23, జూన్ 2023, శుక్రవారం

బూరుగ దూది పరుపు.

 బూరుగ దూది పరుపు...

పరమాచార్య వారు సాధారణంగా పగలు నిద్రించరు. కానీ ఉపవాసాల బడలిక వల్ల ఒక్కోసారి తుంగ చాపమీద ఎలాంటి గుడ్డ పరుచుకోకుండానే పడుకుంటారు. అందువల్ల వారి వీపు మీద తుంగ చాప ముద్రలు కనిపిస్తుంటాయి.సుందరరామన్ అనే శిష్యుడు ఆ ముద్రలు చూసి "స్వామి వారి శరీరం ఒత్తుకొంటున్నది "అని ఎవరిని సంప్రదించకుండా చెన్నై వెళ్లి పరుపులు, దిండ్లు అమ్మే దుకాణంలో బూరుగదూది పరుపు దానికి ఒక వెల్వేట్ కవర్, దిండ్లు కొని స్వయంగా తానే మోసుకొని తెచ్చాడు.వీటిని స్వామి ముందుంచి వినయంగా "మీరు వీటిని స్వీకరించాలి "అని ప్రార్ధించాడు.స్వామి వాటిని తన సమీపానికి తెమ్మని సైగ చేసాడు. వాటిని తాకి "చాలా మెత్తగా ఉన్నాయి."

"అవును పెరియవ. వీటిని బూరుగ దూదితో చేసారు."

కొద్ది సేపు మౌనం.

దూరం గా ఉన్న ఒక పేద రైతు వైపు చూపిస్తూ

"అతను ఒక పేద రైతు. పగలంతా మనకోసం పొలం పనిచేసి ధాన్యం పండించి రాత్రిళ్ళు ఎక్కడో నేలమీద గుడ్డపరుచుకొని నిద్రిస్తాడు.సుందర రామన్ నాకోసం ఒక పని చేసి పెట్టు. వీటికి రెండు దుప్పట్లు జతచేసి అతనికివ్వు. నేను వీటిని స్వీకరించినట్లే భావించు."

కొద్దిసేపు సుందర రామన్ లో ఎలాంటి భావనలు వ్యక్తం కాలేదు. తేరుకొని

"తప్పకుండ పెరియవ "అన్నాడు. కొద్ది గంటలలో వారి ఆదేశాలను అమలు చేసాడు.

***గీతాచార్యుడు ఈ మహనీయులనే 'సమదర్శి '(5.18 పండితాః సమదర్శినః ) అంటారు అని గీతలో బోధిస్తాడు.

కామెంట్‌లు లేవు: