళ్లి ఆరు నెలలు ఇల్లరిక వుండు పో అంటాడు అప్పుడే మహాకవికి రోజు రోజుకి అత్తవారింట మర్యాదలు తగ్గినవి అత్తగారిఊరి బయట పొలం కాపలా ఉంటూ కిరాతార్జునీయం రచన చేసినాడు *
〽️〽️〽️〽️〽️
మాగాయ ఆవకాయ
*మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*.
మహాత్ములు ఇలా చెప్పారు
*మాగాయ:-*
భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....
అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...
పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి...
సిద్ధిని పొందిన ఋషిలా ముక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక...
బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం
నరుల పట్ల కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...
బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని...
అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా, తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,
మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు
ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...
ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి విశేషాలతో విరాజిల్లినట్లుగానే...
నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...
'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!
*ఆవకాయ:-*
"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,
"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...
ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని,
బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా...
తనతోపాటు శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...
"నేను నేనుగానే ఉండి, ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను" అని....
చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.
*అయ్యా! ఆధ్యాత్మిక మార్గంలో ఇతి మార్గం, (న+ ఇతి) నేతి మార్గం అని చదివాను. ఏమీ అర్ధం కాలేదు. కాని ఆవకాయ, మాగాయి ఉదాహరణలతో మొత్తం బ్రహ్మజ్ఞానం అంతా కరతలామలకం అయిపోయింది. ధన్యోస్మి మహాప్రభో ధన్యోస్మి. పునరావృత్తి రహితమైన స్థితి ఈ రెండు ఊరగాయలు కల్పిస్తాయని తెలిస్తే వ్యాసులవారు, ఆదిశంకరులు కోనసీమలోనే అవతరించి ఉండేవారు.*
<<<<<<<<<<<<<>>>>>>>>>
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - దశమి - పూర్వాషాఢ - భృగు వాసరే* (13.03.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
పార్వతి దేవి స్తుతి 🙏
🌸పార్వతి దేవి స్తుతి 🙏
సీ .శాంకరి !శాంభవి! శర్వాణి !శారద!
కరుణతో కాపాడు కాళికాంబ!
భవునిరాణి !భవాని! బాధలు దూరము
చేసియు చాముండి! చింత తీర్చు
కళ్యాణి !భగవతి! కామాక్షి !నిర్మల!
బహుభుజ భార్గవి! వందనములు
మాతంగి !మాతృక! మాలిని! మలయమ్మ!
మమ్ము కావుము దేవి మమత తోడ
తే శంభుప్రియగౌరి ! పార్వతి !శరణు శరణు
సర్వమంగళ !సావిత్రి! జయము జయము
సింహరథ సింహ వాహిని !శీఘ్రముగను
శైలముదిగిరాశ్యామల !శంభురాణి!
సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల
పంచాంగం 13.03.2026 Friday,
ఈ రోజు పంచాంగం 13.03.2026 Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస కృష్ణ పక్ష దశమి తిథి భృగు వాసర పూర్వాషాఢ నక్షత్రం వ్యతిపాత యోగః వణిజ కరణం.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
శ్రాద్ధ తిథి: దశమి
నమస్కారః , శుభోదయం
13-03-2026శుక్రవారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
13-03-2026శుక్రవారం రాశి ఫలితాలు
మేషం
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.
---------------------------------------
వృషభం
చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.
---------------------------------------
మిధునం
ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.
---------------------------------------
కర్కాటకం
చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
---------------------------------------
సింహం
బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
---------------------------------------
కన్య
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు.
---------------------------------------
తుల
కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.
---------------------------------------
వృశ్చికం
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
---------------------------------------
ధనస్సు
ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
---------------------------------------
మకరం
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.
---------------------------------------
కుంభం
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.
---------------------------------------
మీనం
కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యను పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
---------------------------------------
నిద్రలేమికి
నిద్రలేమికి సులభ పరిష్కారాలు -
ప్రస్తుతపరిస్థితుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానకారణం మనయొక్క జీవితములో ఎదుర్కొనే ఒత్తిళ్లు కావచ్చు మిగిలిన సమస్యలు ఏవైనా కారణం కావచ్చు. నిద్ర మనిషి జీవితంలో అత్యంత ప్రధానం అయినది. నిద్ర తక్కువ అవ్వడం రోగాలు రావడానికి ప్రధాన కారణం . నిద్ర తక్కువైన మనిషికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చును.
కావున వీలయినంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది . అలాంటి విశ్రాంతి కేవలం మంచి నిద్రతోనే లభిస్తుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే యోగాలు చాలా మంచిఫలితాన్ని ఇస్తాయి .
* నిద్రపట్టనప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేడిచేసి ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూస్తున్న త్వరలో మంచినిద్ర వచ్చును. మంచి గసగసాలనే వాడండి. మార్కెట్లో తొటకూర విత్తనాలను గసగసాలుగా అమ్ముతున్నారు.
* వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటితో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు , నుదురుకు వ్రాసి పడుకున్న నిద్రపట్టును .
* ఉదయం , సాయంత్రం సర్పగంధి వేళ్ళ చూర్ణం పావుస్పూన్ అరకప్పు నీళ్ళలో వేసి తాగుచున్నచో మంచిఫలితం కనిపించును. రక్తపోటు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయును .
* రాత్రి సమయంలో మజ్జిగ లో రెండు నీరుల్లిపాయ ముక్కలను కలుపుకుని లోపలికి తీసుకొండి. మంచి నిద్ర వచ్చును.
* నిద్రపోవడానికి ముందు కప్పు వేడిపాలల్లో అరచెంచా మిరియాల కషాయం కలుపుకుని తాగుచున్న సుఖనిద్ర కలుగును.
* అశ్వగంధ చూర్ణము కూడా బాగా పనిచేయును . ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణం ఒక చిన్న గ్లాసు పాలల్లో కలిపి నిద్రపొవడానికి ముందు ప్రతినిత్యం సేవించవలెను .
పైన చెప్పిన యోగాలలో మీకు అత్యంత సులభమైన యోగాన్ని తీసుకుని పాటించవచ్చు. సర్పగంధ వేళ్ళ చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ సామానులు అమ్మే దుకాణాలలో లభ్యం అగును.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
