వేదాంత వ్యాసం
మొదటి భాగం
బ్రహ్మ :
గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము, సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.
పరబ్రహ్మ :
బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.
ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.
అచల పరిపూర్ణ పరబ్రహ్మ :
శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని, పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.
పరిపూర్ణము :
పరిపూర్ణము నిర్వికారము. దానినుండి, దానికి సంబంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే మూలావిద్య. ఈ ప్రథమ స్పందనకు మూలావిద్య కారణము గాని, పరిపూర్ణము కారణము కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడూ మూలా విద్యకారణముగా తోచెను గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకములు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము. ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.
ఇహరూపము :
ఎదురుగా ఇంద్రియ గోచరముగా నున్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుచూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావు పుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య. మాయా కల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. స్వస్వరూపమందు లేనిది. ఊహామాత్రము. భావనామాత్రము. యత్భావంతద్భవతి. అభావమందు లేనిది. మృతరూపము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహరూపము.
పరరూపము :
ఈ దృశ్య జగత్తుకు ఆవలనున్నది. ఇహరూపమునకు పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణమునకు, సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది. స్వతఃసిద్ధమై యున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ