శ్రీరామ (131)
(నరసింహాపాసన అంటే సంధ్యోపాసనే )
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).
-----------------------
అన్ని ఉపాసనల కంటే "సంధ్యోపాసన" చాలా గొప్పది.
సంధ్యోపాసన అనగా రెండు సమయముల మధ్య సంధి,
రెండు ప్రాంతముల మధ్య సంధి,
రెండు ఆలోచనల మధ్య సంధి,
రెండు అక్షరముల మధ్య సంధి,
ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసల మధ్య సంధి,
మొదలైనవి.
ఆ "సంధుల" మధ్య ఉన్నదానిని (సత్) "సంధ్య" అంటారు.
అదే ఆత్మ.
దానిని గమనించడమే సంధ్యోపాసన.
సంధ్యలో మహత్తరమైన "ఉత్పాదన" శక్తి ఉంటుంది.
ఆ శక్తిని "సవిత" అంటారు.
ఆ శక్తిని ఉపాసించి తరించడానికే మనకు "సంధ్యోపాసన" చెప్పబడింది.
ఈ శక్తికి ప్రతీక అయిన సూర్యుని అగస్త్య మహర్షి ఉపదేశించిన ' ఆదిత్య హృదయము ' ను పఠించి, శ్రీరాముడు ఉపాసించాడు.
ఆవిధంగా ఉపాసించిన తరువాత "శ్రీ రాముడు" రావణాసురుని అవలీలగా సంహరించగలిగాడు.
సీతాదేవి కూడా " సంధ్యోపాసన" చేసినట్లు వాల్మీకి రామాయణం లోని "సుందరకాండ" లో చెప్పారు.
చెరుకు గడ యొక్క "కణుపు" లో విత్తనం లేకుండా
"చెరుకు మొక్క" ను పుట్టించే శక్తి ఉన్నది.
ఆ కణుపును "పర్వం" అంటారు.
"ఉదయ సంధ్య", "సాయం సంధ్య"
గ్రహణములు,పుష్కరములు, మొదలైనవి కాల పర్వములు.
కాశీ మొదలైన పుణ్యక్షేత్రములు దేశ పర్వములు.
ఈ దేశ, కాల, పర్వములు అత్యంత శక్తివంతమైనవి.
ఆ యా పర్వములలో చేసే జప, ధ్యాన, పూజాదులు,ఇతర సమయములలో చేసే జపాదుల కంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి.
నరసింహ స్వామి పగలు, రాత్రి, మధ్య ఉండే సంధ్యాసమయంలో ఆవిర్భవించాడు.
ఆ "సంధ్య" లో ఉన్న మహాశక్తే నరసింహ స్వామి రూపంలో మహాబలుడైన హిరణ్యకశిపుని అవలీలగా సంహరించింది.
ఆ శక్తే "అహో బలం" అని దేవతలచే స్తుతింపబడి,
"అహోబిలం" లో వేంచేసి ఉన్నది.
శక్తికి ప్రతీక అయిన ఆ నరసింహస్వామిని ఉపాసిస్తే "సంధ్యోపాసన" ఫలితం సిద్ధిస్తుంది.
విశేషించి సంధ్యా సమయములలో చేసే నరసింహోపాసన సర్వ శ్రేయస్సులను ప్రసాదిస్తుంది.
శ్లో//శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ/
తాపత్రయోపశమనాయ భవౌషధాయ/
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ/
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే//.
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
1-5-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి