#అఘోరీ_మూడవ_భాగము_3
ఇంతవరకూ చదివింది...
[ " తెలుగా?"
" ఔను స్వామినీ "
దీక్ష ఎప్పుడయింది?
ఐదేళ్ళ కిందట.
ఈ రాత్రి రెండో జాముకి, నిన్న హోమము చేసిన చోటుకి రా... అంటూ ఆమె సమాధానం కోసము చూడకుండా వెళ్ళిపోయింది. ]
పగలంతా ఇంకేమీ పని లేదు. తనతో వచ్చిన తమ తెగ వారితో కలిసి భోజనము చేసింది. ఉడికించిన చామగడ్డలు, చిలగడ దుంపలు, కాసిని మరమరాలు. ఒక అరటి పండు. అంతే. పాలు మాత్రము దండిగా దొరుకుతాయి. మహా కుంభమేళా లో ఎందరో సాధకులు, అధికారులు లక్షలకొలదీ భక్తులకు షడ్రసోపేతమైన భోజనాలు ఉచితంగా అందిస్తున్నారు. తమకు అవి నిషేధము. కాకపోయినా కూడా తనకు ఆహారం మీద అంత పట్టింపు లేదు.
భోజనం చేసి తిరిగి జపములో మునిగింది. సాయంత్రము ఐదు గంటలకు మరలా స్నానము చేసి వచ్చింది. ఈసారి ఆ మాత కనపడలేదు. వచ్చి యోగసాధనలో మునిగిపోయింది. రాత్రిళ్ళు భోజనాలు ఉండవు. అసలు ఒక పూట భోజనము దొరకడమే ఎంతో అదృష్టము. తమ స్థావరాలలో ప్రతిరోజూ భోజనం ఉండదు. ఏది దొరికితే దానితో సరిపెట్టుకోవాలి. మాంసాహారం నిషిద్ధం. జనాలు అనుకునేటట్టుగా తాము శవాలను పీక్కు తినము. మేళాలో కొందరు తనని ఇదే అడిగారు. అదంతా అబద్ధమని స్పష్టంగా చెప్పింది. అయితే, రొట్టెలకు, పళ్ళకు, పాలకు, మాంసాహారానికి, శవాల కట్టెలకు తమకు భేదం ఉండదు. అన్నీ ఒకటే. సామాన్య జనాలకు ఇది అర్థం కాదు.
రాత్రవుతోంది. చంద్రుడు, నక్షత్రాలు బాగా కనిపిస్తున్నాయి. నవమి వెన్నెల, ప్రశాంత, నిర్మల ఆకాశం నుండీ సోనలుగా జాలువారి వచ్చి పడుతున్నది. తీతువు ఒకటి అరచుకుంటూ చంద్రుడికి అడ్డంగా వెళ్ళింది. దాన్ని మొదట్లో తాను చక్రవాకం గా పొరపడేది.
నిన్నటి శవము కాల్చిన చోటకి బయలు దేరింది. తాను శిష్యురాలి నుండీ సాధకురాలిగా మారిన ఈ రెండేళ్ళలో ఎన్నెన్నో రాత్రుల్లో , శ్మశానాలలో హోమాలు చేసింది. కొన్నిసార్లు ఒంటరిగా శవాల మీద కూడా హోమాలు చేసింది. అప్పుడెప్పుడూ కలగని ఒక అనిర్వచనీయమైన భావం ఈ మహా కుంభమేళాలో కలుగుతోంది. కారణం తెలీదు కాని, ఇక్కడ అఘోరాచార్యులు, ఆచార్యాణులు, మహాంత్ లు, కౌళాంతరులు చేస్తున్న అనుష్ఠానాల ప్రభావం కావచ్చు. వారి స్థితికి తాను చేరుకోవాలంటే ఇంకా వందల యేళ్ళు అవుతుందేమో, బ్రతికి ఉంటే!!
ఆలోచనల్లోనే తన గమ్యం చేరుకుంది. ఈరోజు కూడా ఒక శవాన్ని కాలుస్తున్నారు. స్మశానాలలో అయితే శవాలు దొరకడము, కాల్చడము సులభమే, కానీ ఈ మహా కుంభమేళాలో, కోట్లాది మంది శ్రద్ధాళువులు స్నానాలు చేస్తున్నా కూడా వారందరికీ కనపడకుండా శవాన్ని తీసుకురావడమే కష్ట సాధ్యము. దగ్గరికి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ నిన్నటి ఆ మాత తప్ప ఇంకెవ్వరూ లేరు. వెళ్ళి ప్రణామము చేసింది. మాత, తనను కూర్చోమని పక్కనే చోటు చూపింది. ఆమెతో పాటు మంత్రము చెపుతూ హోమము చేసింది. అదయ్యాక ఇసుక తీసుకెళ్ళి నదిలో కలిపి మళ్ళీ వచ్చి కూర్చున్నారు.
ఆ మాతే అడిగింది " కుముద్వతిని వెతుక్కుంటూ వచ్చావా?"
తాను ఆశ్చర్యంతో అవాక్కైంది. ఔనన్నట్టు తలాడించి, " మా గురువు గారి ఆదేశానుసారము " అంది.
మీ గురువుగారు ఇంకా ఏమి చెప్పారు?
ఇంకేమీ లేదు స్వామినీ, ’ నీకు అదృష్టం ఉంటే కుముద్వతి నీకు కనిపిస్తుంది. కనిపిస్తే, ఏమి చేయాలో ఆమే చెపుతుంది. ఆమె చెప్పినట్టు నడుచుకో..’ అన్నారు.
ఆమె కనబడుతుందనుకుంటున్నావా?
తెలీదు స్వామిని, అసలు ఆమె ఉందో లేదో తెలీదు. తమరిని ఒకటి అడగవచ్చునా?
ఏమిటది?
కుముద్వతి మీకు తెలుసా? ఆమె అదే పేరుతోనే ఉండేదా?
తెలుసా..అన్నదానికి జవాబు ఇవ్వకుండా స్వామిని అంది," అఘోరీలు కానీ, అఘోరాలు కానీ ఎవరూ తమ అసలు పేర్లు మార్చుకోవలసిన అవసరం లేదు. నీకు తెలియదా?
తెలియదు,స్వామిని, నేనయితే మార్చుకోలేదు... కొందరి పేర్లు చూస్తే అసలు పేర్లు కావేమో అనిపించేది. అందుకు మార్చుకున్నారేమో..అనుకొనేదాన్ని.
కుముద్వతి గురించి మీ గురువుగారు ఇంకేమీ చెప్పలేదా? నువ్వు యే స్థావరం నుండీ వచ్చావు?
గురుదేవులు ఇంకేమీ చెప్పలేదు, స్వామిని, నేను దీక్ష తీసుకున్నది నేపాల్ సరిహద్దు లోని ’ కుమావ్ ’ కొండల దగ్గర.
ఉన్నట్టుండి స్వామిని, పాట మొదలు పెట్టింది," జైసే గంగాకి ధారా శంకరా హో తేరే గల్లే మె నాగన్ కీ మాలా డమ్మే డమ్మే డమరూ బాజే...
ఆ పాట తానూ అందుకుంది, తనకు ఇష్టమైన పాట. ఇద్దరూ కలిసి పాట మొత్తం పాడారు. నిన్నటి తెలుగుపాట పాడింది ఈ స్వామిని తప్ప ఇంకెవరూ కాదు అని అర్థమైంది. అదే గొంతు.
తాను మళ్ళీ అడిగింది, ’ ఇంకో ప్రశ్న అడగవచ్చా?"
అడుగు
’ నిన్న మీరు పాడిన తెలుగుపాట మీకెలా వచ్చింది? రేడియోలో విన్నారా? ’
స్వామిని మొహం పై అతిచిన్న మందహాసము మెరిసింది. అది మందహాసమేనా, లేక తాను అలా అనుకుందా?””
ఆ పాట వ్రాసింది మా పూర్వాశ్రమపు తాతగారు. ఇప్పటికి ఐదు వందల సంవత్సరాల పైనే అయి ఉంటుంది. చిన్నపుడు మా అమ్మ నాకు నేర్పింది. మాతాత గారు నాతో అన్నారు, ’ నువ్వు జీవితాంతమూ ఈ పాట పాడుకుంటూ ఉండాలి, ఎప్పటికీ మరచిపోరాదు..’ అని.. నా వయసు ఇప్పుడు నాలుగు వందలా అరవయ్యో, డెబ్బయ్యో.
అయితే మీరు పుట్టుకతో తెలుగువారేనా, మా జేజెమ్మ కుముద్వతి గురించి మీకు తెలిసిందంతా చెప్పండి... ఆమె ఇప్పుడు ఎక్కడుంది?
కుముద్వతిని మరచిపో.. ఆమె మరణించి వంద సంవత్సరాలు దాటింది... అంది స్వామిని గంభీరంగా.
మళ్ళీ తానే అంది, " కుముద్వతి మరణించేనాటికి ఆమెకు రెండు వందల యాభై యేళ్ళ పైనే. నువ్వనుకున్నట్టు ఆమెకు ఇప్పుడుంటే నూట అరవై యేళ్ళు కాదు, మూడువందలయాభై యేళ్ళూ ఉండేవి "
తాను విస్మయముతో నిరుత్తరురాలైంది. జేజెమ్మను కలుస్తానని ఎందుకో బలమైన నమ్మకం ఉండింది. ఆమెను కలవడానికే దేవుడు ఇక్కడికి పంపించాడేమో ...అనుకునేది. గురువుగారు కూడా, ఆమెను కలుస్తావు అనే అర్థంతోనే అనేవారు... హఠాత్తుగా...ఆమె లేదంటే... మనసు ఒకలా అయిపోయింది. కానీ తానొక అఘోరీ. ఇటువంటి వాటికి చలించే దుర్బల మనసు కాదు తనది. తమకు ఇచ్చే శిక్షణ కూడా అటువంటిది...
ఇద్దరూ మౌనంగా మరలా హోమం చేశారు. స్వామినిని ఇంకేమో అడగాలనుకుంది కానీ ఆమె గంభీర ముద్ర చూసి అడగలేకపోయింది.
హోమం అయ్యాక స్వామిని అంది, " ఈ రోజు త్రయోదశి. ఎల్లుండి మహా మాఘి. ఆరాత్రి నువ్వు తప్పకుండా రావాలి. నిన్ను ఇక్కడికి రప్పించిన ఉద్దేశమే అది. "
" క్షమించాలి, స్వామిని, ఆ రోజు మా తెగ వారమంతా రాత్రంతా అనుష్ఠానాలలో ఉండాలి అని నిర్ణయించారు. "
" మహా అఘోరాచార్యాణి వైజయంతి చెప్పింది అని చెప్పు " అని ఇక మాట్లాడ కుండా ఆమె స్నానానికి వెళ్ళింది.
అవాక్కై, తాను కూడా స్నానం చేసి భస్మ ధారణ చేసి వచ్చింది. ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకోలేదు.
తిరిగి వస్తుండగా మహా అఘోరాచార్యాణి మాట గుర్తు వచ్చింది.." నిన్ను ఇక్కడికి రప్పించిన ఉద్దేశమే అది. "
అంటే నన్ను ఇక్కడికి మహాచార్యాణి ఆదేశం మేరకు పంపారా? స్వామిని మహా చార్యాణి అని నాకు మొదట తెలీదు. గురువుగారికి తెలుసేమో... మహా అఘోరాచార్యాణి అంటే అంతకన్నా పెద్ద స్థాయి ఇక లేదు. ’ మహాంత్ ’ అని కూడా అంటారు. ’ " కౌళాంతర " అని కూడా అంటారు.. తనను పిలిపించడములో ప్రత్యేక కారణము ఉందా? తానింకా సాధకురాలిని మాత్రమే. తర్వాత గురువు కావచ్చు. యోగీశ్వరి కావచ్చు.... ఆ తర్వాత మహాంత్.. సర్వోన్నతంగా ’ మహా అఘోరాచార్యాణి ’ .....పై మెట్టులలో ఒకదాని నుండీ ఇంకోదానికి వెళ్ళాలంటే సులభం కాదు. కొందరికి వందల యేళ్ళు శ్రమించినా అసంభవం.
శిబిరానికి వచ్చి ఇతర కృత్యాలు యాంత్రికంగా చేసింది. మనసు నిండా వైజయంతి అఘోరాచార్యాణి , ఆమె మాటలు నిండి పోయాయి. తెలుగుపాట వారి పూర్వాశ్రమపు తాతగారు ఐదు వందల యేళ్ళ కిందట వ్రాశారా? ఆమెకు వారి తల్లి నేర్పించిందా? మరి మా అమ్మకు ఎవరు నేర్పించి ఉంటారు? కుముద్వతి జేజెమ్మ చిన్నతనములోనే సన్యాసుల్లో కలసిపోయిందని చెప్పేవారు. ఆమెను తాను ప్రత్యక్షంగా చూడనే లేదు. అమ్మ చూసి ఉంటుందా? అనుమానమే. . ఆమె ద్వారా అమ్మకు ఆ పాట వచ్చిందా? ఔను, తన అత్తగారి నుండీ నేర్చుకున్నాను అందిగా, అమ్మ ? అత్తగారు అంటే కుముద్వతి ఎలా అవుతుంది? ఆమె చిన్నవయసులో సన్యాసం తీసుకోలేదా? అన్నీ జవాబు లేని ప్రశ్నలే. మరి ఈ ఆచార్యాణికి కుముద్వతి ఎలా తెలుసు? ఎక్కడైనా శిబిరం లో కలిసిందేమో?. జేజెమ్మ పోయి వంద సంవత్సరాలు అయిందట. అంటే, అంతకు ముందే చూసి ఉండాలి. అప్పటికి ఆచార్యాణికి మూడు వందల యాభై యేళ్ళు వయసు. చూస్తే అలా కనపడదు. అంత సాధన తాను చేయగలదా? వీళ్ళంతా చిన్నతనము నుండే సాధన మొదలు పెట్టినవాళ్ళు కాబట్టి అంతకాలం బతకగలిగారు. నేను ఈ మధ్యే మొదలు పెట్టాను.
జరుగుతున్నదంతా ఒక కలలా ఉంది. తాను మహా కుంభమేళాకు వస్తానని తెలుసు గాని, ఇక్కడ జరుగుతున్నవి తాను ఊహించనివి. నన్ను ఏదో ముఖ్యమైన పని మీదే రప్పించారు. అది ఏమిటో తెలీదు. ఆ పనికి తనకన్నా పైవాళ్ళు ఎందరో ఉన్నారు కదా? తననే ఎందుకు ఎంచుకున్నారు? ఒక సాధారణ సాధకురాలిని? అన్నీ ప్రశ్నలే. ఎల్లుండి మహా మాఘి. అంటే మాఘ పౌర్ణమి. ఆనాడు తనకు ఏదో గొప్ప పని అప్పజెప్పుతారేమో?
మహా మాఘి రానే వచ్చింది. ఉదయము నుండే తనకు ఏదో తెలీని ఉద్విగ్నత. మధ్యాహ్నం ఎలా గడిచిందో.. సంధ్యా స్నానాల్లో ఆచార్యాణి కనిపించలేదు. తన శిబిరములో ఆమె పేరు చెప్పగానే ఎవరూ ఇక రెట్టించలేదు. వెళ్ళమన్నారు.
రాత్రి మొదటి జాము దాటింది. జపము చాలించి బయలు దేరింది. కాస్త త్వరగానే వెళ్ళింది. అక్కడ ఇప్పుడు కూడా మహా అఘోరాచార్యాణి వైజయంతి ఒక్కతే ఉంది.
" నువ్వు త్వరగా రావడం మంచిదైంది. త్వరగా రమ్మని నేనే చెప్పాల్సింది, మరచిపోయాను. ఈ రాత్రి తంతు చాలా విపులంగా ఉంటుంది." అని కూర్చోమంది. పక్కన కూర్చోబోతుంటే, అహ, కాదు నాకు ఎదురుగా, శవానికి ఆవల కూర్చో! అంది. ఆమె ఎదురుగా తాను కూర్చుంది. ఇద్దరి మధ్యలో శవం, చితిపైన. ఇంతకు ముందు గమనించలేదు కానీ, మాహా ఆచార్యాణి కళ్ళు నిప్పుగోళాలో, విస్ఫు లింగాలో అన్నట్టు ఎర్రగా కణకణలాడుతున్నాయి. ముఖం లోకి చూడాలంటే మామూలు జనం భయపడుతారు. దానికితోడు, ఆ జటాజూటం...........
అదేమిటి, ఆచార్యాణి కూడా తాను పెట్టుకున్నటువంటిదే లోలాకులే పెట్టుకుంది? శంఖం ఆకారం లో ఉన్న బంగారపు లోలాకు ఆమె కుడి చెవికి వేలాడుతోంది. ఎడమవైపు జటలతో కప్పుకున్నందున కనబడటం లేదు. తాను సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు తెచ్చుకున్న పెట్టెలో ఒక లోలాకు ఉండింది. అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అమ్మదేమో... పాతవస్తువుల చిన్న సంచీ తనతోపాటు అనుకోకుండా వచ్చింది. అందులో ఉండింది తానుపెట్టుకున్న లోలాకు. రెండోది వెతికితే దొరకలేదు. మళ్ళీ వెతకాలి అనుకుని మర్చేపోయింది...
ఆలోచన నుండీ తేరుకొని చూసింది... ఈ సారి ఒక స్త్రీ శవం వచ్చింది. ఆమె గర్భవతిగా ఉండి మరణించిందో ఏమో, పొట్ట చాలా ఎత్తుగా ఉంది. ప్రసవం అయ్యేలోపే పోయిందేమో...
" మనకు ఈ రాత్రి ఇటువంటి శవమే కావలసినది. అంతా మహాదేవుడి అనుగ్రహం " అంది మహాచార్యాణి. మొదటి రోజు కనిపించిన ఇతర అఘోరాలు మళ్ళీ కనపడలేదు. తామిద్దరికీ రెండు పక్కలా పేలాలు, అటుకులు, నువ్వులు, బియ్యపు పిండి, నెయ్యి, పాలు అమర్చి ఉన్నాయి. ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారో?
" అనవసర విషయాలు ఆలోచించక, అఘోర జపము వెయ్యిసార్లు చేయి... " అంది ఆచార్యాణి
తాను తలఊపి, గురుదేవులకు నమస్కరించి, కళ్ళు మూసుకుని జపములో మునిగింది. అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే, ముందర, ఆచార్యాణికి పక్కన అటు పది మంది, ఇటు పది మంది కూర్చొని ఉన్నారు. ఎప్పుడు వచ్చారో... అందరి పక్కనా అవే హోమద్రవ్యాలు ఉన్నాయి. శవము చుట్టూ ఒక గంపలోని ఇసుక తీసి, గుప్పెళ్ళు గుప్పెళ్ళుగా పెట్టించింది ఆచార్యాణి. మొత్తం నూట ఇరవై.
శవము నుదుట ఉన్న కుంకుమ తీసి వాటి మీద అలంకరించింది. నువ్వులు చల్లింది. ఒక పాత్రలో నుండీ ఏదో ఎర్రటి ద్రవం అన్ని కుప్పలమీదా కొద్దికొద్దిగా పోసింది. అది రక్తమే అయి ఉండాలి.. ఎవరిదో..?
హోమం మొదలు అయ్యింది. మొదట తాము ఇద్దరూ ఆహుతులు వేస్తుంటే తర్వాత మిగతావారు కూడా అదే మంత్రము చెప్పి ఆహుతులు వేస్తున్నారు. ఒక వేయి ఎనిమిది ఆహుతులు అయ్యాయి. శవము సగము కాలి ఉంది. భరించలేని వాసన వస్తోంది కానీ, అందరికీ అది అలవాటే కాబట్టి, హోమం మీదే ఏకాగ్రతతో ఉన్నారు.
ఉన్నట్టుంది ఆ ఇసుక కుప్పలనుండీ తెల్లటి పొగ, వెలుగు కిరణం వలె, పైకి ఎగజిమ్మడము మొదలైంది. అందరూ ఆనందంతో ’ హర్ హర్ మహాదేవ్’ అని అరిచారు. ఎందుకో తెలీకున్నా తానూ శ్రుతి కలిపింది. ఆ తెల్లటి పొగ వేగంగా బయటకు వస్తూ పైకి ఎగస్తోంది. అన్ని కుప్పలనుండీ వచ్చిన ఆ పొగ గాలిలో ప్రయాణిస్తూ వెళ్ళిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. శవం ఇప్పుడు పూర్తిగా కాలిపోయి ఉంది. హోమం ముగిసింది . అందరూ ఆ ఇసుక కుప్పల నుండే దోసిళ్ళతో ఇసుక తీసుకొని నదికి వెళ్ళి కలిపి, స్నానం చేసి వచ్చారు. మళ్ళీ యథా ప్రకారము జపము. కళ్ళు తెరిచేసరికి అరుణోదయం అయి ఉంది. ఎదుట ఎవరూ లేరు. ఎప్పుడు వెళ్ళిపోయారో?
తాను లేచి, చితికి నమస్కరించి, శిబిరానికి వచ్చేసింది. వచ్చేటప్పటికి శిబిరాల్లోని వారంతా గుమికూడి ఉన్నారు. అందరి ముఖాల్లోను ఏదో తెలియని భావం. అది గాంభీర్యమో, బాధో, ఆందోళనో తెలియడం లేదు.
ఉన్నట్టుండి ఒక వృద్ధ అఘోరా వచ్చారు. ఆయన తెలుగులో అన్నారు, " ధన్యురాలవు వైశ్వానరీ, నీకిచ్చిన కార్యము సమర్థవంతముగా నిర్వహించావు, నీకు గురు స్థానము త్వరలోనే ఇవ్వబడుతుంది. మహదేవుడి ఆశీస్సులు నీపై మెండుగా ఉంటాయి " అని చేయి పైకెత్తి ఆశీర్వదించారు.
తనకు ఆశ్చర్యం అయింది, నేనేమి చేశాను? ఎప్పుడూ చేసే హోమాలే చేశాను కదా?
అయినా, వినయముగా నమస్కరించి పక్కకు తొలిగాను. శిబిరాల వద్ద చేరుకున్న వారు ఇంకా అలాగే ఉన్నారు. ఎందుకో నాకు అర్థము కాలేదు.
నిత్య కృత్యాలు ముగించి మళ్ళీ స్నానానికి వెళ్ళబోతుంటే పక్కనున్న వారు ఆపారు. " స్నానం ఇప్పుడే కాదు, దహనం తర్వాత.!" అని.
దహనమా? ఏ దహనము? అని ఆశ్చర్యముతో అడిగాను.
వారు నవ్వి అన్నారు... ’ అదే నీ గొప్పతనము. నీకిచ్చిన కార్యాన్నీ మొక్కవోని ఏకాగ్రతతో ముగించావు, పక్కన ఏమి జరుగుతున్నదో కూడా తెలీనంత ఏకాగ్రత!. ఈ తెల్లవారుజామున, మీరు జపములో ఉండగానే, మహా అఘోరాచార్యాణి తనువు చాలించింది. నీ ఎదురుగానే!. కానీ నువ్వు ఎరుగవు. ఈ ఉదయమే ఆమె శవ దహనం ఉంటుంది"
నాకు కళ్ళు తిరుగుతున్నట్టైంది.. మహాచార్యాణి చనిపోయిందా? నా ఎదురుగనే? నాకు తెలీకుండానే? విద్యుద్ఘాతము తగిలినట్టైంది. అయోమయంగా చూస్తున్నాను.
[సశేషమ్]