2, డిసెంబర్ 2023, శనివారం

 శు భో ద యం🙏


హీమాలయంలో  మధ్యాహ్నం !


           మ:  తలమే  బ్రహ్మకునైన  నీనగ మహాత్మ్యంబెన్న ?  నేనియ్యడన్ 


                   గలచోద్యంబుల  రేపుఁ గన్ గొనియెదన్గాకేమి! నేఁడేగెదన్ ,


                  నళినీ బాంధవ భానుతప్త  రవికాంతస్యంది   నీహార   కం


                  దళ ఛూత్కార  పరంపరల్ పయిపయిన్  మధ్యాహ్నమున్  దెల్పెడిన్;


                       

                          మనుచరిత్రము-  2 - ఆ-- అల్లసాని  పెద్దన .


                     ఇది ఆంధ్రకవితా పితామహుఁడైన  అల్లసాని పెద్దన గారిపద్యం. ప్రవరుడు  సిధ్ధరస ప్రభావంతో  హిమాలయాలకు 

వెళ్ళాడు.హిమగిరి సొగసులు  కొన్ని వీక్షించాడు. ఇంకాచాలా ఉన్నాయి. ఇంతలో మధ్యాహ్నమయ్యింది. ఇకయింటికిఁ బోకతప్పదు.

నిరంతరం మంచుతో (పొగమంచుతో)  మబ్బు మబ్బుగా ఉండే హిమాయంలో  మధ్యాహ్న మైనదని కనుగొనటం చాలాకష్టం.కానీ

ప్రవరుడు సమయాన్ని  ఖచ్చితంగా గుర్తించాడుమరి? అది యెట్లా?  ఆవిషయాన్నే యీపద్యంలో చెపుతున్నాడు పెద్దన.


             కఠిన పదములకు అర్ధము:  తలమే- శక్యమా?  చోద్యములు- వింతలు- నళినీబాంధవ భానుతప్త-  పద్మ బంధువైన సూర్యునిచే వేడెక్కిన:  రవికాంత- సూర్యకాంత శిలలపై ; స్యంది- రాలుచున్న; నీహార కందళములు- మంచు చినుకులు; ఛూత్కార పరంపరల్- చుయ్యి చుయ్యిమను ధ్వనులు;  


               భావము: బ్రహ్మకుకూడా యీహిమగిరి గొప్పతనాన్ని పొగడతరంకాదు. ఇక్కడ నున్న వింతలను  నేను రేపు వచ్చి చూతునుగాక!

ఇక నీవేళయింటికేగెదను. సూర్యకిరణాల వేడికి కాలిన యీసూర్యకాంత  మణులపై  మంచుబిందువులు రాలుటచే చుయ్యి  చుయ్యిమను  శబ్దములు  వినవచ్చుచున్నవి. ఈశబ్దముల వలన మధ్యాహ్న మైనదని తెలియుచున్నది. 


                 పెద్దన రచన లోని  సొగసుకీపద్యము నిదర్శనము. నిరంతరము మంచు వర్షించుటచే  నంధకార మావరించిన  యాహిమాలయాల కోనలలో  వెలుతురే  శూన్యము. అక్కడ సమయమును గుర్తించుట యెట్లు? అనుప్రశ్న పాఠకులు వేయకుండగనే,

తన పాత్ర తోనే ఆయుపపత్తిని  వెల్లడింపఁ జేయుచున్నాడు. సూర్యకాంత శిలలను భేదములు గల శిలలు అక్కడ యున్నవట.వాటిపై సూర్యకాంతిపడిన  ప్రజ్వలించునట. ఆప్రజ్వలనచే  వేడెక్కి యాశిలలు కాలిన పెనములవలెనుండ, పైనుండిరాలు

మంచుచినుకులు  వాటిపైరాలి యవి సుయ్యి  సుయ్యి  యని  చప్పుడులు  చేయుచున్నవట. అదిగో ఆకారణముగా  ప్రవరుడు మధ్యాహ్న మగుటను గుర్తించినాడు. అని సమాధానమొసంగు చున్నాడు.


                        ఎంత  చక్కని  యూహ!  మహాకవుల యూహలట్లే యుండును.  


                                    నిదర్శనాలంకారము!  


                                                                           స్వస్తి!🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: