కర్తవ్య భావన
మనం చేసే ప్రతి పనిని మనమే చూస్తాము అనే భావనతో ఉంటాము ఎలా అంటే ఒకరోజు రామారావు విజయవాడ వెళ్లాలని రైలుకి ప్రయాణం అయ్యాడు. ముందుగా రిజర్వేషన్ చేసుకోవటంతో ఉదయం హడావిడిగా సికింద్రాబాద్ రైల్వే స్టెహానుకు చేరుకున్నాడు. టికెట్టు కొనుక్కోని హడావిడిగా ప్లాటుఫారం మీదికి వెళ్ళగానే కృష్ణా ఎక్సప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా వుంది. యెంత పొద్దున్న తయారయినా కూడా ఇది పరిస్థితి అని అనుకున్నాడు. బతుకు జీవుడా అని దొరికిన కంపార్టుమెంట్లో ఎక్కాడు. కంపార్టుమెంటు మొత్తం ప్యాసింజర్లతో కిటకిట లాడుతుంది. కూర్చోవటానికి ఎక్కడ సీటు లేదు. ముగ్గురు కూర్చునే సీట్లల్లో నలుగురు కూర్చుని వున్నారు. సీటు వెనుక వుండే కడ్డీలు పట్టుకొని నిలుచున్నాడు రామారావు. ఇంకా నయం ఇంకొక నిమిషం ఆలస్యంగా వస్తే రైలు తప్పిపోయేది అని అనుకున్నాడు. ఇంతటిలో రైలు కుతకూయటం చిన్నగా బయలుదేరడం జరిగింది. ఒక్క నిమిషంలో సిగ్నలు స్తంభాలను దాటి రైలు వేగాన్ని పూనుకున్నది.
రైలు దొరికినందుకు రామారావుకు సంతోషం అయింది. తన దూరపు బంధువు ఇంట్లో పెండ్లికి బయలుదేరాడు. నిజానికి దూరపు బంధువు కదా పోకపోతే ఏమిటని మీరనవచ్చు కానీ సుబ్బారావుతో బందుత్వం కన్నా స్నేహితం ఎక్కువ రోజు ఏదో ఒక టైంలో ఫోనులో మాట్లాడుకుంటారు. ఒకరి గురించి ఒకరు పట్టించుకోవటమే కాక ఒకరికి ఇంకొకరు ఎంతో అన్యోన్య సహకారికంగా వుంటారు. అందువల్ల రామారావుకు ఈ ప్రయాణం అనివార్యం అయ్యింది.
రామారావు జాగ్రత్త పరుడు యెంత జాగ్రత్త పరుడంటే తన చేతిలో వున్న సూట్‌కేసును క్రింద పెట్టకుండా చేతిలోనే ఉంచుకొని మోస్తువున్నాడు. అది చూసిన ప్రక్క ప్రయాణికుడు అదేమిటి యెంత సేపు పట్టుకొని వుంటారు క్రింద ఎక్కడైనా పెట్టండి. అటుచూడండి ఆ సీటుక్రింద కాళీ వున్నది అక్కడ పెట్టండి అని సలహా ఇచ్చాడు. ఆ పర్వాలేదండి నేను పట్టుకోగలను మరీ అంత బరువు ఏమిలేదు అని అన్నాడు. నిజానికి మూడు రోజులకు సరిపడా బట్టలు, ఇతరత్రా సామానుతో సూటుకేసు దాదాపు పది కిలోల బరువు వరకు వుంది. అయినా కూడా సూటుకేసుని రామారావు చేతి నుండి క్రిందికి దించలేదు. ఎందుకంటె క్రింద ఎక్కడైనా పెడితే ఎవరైనా తీసుకొని పోతారేమో అనే అనుమానం అతనిని బాగా పట్టుకుంది. అందుకే బరువు అయినా కూడా పట్టుకొనే వున్నాడు. నిజానికి రామారావు ని తీసుకుని వెళ్లే రైలు రామారావు సూటుకేసుని కూడా గమ్యానికి తీసుకొని వెళుతుంది. కానీ అతి జాగ్రత్త వలన రామారావు సూటుకేసు మోయాల్సిన పని లేక పోయిన పనికట్టుకొని సూటు కేసుని మోస్తూ తన ప్రయాణాన్ని ఆసవ్యకరంగా తనకు తానుగా చేసుకున్నాడు.
ఇక విషయానికి వస్తే మనలో చాలామంది అని అనే కన్నా మనం అందరం కూడా రామారావు లాగానే ప్రవర్తిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ అనేక ఇక్కట్లకు పాలుపడుతున్నాము. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఒక్కటే అత్యంత విలువైనది ప్రశస్తమైనది ఎందుకంటే ఈ జన్మలోనే మనం మన జ్ఞానంతో భగవంతుని తెలుసుకొని పొందగలము. కానీ మనం అనేకమైన విషయాలు వాటిలో ఏమాత్రం సంబంధం లేకపోయినా సంబంధం కలుపుకొని అవి నావి, నాది అనే మమకారాన్ని పెంచుకొని వాటి చుట్టూ తిరుగుతూ వాటిలో లీనమై పరబ్రమ్మను విస్మరిస్తున్నాము అంటే అతిశయోక్తి కాదు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే నీవు నీవుగా అంటే ఒంటరిగా ఈ దృశ్యమాన జగత్తులోకి ప్రవేశించావు. నీకు అన్నా లేదు తమ్ముడు లేదు ఎటువంటి కుటుంబ సంబంధాలు లేవు. అవి అన్ని నీకు నీవుగా కలుపుకొని వాటిమీద నీకు బాధ్యత వున్నట్లుగా భావించి నీవు అనవసరమైన బరువును మోస్తూ నీ ప్రశాంతతను కొలాప్వటమే కాకుండా నీ లక్ష్యం అయినా మోక్ష పదాన్ని మారుస్తున్నావు. నిజానికి నిన్ను చుస్తే భగవంతుడు నీ బంధాలను కూడా తానె చుస్తాడు ఎలాగయితే నిన్ను గమ్యస్థానాన్ని చేర్చే రైలు నీ సూటుకేసును కూడా గమ్యస్థానాన్ని చేరుస్తుందో అలాగే అన్నమాట. కానీ నీవు రామా రావు లాగా నీకు నీవు అతి జాగ్రత్త పరుడవు అని అనుకోని నీ కర్తవ్యమ్ కానీ దానికి నీ కర్తృత్వం తల మీద వేసుకొని మోస్తూ ఉండటమే కాకుండా అదే నీ కర్తవ్యం అని అనుకుంటున్నావు. ఇట్లా అనుకోని నీ జీవిత లక్ష్యాన్ని మారుస్తూ పరమేశ్వరుణ్ణి మదిలోకి రానీయడం లేదు.
కాబట్టి సాధక మిత్రమా మేలుకో నీ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని తాత్కాలిక మైన బావ బంధాలనుండి విముక్తుడవు కమ్ము. నిత్యం ఏకాగ్రతతో, అకుంఠిత దీక్షతో సాధన చేస్తేనే కానీ మోక్షపదం పొందలేము. ఇంకా ఆలస్యం చేయకు ఈ క్షణమే నీ లక్ష్యాన్ని తెలుసుకొని నీ లక్ష్యం వైపు నీ గమనాన్ని సాగించు. మోక్షాన్ని సిద్దించుకో.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిః
ఇట్లు మీ
భార్గవ శర్మ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి