పప్పు కూడు కాదు !
చిప్పకూడు లేదా పిండాకూడు !!
👇👇👇👇👇👇👇👇👇
1. కూతురి పెళ్లి కోసం మలక్పేట్ మల్లేషం పాతబస్తీ వడ్డీ వ్యాపారులనుంచి లక్ష రూపాయిలు అప్పు తీసుకొన్నాడు . నూటికి నెలకు పది రూపాయిలు వడ్డీ . ఐదో తేదీ లోగా నెల వడ్డీ డబ్బులు చెల్లించాలి . లేక పొతే అది అసలుకు జమ అవుతుంది .... ఇదీ ఒప్పందం .
అప్పు తీసుకొని రెండేళ్లయ్యింది . ఒకటి- రెండు నెలలు తప్పించి వడ్డీ చెల్లించలేక పోయాడు . వారి దౌర్జన్యం ఎక్కువ కావడం తో భార్య నగలు తాకట్టు పెట్టి అప్పు చెల్లించేద్దామనుకొన్నాడు . తీసుకొంది లక్ష . వడ్డీ మొత్తం కలిపి ఇంకో యాభై అరవై వేలు అయ్యుంటుందనుకొన్నాడు . మొత్తం మూడున్నర లక్షలు అయ్యింది అన్నారు . ఇంత పెద్ద మొత్తం ఎలా అయ్యిందో అర్థం కాక లబో దిబో అన్నాడు .
పుట్టింటికి భర్త తో వచ్చిన కూతురిని తాము తీసుకెళ్ళిపోతామంటూ వారు ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు . జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మల్లేశం ఆత్మ హత్య చేసుకొన్నాడు . ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు ... మల్లేశం భార్య ను, అల్లుడిని వేధిస్తున్నారు . ఈ లోగా అప్పు మొత్తం అయిదు లక్షలయ్యింది . తమకు కూడా ఆత్మ హత్యే గతి అని ఆ కుటుంబం మొత్తం ఆలోచిస్తోంది .
పెళ్ళికి చేసిన అప్పు అందరికీ పాడె ఎందుకయ్యింది ?
2. తిరుపతి నాయుడప్ప . ఫైనాన్స్ వ్యాపారి . తన దగ్గర డబ్బు డిపాజిట్ చేస్తే నెలకు నూటికి రెండు రూపాయిల వడ్డీ చొప్పున టంచనుగా చెల్లిస్తాడు . ఇంటి దగ్గరకే వచ్చి ఆ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు వడ్డీ చెల్లించి పోతారు .
అదే ఊళ్ళో ఆర్థిక శాస్త్రం చదివిన అరవింద రావు " ఎన్నో ఫైనాన్స్ సంస్థలు దివాళా తీశాయి .. ఇదీ అంతే " అనుకునేవాడు . తనకు తెలిసిన వారు సంస్థలో డిపాజిట్ చేసి నెల- నెల వడ్డీ రూపం లో సంపాదిస్తుంటే ఆలోచనలో పడ్డాడు .
ఇది పెద్ద సంస్థ . తాము సేకరించిన డిపాజిట్ లను నాయుడప్ప బెంగళూరు లో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు . దివాళా సమస్యే లేదని అయిదు కోట్లు డిపాజిట్ చేసాడు . నెలకు పది లక్షలు ఇంటికి రావడం మొదలయ్యింది . ప్రాణానికి సుఖం అయ్యింది . చేస్తున్న వ్యాపారాన్ని వదిలేసాడు . ఇదే ఆదాయ మార్గం అయ్యింది . ఆదాయం ఇక పెరగాలంటే ..?
మిత్రులకు బంధువులకు ఈ ఫైనాన్స్ స్కీం గురించి చెప్పాడు . "అతన్ని మేమెలా నమ్మాలి అన్నారు" . "అయితే రిస్క్ నాది . మీరు నాకివ్వండి . నాకు ఆయన రెండు రూపాయిల వడ్డీ ఇస్తాడు . నేను మీకు రూపాయిన్నర వడ్డీ ఇస్తాను . రిస్క్ తీసుకున్నందుకు నాకు అర్ధ రూపాయి ఆదాయం" అన్నాడు . వారు సరే అన్నారు . ఇంకో అయిదు కోట్లు సేకరించి నాయుడప్ప ఫైనాన్స్ స్కీం లో పెట్టాడు . ఇప్పుడు నెలకు రెండున్నర లక్షల అదనపు ఆదాయం .
బెంగళూరు రియల్ ఎస్టేట్ ధరలు అనుకొన్న స్థాయిలో పెరగలేదు . నాయుడప్ప రొటేషన్ దెబ్బ తింది. చేతులెత్తేశాడు . అరవింద రావు తన పూర్వీకుల ఆస్తులు అమ్మి తన ద్వారా ఫైనాన్స్ కంపెనీ లో పెట్టుబడి పెట్టిన వారికి ఇచ్చేసాడు . ఈ లోగా వారినుంచి నిందలు .. అవమానాలు . ఆర్థిక శాస్త్రం చదివిన అరవింద రావు రావు.. ఇప్పుడు తీవ్ర మనో వ్యాకులతతో ..
3. అదో స్కూల్. దాని యజమాని చాలా బోల్డ్ . రిస్క్ తీసుకొని పైకి రావాలి అనుకునేవాడు . స్కూల్ ఫీజు సంవత్సరానికి యాభై వేలు . "ఎల్ కేజీ నుంచి పదోతరగతి దాకా మీ పిల్లల్ని స్కూల్ చదివిస్తే ఫీజు ఆరు లక్షలకన్నా ఎక్కువే అవుతుంది . మొత్తం ఫీజు ఇప్పుడే... ఒక్క సారే చెల్లిస్తే... కేవలం రెండు లక్షలు" అని ప్రకటించాడు .
అప్పో సప్పో చేసి చాలా మంది మొత్తం ఫీజు కట్టేసారు . బాగా లబ్ది పొందామనుకొన్నారు .
స్కూల్ యజమాని ఇలా సేకరించిన డబ్బును షేర్ మార్కెట్ లో, ఇంకా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసాడు . ఇది ఇబ్బుడి ముబ్బిడిగా లాభాలు తెస్తుంది . అప్పుడు నెల నెల స్కూల్ జీతాలు , బిల్డింగ్ అద్దెలు లాంటి ఖర్చులు పోయినా బాగా మిగులుతుంది అనుకొన్నాడు .
షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ఒడుదుడుకులు . మొత్తం కుదేలయ్యింది . స్కూల్ యజమాని .. స్కూల్ పేరెంట్స్ అటు పై ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు .
డబ్బు !
మనిషి సృష్టి !
అది లేక పొతే చావే !
దాన్ని ఎలా మానేజ్ చెయ్యాలో తెలియక పోయినా చావే .!
డబ్బు సైన్స్ .. అంటే ఆర్థిక శాస్త్రం .
ఒకప్పుడు వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది .
డబ్బు లావాదేవీలు పెద్దగా ఉండేది కాదు .
ఉన్నా... ఆ రోజుల్లో ఇంగిత జ్ఞానం ఎక్కువ .
పొదుపు , శక్తికి మించి అప్పు చేయకపోవడం... లాంటి ఎన్నో విషయాలు పెద్దలు తమ ఇంటిలోని యువకులకు చెప్పేవారు .
రాను రాను కరెన్సీ లావాదేవీలు పెరిగాయి . దాన్ని దాటి డిజిటల్ లావాదేవీల స్టేజి వచ్చేసింది .
ఎకనమిక్స్ . తొమ్మిదో తరగతి వరకు దీని ప్రస్తావన ఉండదు . అటు పై పదవ తరగతి దాకా అంటే కేవలం రెండేళ్లు .. అదీ మూడో నాలుగో ఆర్థిక శాస్త్ర పాఠాలు. అదీ దైనందిన జీవితం తో సంబంధం లేని థియరిటికల్ పాఠాలు .
అటు పై కాలేజీ చదువుల్లో ఆర్థిక శాస్త్రం తీసుకొనే వారు కరువయ్యారు .
చదివేది బతకడం కోసం .
బతకాలంటే డబ్బుండాలి { కేవలం డబ్బుంటే చాలదు . అది వేరే కోణం }.
ఆ డబ్బును ఎలా మానేజ్ చెయ్యాలో తెలియక , ఏటా కొన్ని లక్షల బతుకులు తెల్లారిపోతున్నాయి .
బతకడం నేర్పని చదువులు .
డబ్బు శాస్త్రం నేర్వని బతుకులు .
క్రెడిట్ కార్డు వుంది కదా అని సంపాదించబోయే డబ్బును ముందుగానే లెక్కకు మించి ఖర్చు పెట్టి ఆనక అంగలార్చే జీవులు కోట్లలో .
అమెరికా కో... ఆస్ట్రేలియా కో ... ఎక్కడికి పోయినా ఒకటే తీరు .
కారు , ఇల్లు క్రెడిట్ పై కొనేసి అటు పై జీవితాంతం EMI చెల్లిస్తూ బతకడం .
ఉద్యోగం స్థిరంగా ఉండి EMI చెల్లిస్తే తప్పేంటి ? అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కదా ? అని ఎవరైనా ప్రశించవచ్చు .
నిజమే .
కానీ కొలువు పొతే ?
పిల్లలు స్కూల్ లో ఉన్నంత వరకు ఫరవాలేదు.
అటుపై వారి కాలేజీ ఫీజ్ లు ఒక పక్క .. ఎప్పుడో కొన్న ఇంటి EMI మరో పక్క .
ఒకటికి రెండు కొలువులు చేస్తూ తాము ఇంటిని కొన్నామో ... ఇల్లే తమ జీవితాన్ని కొనేసిందో... అర్థం కాక మధన పడే దూరతీరాల జీవులెందరో .
అందరికోసం కొన్ని డబ్బు శాస్త్ర పాఠాలు .
👇👇👇👇
1 . ఇంటి అద్దె , పచారీ సరుకుల ఖర్చు , బట్టలు , వాటర్ బిల్, పెట్రోల్ బిల్... లాంటి నెలవారీ ఇంటి ఖర్చులు .. ఇలాంటివి ఒక లెక్క . ఇలాంటి ఖర్చుల కోసం మీరు అప్పు చేస్తున్నారు అంటే ప్రమాదం అంచుల్లో ఉన్నట్టే .
ఎందుకు అప్పు చెయ్యాల్సి వస్తోంది ? ఆదాయాన్ని పెంచుకోలేరా ? ఖర్చుల్ని తగ్గించుకోలేరా ? ఆలోచించండి . ఇలాంటి నెలసరి ఖర్చులకు { రెవిన్యూ వ్యయం } అప్పు చేస్తే దాన్ని ఎలా తీరుస్తారు ? తీసుకొన్న అప్పు ఇంతింతై రేపు ఉరితాడుగా మారే ప్రమాదముంది . నేడు అప్పు చేసి పప్పు కూడు తింటే.. రేపు ? జైలా ? మరణమా?
2 . చెల్లి / కూతురు లేదా ఇంట్లో మరొకరి పెళ్లి . పెళ్ళికి అప్పు చెయ్యాలా ? నలుగురికీ ఆడంబరంగా కనిపించి రేపు చిక్కుల్లో ఇరుక్కుంటారా ? ఉన్నంతలో పెళ్లి చేయలేరా ?
గద్ద చాలా పైకి ఎగిరిందని కోడి ఆ పని చేస్తుందా ? కుక్క ఎగిరే ప్రయత్నం చేయడం చూసారా ?
తమ లిమిట్ వాటికి తెలుసు .
మనుషులై పుట్టిన మనకు కనీసం వాటి స్థాయి ఇంగిత జ్ఞానం లేక పోతే ఎలా ?
౩. డబ్బుని పాతి పెడితే చెట్టు మెలిసి , డబ్బు కాయలు కాస్తుందా ?
డబ్బు డబ్బు ను సృష్టించాలి అంటే పని చెయ్యాలి .
ఎవరో డబ్బు ఆధారంగా పని చెయ్యాలి .
అంటే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది .
మనం బ్యాంకుల్లో డబ్బు ను రికరింగ్ ... సేవింగ్స్ అకౌంట్స్ రూపం లో డిపాజిట్ చేస్తాము . బ్యాంకు వారికి ఆదాయం ఎలా వస్తుంది ? వారు కరెన్సీ నోట్లను విత్తనాల్లా పాటి పెడతారా ఏంది ?
మనకు వారు, ఎలా వడ్డీ ఇవ్వగలుగుతున్నారు .
మనకు బ్యాంకు ఏడు శాతం వడ్డీ ఇస్తుంది అనుకొందాము . మనం జమ చేసిన డబ్బును వారు వేరే వారికి అప్పులిస్తారు . వారి వద్ద నుంచి 13 - 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు . తేడా ... జీతాలు అద్దెలు లాంటి ఖర్చులకు సరిపోతుంది . ఇంకాస్త మిగిలితే బ్యాంకు కు లాభం . అదీ లెక్క .
బ్యాంకు నుంచి 14 శాతం ఇంటరెస్ట్ కు అప్పు తీసుకొన్న వారు ఏమి చేస్తారు ? చాలా మటుకు ఇలా అప్పు తీసుకొనే వారు దాన్ని వ్యాపారానికి పెట్టుబడిగా పెడుతారు .
పై ఉదాహరణలో పాత బస్తీ వడ్డీ వ్యాపారి నూటికి నెలకు పది రూపాయిలు వడ్డీ .. అంటే బ్యాంకు లెక్కలో చెప్పాలంటే 120 శాతం వడ్డీ . ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు 120 శాతం .. పోనీ తక్కువంటే నూటికి నెలకు అయిదు రూపాయిలు అంటే 60 శాతం .. ఇంకా తక్కువంటే నాయుడప్ప ఫైనాన్స్ కంపెనీ చెల్లించినట్టు నూటికి నెలకు రెండు రూపాయిలు అంటే 24 శాతం ..
బయట వడ్డీ రేట్లు ఇలా ఉంటే బ్యాంకు లు కేవలం 14 శాతానికే అప్పులిస్తున్నాయి . ఎందుకు ?
వారికి పిచ్చా? వెర్రా ?
మన దేశం లో... ఆ మాటకొస్తే ప్రపంచం లో పది శాతం ప్రాఫిట్ వస్తే అది గొప్ప బిజినెస్ కింద లెక్క . కనీసం పది శాతం ప్రాఫిట్ రాకుండా కునారిల్లే వ్యాపారాలు ఎన్నో . అరుదుగా 20 శాతం లాభాలు . మహా అరుదుగా ముప్పై ఆరు శాతం .
ఇప్పుడు ఆలోచించండి . నాయుడప్ప ఫైనాన్స్ సామ్రాజ్యం ఎందుకు కుప్ప కూలింది ?
తన కంపెనీ లో పెట్టుబడి పెట్టే వారికి ఆయన 24 శాతం ఇచ్చేవాడు . అంటే ఆయన కంపెనీ కి కనీసం 36 శాతం రాబడి ఉండాలి .
36 శాతం లాభాలు వచ్చే కంపెనీ లు ఎన్ని ? ఏదో ఇన్ఫోసిస్ లాంటి సంస్థ . అదీ అప్పుడప్పుడు . వారు నాయుడప్ప దగ్గర అప్పు చేయరు .
నాయుడప్ప రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు . మహా అంటే రియల్ ఏస్టేట్ర్ ఐదేళ్లకు డబల్ అవుతుంది . అంటే 20 శాతం ఇంటరెస్ట్ .
నాయుడప్ప కు రియల్ ఎస్టేట్ సజావుగా సాగితే వచ్చేది 20 శాతం . ఆయన జనాలకు ఇవ్వాల్సింది 24 శాతం . అంటే ఆయన ఫైనాన్స్ వ్యాపారం గర్భం లోనే మరణించిన శిశువు . ఫండమెంటల్స్ సరిగా లేవు . ఏదో కొన్నాళ్ళు... వస్తున్న డబ్బుతో రొటేట్ చేసి బాగుందనిపించాడు .
ఆర్థిక శాస్త్రం చదివిన అరవింద రావు ఒక పెన్ను పేపర్ తీసుకొని లెక్కవేసుంటే ఇది మృత శిశువు అని అర్థం అయిపోయివుండేది . కానీ నలుగురితో నారాయణ మెంటాలిటీ . అందరూ వేసుకున్నారని కరోనా వాక్ సీన్ వేసుకొని కీర్తి శేషులైన ఎంతో మంది ని చూసాము .
కృషి బ్యాంకు మసై పోవడానికి , చార్మినార్ బ్యాంకు మూసి వరదల్లో కొట్టుకొని పోవడానికి, ఏటేటా ప్రతి కాలనీ లో ఎన్నో ఫైనాన్స్ కంపెనీ లు దివాళా తీసిపోవడానికి ... కారణం ఇదే .
గుర్తు పెట్టుకోండి . నూటికి నెలకు మహా అంటే 18 శాతం ..
ఆరోగ్యం బాగాలేదు .. వెంటనే ఆసుపత్రికి డబ్బులు కావాలి లాంటి ఎమర్జెన్సీ లో 24 శాతం .. అంతకు మించి ఎక్కువ వడ్డీ కి మీరు అప్పు తీసుకొంటే మీ గొయ్యి మీరే తవ్వుకొన్నట్టే .
అదే విధంగా 24 శాతం అంతకంటే ఎక్కువ వడ్డీ ఇస్తాము అని చెప్పే నాయుడప్ప ఫైనాన్స్ లాంటి సంస్థల్లో మీరు డిపాజిట్ చేస్తే మీ డబ్బులకు మీరు తిలోదకాలు ఇచ్చుకొన్నట్టే !
అప్పు లేనిదే అమెరికా కైనా తెల్లారదు . నిజమే .
కానీ తీసుకొనే మొత్తం ఎంత ?
దానికి మీరు చెల్లించే వడ్డీ ఎంత ?
తీసుకొన్న అప్పుతో మీరు ఏదయినా సంపదను సృష్టిస్తున్నారా?కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ } . అయితే ఏంటది ?
వచ్చే లాభాలు ఎంత ?
రిస్క్ ఎంత ?
నష్టాలు వస్తే వాటిని ఎలా భరిస్తారు ?
బ్యాంకు లు కొల్లేటరల్ లేకుండా సాధారణ జనానికి అప్పుఇవ్వవు . బిజినెస్ లో నష్టం వస్తే ఆ ఆస్తిని ని అమ్మి వారు సొమ్ము రాబట్టుకొంటారు .
అదే రీతిలో మీ అంత మీరు లెక్క పెట్టుకోవాలి . పెట్టిన పెట్టుబడి ఎంత రాబడినిస్తుంది . లెక్క తప్పైతే ఏంటి ? అని
ఇంకా ఎన్నో వున్నాయి .. అన్నీ ఒకే క్లాసులో{ ఒకే పోస్ట్ లో } అయిపోవాలంటే ఎలా ?
అప్పుడప్పుడు .. పోస్టు చేస్తూనే వుంటాను .
చదవండి .
ఒకటికి రెండు మూడు సార్లు చదవండి .
చదివి అర్థం చేసుకోండి .
నలుగురికీ పంచండి .
ఎందుకంటే సరైన విజ్ఞానమే .. సంతోషకర జీవితాన్నిస్తుంది .