23, జూన్ 2023, శుక్రవారం

యోగ సాధన

 *శరీరాంతర్గత నాడులు - యోగ సాధన - వజ్రనాడి*



    ప్రాచీన యోగ శాస్త్రాల ప్రకారం...."వజ్రనాడి" అన్న నాడి, శరీరంలో ప్రవహించే శక్తివంతమైన, శక్తి ప్రవాహ నాడీ వాహినులలో ముఖ్యమైనది. "వజ్ర" అన్న పేరు సంస్కృత భాష నుండి గ్రహించబడింది.  "వజ్ర" అనగా దృఢమైనది, ఉరుములాంటిది, దేనికీ లొంగనిది అని అర్థం. "నాడి" అనగా, నాళము, ప్రవాహము అని అర్థము. 


     మూడు ముఖ్య నాడులు, వెన్నుబాము వెంబడి ప్రవహిస్తున్నాయి. అవి 1. సుషుమ్నానాడి 2. ఇడానాడి 3. పింగళానాడి. ఈ "వజ్రనాడి" సూక్షమైన నాడులలో, మొదటి పొరగా ఉండి, సుషుమ్నానాడిలో అంతర ప్రవాహ రూపంలో ఉంటుంది.


     వజ్రనాడిని వజ్రిణి  అని కూడా అంటారు. ఈ వజ్రా నాడిలో మరల "చిత్రానాడి" లేదా "చిత్రిణి" ఉంటుంది. ఈ నాడులన్నీ సూక్ష్మాతి సూక్ష్మ నాడులు. ఈ వజ్రనాడి, షట్చక్రాల శక్తులను చైతన్యవంతం చేస్తుంది. కుండలినీశక్తిని కూడా చైతన్యం చేస్తుంది.


     ఈ వజ్రనాడి మూలాధార చక్రంలో ప్రారంభమౌతుంది. వజ్రనాడిలో గల చిత్రానాడిలో...ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గాన్ని "బ్రహ్మద్వారం" అంటారు. ఈ బ్రహ్మద్వారం ద్వారానే , చైతన్యం కాబడిన కుఃడలినీశక్తి ప్రవహిస్తుంది. ప్రాణాయామము,మంత్రసాధన, సతతధ్యానము... కుండలినీశక్తి చైతన్యం చెందడానికి సహాయపడతాయి. చైతన్యవంతం అయిన కుండలినీశక్తి ఈ నాడీ మార్గాల ద్వారా ప్రవహిస్తుంది.


    సుషుమ్నానాడి మధ్యలో మణిలాగా ప్రకాశించే వజ్ర అనే నాడి ఉన్నది. మరల దానిలో చంద్ర సూర్య అగ్ని రూపమైన, బ్రహ్మవిష్ణు శివులతో కూడిన చిత్రా (చిత్రిణి) అనే నాడి సాలెపురుగు దారములాగా ఉన్నది. నిర్మలమైన జ్ఞానోదయము లేకపోవటంవలన ఈ నాడిని ఎవరూ తెలుసుకోలేరు. మరల ఆ చిత్రానాడిలోపల అతి సూక్ష్మమైన విద్యున్మాలలాగా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ బ్రహ్మనాడి అనే మరొక నాడి ఉన్నది.


    

     ఈ బ్రహ్మనాడిలోని రంధ్రంద్వారా బ్రహ్మరంధ్రంలోని సహస్రారపద్మం నుండి సుధ ప్రవహిస్తూ ఉంటుంది. యోగులు ఆ సుధను మూలాధార పద్మంవద్దనున్న కుండలినీశక్తి ద్వారా పానం చేసి, బ్రహ్మానందమును అనుభవిస్తారు.


      "వజ్రనాడి" లేదా "వజ్రిణి"...సుషుమ్నా నాడిలో ఉంటుంది. ఇది స్వాధిష్ఠాన చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. సూక్ష్మశరీర కదలికలకు ఈ వజ్రానాడి బాధ్యత వహిస్తుంది.


      ఈ మానవ శరీరంలో గల కోట్ల నాడులలో 72,000 సూక్ష్మ నాడులు ముఖ్యమైనవి. ఈ నాడులలో ఇడా, పింగళా, సుషుమ్నా నాడులు, గాంధారి, హస్తిజిహ్వ, కుహు, సరస్వతి, పూషా, శంఖిణి, పయస్విని, వారుణి, అలంబుస, విశ్వోదర, యశస్విని నాడులు ముఖ్యమైనవి. ఈ సుషుమ్నానాడిలో వజ్రనాడి ఉంటుంది. సామాన్యంగా ఇడానాడి జీవనిర్మాణ క్రియలలో సంబంధం కలిగి యుంటుంది. పింగళానాడి ఉత్ప్రేరక క్రియలలో సంబంధం కలిగియుంటుంది. వజ్రనాడి అభివ్యక్తీకరణ (manifestation) ప్రక్రియలలో సంబంధం కలిగియుంటుంది.


      ఈ వజ్రనాడి పరమతేజస్సుతో ఉంటుంది. ఈ నాడి నిరంతరమూ ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ వజ్రనాడి మూలాధారము నుండి ప్రారంభమై ఆజ్ఞాచక్ర పర్యంతమూ విస్తరించి ఉంటుంది.

కామెంట్‌లు లేవు: