శ్రీరామ (130 ).
( పోతన మహాకవి రచించిన శ్రీ నరసింహ స్వామి ఆవిర్భావ ఘట్టం)
శ్లో//శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ/
తాపత్రయోపశమనాయ భవౌషధాయ/
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ/
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే//.
---------------
"శ్రీ నరసింహ స్వామి" ఆవిర్భావ ఘట్టాన్ని,
మహాకవి, మహాభక్తుడు, అయిన "పోతన" ,
భక్తి పారవశ్యంతో,
నరసింహోపాసకులకు అత్యంత ప్రీతిపాత్రమైనది,
వేద మంత్రములతో సమానమైనది,
గంభీరమైనదీ,
అయిన గద్య రూపంలో ,
మధురాతి మధురమైన తెలుగు భాషలో వర్ణించారు.
శ్రీమద్భాగవతం లోని పుణ్యప్రదమైన ఆ గద్య భాగమును,తాత్పర్య సహితంగా పఠించి తరిద్దాం.
1. "ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును/
(తన తమ్ముడు హిరణ్యాక్షుని చంపాడనే ఉద్దేశ్యంతో శ్రీమహావిష్ణువుతో వైరంపెట్టుకున్న హిరణ్యకశిపునకు)
2.వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును/
(ఆ శత్రుత్వంవల్ల, మనస్సులో క్రోధాగ్ని జ్వాలలు చెలరేగినవి)
3.రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును/
(ఆ క్రోధాగ్నిజ్వాలలు అతనిలోని విజ్ఞానాన్ని, వినయాన్ని కాల్చివేశాయి)
4.వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును/
(అతని హృదయం అహంకారంతో కూడి, తన శక్తియందున్న నమ్మకంతోను, ధైర్యముతోను, గాంభీర్యముతోను,చలించసాగింది)
5.హృదయ చాంచల్యమాన తామసుండును/
(ఆ హృదయ చాంచల్యము వల్ల అతనిలో తామస గుణం విజృంభించింది).
6.తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నయి/
(ఆ తామస గుణంవల్ల అతని మానస స్థైర్యం కూడా విజృంభించి చిందులు త్రొక్క సాగింది)
7.విస్రంభంబున హుంకరించి/
(పట్టరాని ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించాడు)
8.బాలుని ధిక్కరించి/
(ధిక్కారపూర్వకంగా ప్రహ్లాదునితో )
9.హరి నిందు జూపుమని/
(ఓరీ!హరిని ఈ స్థంభంలో చూపించు, అని)
10.కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా/
(తన చేతికున్న మణిమయములైన బంగారు కంకణాలు గణ గణ ధ్వనులు చేస్తుండగా)
11.దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రసస్తం బగు హస్తంబున/
(దిగ్గజముల దంతములను విరిచివేశే సామర్ధ్యం గల తన హస్తముతో)
12.సభామండప స్థంభంబు వ్రేసిన/
(సభా మంటపం లోని ఒక స్తంభాన్ని పగలగొట్టాడు)
13.వ్రేటు తోడన/
(అతని అరచేతి దెబ్బ తగలగానే)
14. దశ దిశలును మిణుగురులు సెదర,జిటిలి,పెటిలి పడి/
(పది దిక్కులా, విష్ఫులింగాలను విరాజిమ్ముతూ, ఆ మహా స్థంభం చిట్లి ఫెళ్ళున విరిగిపోయింది)
15. బంభాజ్యమానం బగు న మ్మహాస్తంభంబు వలన/
(ఆ విధంగా భయంకర శబ్దములు చేస్తూ విరిగిన ఆ మహా స్థంభం నుండి),
16. ప్రళయ వేళా సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహా వలాహక వర్గ నిర్గత నిబిడ నిష్టుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట చ్ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబు లయి యెగసి యాకాశ కుహరాన్తరాళంబు నిరవకాశంబు సేసి నిండినం/
(ప్రళయకాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే, సప్త మహా వాయువులచేత కొట్టబడిన, భీకర కాలమేఘములు పిడుగులను వర్షిస్తాయి. స్థంభం పగులుతున్నప్పుడు ఆ ఉరుములు చేసే ధ్వనులవంటి "ఛట ఛట ఫట ఫట" ధ్వనులు, ఆకాశానికి ఎగసినవి.కర్ణకఠోరమైన ఆ శబ్దాలతో ఆకాశమంతా, ఏమాత్రమూ ఖాళీ లేకుండా నిండిపోయింది).
17. బట్టు చాలక, దోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి, పరిస్ఫోటితంబుగా/
(ఆ భయంకర శబ్దం వల్ల,బ్రహ్మ, మహేంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని, మున్నగు దేవతలంతా, వారు కూర్చున్న స్థానాలలో పట్టు లేనివారై, తేలిపోతున్నట్లుగా అయినారు.
భయంతో వారిగుండెలు అవిసి పోయాయి.
వారితోనూ,చరాచర జంతుజాలముతోను,నిండిన బ్రహ్మాండమనే భాండం ఆ ధ్వనికి పగిలి పోయినట్లు అయినది.
స్తంభం ఛిన్నాభిన్నమైంది.
అప్పుడు ఆ స్తంభంలో నుండి శ్రీ నరసింహదేవుడు అవిర్భవించాడు).
18. బ్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును/
(ఆ నరసింహ స్వామి యొక్క దివ్య పాదతలములు చక్రము, బాణము, నాగలి, వజ్రాయుధము, అంకుశము, మత్స్యము మొదలైన శుభరేఖలతో ప్రకాశిస్తున్నవి) ,
19.చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరా భార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును/
(ఉగ్రరూపంతో ఉన్న ఆ స్వామి నడుస్తుంటే,ఆ పాదముల భారమునకు, భూమిని మోసే అష్ట దిగ్గజములు,ఆదిశేషుడు, కులపర్వతాలు, కూర్మరాజు, అణిగి మణిగి పోతున్నారు) ,
20. దుగ్ద జలధి జాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును/
(ఆయన ఊరువులు, క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం యొక్క తొండం లాగా బలిసి,ఉన్నాయి) ,
21.ఘణ, ఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును/
(పచ్చని పట్టు వస్త్రము ధరించిన ఆ స్వామియొక్క కటి ప్రదేశము మణులు చెక్కిన ఒడ్డాణముతో కూడినదై,ఆ వడ్డాణమునకు కూర్చిన మువ్వల ఘణ ఘణ శబ్దములతో శోభిల్లుతున్నది) ,
22. నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును/
(ఆకాశగంగ యందు సుడులు తిరుగుతున్న సరస్సు లాగా ఆ స్వామి నాభి ప్రదేశం గంభీరంగా ఉన్నది) ,
23. ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును/
(ఆ నరసింహుని నడుము పిడికిటిలో ఇమిడేటంత సన్నగా ఉండి నిగ నిగ లాడుతోంది) ,
24. కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును/
(ఆయన వక్షస్థలం కులపర్వతముయొక్క చరియ వలె, కఠినముగాను,విశాలముగాను,ప్రకాశిస్తున్నది) ,
25. దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రయామాన/
(రాక్షస సేనల ధైర్యమనే లతలను త్రెంపే కొడవళ్ల వలెను),
26. రక్షో రాజ వక్షో భాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగాలాయమాన/
(రాక్షస రాజైన హిరణ్యకశిపుని యొక్క బండబారిన వక్షస్థలమనే క్షేత్రాన్ని దున్నే నాగళ్ల వంటివి) ,
27.ప్రతాప జ్వలన జ్వాలాయమాన/
(ప్రతాపంతో మంటలు మండుతున్న నెగళ్ళ లాగా ఉన్నవి) ,
28.శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాణ/
(శరణాగతి పొందిన భక్తుల నేత్రములనే చకోరపక్షులకు ఆహ్లాదం కలిగించే చంద్రకాంతిలాగా అందమైనవి) ,
29. వజ్రాయుధ ప్రతిమాన భాసమాన/
(కఠినమైన వజ్రాయుధముల వలె ప్రకాశిస్తున్నవి) ,
30.నిశాత ఖరతర ముఖ నఖరుండును/
(వాడితేలి,వంకరలు తిరిగి తీక్షణముగా ఉన్న గోళ్ళతో శోభిల్లుచున్న వాడును) ,
31.శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత,తోమర, ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన,మాలికా విరాజమాన, నిరర్గళానేక శత భుజార్గళుండును/
(మహోన్నత పర్వత శిఖరములవంటి నరసింహస్వామి బాహువులు, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరములాదిగా వివిధ ఆయుధములను ధరించి ఉన్నవి.
అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్న అసంఖ్యాకములైన ఆ బాహువులు వీర రసం అనే సాగరానికి చెలియలి కట్టలవలె ఉన్నవి) ,
32. మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును/
(మణి ఖచితములై మనోహరంగా ప్రకాశిస్తున్న కాలి కడియములు, హారములు, కేయూరములు,కంకణములు, కిరీటము, మకర కుండలములు మొదలైన,
కాంతులు విరజిమ్ముచున్న భూషణములతో,
స్వామి ధగ ధగా వెలిగి పోతున్నాడు) ,
33. త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును/
(ఆ ప్రభువు కంఠం మూడు రేఖలతో కూడి, పర్వత శిఖరంలాగా దృఢంగా ఉన్నది) ,
34. ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును/
(గాలికి చలిస్తున్న పారిజాతవృక్షము యొక్క చిగురుటాకులాగా,నరసింహస్వామి పెదవులు కోపంతో కదలుచున్నవి) ,
35. శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన,తటిల్లతా సమాన దేదీప్యమాన,
దంష్ట్రాంకురుండును/
(శరత్కాలంలో మేఘముల మధ్య మెరిసే విద్యుల్లతలలాగా స్వామి కోరలు ధగధగలాడుతున్నాయి) ,
36. కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ,సప్తజిహ్వ జిహ్వా తులిత, తరళ తరాయమాన,విబ్రాజమాన జిహ్వుండును/
(ప్రళయకాలంలో లోకముల నన్నింటినీ దహించడానికి విజృంభిస్తున్న కాలాగ్నిజ్వాలలాగా ఆ స్వామి జిహ్వ ఎఱ్ఱగా భయంకరంగా ప్రకాశిస్తున్నది) ,
37. మేరు మందర మహా గుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును/
(ఆ నరసింహుని నోరు, నాసికా రంధ్రములు, మేరు, మందర పర్వతముల గుహలలాగా విస్తారంగా ఉన్నవి) ,
38. నాసికా వివర నిస్సర న్నిబిడ నిశ్శ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును/
(ఆ నాసికా రంధ్రములనుండి వస్తున్న వేడి వేడి నిశ్శ్వాసలతో సప్తసాగరాలు అల్లకల్లోలమై, సాగర జలాలు సల సల కాగుతున్నవి) ,
39. పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును/
(ఉదయాచలముపై ప్రకాశిస్తున్న సూర్య మండల కాంతుల లాగా స్వామివారి నేత్రములు ప్రకాశిస్తున్నాయి) ,
40. లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును/
(సూర్యమండల కాంతితో తేజరిల్లుచున్న స్వామి నేత్రములయొక్క, క్రీగంటి చూపులనుండి బయల్వెడలిన, విష్ఫులింగ సమూహములు,తమ తమ సంచారంతో ప్రాణుల భవిష్యత్తును నిర్ణయించే నక్షత్ర, గ్రహ, మండల సంచారాన్ని అడ్డగిస్తున్నాయి ) ,
41. శక్ర చాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును/
(స్వామియొక్క కనుబొమలు, ఇంద్రధనస్సు లాగా వంగి, క్రోధముతో ముడిపడి ఉండటం వల్ల ముఖం భయంకరంగా ఉన్నది) ,
42.ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును/
(గండ శిలల లాగా కఠినమైన స్వామి కపోలములు చూచుటకు కమనీయముగా ఉన్నవి) ,
43. సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహా భ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును/
(సంధ్యా సమయంలో ఎర్రబారిన మేఘ మాలికల లాగా ఎఱ్ఱగా మెరుస్తూ, మబ్బుల నొరయుచున్న స్ఫుటమైన జూలుతో స్వామి విరాజిల్లుతున్నాడు ) ,
44. సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును/
(జూలు విదల్చడం వల్ల పుట్టిన వాయువు, తీవ్ర వేగంతో, ఆకాశంలో సంచరిస్తున్న దేవతల విమానాలను, వైమానికులతో సహా ఊగిపోయేటట్లు చేస్తోంది) ,
45. నిష్కంపిత శంఖ వర్ణ మహోర్ద్వకర్ణుండును/
( స్వామి కర్ణములు ఊర్ధ్వముఖంగా నిక్కబొడుచుకుని, చలనం లేకుండా పెద్ద శంఖముల వలె తెల్లగా ప్రకాశిస్తున్నవి) ,
46. మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన,
వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును /
(దేవ దానవులు,మందరపర్వతాన్ని కవ్వంగా చేసి, క్షీరసముద్రమును మధిస్తున్నప్పుడు, అతి వేగంగా తిరుగుతున్న ఆ పర్వతము యొక్క వేగానికి ఆకాశమంతా వ్యాపించిన పాల సముద్ర తరంగముల తుంపురుల వలె స్వామి కేసరములు అందముగా భాసిస్తున్నవి) ,
47. పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును /
(ఆ స్వామి శరీరం మీది రొమరాజి పూర్ణిమనాటి చంద్రుని వెన్నెల కిరణముల వలె ఆహ్లాదకరంగా ఉన్నది) ,
48. నిజ గర్జా నినాద నిర్దళిత కుముద, సుప్రతీక, వామ,నైరావత, సార్వభౌమ, ప్రముఖ ధిగిభరాజ కర్ణ కోటరుండును/
(ఆ నృసింహుని భయంకరమైన సింహగర్జనకు, కుముద, సుప్రతీక, వామన, ఐరావత, సార్వభౌమాది, ప్రముఖ దిగ్గజముల కర్ణములు పగిలిపోతున్నవి) ,
49. ధవళ ధరాధర దీర్ఘదురవలోకనీయ దేహుండును/
(ఆ దేవుని తెల్లని దేహము ఎత్తైన వెండి కొండ అయిన కైలాసపర్వతమువలె, విశేష కాంతితో వెలిగిపోతూ, ఎవరికీ తేరిపార చూడడానికి శక్యం కాకుండా ఉన్నది) ,
50. దేహ ప్రభాపటల నిర్మథ్యమాన పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును/
(తామస గుణోపేతులైన శత్రు రాక్షససమూహముల "గర్వము" అనే అంధకారాన్ని రూపుమాపు తున్నవా అన్నట్లు స్వామివారి శరీరకాంతులు ధగ ధగలాడుతున్నవి) ,
51. ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును/
(ఆ నరసింహ స్వామి "అంతరంగం" భక్తుడైన ప్రహ్లాదునకు సంతోషం కలిగిస్తూ, కరుణా రసముతోను," "బహిరంగము" అనగా ఆకారము, తనయందు శతృభావంతో ఉన్న హిరణ్యకశిపునకు, సంతాపం కలగజేస్తూ, "వీర రసము" తోను విలసిల్లుతున్నవి) ,
52. మహా ప్రభావుండును నయిన శ్రీ నృసింహదేవుం డావిర్భవించినన్/
(మహాప్రభావసంపన్నుడైన శ్రీ నృసింహస్వామి సభలోని స్తంభంనుండి ఆవిధంగా ఆవిర్భవించగా!) ,
53. గనుంగొని,
(ఆ ఆవిర్భావం చూచి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటున్నాడు).
క. నరమూర్తి గాదు,కేవల, హరిమూర్తియు గాదు మానవాకారము గే/
సరి యాకారము నున్నది, హరి మాయా రచితమగు యథార్థము చూడన్//
(ఇది పూర్తిగా నరరూపమూకాదు, పూర్తిగా సింహరూపమూ కాదు.
సరిగా పరిశీలించి చూస్తే, ఇది నరుడు,సింహము కలిసి ఏర్పడిన శ్రీ హరి యొక్క మాయారూపము).
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
30-4-'26
.