13, మార్చి 2026, శుక్రవారం

*శ్రీ మహావిష్ణు పురాణం* `

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శుక్రవారం 13 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం* ``

               *24వ భాగం*


*మహావిష్ణువు కపిల మహర్షి అవతారం (2)*```


దేవహూతికి తొమ్మిది మాసాలు నిండాయి. నారాయణుడు కపిలుడిగా దేవహూతి గర్భం నుంచి ప్రపంచంలోకి రావలసిన శుభ ఘడియలు వచ్చేసాయి. ఇందుకోసమే వేచి ఉన్న దేవ దుందుభులు మ్రోగాయి. మంగళనాదాలు, శంఖారావాలు, ఘంటానాదాలు ముల్లోకాలలో మధురంగా ప్రతిధ్వనిస్తుండగా శ్రీహరి దివ్యతేజస్సులు విరజిమ్ముతూ కపిల వర్ణ ఛాయలో దేవహూతి గర్భం నుండి శిశువుగా జన్మించాడు.


ఆకాశం నుండి దేవతలు, మహర్షులు మరియు ఇతర ఆకాశగణాలు పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు శిశువు గుణగణాలు గానం చేసారు. బ్రహ్మదేవుడు ఆనందంతో "నారాయణుడు నరుడిగా తొలిసారి భూమి మీద జగత్కళ్యాణానికి స్త్రీ మాతృగర్భాన తొమ్మిది మాసాలుండి జన్మించాడు" అని ఆనందపడి కపిల దర్శనం కోసం బయలుదేరి వెళ్లాడు. 


నారాయణుడి కపిల అవతారం భూమి పై మొదటి మానవ జన్మ కావడంతో దేవతలందరు సంతోషముతో దర్శనానికి బయలుదేరారు. 


లోకసంచారంలో ఉన్న నారదుడు విషయం తెలుసుకుని "మా తండ్రికి తండ్రి, నాకు ఆరాధ్య దైవం నారాయణుడు ధరించిన మొదటి మానవ అవతారాన్ని దర్శించి ధన్యుడి నవ్వాలి" అని ప్రకటించి కర్దముని ఆశ్రమానికి బయలుదేరాడు. 


నవ ప్రజాపతులు, సనకసనందాదులు నారాయణ అవతార దర్శనం చేసుకోవాలి అని నారదుని వెంట బయలుదేరారు. స్వాయంభువ మనువు కూడా దౌహిత్రుని జనన వార్త విని భార్యా పుత్రులతో కర్దముని ఆశ్రమానికి బయలుదేరాడు.


కర్దముడు పుత్రుని చూడటానికి బ్రహ్మాది దేవతలు, మహర్షులు, మామగారు అత్తగారు బంధువులతో రావడం చూసి సంతోషముతో పొంగిపోయాడు. అందరికి సాదరంగా స్వాగతం పలికాడు. బ్రహ్మాది దేవతలు శిశురూపంలో ఉన్న నారాయణుని అనేక విధాలుగా స్తుతించారు. బ్రహ్మ సూచనతో కర్దమ మహర్షి పుట్టిన శిశువుకి కపిలుడు అని నామకరణం చేశాడు.


బ్రహ్మ కర్దమ మహర్షిని చూసి "మునీంద్రా! నారాయణుడు కర్మబద్దులైన జీవులను ఉద్దరించడానికి మాతృగర్భం నుండి తొలిసారిగా కపిల అవతారంలో మానవుడిగా జన్మించారు. ఇతడు సాంఖ్య యోగ ప్రవర్తకుడై ప్రసిద్ధి చెందుతాడు. ఈ కపిలావతారము ముల్లోకాలకు పూజనీయమై బ్రహ్మకల్పాంతవరకు ఉంటుంది" అని పలికాడు.


సకల విద్యాదేవత సరస్వతీదేవి కపిలుని చూసిన ఆనందంతో తన్మయురాలై "సర్వ విద్యా శాస్త్రాది దేవతైన నేను, నాకు గల వాక్కు, శబ్దం, అక్షరం, ఛందస్సు, శ్రుతి, స్మృతి, యోగ కరణాది సకల విద్యలను ఈ క్షణం కపిలునికి అనుగ్రహిస్తున్నాను. ఇతడు సాంఖ్య యోగ తత్త్వోపదేశాలతో ముల్లోకాలను ఉద్దరిస్తాడు" అని ఆశీర్వదించింది.


శిశురూపంలో కపిలుడు “ధన్యుణ్ణి మాతా" అని నోరు తెరిచి పలకడంతో బ్రహ్మాదులందరు ఆశ్చర్యం చెందారు. అందరు చూస్తుండగానే కపిలుడు ఐదు సంవత్సరాల బాలునిగా మారి ఉయ్యాల దిగి తల్లిదండ్రులైన కర్దమ దేవహూతిలకు నమస్కరించి "తల్లీ తండ్రులారా! దేహము ధరించినప్పుడు దేహ ధర్మము పాటించాలి.


సరస్వతీదేవి అనుగ్రహంతో సకల శాస్త్ర వేదవిద్యలు లభించాయి. కానీ జన్మించిన దేహికి ధర్మానుసారం ఐదవ ఏట విధి విధాన పూర్వకంగా ఉపనయనం, బ్రహ్మోపదేశం జరిగిన తరువాత మాత్రమే వేద విద్యార్హత లభిస్తుంది. అందుకే ఐదు సంవత్సరాల బాలకుడనయ్యాను. నాకు ఉపనయనం జరిపించండి. పిదప ఈ దేహమునకు బంధువులైన నా సోదరీమణులు, మీ కుమార్తెలు తొమ్మిది మందికి వివాహం జరిపించి మీ బాధ్యతలు పూర్తి చేయండి" అని ఉపదేశించాడు.


బ్రహ్మదేవుడు కపిలుని మాటలు విన్న తరువాత కర్దమునితో "కర్దమ మునీంద్రా! కపిలుడి చెప్పినది నిజం. నీ తొమ్మిదిమంది పుత్రికలను నా పుత్రులైన తొమ్మిదిమంది ప్రజాపతులకు ఇచ్చి కన్యాదానం చేసి వివాహ విధులను పూర్తి చేయుము. వీరికి చక్కటి సంతానం కలిగి సృష్టి వృద్ధి చెందుతుంది" అని చెప్పాడు. 


బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో కర్దమ దంపతులు ముందుగా కపిలుడికి ఉపనయనం, బ్రహ్మోపదేశం చేశారు. గాయత్రీదేవి కపిలునికి సకల మంత్రాలను ఉపదేశం చేసింది.


అనంతరం కర్దమ మహర్షి తన తొమ్మిదిమంది కుమార్తెలను బ్రహ్మ మానస పుత్రులు తొమ్మిదిమందికి ఇలా ఇచ్చి వివాహం చేశాడు. మరీచికి కళని, అత్రికి అనసూయను, అంగీరసుడికి శ్రద్ధను, పులస్త్యుడికి హవిర్భువుని, పులహుడికి గతిని, క్రతువుకి క్రియను, భృగువుకి ఖ్యాతిని, వసిష్టుడికి అరుంధతిని, అధర్వుడికి శాంతిని ఇచ్చి వివాహం జరిపించాడు. 

కపిలుడు తొమ్మిదిమంది వరులకు వివాహ సంప్రదాయం ప్రకారం పాదపూజ చేసి నమస్కరించాడు.


సాక్షాతు మహావిష్ణువు కపిలుడిగా తమ పాద పూజ చేసినందుకు బ్రహ్మ మానస పుత్రులు పొంగిపోయారు. వివాహ విధులు ముగిసిన తర్వాత వధువులు తమ భర్తలతో వారి నివాసాలకు వెళ్లి పోయారు. తరువాత కర్దమ మహర్షి కపిలుని ఏకాంతంగా కలుసుకుని "నారాయణా! కపిలుడిగా మాకు కుమారుడవై జన్మించి మమ్మల్ని ధన్యులని చేశావు. నీ నిజపాద సన్నిధి పొందడానికి నన్ను సన్యాస దీక్ష స్వీకరించడానికి అనుమతించుము" అని ప్రార్ధించాడు.


కపిలుడు మందహాసంతో "తండ్రీ! నీవు మోక్షము కోరుకునేవాడవు. వైరాగ్య ప్రాప్తి నీకు ఎప్పుడో కలిగింది. దేహానికి సంబంధించిన ఋణ బంధాలు తీర్చుకున్నావు. మోక్షానికి అర్హత సాధించావు. సన్యాస దీక్ష స్వీకరించుము" అని అనుమతి ఇచ్చాడు. 


కర్దమ మహర్షి భార్య దేవహూతి అనుమతి తీసుకుని సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సుకి వెళ్లి పోయాడు.


*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: