🕉 మన గుడి :
🔆 కృష్ణా జిల్లా : " హంసలదీవి "
👉 శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం
💠 కృష్ణవేణి నది మడ అడవుల గుండా వయ్యారంగా మెలికలు తిరుగుతూ సాగరుని ఒడికి చేరే ప్రాంతమే హంసల దీవి.
సహ్యాద్రి పర్వతశ్రేణులలో ప్రభవించిన కృష్ణానది శివకేశవ క్షేత్రమైన హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది.
💠 మహారాష్ట్రలో జన్మించి నేలను సస్యశ్యామలం చేస్తూ వేల కిలోమీటర్లు ప్రయాణించే కృష్ణమ్మలోని ఓ పాయ కోడూరు మండలం హంసల దీవిలో సముద్రంలో కలుస్తుంది. నది సముద్రంలో కలిసే చోటుకు ప్రత్యేక విశిష్టతను ఆపాదించింది శాస్త్రం. ఇలాంటి చోట్ల స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలూ నశిస్తాయని చెబుతుంది. కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే అలాంటి పవిత్ర స్థలానే రుక్ష్మిణీ సమేతంగా వేణుగోపాల స్వామి కొలువయ్యాడు.
💠 ఒకసారి ఇద్దరు గంధర్వులు ఆకాశయానం చేస్తు ఈ ప్రాంతానికి చేరుకునే సరికి అక్కడ ఒ మహర్షి తపస్సు చేసుకొంటున్నాడు. అతని నల్లని శరీరాకాన్ని చూసిన గంధర్వులు పరిహాసం చేశారు. ఈ మహర్షి కోపంతో కాకులుగా మారాలని ఆ గంధర్వులను శపించగా తమను క్షమించాలంటూ ఆ గంధర్వులు ఆ మహర్షి కాళ్లపై పడి ప్రార్థించారు. కృష్ణానదీ తీరాల్లో స్నానం చేస్తే కాకుల రూపం పోయి హంసల రూపం వస్తుందని, ఆ మహర్షి శాప నివారణోపాయాన్ని తెలిపాడు. ఇలా కృష్ణా నదీ తీరాల్లో స్నానం చేస్తుండగా ఈ దీవి దగ్గర గంధర్వులకు హంసల రూపం వచ్చిందట. అందుకే ఈ దీవికి హంసలదీవి అనే పేరు వచ్చినట్టు ఒక కథ వినపడుతుంటుంది.
💠 గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలను ప్రక్షాళన చేసే గంగా మాత, కొంత మంది భక్తుల పాపాలను ప్రక్షాళన చేసే క్రమంలో తన రంగు మారింది, తన సహజ దివ్యమైన రూపం తిరిగి ప్రసాదంచమని గంగా మాత శ్రీ మహావిష్ణువుని ప్రార్ధించింది, అప్పుడాయన నీవు నల్లని కాకి రూపానికి మారిపోయి ఏ తీర్ధంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ మాత కాకి రూపంలో హంసల దీవి వద్ద ఉన్న కృష్ణవేణి నదీ సాగర సంగమ ప్రదేశంలో స్నానం చేసింది వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది అందుకని ఈ ప్రాంతానికి హంసలదీవి అని పేరు వచ్చింది..
💠 స్థలపురాణం :
పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా వుండేవు. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు.
అలా రంగడనే గోపాలుని ఆవు ఓ పుట్టలో పాలు వర్షించటాన్ని చూసి కోపంతో చలించిపోయాడు.
ఎండు ఆకులు పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది.
రంగడి శరీరం మంటలు
మండింది.
తాను చేసిన తప్పును తెలుసుకుని, గ్రామ పెద్దలతో కలిసి పుట్ట దగ్గరకు వెళ్ళాడు.
ఆ పుట్టలో శిరస్సు మినహా మిగిలిన శరీరం కాలిపోయినట్టుగా వేణుగోపాలస్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని తాకినంతనే గోపాలుని శరీర మంటలు తగ్గాయి. ఆ విగ్రహాన్ని గ్రామానికి తీసుకువచ్చి పూజలు ఆరంభించాడు. ఓ రోజు స్వామి వారు గ్రామస్తుల కలలో కనపడి పశ్చిమగోదావరి జిల్లాలోని కాకరపర్తి అనే గ్రామంలో ఓ భూస్వామి ఇంటి ఈశాన్య మూల కాకరపాదు కింద తాను ఉన్నట్టు సెలవిచ్చాడు. అంతనే గ్రామస్తులు కాకరపర్తి వెళ్లి, ఆ భూస్వామిని బతిమలాడి స్వామి వారి విగ్రహాన్ని హంసల దీవికి తీసుకువచ్చారని ఓ కథ చెబుతుంటారు.
💠 పూర్వం దేవతలు సముద్రతీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కకి స్థలపురాణం. వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. అయినా తెల్లవారిందని వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు.
నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.
💠 గర్భాలయం నందలి శ్రీ వేణుగోపాలస్వామి ప్రతిష్ట విగ్రహంతోపాటు స్వయంభూమూర్తిని కూడా చూడగలము. మూలవిరాట్టుకు ఎడమవైపున గోవును, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులు, చక్రత్తాళ్వారు స్వామిని దర్శించగలము. ముఖమండపం నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ జనా ర్ధన స్వామి వారు కొలువై ఉన్నారు.
💠ఈ ఆలయంలో వివాహం చేసుకొని, సాగరసంగమ ప్రదే శంలో సరిగంగ స్నానాలు చేస్తే ఆ జంటలు సుఖంగా నూరేళ్ళు జీవిస్తారనేది భక్తుల విశ్వాసం.
ఈ ఆలయంలో నిద్ర చేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగు తుందని చెపుతారు.
💠ఉత్సవాలు...
మాఘపౌర్ణమికి స్వామివారి కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, ధనుర్మాసం, ప్రత్యేక ఉత్సవాలు. కార్తీకమాసంలో సముద్ర స్నానం చేసిన వేలాదిమంది భక్తులు తప్పనిసరిగా స్వామిని దర్శిస్తారు.
💠 హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి