23, జూన్ 2023, శుక్రవారం

ఆయన దేవుడు

 ఆయన దేవుడు ఏమైనా చెయ్యగలరు


శ్రీ చంద్రమౌళి గారు పరమాచార్య స్వామివారికి మహాభక్తులు. వారి మేనమామ సైన్యంలో క్యాప్టెన్ గా పనిచేసేవారు. వారికి దైవం మీద నమ్మకం, భక్తి ఉన్నా పరమాచార్య స్వామివారిపై అంత భక్తి కలిగినవారు కాదు.


వారి అల్లుడు వెల్లూర్ లో పనిచేసేవారు. హఠాత్తుగా ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో అస్వస్థకు గురయ్యారు. వెల్లూర్ లో పరీక్షించిన డాక్టర్లందరూ ఏమి చెయ్యలేమని చేతులెత్తేశారు. ఆ రాత్రి ఆ క్యాప్టన్ గారి అమ్మాయి తన భర్త ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ దిగులుతో నిద్రపోయింది. ఆరాత్రి ఆమెకు ఒక విచిత్రమైన కల ఒకటి వచ్చింది. పరమాచార్య స్వామివారు కలలో కనపడి, “నీ మంగళసూత్రాన్ని ఇవ్వు?” అని అడిగారు.


ఉదయం తెల్లవారగానే, సరైన పసుపు తాడు దొరకకపోయినా, చేతికి దొరికిన మమూలు దారానికే ఒక పసుపుకొమ్మను కట్టి మెడలో కట్టుకుంది. పరమాచార్య స్వామివారికి సమర్పించడానికి మెడలో ఉన్న బంగారు తిరుమాంగల్యాన్ని తీసి భద్రం చేసింది. మహాస్వామివారు చెప్పినది కలలో అయినా స్వామివారిపై తనకున్న భక్తివల్ల వారి ఆదేశాన్ని శిరసావహించింది.


ఈ విషయాన్నంతా చంద్రమౌళి మామకు చెప్పగానే, వెంటనే మహాస్వామివారి దర్శనానికి రావలసిందిగా కోరాడు. కాని పదిహేను రోజుల తరువాతనే పరమాచార్య స్వామివారి దర్శనం లభించింది. వారు వెళ్ళి అక్కడ నిలబడగానే, “ఎవరో దర్శనానికి వచ్చినట్టున్నారే” అని అక్కడున్నవారితో స్వామివారు అన్నారు. ”స్వామివారు మాకోసం ఇబ్బంది పడవల్సిన అవసరం లేదు. స్వామివారు బయటకు వచ్చిన తరువాతనే దర్శించుకుంటాము” అని చంద్రమౌళి మామ చెబుతున్నా స్వామివారు పట్టించుకోక, వారిని లోపలికి తీసుకుని రమ్మన్నారు.


అచ్చంగా కలలో అడిగినట్టే స్వామివారు ఆమెని, ”తీసుకుని వచ్చావా? ఇలా ఇవ్వు” అని అడిగారు. స్వామివారు మాంగల్యాన్ని స్వీకరించి ఒక పండుని తీసుకునిరమ్మని బాలు మామకు చెప్పారు. బాలు మామ ఒక ఆపిల్ పండును తీసుకునిరాగా దాన్ని స్వామివారు ఒలిచి క్యాప్టెన్ అల్లుడి వంక తీక్షణంగా చూడసాగారు. తరువాత ఆ పండుని వారికి ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదిస్తూ “నీకు ఏమి ప్రమాదం లేదు. మీరు వెళ్ళవచ్చు” అని అన్నారు.


వారు వెల్లూర్ వెళ్ళగానే మరలా వైద్య పరీక్ష చేయించగా, వైద్యులు అమితాశ్చర్యాలకు లోనయ్యారు. అతని మూత్రపిండాలు రెండూ చక్కగా పనిచేస్తున్నాయి. కేవలం ఏదో అతీంద్రియ శక్తి వల్ల మాత్రమే ఇలా జరిగి ఉంటుందని గ్రహించి ఏం జరిగిందని వారిని అడిగారు. జరిగినదంతా చెప్పగానే వెంటనే వారు, “ఓహ్! ఆయన దేవుడు ఏమైనా చెయ్యగలరు” అని అన్నారు.


కేవలం భక్తితో పరమాచార్య స్వామివారికి దగ్గరైతే, ఆ భక్తి మనకు సకల శుభాలను సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఆ నిరంతర కరుణకు అంతు ఉండదు.


--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: