*#కృష్ణా_నీ_మీద_మనసాయెరా #గోపికావిలాపము*
( కందములలో శతకము - 04 )
🌺🍃 *----------------* 🍃🌺
🌹🙏🌹
*ఎంతటి గబ్బితనంబులొ*
*యింతగ ప్రాధేయపడితి నింతిని నైనన్*
*వింతగ నీ మనసు కరుగ-*
*దెంత విచిత్రంబిది సరి యెరుగుము గృష్ణా !*
( 31 )
🌹🙏🌹( భావము )
ఎంత గర్వమో ఎంత కొంటెతనమో నీది.
ఇంత ఆశతో బ్రతిమాలుచూ వేడుకుంటున్నా ,
మగువనైనా సరే నేనే అడుగుతున్నా నీ పొందును !🙏
అయినా సరే నీ మనసు కరుగుటలేదు ఇదేమి విచిత్రమో
మరి అది నీకే తెలియాలి *కృష్ణా !*🙏
🌹🙏🌹
*కష్టము నెరిగిన వాడవు*
*దుష్టుల నైనను విడువక దొరకొందువు , నీ*
*యిష్టసఖిని విడిచితివే !*
*కష్టము గాదా మనసుకు కలతై కృష్ణా ??*
( 32 )
🌹🙏🌹( భావము )
నీవు స్వయముగా కష్టములనెన్నో అనుభవించి తెలుసుకున్నవాడవు .
చెడ్డవారినైనా , మంచిగా యత్నించి చేరదీసెడి వాడవు ! 🙏
మరి ఇదేమిటయ్యా నీ ప్రియురాలనే అయినా నన్ను ఇలా విడిచిపోయావు ?🙏
నా మనసుకు కష్టముగా ఉండదా ఈ బాధ *ఓ కృష్ణా !!*🙏
🌹🙏🌹
*మజ్జన మాడెడి వేళన్*
*గజ్జెలు గట్టు సమయాన , గానంబులనున్*
*నొజ్జ యరు దెంచినను నీ*
*సజ్జనులకడ తవనామ స్మరణయె కృష్ణా !*
( 33 )
🌹🙏🌹( భావము )
స్నానము చేస్తున్నా , కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటున్నా,
పాడుకుంటున్నా చివరకు గురువులు వేంచేసినా ,
ఇక్కడ మంచివారి అందరి నడుమనా ,
నాకు నీ పేరును తలుచుకోవటమే పనిగా అయినది *కృష్ణా !* 🙏
🌹🙏🌹
*ప్రీతిగ నిన్నే వలచిన*
*నాతిని దూరమున వెట్ట న్యాయంబౌనా ?*
*శీతల మనంబుతో నా*
*రీతిన ప్రేమింపరార రివ్వున కృష్ణా !*
( 34 )
🌹🙏🌹( భావము )
ఎంతో ఇష్టపడి నిన్నే ప్రేమించిన వనితను ,
నన్ను దూరమున పెట్టటము నీకు ఒప్పిదముగా ఉన్నదా *కృష్ణా ?*🙏
కొంచెము చల్లని మనసు చేసుకో నాపైన .
ఆ విధముగా నన్ను ప్రేమించుటకు వేగిరమే రారాదా *కృష్ణా ?*
🌹🙏🌹
*గట్టిగ నీ కౌగిలిలో*
*నిట్టే యొదగని పరువము లేలా కృష్ణా ?*
*గట్టున పొరలెడి మీనం-*
*బెట్టుల వగచునొ నదియిదియేగద కృష్ణా !*
( 35 )
🌹🙏🌹( భావము )
నీ కౌగిలిలో గట్టిగా నన్ను తీసుకోగా , ఆ కౌగిలిలో చక్కగా ఒదిగపోవాలిగానీ ,
అవియేమియూ లేని ఈ నా వయస్సు అసలెందుకు *కృష్ణా ?*🙏
నీటి నుంచీ విడివడిన చేప ఎలా అయితే విలవిలా కొట్టుకుంటూ బాధపడుతుందో
చూడాలంటే , నన్ను చూస్తే చాలు .🙏
ఆ బాధయే నా బాధ గదా *కృష్ణా !*🙏
🌹🙏🌹
*గోవుల గాచెడి కృష్ణా*
*గోవువలెనె జూడరాద గోముగ నన్నున్ ?*
*జేవకు గొదవేమయె ? యీ*
*జీవికి నీవే జవముయు జీవము కృష్ణా !*
( 36 )
🌹🙏🌹( భావము )
గోవులను ఎంతో లాలనగా గాచే వాడవు కదా *ఓ కృష్ణా !*🙏
అ గోవుల మంద లోనే ఒక గోవునని నన్ను గారాబముగా చూచుకొనరాదా ?🙏
ప్రేమను పంచుటలో నీ శక్తికి అరుదేమి గలదయ్యా ?🙏
ఈ జీవికి నీ పొందే శక్తినిచ్చును , అదియే ఈ జీవికి జీవితము కూడా *కృష్ణా !* 🙏
🌹🙏🌹
*పక్కనె బాన్పదె యున్నది*
*పక్కనె బండ్లుయు నగరులు బాలుయు దేనెల్ ,*
*పక్కెనె యున్నవి యేలకొ ?*
*పక్కన నినుబాయగనవి వట్టివె కృష్ణా !*
(37 )
🌹🙏🌹( భావము )
పక్కనే చక్కగా మెత్తని పానుపు ఉన్నది.
పక్కనే మధుర ఫలములు ఉన్నవి , సుగంధ పరిమళ ద్రవ్యములున్నవి .
అలాగే గోరువెచ్చని పాలు , తేనియ కూడా ఉన్నాయి .🙏
అవి అన్నీ నా ప్రక్కన ఉండి ఏమి ప్రయోజనము
పక్కన నువ్వు లేకుండగా *కృష్ణా ?*🙏
🌹🙏🌹
*రెక్కలు జాచిన గోర్కెలు*
*దిక్కులనన్ని వెదకినవి దేవర నీకై !*
*పెక్కగు నాశల మునిగితి*
*నెక్కుడవీవని పొగడుచు నీకడ కృష్ణా !*
( 38 )
🌹🙏🌹( భావము )
నా కోరికలు బాగా రెక్కల తొడిగిన రీతిలో వ్యాపిస్తున్నాయి నీ కొరకు .
అవి అన్ని దిక్కులా వెతుకుతున్నాయి , నా దేవుడవైన నిన్నే !🙏
అపరిమితమైన ఆశలలో మునిగిపోయానయ్యా ,
గొప్పవాడవు నాకు నీవే అని ,
నిన్నే పొగుడుకొనుచున్నాను ఇక్కడ *కృష్ణా !* 🙏
🌹🙏🌹
*ఫలము ,సుమము పత్రమునున్*
*జలంబుకైన సరి సంతసపడుదు వకటా !*
*యిల నా మనంబు నర్పణ*
*మెలమిన జేసిన నను గనవేమయ కృష్ణా ?*
( 39 )
🌹🙏🌹( భావము )
నిన్ను బాగుగా తెలిసిన వారు చెప్పారు .
నువ్వే అన్నావట వారితో .🙏
నీకు ఫలమైనా , పుష్పమైనా , పత్రమైనా , జలమైనా
ప్రీతితో ఒసగితే సంతోషముగా స్వీకరిస్తావట .🙏
మరి నా మనసునే ఉన్నతముగా నీకే అర్పితము చేసినా ,
నా వైపు అసలు చూడను కుడా చూచుటలేదు ఎందుకు *కృష్ణా ?*🙏
🌹🙏🌹
*తింటివొ లేదో యనుచున్*
*గంటన నొత్తులనువెట్టి గాంచుచు నీకై*
*యింటన నుండిన వనితను*
*నొంటరి తనమున నొదులుట యొప్పా కృష్ణా ??*
( 40 )
🌹🙏🌹( భావము )
ఎమన్నా అసలు తిన్నావో లెదో అని ,
నా కంటిలో వత్తులు వేసుకొని మరీ వేచి చూస్తున్నాను నీకొరకే ! 🙏
ఇంట్లోన బిక్కుబిక్కు మంటూ ఉంటున్న నన్ను ,
ఇలా వదిలివేయుట సరియైనదేనా *కృష్ణా ?*
🌹🙏🌹
*హరే కృష్ణ ! హరే కృష్ణ !* 🙏
పద్యములు 41 to 50 రేపటి శీర్షికలో .....
మీ ఆశీర్వాదములను కోరుకొనుచూ ..
మీ సూచనలు అభిప్రాయములు సదా స్వాగతిస్తూ ...
భవదీయుడు
✍ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది*