30, ఆగస్టు 2022, మంగళవారం

సాధకుడు జీవితం

 సాధకుడు తన జీవితంలో ఎలా వుండాలి


కమలం బురదలో పుడుతుంది, నీటిపైన జీవిస్తుంది...

ఈ రెండింటిని తనలో చేర్చు కోదు, ఆడవారు కంటికి పెట్టుకునే కాటుక గ్రుడ్డు కు అంటదు...

పచ్చళ్లు, కూర్మాలూ, ఎన్ని తిన్నా గాని నాలుకకు జిడ్డు అంటదు...

అట్లే సాధకుడు, జగత్తులో ఉన్నప్పటికీ, జగత్తు మనలను అంటకూడదు...

సుఖ దుఃఖములు, సంయోగ వియోగములతోనూ, మనకు సంబంధముండకూడదు...


అభిమాన, అహంకారములున్నచోట, దైవభక్తి ఉండజాలదు...

నేను కీర్తనలు బాగా పాడుతున్నాననీ, నా పూజా మందిరాన్ని రంగుల దీపాలతో బాగా అలంకరించాననీ గర్వపడవద్దు...

మన అలవాట్లల్లో వైఖరిలో మంచి పురోగతి ఉండాలి...

అది లేనప్పుడు సాధన వ్యర్థమైన కాలక్షేపమే...

కలి మహత్మ్య మేమో కానీ ఈరోజు ఆడంబర భక్తి తాండవ మాడుతోంది...

దైవము దేనినీ ఆశించడు, పరోపకారం, దీన ప్రాణులకు చేతనైనా సహాయ సహకారాలు అందించడం స్మరణ అనేది ఒక స్టాంపు, మననం అనేది ఒక చిరునామా, నామమును స్మరించాలి, ఆయన రూపమును ధ్యానించాలి... అంతేచాలు. అదే ఆయనను చేరుతుంది

వినాయక చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 1         


ఏకవింశతి (21) పత్రి  


    వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మనం 21 రకాల పత్రితో  పూజిస్తాం. 

    ఆ పత్రికీ, వాటి వృక్షభాగాలకీ అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుందాం.  

  (ముఖపుస్తకం నుంచి చొప్పకట్ల సత్యనారాయణగారి సౌజన్యంతో)


21 రకాల పత్రి - ఔషధ గుణాలు


1) మాచీపత్రం : ఇది మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. 

    మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. 

    ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. 

    ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. 

    రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.


2) బృహతీ పత్రం. 

    భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. 

    దీనినే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం.     

    ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమానీ, దగ్గునూ, సైనసైటిస్‌నూ తగ్గిస్తుంది. 

    అరుగుదలను పెంచుతుంది,     

    గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.     

    బృహతీపత్ర చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. 

    బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. 

    రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. 

    ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.


3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. 

    ఇది మధుమేహానికి (షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

    మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 


4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. 

    తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. 

    దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. 

    ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. 

    మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. 

    చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

    ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 

    గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. 

    హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.            


5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. 

    ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. 

    మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది.      

    దీని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దీని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. 

    జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.


6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. 

    చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. 

    ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, 

    కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది. 


7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. 

    దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులూ, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులూ నివారణమవుతాయి. 

    దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. 

    స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. 

    ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది. 

    పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. 

    రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు. ఆహరం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి మొక్క మహిమ. 

    ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. 

    ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.


8) తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.


    కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. 

    కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. 

    తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. 

    చర్మరోగాలను నయం చేస్తుంది. 

    తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. 

    అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. 

    తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 

    తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. 

    ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుందని తేలింది. 


    కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు. 


9) చూత పత్రం : మామిడి ఆకులను సంస్కృతంలో చూత పత్రం అని అంటారు. మామిడి మంగళకరమైనది.


    లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది.   

    మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడిచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. 

    చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. 

    చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. 

    మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. 

    మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. 

    ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.


10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. 

    సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. 

    గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది.


11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకభాషలో అవిసె అంటాం. 

    దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. 

    ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. 

    విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.


12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసుమప్రభ' అనే నామం కనిపిస్తుంది. 

    దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. 

    దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది. 

    దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. 

    దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

    దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. 

    దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.


13) దేవదారు : ఇది వనాలలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. 

    దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. 

    దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.


14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. 

    మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.


15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. 

    రెండింటిలో ఏదైనా వావిలి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. 

    ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.


16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. 

    ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. 

    జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. 

    జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. 

    జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. 

    కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. 

    జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.


17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. 

    థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. 

    అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

    చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.


18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. 

    జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. 

    జమ్మిపూలను చక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. 

    జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.


19) ఆశ్వత్థపత్రం: సంస్కృతంలో అశ్వత్థం అంటే, తెలుగులో రావి అంటాం. 

    తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమాట. 

    రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. 

    రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. 

    అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను సమిధలుగా వాడుతారు. 

    రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. 

    దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. 

    రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. 

    రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.


20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. 

    మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. 

    భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా ఇది పెరుగుతుంది. 

    ఇది శరీరానికి చలువ చేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. 

    పుండు నుంచి రక్తం కారడాన్ని త్వరగా ఆపుతుంది. 

    మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. 

    దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.


21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. 

    జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. 

    జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. 

    ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. 

    జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది. 


                   =x=x=x= 


    — రామాయణం శర్మ

              భద్రాచలం