*సన్యాసి..సంసారి..*
"నేను ఇక్కడ మండలం రోజులు ఉండాలని అనుకుంటున్నాను..ఈ వాతావరణం నాకు నచ్చింది..నేను ఉండటానికి ఏర్పాట్లు చేయగలరా?..నేను ప్రతిరోజూ సాధన చేసుకోవడానికి ఈ ప్రదేశం అనువైనదిగా నా మనస్సుకు అనిపిస్తోంది..పైగా ఇక్కడ ఒక అవధూత తపస్సు చేసి సిద్ధిపొందాడని విన్నాను.." అని ఆ సాధువు నన్ను అడిగాడు..కాషాయ వస్త్రాలు కట్టుకొని నుదుటన పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్న ఆయనను చూడగానే నాకు పెద్దగా భక్తిభావం కలుగలేదు..వయసు నలభై ఏళ్ళు ఉంటుందేమో అనుకున్నాను..అతని ముఖం లో నిర్లక్ష్యంతో కూడిన చూపు కనబడుతున్నదా అన్న భావన కలిగింది..
"ఇలా హఠాత్తుగా వచ్చి, ఏర్పాట్లు చేయండి అంటే..మాకు వీలుపడదు..మీరు కనీసం రెండు మూడు నెలల ముందుగా తెలియపరచి ఉంటే..అవకాశం కల్పించేవాడినేమో..ప్రస్తుతానికి ఇక్కడ తపస్సు చేసి సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్ళండి..కొంతకాలం తరువాత మీరు ముందుగా తెలియచేస్తే..మీరు సాధన చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాము.." అన్నాను..
"అలాగా..సరే.." అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు..కనీసం స్వామివారి సమాధి దర్శనం కూడా చేసుకోలేదు.."ఆ సాధువు మళ్లీ వస్తే..సమాధి వద్దకు పంపించండి..మనమేమీ ఏర్పాట్లు చేయలేమని చెప్పండి.." అని మా సిబ్బందికి చెప్పాను..మా వాళ్ళు కూడా సరే అన్నారు..ఆరోజు అతను మాకు కనబడలేదు..మేమూ మా పనుల్లో మునిగిపోయాము..ప్రక్కరోజు ఉదయం మళ్లీ వచ్చాడు.."అయ్యా..స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాను.." అన్నాడు..సరే అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి..గడప వద్ద నిలబడి..రెండు చేతులూ జోడించి నమస్కారం చేసుకొని..తన చొక్కా జేబులోంచి ఒక చిన్న కర్పూరపు గడ్డ తీసుకొని..ప్రక్కనే స్వామివారి ఉత్సవ మూర్తి ముందు వెలుగుతున్న దీపం వద్ద ఆ కర్పూరాన్ని వెలిగించి.."స్వామీ దత్తాత్రేయా..." అంటూ పెద్ద కేక పెట్టి..వెలుగుతున్న ఆ కర్పూరాన్ని అమాంతం నోట్లో వేసుకొని మింగేసాడు..ఈ తతంగం అంతా చూస్తున్న మా కందరికీ ఒళ్ళు జలదరించింది..ఒక ఐదు నిమిషాల పాటు అక్కడే కళ్ళుమూసుకుని నిలబడ్డాడు..ఆ తరువాత స్వామివారి ఉత్సవ మూర్తి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని..అర్చక స్వామి ని అడిగిమరీ తీర్ధం ఇప్పించుకొని..దానిని నోట్లో వేసుకొని..మళ్లీ నమస్కారం చేసుకొని..బైటకు వచ్చేశాడు..
"నాకు ప్రాయశ్చిత్తం జరిగింది.." అని ఒకే ఒక మాట చెప్పి.."నేను వెళ్ళొస్తాను.." అని వెళ్ళిపోయాడు..ఆరోజు ఆ సంఘటన నా మనసులో హత్తుకు పోయింది..ఆ తరువాత అతను మళ్లీ రాలేదు..క్రమంగా నేనూ మర్చిపోయాను..
మరో రెండు సంవత్సరాల తరువాత..ఒక శనివారం నాటి మధ్యాహ్నం మూడు గంటల వేళ, ఇద్దరు దంపతులు వచ్చారు..నేరుగా నేను కూర్చున్న చోటుకి వచ్చి.."నన్ను గుర్తు పట్టారా?" అని ఆ ఇద్దరిలో మగవాడు అడిగాడు.."లేదు..మీరెవరో నాకు గుర్తు రావడం లేదు.." అన్నాను.."నిజమే లెండి..గుర్తుపట్టడం కష్టమే..కానీ ఇది చెప్పండి..రెండు సంవత్సరాల క్రితం..ఇక్కడ సాధన చేసుకోవాలి..నాకు ఉండటానికి ఏర్పాటు చేయమని ఒక సన్యాసి మిమ్మల్ని అడిగాడు..మీరు కుదరదు అన్నారు..గుర్తుందా?..ఆ సన్యాసిని నేనే..ఇప్పుడు సంసారిగా మారి..స్వామివారి దర్శనానికి వచ్చాను..ఈమె నా భార్య..సాధన, తపస్సు, మోక్షం..ఇలాటి మాటలు విని..సన్యాసుల్లో కలిశాను..ఎక్కడెక్కడో తిరిగాను..ఒక గమ్యం లేదు..ఒక మార్గం లేదు..మొదటిసారి మొగిలిచెర్ల వచ్చి ఈ స్వామివారి మందిరం లో అడుగుపెట్టిన తరువాత..నాకు తపన మొదలైంది..మీరు ఇక్కడ ఉండటం కుదరదు అన్న తరువాత..ఆరోజు రాత్రి స్వామివారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి..నీ మార్గం ఇదికాదు..కుదురుగా సంసారం చేసుకో..పోరా..పోయి..నీ భార్య తో కలిసి ఇక్కడకు రా..! అని చెప్పారు..అందుకే తెల్లవారి వచ్చి ఇక్కడ వెలిగే కర్పూరాన్ని మింగి..నా తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను..నేరుగా మా ఊరు వెళ్లి, నా భార్యకు క్షమాపణ చెప్పుకున్నాను..వ్యవసాయం చేసుకుంటూ..కుదురుగ్గా వున్నాను..ఇన్నాళ్లకు మళ్లీ స్వామి దయవల్ల ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాను.." అన్నాడు..
అందరూ సాధకులు కాలేరు..కొందరు వక్రమార్గం పడతారు..అటువంటి వారు సరైన సమయం లో సద్గురువును ఆశ్రయిస్తే...సక్రమమైన బోధచేసి..జీవితానికో మార్గం చూపుతారు..సంసారిగా వుండి..సన్యాసిగా మారి..మళ్లీ సంసారం లోకి వచ్చిన ఈ సాధకుడి జీవితం కూడా మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు అనబడే సద్గురువు బోధ తోనే బాగుపడింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి