23, జూన్ 2023, శుక్రవారం

♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 99

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️

*పార్ట్ - 99



దేవకి దృష్టికి ఆమె కుమారుడు కనిపించలేదు. ఆమె నిత్యం, అనుక్షణం ఆరాధించే విష్ణు భగవానుడు దర్శనమిచ్చాడు. దేవదేవుని దర్శనభాగ్యంతో దేవకి ముఖం విప్పారి ప్రకాశంవంతమైంది. 


"దేవకీ .... ఆనాడు నీకు వరమిచ్చాను. దాన్ని నెరవేర్చాను. నా అంశతో ఘటనా ఘటనా సమర్థుడైన కుమారుడు నీకు కలిగాడు. నాడు ద్వారకలో నేనేం చేశానో... నేడు అదే నీ తనయుడు చేస్తున్నాడు... నా యీ జగన్నాటకంలో నాకు నీ పాత్ర అవసరం తీరిపోయింది... నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానిక... రా... దేవకీ.... రా...." 


"ప్రభూ... మళ్లీ... మీ దర్శనభాగ్యంతో నన్ను ధన్యురాలిని చేసావా తండ్రీ... నన్ను నీలో ఐక్యం చేసుకుంటానంటున్నావా ప్రభూ... వస్తున్నాను నాయనా... నీ సన్నిధికే వస్తున్నాను... నారాయణా... నారాయణా ...." 


తన తల్లికి విష్ణు దర్శనమైందని, ఆమె ఆ నారాయణునిలో ఐక్యమైపోతుందని గ్రహించాడు చాణక్యుడు. అతని వెనుకనుంచి శ్యామశాస్త్రి అందించిన గంగాజలాన్ని ఉద్దరిణితో మూడుసార్లు తల్లి గొంతులో పోస్తూ చాణక్యుడు దుఃఖిస్తూ "నారాయణా... నారాయణా... నారాయణా..." అని స్మరించాడు. ఆ మరుక్షణమే కాశీ విశ్వేశ్వరుడే విశాలాక్షీ సమేతుడై అదృశ్యరూపాన దేవికి ప్రక్కన నిలిచి ఆమె చెవిలో రామనామ తారకమంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాడు. అంతే... దేవకి ప్రాణజ్యోతి ఆ దేవదేవునిలో ఐక్యమైపోయింది. 


"అమ్మా...." పంచపాత్రను జారవిడుస్తూ బిగ్గరగా రోదించాడు చాణక్యుడు. మాతృఋణం తీర్చుకోవడానికి వెక్కివెక్కి ఏడుస్తూ అశ్రుతర్పడం వదిలాడు. మానవుడు ఎంతటి వాడైనా, అఖండ ప్రజ్ఞావంతుడైనా, వేదవిదురుడైనా, మరేమైనా... తన తల్లికి మాత్రం బిడ్డే... ఆ తల్లి రుణాన్ని ఎంతటివాడైనా తీర్చుకోక తప్పదు. కనిపెంచిన మాతృమూర్తికి కన్నీళ్ళతో శ్రద్ధాంజలి ఘటించడమే రుణం తీర్చుకోవడం... 


మనిషిరూపంలో వున్న దెయ్యం అనీ, రాక్షసుడనీ, కఠినాత్ముడనీ, నిరంకుశ హృదయుడనీ, దయాదాక్షిణ్యాలు లేని కుటిలుడనీ... ఇలా తనని తానే ఎన్నోన్నో బిరుదులు ప్రచారం చేయించుకున్న చాణక్యుడు... వాటన్నిటికీ అతీతంగా, సామాన్య మానవుడిలా ఒక మామూలు తల్లి కోసం పరితపించే సాధారణ కుమారుడిలా... వెక్కివెక్కి ఏడుస్తూ... తన కన్నీటి తర్పణముతో ఆ కన్నతల్లి రుణం తీర్చుకున్నాడు. ఆ సాయంత్రమే హరిచంద్ర ఘాట్ నందు దేవకి దహన సంస్కారములను బ్రాహ్మణోచిత పద్ధతిన యధావిధిగా నిర్వర్తించాడు చాణక్యుడు. 


కాశీరాజ పరిషత్ లో పండి విజయం సాధించిన చాణక్యునితో కాశీరాజుకి పూర్వ పరిచమున్నది. ఇప్పుడు మగధకి సామంతమైనది కాశీరాజ్యము. చంద్రగుప్తునికి అత్యంత ఆప్తుడైన గురుదేవునిగా ఇప్పుడు విచ్చేసిన చాణక్యుని ఆ కష్ట సమయంలో ఏ లోటూ రాకుండా తగిన ధన సహాయము చేయవలెనని ఆశించాడు కాశీరాజు. అంతలో అదే విషయమై చంద్రగుప్తుని వద్దనుంచి కూడా అతనికి వర్తమానం వచ్చింది. 


కానీ.... వారి సహాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు చాణక్యుడు. తనకున్నంతలో తన తల్లి అంతక్రియలు, దశదినకర్మలు ఘనంగా జరిపించాడు. ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా వైదిక విదుల ద్వారా కూడా చాణక్యుడు తన మాతృరుణాన్ని తీర్చుకున్నాడు. అనంతరం కొద్ది రోజుల తర్వాత భార్య, కుమార్తెతో పాటలీపుత్రానికి ప్రయాణమయ్యారు చాణక్యుడు. 


ఆర్యుని భార్య గౌతమికి అమ్మమ్మ, తాతయ్యలైన శ్యామశాస్త్రి దంపతులను కూడా తమతో పాటు పాటలీపుత్రం వచ్చి ఉండవలసిందిగా అభ్యర్థించారు. ఆ వృద్ధదంపతులు వారి కోరికను సున్నితంగా తిరస్కరించి 'వార్ధక్యంలో వున్న తాము వానప్రస్థంతో తపస్సుతో శేష జీవితాన్ని గడుపుతామని' చెప్పి వనవాసానికి వెళ్ళిపోయారు. చాణక్యుడు భార్యాబిడ్డలతో పాటలీపుత్రానికి చేరుకున్నాడు. 


రాజమాత మురాదేవి, చంద్రగుప్తుడు చాణక్యుని నివాసానికి వచ్చి వారికి కలిగిన మాతృశోకానికి తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. రాజమాత మురాదేవి ఆర్యుని అర్ధాంగి గౌతమిని ఆదరించి ఆలింగనం చేసుకొని పసిబిడ్డ అన్నపూర్ణని చేరదీసి ముద్దులాడింది. 


ఇదంతా ఇలా జరుగుతుండగానే చంద్రగుప్తుడిని చాటుకు పిలిచి "ప్రభువుల వారి మీద రెండు హత్యప్రయత్నాలు జరిగాయట గదా ?" అని ప్రశ్నించాడు చాణక్యుడు.


చంద్రుడు మందహాసం చేసి "ఈ వార్త అప్పుడే తమరికి చేరిందా..  " అన్నాడు. 


"వార్త నాకు తెలిసినందుకు విచారిస్తున్నావా ? నీ అంగరక్షక దళం అజాగ్రత్తకు సిగ్గుపడుతున్నావా ?" రెట్టించాడు చాణక్యుడు. 


చంద్రుడు తలదిప్పి "రెండూకాదు. పాటలీపుత్ర రాజ పరివారంలో ఇంకా రాక్షసాత్యునికి వున్న 'పట్టు'కి నిదర్శనం ఆ హత్యప్రయత్నాలు" అని చెప్పాడు. 


చాణక్యుడు భృకుటి ముడిచి "రాక్షసుడు... హు.... యీ చాణక్య తంత్రాన్నించి  నుంచి ఆ రాక్షసుడు ఎలా తప్పుకుంటాడో చూస్తా .." అన్నాడు పటా పటా పళ్లు కొరుకుతూ. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: