*భజే శ్రీనివాసమ్.*
*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*
*రచన.*
*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
**విశాఖ -- 16*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
విశాఖ నక్షత్రానికి అధిపతులు ఇంద్రాగ్నులు. విశాఖ అయిదు
నక్షత్రాల సమూహం. ఇక్కడినుంచీ జ్యోతిశ్చక్రం మరో శాఖలోనికి
వెళుతుంది. అందుకే ఇది వి-శాఖ, విశాఖ నక్షత్రంగా పిలవబడు తున్నది.ఈ నక్షత్రాన్ని రాధా నక్షత్రమని కూడా అంటారు. ఇందువలననే వైశాఖమాసాన్ని రాధామాసం అని కూడా వ్యవహరిస్తారు.వైశాఖ మాసం శ్రీనివాసునికి ఎంతో ప్రీతిపాత్ర మైనది. ఈ మాసంలోఎవరైతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ
ఉంటారో వారి సర్వభాగ్యాలు కలుగుతాయి. జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరకు అమృతతత్త్వాన్ని పొందుతారు. ఈ అష్టాక్షరీమంత్రానికి మించిన దివ్య ఔషధం మరొకటి లేదు. మంత్రము అంటేమననం చేయువారిని రక్షించునది అని అర్థం. ఎవరైతే ఓం నమో
నారాయణాయ అనే మంత్రాన్ని రోజులో ఒక్కసారైనా జపిస్తున్నారో వారు అన్ని ఆపదల నుండి రక్షింపబడుతారు. అకాల మృత్యువు దరిచేరదు.
పూర్ణాయుష్షుతో కలకాలం సుఖంగా జీవిస్తారు. అద్భుతమైన ఈ అష్టాక్షరీ మంత్రం సృష్టిలో తిరుగులేని శక్తి కలది. ఈ మంత్రంలో ఓం అనేది ఆత్మ స్వరూపం. నమః అనేది ప్రకృతి స్వరూపం. అకార, ఉకార, మకార కలయికే ప్రణవ స్వరూపమైన ఓంకారము. ఈసృష్టి మొత్తం ఓంకారంనుంచే ఉద్భవించింది. అదే నారాయణ స్వరూపం.
శ్రీమన్నారాయణుడు సృష్టి చేయాలి అనే సంకల్పించగానే అతని మహోజ్వల స్వరూపం నుంచి హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత
పంచభూతాలు ఉద్భవించాయి. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు
మరొక్కమారు సంకల్పం చేయగా ఆ పరబ్రహ్మమూర్తినుండే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సకల వేదాలూ ఉద్భవించాయి.
ఓంకార స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు సత్యము, నిత్యము. భూమి, ఆకాశము, దశ దిశలూ వ్యాపించి ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే.
ఊర్ధ్వ, మధ్య, అధోభాగముల యందు ఉన్నది ఆ శ్రీనివాసుడే. అతడుకాలపురుషుడు. భూత, భవిష్యత్ వర్తమాన కాలాలు అతడే. ఈ సృష్టిమొత్తం
శ్రీమన్నారాయణుని స్వరూపమే. ఈ విషయం గ్రహించిన వారు కూడా నారాయణ స్వరూపులే అవుతారు. సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు జీవుల హృదయపద్మంలో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వ జీవకోటియందు అంతర్యామి
స్వరూపంగా భాసిస్తున్నది అతడే. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో
నారాయణాయ లోని ఓంకారము బ్రహ్మ స్వరూపము. నకారము విష్ణుస్వరూపము, మకారము రుద్ర స్వరూపము. నకారము ఈశ్వర రూపము.రకారము విరాట్ స్వరూపము. యకారము పరమ పురుష స్వరూపము.
ణకారము భగవత్స్వరూపము, ఇక చివరిదైన యకారము పరమాత్మ స్వరూపము. ఇంతటి మహోన్నతమైన నారాయణ అష్టాక్షరీ మంత్రాన్నిజపించిన వారికి సర్వ భాగ్యాలూ సమకూరుతాయి.
మానవు లందరూ అనేక కర్మలు చేస్తుంటారు. మనం చేసే మంచి కర్మలవలన పుణ్యమూ, చెడు కర్మలవలన పాపమూ కలుగుతుంది.మానవులు చేసే కర్మ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంచిత కర్మ.రెండవది వర్తమాన కర్మ. సంచిత కర్మ అంటే మనం జన్మ జన్మలనుంచిమోనుకుని వచ్చినది. ఇది ప్రతి జన్మలోనూ ఎంతోకొంతఅనుభవిస్తుంటాము. ఈ కర్మను పూర్తిగా క్షయం చేయాలంటే ఆ కర్మను
పూర్తిగా అనుభవించటమే. అనుభవించటం వలన మాత్రమే కర్మ క్షయంఅవుతుంది. కానీ మానవుడు కోటానుకోట్ల జన్మలలో మూటకట్టుకున్న కర్మను క్షయం చేసుకోవాలంటే ఈ కల్పాంతం దాకా జన్మలెత్తినా
సాధ్యపడదు. కాబట్టి ఈ సంచిత కర్మను జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. ఈవిధంగా మాత్రమే సంచితకర్మ క్షయమవుతుంది.ఇకపోతే రెండవది వర్తమానంలోని కర్మ. అంటే ఈ జన్మలో చేసిన
కర్మవల్లనే క్షయమయ్యేది. ఇది లాగి వదిలిన బాణం వంటిది. ఈ జన్మలోచేసిన మంచి చెడులకు కొంతమేర ఈ జన్మలో అనుభవించవలసి రావడం.
ఎటువంటి కర్మనైనా క్షయం చేసుకునే జ్ఞానాన్ని, దివ్యత్మాన్ని
ప్రసాదించగలిగేది ఒక్క నారాయణ అష్టాక్షరీ మంత్రం ఒక్కటే. ఇది
మోక్షప్రాప్తికి అతి తేలికైన సాధనం.
శ్రీమన్నారాయణుడు ఆశ్రిత వత్సలుడు. అల్ప సంతోషి కూడాను.కేవలం గుప్పెడు అటుకులు మాత్రమే ఇచ్చిన సుదామునికి సర్వ సంపదలూ
అనుగ్రహించాడు.శ్రీమన్నారాయణ తత్త్వాన్ని అర్థం చేసుకుని అతడే
పరమాత్ముడు, పరమ గురువు, పరమ గతి, పరమాశ్రయుడు, పరమ సఖుడు, అని తెలుసుకున్నవారికి సర్వ భాగ్యాలూ లభిస్తాయి. ఇంతటి
అమృతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే తిరుమలలో శ్రీనివాసునిగావెలసి తనను శరణు వేడిన భక్తులను ఎల్లవేళలా రక్షిస్తున్నాడు. సర్వసంపదలూ అనుగ్రహిస్తున్నాడు.
ఓ శ్రీనివాసా! ఎంతటి అమృతమూర్తివి తండ్రీ నీవు. సకల చరాచరసృష్టి కర్తవు నీవే, సర్వ మంగళ స్వరూపడవు నీవే. నీకివే మానమస్కారములు. ఓ శ్రీమన్నారాయణా! నీకివే ప్రణామములు.
జగద్రక్షకా! నీకివే మా నమస్కారములు.
*" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్*
*శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”*
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి