23, జూన్ 2023, శుక్రవారం

చమత్కారము

 🕉️🙏शुभोदयः।🙏🕉️


 पीतः क्रुद्धेन तातश्चरणतलहतो वल्लभो येन रोषाद् 

आबाल्याद् विप्रवर्यैः स्ववदनविवरे धार्यते वैरिणी में। 

गेहं मे छेदयन्ति प्रतिदिवसमुमाकान्तपूजानिमित्तं तस्मात् खिन्ना सदाहं द्विजकुलनिलयं नाथ ! युक्तं त्यजामि । ।



పీతః క్రుద్ధేన తాతశ్చరణతలహతో వల్లభో యేన రోషాద్

ఆబాల్యాద్ విప్రవర్యైః స్వవదనవివరే ధార్యతే వైరిణీ మే।

గేహం మే ఛేదయన్తి ప్రతిదివసముమాకాన్తపూజా

నిమిత్తం

తస్మాత్ ఖిన్నా సదాహం ద్విజకులనిలయం నాథ! యుక్తం త్యజామి।।


ఈ సుభాషితంలో ఆచార్య చాణక్యుడు బ్రాహ్మణులు సాధారణంగా ఎందుకు బీదరికం అన్ని అనుభవిస్తారనే విషయంపై విష్ణు-లక్ష్మీ సంవాద రూపంలో బ్రాహ్మణులపై లక్ష్మి ఎందుకు కోపంగా ఉంటుందనే ప్రశ్నపై లక్ష్మీదేవి యొక్క సమాధానాన్ని చమత్కారంగా ఇలా వర్ణించారు --

బ్రాహ్మణ కులంలో జన్మించిన అగస్త్యుడనే ఋషి నాతండ్రియైన సముద్రునితాగేసి ఇంకింపజేసేడు (క్షీరసాగరమథనంలో లక్ష్మి జన్మించింది కనుక సముద్రుడు ఆమె తండ్రి). అంతేకాదు, బ్రాహ్మణుకులంలో జన్మించిన వేరొక వ్యక్తి మహర్షి భృగువు నాప్రాణప్రియమైన మీ వక్షస్తలంపై తన్నేడు. అతిముఖ్యంగా బ్రాహ్మణులు చిన్నతనం నుండీ వేదాధ్యయనం చేస్తూ నాకు ప్రతిద్వందియైన సరస్వతీ దేవిని ఉపాసిస్తూ ఉంటారు. ఇదికాక ప్రతిరోజూ శంకరుని ఆరాధించడానికి నా నివాసస్తానమైన కమలపుష్పాలను పీకి వేస్తారు. ఈ కారణాలవలన నేను బ్రాహ్మణులను వదిలపెట్టేసేను. నా నిర్ణయం అనుచితంగా అని లక్ష్మీదేవి సమాధానమిచ్చింది కవి చమత్కారము.


Chanakya Niti - 15/16.


Why Brahmins live in poverty is very cleverly answered by Chanakya in the form of discussion between Vishnu and Lakshmi as follows :

Lord Vishnu asked Goddess Lakshmi as to why she is always angry on Brahmins and Lakshmi replied as follows :

My father Ocean (since Lakshmi was born during churning of Ksheersagar, Samudra is treated as her father) was dried up by drinking by one Brahmin Muni Agastya. Another Brahmin Bhrigu Maharshi kicked on the chest of my beloved husband (yourself). Importantly Brahmins, right from their childhood study Vedas and worship my rival Goddess Saraswati. More over, everyday they destroy my home for worshipping Lord Siva (Lakshmi resides in Lotus and people worship Lord Siva with lotuses). She says am wrong in leaving Brahmins?


हरिः ॐ।


 


 

నరకం నుండి తప్పించేవి వృక్షాలు

 మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు


మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహ పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.

 

శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı 

ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı   


         ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు. 


పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు


                మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి. 


వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది.

 

శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı

మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı


ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది. 


            వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి. గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది. 


మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి. మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ద్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం.  నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.

శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం

 🕉  మన గుడి : 





🔆 కృష్ణా జిల్లా : " హంసలదీవి "


👉 శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం


💠 కృష్ణవేణి నది మడ అడవుల గుండా వయ్యారంగా మెలికలు తిరుగుతూ సాగరుని ఒడికి చేరే ప్రాంతమే హంసల దీవి. 

సహ్యాద్రి పర్వతశ్రేణులలో ప్రభవించిన కృష్ణానది శివకేశవ క్షేత్రమైన హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. 


💠 మహారాష్ట్రలో జన్మించి నేలను సస్యశ్యామలం చేస్తూ వేల కిలోమీటర్లు ప్రయాణించే కృష్ణమ్మలోని ఓ పాయ కోడూరు మండలం హంసల దీవిలో సముద్రంలో కలుస్తుంది. నది సముద్రంలో కలిసే చోటుకు ప్రత్యేక విశిష్టతను ఆపాదించింది శాస్త్రం. ఇలాంటి చోట్ల స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలూ నశిస్తాయని చెబుతుంది. కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే అలాంటి పవిత్ర స్థలానే రుక్ష్మిణీ సమేతంగా వేణుగోపాల స్వామి కొలువయ్యాడు.


💠 ఒకసారి ఇద్దరు గంధర్వులు ఆకాశయానం చేస్తు ఈ ప్రాంతానికి చేరుకునే సరికి అక్కడ ఒ మహర్షి తపస్సు చేసుకొంటున్నాడు. అతని నల్లని శరీరాకాన్ని చూసిన గంధర్వులు పరిహాసం చేశారు. ఈ మహర్షి కోపంతో కాకులుగా మారాలని ఆ గంధర్వులను శపించగా తమను క్షమించాలంటూ ఆ గంధర్వులు ఆ మహర్షి కాళ్లపై పడి ప్రార్థించారు. కృష్ణానదీ తీరాల్లో స్నానం చేస్తే  కాకుల రూపం పోయి హంసల రూపం వస్తుందని, ఆ మహర్షి శాప నివారణోపాయాన్ని తెలిపాడు. ఇలా కృష్ణా నదీ తీరాల్లో స్నానం చేస్తుండగా ఈ దీవి దగ్గర గంధర్వులకు హంసల రూపం వచ్చిందట. అందుకే ఈ దీవికి హంసలదీవి అనే పేరు వచ్చినట్టు ఒక కథ వినపడుతుంటుంది.


💠 గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలను ప్రక్షాళన చేసే గంగా మాత, కొంత మంది భక్తుల పాపాలను ప్రక్షాళన చేసే క్రమంలో తన రంగు మారింది, తన సహజ దివ్యమైన రూపం తిరిగి ప్రసాదంచమని గంగా మాత శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించింది, అప్పుడాయన నీవు నల్లని కాకి రూపానికి మారిపోయి ఏ తీర్ధంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ మాత కాకి రూపంలో హంసల దీవి వద్ద ఉన్న కృష్ణవేణి నదీ సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేసింది వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది అందుకని ఈ ప్రాంతానికి హంసలదీవి అని పేరు వచ్చింది.. 


💠 స్థలపురాణం :

పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా వుండేవు. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు.

అలా రంగడనే గోపాలుని ఆవు ఓ పుట్టలో పాలు వర్షించటాన్ని చూసి కోపంతో చలించిపోయాడు. 

ఎండు ఆకులు పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది. 

 రంగడి శరీరం మంటలు

మండింది. 

తాను చేసిన తప్పును తెలుసుకుని, గ్రామ పెద్దలతో కలిసి పుట్ట దగ్గరకు వెళ్ళాడు.

 ఆ పుట్టలో శిరస్సు మినహా మిగిలిన శరీరం కాలిపోయినట్టుగా వేణుగోపాలస్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని తాకినంతనే గోపాలుని శరీర మంటలు తగ్గాయి. ఆ విగ్రహాన్ని గ్రామానికి తీసుకువచ్చి పూజలు ఆరంభించాడు. ఓ రోజు స్వామి వారు గ్రామస్తుల కలలో కనపడి పశ్చిమగోదావరి జిల్లాలోని కాకరపర్తి అనే గ్రామంలో ఓ భూస్వామి ఇంటి ఈశాన్య మూల కాకరపాదు కింద తాను ఉన్నట్టు సెలవిచ్చాడు. అంతనే గ్రామస్తులు కాకరపర్తి వెళ్లి, ఆ భూస్వామిని బతిమలాడి స్వామి వారి విగ్రహాన్ని హంసల దీవికి తీసుకువచ్చారని ఓ కథ చెబుతుంటారు. 


💠 పూర్వం దేవతలు సముద్రతీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కకి స్థలపురాణం. వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. అయినా తెల్లవారిందని వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు.

నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.


💠 గర్భాలయం నందలి శ్రీ వేణుగోపాలస్వామి ప్రతిష్ట విగ్రహంతోపాటు స్వయంభూమూర్తిని కూడా చూడగలము. మూలవిరాట్టుకు ఎడమవైపున గోవును, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులు, చక్రత్తాళ్వారు స్వామిని దర్శించగలము. ముఖమండపం నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ జనా ర్ధన స్వామి వారు కొలువై ఉన్నారు.


💠ఈ ఆలయంలో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదే శంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరేళ్ళు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం. 

ఈ ఆలయంలో నిద్ర చేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగు తుందని చెపుతారు.


💠ఉత్సవాలు...

మాఘపౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు. కార్తీకమాసంలో సముద్ర స్నానం చేసిన వేలాదిమంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.


💠 హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది.

కృతజ్ఞతా భావంతో

 *ఆశ్రయ పరిత్యాగ దోషం* 

*శ్రీ స్కాంద పురాణము*


ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యము. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనమూ ధన్యులము.


మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది


“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరము? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.


ఇలా ధర్మం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.


చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.


తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.




మనకు నీడనిచ్చిన ఇంటిని, మనకు అన్నంపెట్టిన నేలతల్లిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది.


 మనకు ప్రత్యంక్షంగానో, పరోక్షంగానో సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు కత చెపుతోంది.

యోగ సాధన

 *శరీరాంతర్గత నాడులు - యోగ సాధన - వజ్రనాడి*



    ప్రాచీన యోగ శాస్త్రాల ప్రకారం...."వజ్రనాడి" అన్న నాడి, శరీరంలో ప్రవహించే శక్తివంతమైన, శక్తి ప్రవాహ నాడీ వాహినులలో ముఖ్యమైనది. "వజ్ర" అన్న పేరు సంస్కృత భాష నుండి గ్రహించబడింది.  "వజ్ర" అనగా దృఢమైనది, ఉరుములాంటిది, దేనికీ లొంగనిది అని అర్థం. "నాడి" అనగా, నాళము, ప్రవాహము అని అర్థము. 


     మూడు ముఖ్య నాడులు, వెన్నుబాము వెంబడి ప్రవహిస్తున్నాయి. అవి 1. సుషుమ్నానాడి 2. ఇడానాడి 3. పింగళానాడి. ఈ "వజ్రనాడి" సూక్షమైన నాడులలో, మొదటి పొరగా ఉండి, సుషుమ్నానాడిలో అంతర ప్రవాహ రూపంలో ఉంటుంది.


     వజ్రనాడిని వజ్రిణి  అని కూడా అంటారు. ఈ వజ్రా నాడిలో మరల "చిత్రానాడి" లేదా "చిత్రిణి" ఉంటుంది. ఈ నాడులన్నీ సూక్ష్మాతి సూక్ష్మ నాడులు. ఈ వజ్రనాడి, షట్చక్రాల శక్తులను చైతన్యవంతం చేస్తుంది. కుండలినీశక్తిని కూడా చైతన్యం చేస్తుంది.


     ఈ వజ్రనాడి మూలాధార చక్రంలో ప్రారంభమౌతుంది. వజ్రనాడిలో గల చిత్రానాడిలో...ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గాన్ని "బ్రహ్మద్వారం" అంటారు. ఈ బ్రహ్మద్వారం ద్వారానే , చైతన్యం కాబడిన కుఃడలినీశక్తి ప్రవహిస్తుంది. ప్రాణాయామము,మంత్రసాధన, సతతధ్యానము... కుండలినీశక్తి చైతన్యం చెందడానికి సహాయపడతాయి. చైతన్యవంతం అయిన కుండలినీశక్తి ఈ నాడీ మార్గాల ద్వారా ప్రవహిస్తుంది.


    సుషుమ్నానాడి మధ్యలో మణిలాగా ప్రకాశించే వజ్ర అనే నాడి ఉన్నది. మరల దానిలో చంద్ర సూర్య అగ్ని రూపమైన, బ్రహ్మవిష్ణు శివులతో కూడిన చిత్రా (చిత్రిణి) అనే నాడి సాలెపురుగు దారములాగా ఉన్నది. నిర్మలమైన జ్ఞానోదయము లేకపోవటంవలన ఈ నాడిని ఎవరూ తెలుసుకోలేరు. మరల ఆ చిత్రానాడిలోపల అతి సూక్ష్మమైన విద్యున్మాలలాగా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ బ్రహ్మనాడి అనే మరొక నాడి ఉన్నది.


    

     ఈ బ్రహ్మనాడిలోని రంధ్రంద్వారా బ్రహ్మరంధ్రంలోని సహస్రారపద్మం నుండి సుధ ప్రవహిస్తూ ఉంటుంది. యోగులు ఆ సుధను మూలాధార పద్మంవద్దనున్న కుండలినీశక్తి ద్వారా పానం చేసి, బ్రహ్మానందమును అనుభవిస్తారు.


      "వజ్రనాడి" లేదా "వజ్రిణి"...సుషుమ్నా నాడిలో ఉంటుంది. ఇది స్వాధిష్ఠాన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. సూక్ష్మశరీర కదలికలకు ఈ వజ్రానాడి బాధ్యత వహిస్తుంది.


      ఈ మానవ శరీరంలో గల కోట్ల నాడులలో 72,000 సూక్ష్మ నాడులు ముఖ్యమైనవి. ఈ నాడులలో ఇడా, పింగళా, సుషుమ్నా నాడులు, గాంధారి, హస్తిజిహ్వ, కుహు, సరస్వతి, పూషా, శంఖిణి, పయస్విని, వారుణి, అలంబుస, విశ్వోదర, యశస్విని నాడులు ముఖ్యమైనవి. ఈ సుషుమ్నానాడిలో వజ్రనాడి ఉంటుంది. సామాన్యంగా ఇడానాడి జీవనిర్మాణ క్రియలలో సంబంధం కలిగి యుంటుంది. పింగళానాడి ఉత్ప్రేరక క్రియలలో సంబంధం కలిగియుంటుంది. వజ్రనాడి అభివ్యక్తీకరణ (manifestation) ప్రక్రియలలో సంబంధం కలిగియుంటుంది.


      ఈ వజ్రనాడి పరమతేజస్సుతో ఉంటుంది. ఈ నాడి నిరంతరమూ ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ వజ్రనాడి మూలాధారము నుండి ప్రారంభమై ఆజ్ఞాచక్ర పర్యంతమూ విస్తరించి ఉంటుంది.

ఈ రోజు పద్యము

 199వ రోజు: (భృగు వారము) 23-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

అన్న (Elder brother): అగ్రజుడు, అగ్రజన్ముడు, అన్న, జ్యేష్ఠుడు, పురోజన్ముడు, పూర్వజుడు, పెద్దవాడు. 


 ఈ రోజు పద్యము:


పనులెన్ని కలిగియున్నను 

దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై 

వినఁగోరుము సత్కథలను 

కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!


 ఓ కుమారా! నీకు ప్రతిదినము పనులెన్ని యుండినప్పటికీ విద్య యందలి గౌరవముతో పెద్దలందరు మెచ్చు కొనునట్లుగా మంచి మంచి కథలను పరిశీలించి వినుచుండుము.

ఆయన దేవుడు

 ఆయన దేవుడు ఏమైనా చెయ్యగలరు


శ్రీ చంద్రమౌళి గారు పరమాచార్య స్వామివారికి మహాభక్తులు. వారి మేనమామ సైన్యంలో క్యాప్టెన్ గా పనిచేసేవారు. వారికి దైవం మీద నమ్మకం, భక్తి ఉన్నా పరమాచార్య స్వామివారిపై అంత భక్తి కలిగినవారు కాదు.


వారి అల్లుడు వెల్లూర్ లో పనిచేసేవారు. హఠాత్తుగా ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో అస్వస్థకు గురయ్యారు. వెల్లూర్ లో పరీక్షించిన డాక్టర్లందరూ ఏమి చెయ్యలేమని చేతులెత్తేశారు. ఆ రాత్రి ఆ క్యాప్టన్ గారి అమ్మాయి తన భర్త ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ దిగులుతో నిద్రపోయింది. ఆరాత్రి ఆమెకు ఒక విచిత్రమైన కల ఒకటి వచ్చింది. పరమాచార్య స్వామివారు కలలో కనపడి, “నీ మంగళసూత్రాన్ని ఇవ్వు?” అని అడిగారు.


ఉదయం తెల్లవారగానే, సరైన పసుపు తాడు దొరకకపోయినా, చేతికి దొరికిన మమూలు దారానికే ఒక పసుపుకొమ్మను కట్టి మెడలో కట్టుకుంది. పరమాచార్య స్వామివారికి సమర్పించడానికి మెడలో ఉన్న బంగారు తిరుమాంగల్యాన్ని తీసి భద్రం చేసింది. మహాస్వామివారు చెప్పినది కలలో అయినా స్వామివారిపై తనకున్న భక్తివల్ల వారి ఆదేశాన్ని శిరసావహించింది.


ఈ విషయాన్నంతా చంద్రమౌళి మామకు చెప్పగానే, వెంటనే మహాస్వామివారి దర్శనానికి రావలసిందిగా కోరాడు. కాని పదిహేను రోజుల తరువాతనే పరమాచార్య స్వామివారి దర్శనం లభించింది. వారు వెళ్ళి అక్కడ నిలబడగానే, “ఎవరో దర్శనానికి వచ్చినట్టున్నారే” అని అక్కడున్నవారితో స్వామివారు అన్నారు. ”స్వామివారు మాకోసం ఇబ్బంది పడవల్సిన అవసరం లేదు. స్వామివారు బయటకు వచ్చిన తరువాతనే దర్శించుకుంటాము” అని చంద్రమౌళి మామ చెబుతున్నా స్వామివారు పట్టించుకోక, వారిని లోపలికి తీసుకుని రమ్మన్నారు.


అచ్చంగా కలలో అడిగినట్టే స్వామివారు ఆమెని, ”తీసుకుని వచ్చావా? ఇలా ఇవ్వు” అని అడిగారు. స్వామివారు మాంగల్యాన్ని స్వీకరించి ఒక పండుని తీసుకునిరమ్మని బాలు మామకు చెప్పారు. బాలు మామ ఒక ఆపిల్ పండును తీసుకునిరాగా దాన్ని స్వామివారు ఒలిచి క్యాప్టెన్ అల్లుడి వంక తీక్షణంగా చూడసాగారు. తరువాత ఆ పండుని వారికి ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదిస్తూ “నీకు ఏమి ప్రమాదం లేదు. మీరు వెళ్ళవచ్చు” అని అన్నారు.


వారు వెల్లూర్ వెళ్ళగానే మరలా వైద్య పరీక్ష చేయించగా, వైద్యులు అమితాశ్చర్యాలకు లోనయ్యారు. అతని మూత్రపిండాలు రెండూ చక్కగా పనిచేస్తున్నాయి. కేవలం ఏదో అతీంద్రియ శక్తి వల్ల మాత్రమే ఇలా జరిగి ఉంటుందని గ్రహించి ఏం జరిగిందని వారిని అడిగారు. జరిగినదంతా చెప్పగానే వెంటనే వారు, “ఓహ్! ఆయన దేవుడు ఏమైనా చెయ్యగలరు” అని అన్నారు.


కేవలం భక్తితో పరమాచార్య స్వామివారికి దగ్గరైతే, ఆ భక్తి మనకు సకల శుభాలను సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఆ నిరంతర కరుణకు అంతు ఉండదు.


--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

బూరుగ దూది పరుపు.

 బూరుగ దూది పరుపు...

పరమాచార్య వారు సాధారణంగా పగలు నిద్రించరు. కానీ ఉపవాసాల బడలిక వల్ల ఒక్కోసారి తుంగ చాపమీద ఎలాంటి గుడ్డ పరుచుకోకుండానే పడుకుంటారు. అందువల్ల వారి వీపు మీద తుంగ చాప ముద్రలు కనిపిస్తుంటాయి.సుందరరామన్ అనే శిష్యుడు ఆ ముద్రలు చూసి "స్వామి వారి శరీరం ఒత్తుకొంటున్నది "అని ఎవరిని సంప్రదించకుండా చెన్నై వెళ్లి పరుపులు, దిండ్లు అమ్మే దుకాణంలో బూరుగదూది పరుపు దానికి ఒక వెల్వేట్ కవర్, దిండ్లు కొని స్వయంగా తానే మోసుకొని తెచ్చాడు.వీటిని స్వామి ముందుంచి వినయంగా "మీరు వీటిని స్వీకరించాలి "అని ప్రార్ధించాడు.స్వామి వాటిని తన సమీపానికి తెమ్మని సైగ చేసాడు. వాటిని తాకి "చాలా మెత్తగా ఉన్నాయి."

"అవును పెరియవ. వీటిని బూరుగ దూదితో చేసారు."

కొద్ది సేపు మౌనం.

దూరం గా ఉన్న ఒక పేద రైతు వైపు చూపిస్తూ

"అతను ఒక పేద రైతు. పగలంతా మనకోసం పొలం పనిచేసి ధాన్యం పండించి రాత్రిళ్ళు ఎక్కడో నేలమీద గుడ్డపరుచుకొని నిద్రిస్తాడు.సుందర రామన్ నాకోసం ఒక పని చేసి పెట్టు. వీటికి రెండు దుప్పట్లు జతచేసి అతనికివ్వు. నేను వీటిని స్వీకరించినట్లే భావించు."

కొద్దిసేపు సుందర రామన్ లో ఎలాంటి భావనలు వ్యక్తం కాలేదు. తేరుకొని

"తప్పకుండ పెరియవ "అన్నాడు. కొద్ది గంటలలో వారి ఆదేశాలను అమలు చేసాడు.

***గీతాచార్యుడు ఈ మహనీయులనే 'సమదర్శి '(5.18 పండితాః సమదర్శినః ) అంటారు అని గీతలో బోధిస్తాడు.

భర్తృహరి

 *క్వచిత్పృథ్వీశయ్యా క్వచిదపి చ పర్యంకశయనః*

*క్వచిచ్ఛాకాహారః క్వచిదపి చ శాల్యోదన రుచిః ।*

*క్వచిత్కంథాధారీ క్వచిదపి చ దివ్యాంబరధరో*

*మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం న చ సుఖమ్‌॥*

                                  ~భర్తృహరి 


పై శ్లోకమునకు అనువాదపద్యము:

*ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై, నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం, బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్* 


తాత్పర్యము: 

ఒక చోట కటికనేలపై పరుండవచ్చును.... మరియొకచోట పట్టుపరుపుపై శయనించవచ్చును.... ఒకచోట కాయగూరలు ఆరగించవచ్చు.... వేరొకచోట వరియన్నము భుజించవచ్చు.... ఒకచోట నార వస్త్రములు ధరించవచ్చు... వేరొకచోట పట్టుపీతాంభరములు ధరించవచ్చు.... కార్యార్థి అయినవాడు కష్టమువచ్చినప్పడు దుఃఖించడు....సుఖము కలిగినప్పుడు సంతోషించడు... కష్టసుఖములు కార్యసిద్ధికి సరిసమానములు.

♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 99

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️

*పార్ట్ - 99



దేవకి దృష్టికి ఆమె కుమారుడు కనిపించలేదు. ఆమె నిత్యం, అనుక్షణం ఆరాధించే విష్ణు భగవానుడు దర్శనమిచ్చాడు. దేవదేవుని దర్శనభాగ్యంతో దేవకి ముఖం విప్పారి ప్రకాశంవంతమైంది. 


"దేవకీ .... ఆనాడు నీకు వరమిచ్చాను. దాన్ని నెరవేర్చాను. నా అంశతో ఘటనా ఘటనా సమర్థుడైన కుమారుడు నీకు కలిగాడు. నాడు ద్వారకలో నేనేం చేశానో... నేడు అదే నీ తనయుడు చేస్తున్నాడు... నా యీ జగన్నాటకంలో నాకు నీ పాత్ర అవసరం తీరిపోయింది... నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానిక... రా... దేవకీ.... రా...." 


"ప్రభూ... మళ్లీ... మీ దర్శనభాగ్యంతో నన్ను ధన్యురాలిని చేసావా తండ్రీ... నన్ను నీలో ఐక్యం చేసుకుంటానంటున్నావా ప్రభూ... వస్తున్నాను నాయనా... నీ సన్నిధికే వస్తున్నాను... నారాయణా... నారాయణా ...." 


తన తల్లికి విష్ణు దర్శనమైందని, ఆమె ఆ నారాయణునిలో ఐక్యమైపోతుందని గ్రహించాడు చాణక్యుడు. అతని వెనుకనుంచి శ్యామశాస్త్రి అందించిన గంగాజలాన్ని ఉద్దరిణితో మూడుసార్లు తల్లి గొంతులో పోస్తూ చాణక్యుడు దుఃఖిస్తూ "నారాయణా... నారాయణా... నారాయణా..." అని స్మరించాడు. ఆ మరుక్షణమే కాశీ విశ్వేశ్వరుడే విశాలాక్షీ సమేతుడై అదృశ్యరూపాన దేవికి ప్రక్కన నిలిచి ఆమె చెవిలో రామనామ తారకమంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాడు. అంతే... దేవకి ప్రాణజ్యోతి ఆ దేవదేవునిలో ఐక్యమైపోయింది. 


"అమ్మా...." పంచపాత్రను జారవిడుస్తూ బిగ్గరగా రోదించాడు చాణక్యుడు. మాతృఋణం తీర్చుకోవడానికి వెక్కివెక్కి ఏడుస్తూ అశ్రుతర్పడం వదిలాడు. మానవుడు ఎంతటి వాడైనా, అఖండ ప్రజ్ఞావంతుడైనా, వేదవిదురుడైనా, మరేమైనా... తన తల్లికి మాత్రం బిడ్డే... ఆ తల్లి రుణాన్ని ఎంతటివాడైనా తీర్చుకోక తప్పదు. కనిపెంచిన మాతృమూర్తికి కన్నీళ్ళతో శ్రద్ధాంజలి ఘటించడమే రుణం తీర్చుకోవడం... 


మనిషిరూపంలో వున్న దెయ్యం అనీ, రాక్షసుడనీ, కఠినాత్ముడనీ, నిరంకుశ హృదయుడనీ, దయాదాక్షిణ్యాలు లేని కుటిలుడనీ... ఇలా తనని తానే ఎన్నోన్నో బిరుదులు ప్రచారం చేయించుకున్న చాణక్యుడు... వాటన్నిటికీ అతీతంగా, సామాన్య మానవుడిలా ఒక మామూలు తల్లి కోసం పరితపించే సాధారణ కుమారుడిలా... వెక్కివెక్కి ఏడుస్తూ... తన కన్నీటి తర్పణముతో ఆ కన్నతల్లి రుణం తీర్చుకున్నాడు. ఆ సాయంత్రమే హరిచంద్ర ఘాట్ నందు దేవకి దహన సంస్కారములను బ్రాహ్మణోచిత పద్ధతిన యధావిధిగా నిర్వర్తించాడు చాణక్యుడు. 


కాశీరాజ పరిషత్ లో పండి విజయం సాధించిన చాణక్యునితో కాశీరాజుకి పూర్వ పరిచమున్నది. ఇప్పుడు మగధకి సామంతమైనది కాశీరాజ్యము. చంద్రగుప్తునికి అత్యంత ఆప్తుడైన గురుదేవునిగా ఇప్పుడు విచ్చేసిన చాణక్యుని ఆ కష్ట సమయంలో ఏ లోటూ రాకుండా తగిన ధన సహాయము చేయవలెనని ఆశించాడు కాశీరాజు. అంతలో అదే విషయమై చంద్రగుప్తుని వద్దనుంచి కూడా అతనికి వర్తమానం వచ్చింది. 


కానీ.... వారి సహాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు చాణక్యుడు. తనకున్నంతలో తన తల్లి అంతక్రియలు, దశదినకర్మలు ఘనంగా జరిపించాడు. ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా వైదిక విదుల ద్వారా కూడా చాణక్యుడు తన మాతృరుణాన్ని తీర్చుకున్నాడు. అనంతరం కొద్ది రోజుల తర్వాత భార్య, కుమార్తెతో పాటలీపుత్రానికి ప్రయాణమయ్యారు చాణక్యుడు. 


ఆర్యుని భార్య గౌతమికి అమ్మమ్మ, తాతయ్యలైన శ్యామశాస్త్రి దంపతులను కూడా తమతో పాటు పాటలీపుత్రం వచ్చి ఉండవలసిందిగా అభ్యర్థించారు. ఆ వృద్ధదంపతులు వారి కోరికను సున్నితంగా తిరస్కరించి 'వార్ధక్యంలో వున్న తాము వానప్రస్థంతో తపస్సుతో శేష జీవితాన్ని గడుపుతామని' చెప్పి వనవాసానికి వెళ్ళిపోయారు. చాణక్యుడు భార్యాబిడ్డలతో పాటలీపుత్రానికి చేరుకున్నాడు. 


రాజమాత మురాదేవి, చంద్రగుప్తుడు చాణక్యుని నివాసానికి వచ్చి వారికి కలిగిన మాతృశోకానికి తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రాజమాత మురాదేవి ఆర్యుని అర్ధాంగి గౌతమిని ఆదరించి ఆలింగనం చేసుకొని పసిబిడ్డ అన్నపూర్ణని చేరదీసి ముద్దులాడింది. 


ఇదంతా ఇలా జరుగుతుండగానే చంద్రగుప్తుడిని చాటుకు పిలిచి "ప్రభువుల వారి మీద రెండు హత్యప్రయత్నాలు జరిగాయట గదా ?" అని ప్రశ్నించాడు చాణక్యుడు.


చంద్రుడు మందహాసం చేసి "ఈ వార్త అప్పుడే తమరికి చేరిందా..  " అన్నాడు. 


"వార్త నాకు తెలిసినందుకు విచారిస్తున్నావా ? నీ అంగరక్షక దళం అజాగ్రత్తకు సిగ్గుపడుతున్నావా ?" రెట్టించాడు చాణక్యుడు. 


చంద్రుడు తలదిప్పి "రెండూకాదు. పాటలీపుత్ర రాజ పరివారంలో ఇంకా రాక్షసాత్యునికి వున్న 'పట్టు'కి నిదర్శనం ఆ హత్యప్రయత్నాలు" అని చెప్పాడు. 


చాణక్యుడు భృకుటి ముడిచి "రాక్షసుడు... హు.... యీ చాణక్య తంత్రాన్నించి  నుంచి ఆ రాక్షసుడు ఎలా తప్పుకుంటాడో చూస్తా .." అన్నాడు పటా పటా పళ్లు కొరుకుతూ. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹