29, జులై 2020, బుధవారం

*జీవిత* *సత్యం*

:చాలామంది అనుకుంటారు...
ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత...
స్నానం చేసి పూజ చేయొచ్చు అని.‌..
ఇంట్లో పని అంతా అయిపోయి...
అలసిపోయి , అప్పుడు స్నానం చేసి...
ఏకాగ్రత లేని మనసుతో పూజను చేస్తారు...
కానీ అది చాలా పొరపాటు...
కనీసం ఉదయం ఆరుగంటల లోపు లేచి...
ముందుగా కాలకృత్యాలు తీర్చుకోవాలి...
ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు...
మనలో ఉన్న చెడు పదార్థాలన్నీ...
నూనె రూపంలో బయటకు వస్తాయి...
నిద్ర లేచిన వెంటనే స్నానం చేయడం వలన...
ఈ చెడు పదార్థాలు అన్నీ బయటకుపోయి శరీరం శుభ్రం అవుతుంది...
ఆ తరువాత ముందుగా దీపారాధన చేయాలి...
ఆ తర్వాతే స్తోత్రాలూ...
నైవేద్యాలూ అన్నీ సమర్పించాలి...
అన్నిటికన్నా దీపారాధన ముఖ్యం...
ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం...
భగవంతుడు జ్యోతి స్వరూపుడు...
మనలో ఉన్న ఆత్మ కూడా జ్యోతి స్వరూపమే...
అందుకని మనం ఏమి సమర్పించినా కూడా...
ఆయన ఈ దీపారాధన ద్వారానే స్వీకరిస్తాడు...
అంతే కాకుండా...
ఈ దీపారాధన వల్ల పరిసరాలు పరిశుభ్రమై...
ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది...
రోజూ ఆవునేతితో దీపం వెలిగించడం...
ఎంతో శ్రేయస్కరం...
ఆరోగ్యదాయకం...
చాలామంది దీపాలకే కదా అని నాసిరకం నూనె వాడేస్తుంటారు...
కానీ దానివల్ల ఇంకా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది...
మనం పదార్థాలను తింటే వచ్చే శక్తి కన్నా...
వాయు రూపంలో పీల్చడం వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది...
అందువల్ల దీపానికి వాడే నూనె పట్ల శ్రద్ధ వహించాలి...
మంచి విషయం అయితే తొందరగా తెలియదు గాని...
చెడు విషయాన్ని ఉదాహరణగా తీసుకుందాం...
ఒక విష పదార్థాన్ని తినేకన్నా...
విషవాయువులు పిలిస్తేనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది...
అదేవిధంగా ఇది కూడా...
అందరూ సూర్యోదయానికి ముందే...
ఈ దీపారాధన చేసే విధానం వల్ల...
మొత్తం సమాజానికి మేలు జరుగుతుంది...

 *సర్వేజనా* *సుఖినోభవంతుః* 🙏

 *జై* *శ్రీ* *కృష్ణా* ...💐🙏

త్వమేవాహమ్‌*

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా 
సాగే ప్రస్థానం.......
పేరే......

             *నేను =I*

*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ 
*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

*ఈ "నేను"* లోంచే 
*నాది* అనే భావన పుడుతుంది!

*ఈ *నాది* లోంచే....

1.నా వాళ్ళు, 
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ, 
7.నా ప్రజ్ఞ, 
8.నా గొప్ప... 

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.

              *EGO అహం* 

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ  *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.

*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*

1. పంతాలతో 
2. పట్టింపులతో, 
3. పగలతో, 
4. ప్రతీకారాలతో...... 

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య, 
2.కౌమార, 
3.యౌవన, 
4.వార్ధక్య,  

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*

 *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*

 *సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ  నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*

 *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*

*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*

*1.నేనే*  శాసన కర్తను, 

 *2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని, 

*3.నేనే* జగజ్జేతను... 

అని మహోన్నతంగా భావించిన ఈ *నేను* 
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.

*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!

   *అది శాశ్వతం కానే కాదు*

ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన 
*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.

*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 
*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.

*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*

*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*

*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*

*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా, 
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో, 
5.భగవత్‌ ధ్యానం 

తో జీవించమనేదే
*వేదాంతసారం*.

*అహం బ్రహ్మాస్మి* అంటే 
*అన్నీ నేనే* అనే స్థితి నుంచి
*త్వమేవాహమ్‌* అంటే *నువ్వేనేను* అని 
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
*మానవ జన్మకు సార్థకత* 

భిక్షగాడు- కోటీశ్వరుడు

*డబ్బు గురించి పొదుపు/పిసినారి తనం గురించి గొప్ప సత్యాన్ని నేర్పించే రాజు – బిచ్చగాడి కథ..!*
అది ఓ రాజ్యం. రాజు, మంత్రి ఇద్దరు మాట్లాడు కుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజుతో ఓ మాటంటాడు. రాజా.. మీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. చివరకు అడుక్కునే వాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు మీ రాజ్యంలో అన్నాడు మంత్రి. 

 దీంతో రాజు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. చాలా తెలివి ఉన్న ఆ రాజు.. అవునా.. నా రాజ్యంలో బిచ్చగాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడా? సరే.. పదా! మంత్రి ఓసారి రాజ్యం చూసొద్దాం అని రాజు, మంత్రి ఇద్దరూ మారు వేషంలో రాజ్యంలో అడుగుపెట్టారు. 

ఓ చెట్టు కింద అడుక్కునే వ్యక్తి హాయిగా నిద్ర పోతున్నాడు. ఉదయం అడుక్కొని తిని నిద్ర పోతున్నాడు. మళ్లీ సాయంత్రానికి అడుక్కో వడానికి వెళ్తాడు. మళ్లీ రాత్రి అక్కడే నిద్రపోతాడు. అదే అడుక్కునే వాడి జీవితం. ఎటువంటి బాదరబందీ లేకుండా హాయిగా జీవిస్తున్నాడు ఆ వ్యక్తి. మారువేషంలో ఉన్న రాజు, మంత్రి ఇద్దరూ ఆ చెట్టు ఎక్కారు. చెట్టు ఎక్కి రాజు.. మంత్రిని 90 రూపాయలు ఇవ్వాలంటూ అడిగాడు. దీంతో అదేంటి.. రాజు అటూ ఇటూ కాకుండా 90 రూపాయలు అడిగాడు అంటూ కాస్త అనుమానంతోనే ఇచ్చాడు.
వెంటనే రాజు 90 రూపాయలను ఆ బిచ్చగాడి దగ్గర పడేశాడు రాజు.

 నిద్రలేచిన తర్వాత ఆ బిచ్చగాడు 90 రూపాయలను చూసి అబ్బ.. 90 రూపాయలు.. వీటికి ఓ 10 రూపాయలు చేరిస్తే… 100 రూపాయలు పొదుపు అవుతాయి .. అని అనుకున్నాడు. 

వెంటనే బయలుదేరాడు. అక్కడా ఇక్కడా అడుక్కున్నాడు. అటూ ఇటూ చేసి 100 రూపాయలు చేశాడు వాటిని. వాటిని దాచుకొని అదే చెట్టు కింద పడుకున్నాడు. తెల్లారి లేచి 100 రూపాయలను చూశాక ఆ బిక్షగాడికి మరో ఆలోచన వచ్చింది. వీటిని ఖర్చు పెడితే వెంటనే ఖర్చయి పోతాయి. వీటికి 900 కలిపితే.. 1000 రూపాయలు అవుతాయి కదా అనిపించింది. దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కష్టపడ్డాడు. వాళ్లను వీళ్లను అడుక్కున్నాడు… వెయ్యి రూపాయలు చేశాడు.

 తర్వాత మరో ఆలోచన వచ్చింది. 99000 వీటికి చేర్చితే.. లక్ష రూపాయలు అవుతాయి కదా… అనిపించింది. అలాగే ఈసారి తీవ్రంగా శ్రమించాడు. లక్ష అయింది. ఇంకా కష్టపడి 99 లక్షలు చేర్చితే కోటి అవుతుంది కదా అనిపించింది. ఇంకా తీవ్రంగా శ్రమించాడు. కోటి చేశాడు చివరకు. కోటీశ్వరు డయ్యాడు. 

బిక్షాధికారిగా ఉన్న ఆ వ్యక్తి లక్షాధికారి.. అట్నుంచి కోటీశ్వరుడయ్యాడు.
డబ్బు వచ్చాక మనిషి ఎలా అవుతాడో తెలుసు కదా. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు.. మంచి ఇల్లు కొనుక్కున్నాడు. అంతా బాగుంది. కానీ.. మనోడిలో ఏదో ఒక అసంతృప్తి. డబ్బు, పెళ్లాం, పిల్లలు.. ఇలా అందరూ ఉన్నా.. మనోడికి ప్రశాంతత లేదు.. సంతృప్తి లేదు. దీంతో తాను బిచ్చగాడిగా ఉన్నప్పుడు ఉన్న అదే చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాడు. రాజు, మంత్రి అదే చెట్టు మీద మారువేషంలో పైనున్నారు. వాళ్లు కిందికి దిగి.. చెట్టు కింద కూర్చున్న వ్యక్తిని చూసి.. అయ్యో.. మీరు కోటీశ్వరులు కదా ఇక్కడ కూర్చున్నారేంటంటూ రాజు అతడిని ప్రశ్నించాడు.


దీంతో ఆ కోటీశ్వరుడు గా మారిన బిక్షగాడిలా అన్నాడు. ఇదే చెట్టు కింద ఏమీ లేకుండా అప్పుడు కూర్చున్నా. నా దరిద్రం… ఏంటంటే.. 90 రూపాయలు ఇక్కడే దొరికాయి నాకు. ఆ 90 రూపాయలే నా కొంప ముంచాయి. 90 రూపాయలకు 10 రూపాయలు కలిపి 100 చేశా. ఆ వందకు 900 కలిపి వెయ్యి చేశా. వెయ్యికి 99 వేలు కలిపి లక్ష చేయాలనిపించింది. అలా పొదుపుగా కోటి రూపాయలు  సంపాదించా. డబ్బు అయితే సంపాదించా కానీ.. మనసు ప్రశాంతంగా లేదు. ఏదో లోటుగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నోట్ల  కట్టలు, నా కష్టాలూ ఉన్నాయి తప్పితే.. సంతోషం, ఆనందం లేవు. అవి కోల్పోయాను అంటూ రాజుతో చెప్పాడు ఆ వ్యక్తి.

 అప్పుడు బేఫికర్ గా ఉండే వాడిని. నా దగ్గర ఏదీ లేదు.. ఇదే చెట్టు కింద హాయిగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ.. హాయిగా నిద్రపోలేక పోతున్నాను.. అంటూ చెప్పడంతో... అప్పుడు మంత్రికి రాజు ఎందుకు అప్పుడు 90 రూపాయలు కింద పారేశాడో అర్థమయిందట. 


ఇందలి నీతి: *మనిషికి జీవితంలో పొదువు అవసరమైన అంశమే గానీ మనిషి యొక్క కనీస జీవితం అవసరాలకు కూడా ఖర్చు పెట్టకపోతే అట్టి వాని జీవితం పై కథలలోని బిక్షగాడి మాదిరిగా నరకప్రాయ మవుతుంది.

*సత్సాంగత్యము - ప్రభావం

దేవర్షి అయిన నారదడు సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అవతారరూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు “దేవర్షీణాంచ నారదః” అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒకసారి శ్రీకృష్ణుని దర్శించుటకై వచ్చి దండప్రణామములు చేసి “భగవాన్! సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి” అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకముగానే నారదునికి తెలియచేయాలని సంకల్పించి “నీవు తూర్పువైపుగా వెళితే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది. అందులో ఉన్న పేడపురుగును సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు” అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వునవ్వాడు.

పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. నరద మహర్షి ప్రశ్న అడిగాడోలేదో గిలగిలలాడూతూ ప్రాణాలు విడిచింది ఆ పేడపురుగు. ఇలా జరిగిందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినదంతా విన్నవించుకొన్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటకసూత్రధారి ఇలా అన్నాడు “ఇప్పుడు పశ్చిమదిశగా వెళ్ళు. ఒక పాడుపడిన దేవాలయము అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు”. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకొని తన ప్రశ్నవేశాడు నారదుడు. అదేమి చిత్రమో ఆ కపోతము నారద మహర్షి పాదలమీద పడి ప్రాణాలు విడిచింది. “ఇది ఏమి వింత? ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించదలచాడో?” అని చింతిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వచ్చి జరిగినది విన్నవించుకొన్నాడు. “అలా జరిగిందా నారదా? అయితే ఈ సారి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగశిశువును పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు” అని చెప్పి చిరునవ్వులొలకబోసాడు లీలామానుషవిగ్రహుడైన నందనందనుడు.

మొదటి రెండు మార్లు జరిగినది తలచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి “నారదా! నిర్భయముగా వెళ్ళు. ఈ సారి అంతా శుభమే జరుగుతుంది” అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి “ఓ పాపాయి! మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి?” అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో “దేవర్షి! అలా ఆశ్చర్య పోతున్నారేమిటి? పెంటకుప్పలోనున్న పేడపురుగును నేనే. అప్పుడు నా జన్మజన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన మీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీవంటి దివ్యపురుషుల సందర్శన మాత్రముచే నాకు పావురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శనభాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరల ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందు వలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది!” అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు.
(ఒక జ్ఞాని పంపిన పోస్టు)

*సత్యవ్రతమహారాజు*



కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.

ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.

"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.

మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.

ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.

"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.

"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.

అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.

"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.

"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.

"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.

'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.

"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.

రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.

సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.

"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.

అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.

మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు....

సినారె #ముద్ర



నా చిన్నప్పుడు వేంకటపార్వతీశ్వరకవుల రచనలైన ‘పిల్లల బొమ్మల రామాయణం, భారతం..’ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్నప్పుడు (1958 ప్రాంతాల్లో) అప్పటికింకా తెలంగాణాగురించి మాకెవరికీ సరిగా అవగాహనే ఉండేది కాదు. ఒక రోజున మా నాన్నగారు చెప్పారు - “ఒరేయ్! తెలంగాణాలో దాశరథి, నారాయణరెడ్డి అనే ఇద్దరు యువకవులు కూడా ఈ బొమ్మల గ్రంథాలను చాలా బాగా వ్రాశారురా!” అని. అదీ నేను మొదటిసారి వీరిరువురి పేర్లూ వినడం.

తరవాత ఇద్దరి రచనల పేర్లు మాత్రమే విన్నాను మరికొన్నాళ్ళు.

1962లో అనుకుంటా - ‘ఇద్దరు మిత్రులు’ ఒక ప్రక్కన, ‘గులేబకావళి’ మరొక ప్రక్కన పోటీగా ఆడుతున్నాయి. ఒక రోజున (కొవ్వూరులో) మా ఇంటి వెనకాల ఏదో కార్యక్రమానికి సినిమా రికార్డులు వేస్తున్నారు. (నాకేమో ఎన్టీ-ఆరంటే ఒక పిసరు అభిమానం ఎక్కువే!) అందులోని పాట “నన్ను దోచుకొందువటే” (అది భీంప్లాస్ రాగంలో ఉందని తరవాత తెలిసింది) విని, దాదాపు నాకు మతిపోయినంతపనయింది! ఆ రికార్డు వేస్తున్నతడిని మంచిచేసుకుని, అక్కడ 3 గంటలపాటు కూర్చుని, ఒక ఏడెనిమిది సార్లు విని ఉంటాను! అంతగా నచ్చేసింది ఆ పాట నాకు. (మరొక రెండు నెల్లో మల్టీపర్పస్ పరీక్షలు (12th) మాకు!)

సుమారు మరొక 30 సంవత్సరాల తరవాత  సినారె తన ఆత్మకథను వ్రాసుకున్నపుడు ఈ సినిమాకు పాటలు వ్రాసే అవకాశం ఎలా కలిగిందో వ్రాసుకున్నాడు.

(ఈయన తన అగ్రజుడని పిలిచే దాశరథి సినీరంగంలోకి చేరాడు అప్పటికే. ఆత్రేయ తీసిన సినిమా ‘వాగ్దానం’లోని ‘నా కంటిపాపలో నిలిచిపోరా!’తో ఆయన రంగప్రవేశం చేశాడని విన్నాను.) ఎన్టీ ఆర్ కు ఈయన ప్రతిభాపాటవాలగూర్చి తెలిశాక, ఎవరో ఆయనకు ఈయన్ను పరిచయంచేశాడట! ఇద్దరూ మాట్లాడుకుంటూంటే ‘మాకొక పాటతో సినీరంగప్రవేశం చేయండి!’ అని ఆయన అడగ్గా ఈయన “సింహద్వారంగుండా ప్రవేశంచేయాలని ఉందండీ నాకు!” అన్నాడట. (అంటే ఒకే చిత్రానికి అన్ని పాటలనూ వ్రాయడమన్నమాట!) “సరే, ఆ అవకాశం మేమే ఇస్తామేమో!” అని నవ్వుతూ ఎన్టీ ఆర్ అన్నాడట.

అనుకోకుండా ఒకరోజు ఈయనకు ఫోనొచ్చిందట మద్రాసునుండి - ‘రామారావుగారు మీతో మాట్లాడాలంటున్నారు!’ అని, ఒకాయన హైదరాబాదులో ఈయనకు ఫోనివ్వడం, ఆ హీరోగారు ‘మా గులేబకావళి చిత్రానికి #మీరే #అన్ని #పాటలూ #వ్రాస్తున్నారు!’ అనడం, ఈయన ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

మద్రాస్ సెంట్రల్ స్టేషనుకి రామారావే స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్ళడం, పది పన్నెండురోజులు ఆయన ఇంట్లోనే ఉండి, ఆయనకు నచ్చినట్లుగా తాను మొత్తం పాటలు వ్రాయడం - ఈ వివరాలనన్నిటినీ సినారె వ్రాసుకున్నాడు తన పుస్తకంలో.

అంతే కాదు, అదే సమయంలో (మద్రాసులో ఉండగానే) నాగేశ్వరరావు సినిమా ఒకదానికి ఒకటిరెండు పాటలను వ్రాయమని కబురొస్తే, ఈయన రామారావుగారిని అడగడానికి జంకాడట. ఆయనే ఈయన ఇబ్బందిని గ్రహించి, ‘బ్రదర్ సినిమాకి వ్రాయడానికి జంకూగొంకూ ఎందుకు? ఆ పని కూడా చేసుకోండి. మీకిక తిరుగుండదు!’అన్నాడట ‘మా’ హీరోగారు.

అంతే ఆ ఆశీర్వచనం ఫలించింది - సినారె సినీ-ప్రస్థానం ఆ  విధంగా మొదలైంది, ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు!

(రామారావు మరణించినప్పుడు #నిజంగా భోరున ఏడ్చినవారిలో సినారె ఒకడు!)

నేను ‘సినారె’ను 1964లో హైదరాబాద్ లోని వైయంసీఏలో చూచాను మొదటిసారి. ఆరోజు సినిమాపాటలలోకి జానపదసాహిత్యాన్ని చొప్పించడంగురించి ఆయన మాట్లాడినట్లు,
‘సెనగచేలో నిలబడి..’ అనే పాట పాడివినిపించినట్లుగా గుర్తు.

ఆయన ‘కర్పూరవసంతరాయలు’ ఖండకావ్యాన్ని, మరికొన్ని ఇతరరచనలనూ మాత్రమే నేను చదవగలిగాను. ఆయన గజళ్ళగురించి నాకు ఎక్కువగా తెలియదు.

ఆయన సినీరచనల్లో నేను మరచిపోలేని కొన్నిటిని క్రింద పేర్కొంటున్నాను:

1) ‘గంగావతరణం’ - బాపు సినిమా “సీతాకల్యాణం”

2) రెండు సినిమా హరికథలు - ‘కలెక్టర్ జానకి’ & ‘స్వాతిముత్యం (రామా! కనవేమిరా?)’

3) ‘ఎంత దూరమో? . ’ - ‘ఏకవీర’  (ఆ చిత్రానికి సంభాషణలు ‘సినారె’వే)

4) ‘చిత్రం! భళారే విచిత్రం!’ - ‘డీవీఎస్’ కర్ణ’

5) ‘పూవై విరిసిన పున్నమి వేళా.. ‘ - ‘శ్రీతిరుపతమ్మ కథ’

6) ‘దాచాలంటే దాగదులే...’ - ‘లక్షాధికారి’ (సంగీతదర్శకుడు చలపతిరావుకు ఈయన ట్యూన్ కూడా కూనిరాగంతో సూచించాడట!)

7) ‘కిలకిల నవ్వులు...’ - ‘చదువుకున్న అమ్మాయిలు’

8) ‘చెలికాడు నిన్నే..’ - ‘కులగోత్రాలు’

9) ‘గోరంత దీపం… (నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి..)’ - ‘గోరంత దీపం’

10) ‘గోగులు పూచే గోగులు కాచే..’ - ‘ముత్యాలముగ్గు’

11)  ‘ఊయలలూగినదోయి మనసే (భానుమతి)’ - ‘బొబ్బిలియుద్ధం’

12) ‘కలల అలల...’ - ‘గులేబకావళి కథ’

అయినా ఎన్నని చెప్పగలను(ము)? అదొక పెద్ద అమూల్యమైన భాండాగారం.

ఆయన జోక్ ఒకటి మరచిపోలేనిది - 'తూర్పు-పడమర' సినిమాలో - "#మీ #బిల్లుకు #నా #పాట #చెల్లు!"

1969లో చోటుచేసుకున్న ‘వేరు తెలంగాణా’ ఉద్యమంలో ‘మాకు కావలసినది #వీర #తెలంగాణా’ అన్న ‘పక్షం’లో ఈయన నిలిచాడు.

అదే సమయంలో ‘తెలుగుజాతి మనదీ..’ (‘తల్లా? పెళ్ళామా?’ సినిమాకి) అనే ప్రసిద్ధమైన పాటను వ్రాశాడు కూడా.

ఎన్టీఆర్ ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన పెట్టించిన విగ్రహాలకు సంబంధించిన వాక్యాలను వ్రాయడంలో కూడా సినారె హస్తం ఉందని విన్నాను.

‘#మార్పు #నా #తీర్పు’ అనే ఒక మకుటంతో వచ్చిన ఆయన కవిత ఒకటి జ్ఞాపకం వస్తుంది తెలంగాణా వేరుపడడాన్ని తలుచుకున్నప్పుడల్లా. ఆయన చివరిరోజుల్లో జరిగిన ఈ ఏర్పాటుపైన  ఆయన ఏ విధంగా స్పందించాడో ఆలోచించడం కూడా గతజల-సేతుబంధనమే!

‘పుట్టినరోజు పండగే అందరికీ …’ అనే పాటలో ఆయనే చెప్పినట్లుగా ‘పుట్టింది ఎందుకో తెలిసిన’ కొందరిలో కచ్చితంగా ఆయన ఉంటాడు, ఇక ఆయన సాహిత్యమంటారా? ఎప్పటికీ నిలచి ఉండేది అది!

భౌతికంగా ఆయన మనమధ్య లేడు గానీ, తెలుగు సాహిత్యంలో తనదైన ఒక చెరగని ముద్ర వేసి మరీ పరమపదించాడు.

విశ్వనాథవారు స్వర్గస్థులైనపుడు మా సాహిత్యమిత్రులం అనుకున్నాం ‘ఒక వటవృక్షం కూలిపోయిం’దని! ఈయన విషయమూ అంతే!
(అయితే, ఈ వటవృక్షాలు వేరే మొక్కలు ఎదగకుండా అడ్డుకున్నవి మాత్రం కావు!)

నాద యోగం - సమాధి స్థితి - దశ విధ నాదాలు

భట్టాచార్య

సాధకుడు ఎడతెగని నిష్ఠతో సాధనలో ఉన్నపుడు....కుండలినీ శక్తి మేల్కొని, అనాహత చక్రం చైతన్య వంతమైతే "దశ విధ నాదాలు" అనుభవానికి వస్తాయి. కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రంలో స్థిర పడితే, రక రకాల కాంతులు అనుభవానికి వస్తాయి. ఈ కాంతులనే "చిత్కళలు" అంటారు. కూటస్త చైతన్యమునే "బిందువు" అంటారు. అయితే ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.

నాద యోగాభ్యాసంలో భాగంగా,  ప్రణవ సాధన చేసేవారికి....మొదటి దశలో, లోపలి నాదం అనేక రకాలుగా వినిపిస్తుంది. నిరంతరం, దీక్షగా అభ్యాసం చేస్తూ ఉంటే, చివరికది సూక్ష్మ నాదంగా పరిణమిస్తుంది. ప్రారంభంలో, లోపల నుండి (1). సముద్ర ఘోష  (2). మేఘ ఘర్జన (3). భేరీ నాదం (4). నదీ ప్రవాహం చప్పుడు.......వినిపిస్తుంది. అయితే ఈ నాదాలు ప్రణవం యొక్క వివిధ పరిణామ రూపాలే. సాధన మధ్య దశలో 1. మద్దెల శబ్దం 2. ఘంటా నాదం 3. కాహళ నాదం వినిపిస్తాయి. ఇవన్నీ, కుండలినీ శక్తి జాగృతిలో, "నాదానుసంధాన" యోగ సాధనలో, ధ్యానావస్థల్లోని...పరిపూర్ణ దశలలో వినిపించే నాదాలివి. ఈ ప్రణవ అభ్యాసం చివరి దశలో, చిరుమువ్వల చప్పుడు, మధురమైన వేణు గానం, తుమ్మెద ఝంకారం....లాంటి వివిధ నాదాలు....అత్యంత సూక్ష్మంగా సాధకునికి వినిపిస్తాయి.

  సాధకుడు, తన సమాధి స్థితిలో నాదాన్ని వింటూన్నపుడు, మధ్యలో మహాభేరీ నాదాలు కూడా వినపడతాయి. ఆ సమయంలో, దాని వెనుకే....అత్యంత సూక్ష్మ నాదాలు వినపడతాయి. ఈ నాదాలను కూడా జాగ్రత్తగా వినాలి. సూక్ష్మ నాదాలు వింటూ...పెద్ద ధ్వనులను విడిచి పెట్టాలి. అలాగే పెద్ద ధ్వనులు వినేటపుడు, సూక్ష్మ నాదాలు విడిచి పెట్టాలి. ఇలా నిరంతరం నాదాభ్యాసం చేస్తున్నపుడు, మనస్సు ఒక నాటికి ఏదియో ఒక నాదంపై ఏకాగ్రతను పొంది, మనోలయం జరుగుతుంది. మనోలయమే కదా, కావలసింది.

శ్రేయోదాయక మార్గగామి


తరతరాల వారసత్వ ధార్మిక జీవన వ్యవస్థ మనది ! కోటానుకోట్ల వత్సరాల అత్యద్భత చరిత భరతఖండపు సొంతం ! ఈ పుణ్య స్థలిపై అపౌరుషేయంగా ఆవిష్కరించబడ్డ వేద సంస్కృతి ! భారతీయ సనాతన ధర్మపు మూల స్థంభమై నిలిచిన సంస్కృత భాష ! ప్రతి పదమందున, ఆ భాషా సౌలభ్యం, " సుమైత్రీ భావనాత్మకతా వికాసం, సజ్జన సాంగత్యపు ఆవశ్యకతా నిర్దేశనం ", మన భరత జాతికి గొప్ప వరం ! వేద విజ్ఞానం అనాదిగా నేర్పెడి సఖ్యత, సారూప్యత, విశ్వ ప్రశాంతతకు వెన్నుదన్నై నిలచు ! భారత దేశం, నేటికీ, ఏనాటికీ సకల విశ్వ జీవజగతి శ్రేయోదాయక మార్గగామి ! శ్రుతుల, స్మృతుల, ఉపనిషత్ కథల రూపాన అనుక్షణం వేద సంస్కృతి, సకల లోక స్నేహ చైతన్య స్ఫూర్తి ! వసుధైక కుటుంబక ఆవిష్కరణకు ఏనాటికైనా వలసిన ధర్మం, సుమైత్రీ భావనాత్మకత ! ఆది నుండి ఈ పవిత్ర పృధ్విపై చక్కని కుటుంబ వ్యవస్థకు మారుపేరై నిలిచిన మన భారత దేశం ! ప్రజాస్వామిక వ్యవస్థ మూలాలకు ఆస్కారం, చక్కని సయోధ్య, సుహృద్భావం ! ఈ ధర్మ పద్ధతి విశ్వ వ్యాప్తంగ సదా సర్వదా ఆచరణీయం, అనుసరణీయమన్న సత్య దార్శనికత !                        దురదృష్టకరం, నేటి విశ్వ వ్యాప్త దుర్భర స్థితిగతులు, ఈ ధర్మాన్ని అతిక్రమించడం బహు శోచనీయం ! నేటి విశ్వ విద్వేషాలు, అనుమానవమానాలు తేలేవెన్నటికి సుహృద్భావ, సువ్యక్తిత్వ సానుకూల స్థితిగతులను ఈ ఇలపై ! రానురాను క్రూరత్వం, ఆపై ఉగ్రవాద స్వభావం, విశ్వ వ్యాప్తంగ పెచ్చుమీరుతున్న దుస్థితి ! మానవ సంబంధాలు గతి తప్పుతున్న నేపథ్యంలో నేటి విశ్వ వ్యాప్త జీవన గమనం !                                                   నేటి విశ్వ మానవాళి నందు, సుమనోవిజ్ఞాన స్ఫూర్తితో, సుసంపన్నమైన సమైక్య భావనాత్మక మైత్రి నెలకొనాల్సిన తరుణమిది ! వారి మనమున, " జీవకారుణ్యతా సహృదయ చైతన్య భావన ", ఆవిష్కృతమవాల్సిన నేపథ్యం ! పవిత్ర భారతీయ సనాతన ధర్మపు మూల సూత్రం, " బ్రతుకు, బ్రతకనివ్వు, అనెడి సానుకూల సముచిత సమైక్య చింతన ", మన వేద విజ్ఞానం నేర్పెడి ధర్మబద్ధ జీవన పద్ధతి ! ప్రాతఃకాలపు కుక్కుట నాద మైత్రీ భావనాత్మక స్ఫూర్తి, అనాదిగా ప్రకృతి ఈ విశ్వ జీవజగతికి మార్గదర్శి ! సుస్నేహ సానుకూల సుహృద్భావ మైత్రీ బంధం, ఈ పవిత్ర పృధ్విపై ప్రశాంత జీవన సోపానం ! బ్రహ్మ దేవునిచే ప్రత్యేక విధాన సృష్టించబడ్డ మానవ జాతి, సకల విశ్వ జీవజగతి ప్రశాంత జీవన గమన ఆశాజ్యోతి !                      " యద్భావం తద్భవతి "                             

సర్వే భవంతు సుఖినః ! 
సర్వే సంతు నిరామయా ! 
సర్వే భద్రాణి పశ్యంతు ! 
మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ ! 🙏                                   

సహనావవతు ! సహ నౌ భునక్తు ! 
సహవీర్యం కరవావహే ! తేజశ్వి నావధీతమస్తు ! మా విద్విషావహై !
ఓం శాంతి శాంతి శాంతిః                                               ✍️
గుళ్లపల్లి ఆంజనేయులు

చెణుకులు

రిటైర్డ్ అయి ఇంట్లో కూర్చున్న భర్తలని
హోమియో పతి (Home - o-pati )
అంటారు!

భర్తలు ఇంటికి ఎంత లేట్ గా వచ్చినా
భార్య ఇంట్లోకి రానిచ్చే  ప్రక్రియ ని
అల్లో పతి (allow - pati ) అంటారు! 🤣

భార్యలు ఆఢించినట్టు ఆడే భర్తలను
 నాచ్ రో పతి అంటారు
*************

*ప్రసాదాలలో పోషక విలువలు !!*

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

*జీర్ణశక్తిని పెంచే ' కట్టె పొంగళి*
బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .

*జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర*
బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .!
                         
*మేధస్సును పెంచే దద్యోధనం*
బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది !!     
                   
*వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబప్రసాదం*
బియ్యం , చింతపండు , ఎండుమిర్చి, పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు , పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం!!
                                                     *శ్లేష్మాన్ని తగ్గించే  పూర్ణాలు* "పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .!!

*రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి*
బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం !!

*కొబ్బరి పాల పాయసం*
కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది. ☘️🙏🏻☘️

Almost all Indian recipes are medicinal , nutritional and healthy.
*****************

సెలవ రోజు

“రేపు ఆఫన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు?" కొంచెం కోపాన్ని మిళితం చేసి సంధించిన ప్రశ్నకి నీళ్ళూ, వక్కపొడీ కలిపి నముల్తున్నాను. 

“నువ్వలా ఈడీవాళ్ళలా ప్రశ్నిస్తే డాడీ ఏంచెప్తారమ్మా? ఆఫ్ ఎప్పుడు తీసుకోవాలా అని సాయంత్రం దాకా డైలమాలోనే వున్నార్ట!" అప్పుడప్పుడు సపోర్టుకొచ్చే పిల్లలు ఆరోజూ వచ్చారు.

మనం ఆఫ్ తీసుకుంటే ఆరోజు ఇల్లు సర్దుకోవడానికి కేటాయిస్తూవుంటాం. ఇది రామాయణకాలంనించీ జరుగుతున్నదే మాయింట్లో.

ఇల్లు సర్దడం విషయంలో ఎన్టీయార్ కి లక్ష్మీపార్వతిలా వుంటుంది నాసహాయం. ఆ సహాయం పనికొచ్చేదో, పనికిరానిదో చెప్పడం కష్టం. బయటివాళ్ళకి చూస్తే సాయంలాగే అనిపిస్తుంది. తనకిమాత్రం నేను తనపనికి అడ్డం పడుతున్నట్టు అనిపిస్తుంది.

పిల్లలు ఇప్పుడంటే పెద్దాళ్ళైపోయారుగానీ చిన్నప్పుడు ఏం ఏడిపించారని! స్కూల్నించి రాగానే యూనిఫారాలు మార్చమని చెవినిల్లు కట్టుకుని పోరినా చలించేవారు కాదు.

ఒకవేళ మార్చినా మా రెండోవాడు పాము కుబుసం విడిచిపెట్టినట్టు ఎక్కడ విప్పితే అక్కడే వదిలేసేవాడు బట్టలు! ఉతకాల్సిన బట్టలకోసం ఓ బుట్టుంటుందనీ, అందులోనే వెయ్యాలని చెప్పిచెప్పి అలిసిపోయాం.

ఇక మన సంగతి. స్వతహాగా పుస్తకాల పురుగునవడంవల్ల ఇంట్లో చాలా పుస్తకాలుంటాయి. వాటిలో పనికిరాని చెత్తంతా ఏరేసి పాతపేపర్లవాడికి ఇచ్చేద్దామని తను, ‘అలా ఎలా ఏరేస్తాం?' అని నేనూ కాశ్మీర్ సమస్యలా చాలాకాలంనించీ నానుస్తున్నాం.

పోనీ కష్టపడుతోందికదా సాయంచేద్దామని చిన్న స్టూల్ తెచ్చుకుని పై అల్మైరాలు సర్దుతోంటే...‘పొట్టాడా! పొట్టాడానీ! అవికూడా అందవు! ఓసారి అద్దంలో చూస్కో!' అంటూ ర్యాగింగ్!

మనకి కొన్ని సరదాలున్నాయి. ఇల్లెప్పుడూ ఒకేలావుంటే నచ్చదు నాకు. ఏదో మొనాటనీ కనబడుతుంది. అంచేత తిరపతి కొండమీద ఆఫీసులు మాటిమాటికీ మార్చేసినట్టు మాయింట్లో వస్తువులన్నిటినీ వాటివాటి స్థానాల్ని మార్చేస్తూవుంటాను.

ఓ రెండునెలలు కంప్యూటర్‌ టేబుల్ హాల్లోవుంటే తరవాత బెడ్రూంలోకి చేరుతుంది. మాకిద్దరికీ పెద్దగా ట్రాన్స్‌ఫర్లు లేవుగానీ దానికిమాత్రం తరచూ బదిలీలే!

మంచాల్ని వేరే దిశలోకి మార్చడం, ‘అచ్చం నీమొహంలా వుంది!' అని తనన్న తరవాత మళ్ళీ యథాస్థానంలోకి మార్చెయ్యడం చాలాసార్లయింది. అయినా సరదా తీరదు మనకి!

ఎల్లైసీలు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులూ...ఇవన్నీ ఇప్పుడంటే టాబ్లెట్లో కట్టిపడేస్తున్నానుగానీ ఒకప్పుడు అవన్నీ గుట్టలుగుట్టలుండేవి ఇంట్లో. ఇక మన ఐటీ రిటర్న్స్, ఆఫీసువాళ్ళిచ్చిన లవ్ లెటర్సూ లక్షల్లో వుంటాయి.

‘ఓసారిలా రండి! నేను మీకు డేట్లవారీగా ఇస్తూవుంటాను. వేటికవి ఒకపక్కగా పెట్టండి!' అన్న పిలుపుతో మనం వింటున్న పాటలు ఆపేసి మొత్తం కాగితాలన్నీ పరుపుమీద పరిచేసేవాణ్ణి.

ఆ పనికి ఎప్పుడూ దుర్ముహూర్తమే సెట్టయేది. మొదలెట్టిన మూడునిమిషాల్లో మూడుకేసులున్నాయని ఫోను మోగేది.

ఆమధ్య మాయింట్లో ఎప్పుడు చూసినా ఒక ఎలక్ట్రీషియనో, ప్లంబరో తిరుగుతూ కనబడేవారు. నేనుకూడా వాళ్ళలో కలిసిపోయి వెనకాల వైర్లవీ మెళ్ళో వేసుకుని చాలా బిజీగా ఇల్లంతా తిరిగేస్తూవుండేవాణ్ణి!

ఇంట్లో రకరకాల లైట్లు, ఫోకస్ లేంప్స్, లేజర్ లైట్లు, ఎల్యీడీ లైట్లు వుంటాయి.....అన్నీ పెడితే దసరాలకి మైసూర్ ప్యాలస్ లావుంటుంది ఇల్లు! అదో సరదా!

జీవితానికి రంగులద్దుకోమని చెప్పాడుగా అదేదో సినిమాలో! అంచేత మనకి మనమే అలా కలర్‌ఫుల్ గా మార్చేసుకుంటే తుత్తిగావుంటుంది.

మొత్తానికి రెండింటిదాకా సర్ది, కాస్తంత కడుపులో పడేసుకుని, నిద్రపోదామని గదిలో చేరాను.

మధ్యాహ్నం పూట కాసేపలా కునుకుతీద్దామంటే ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకువాళ్ళూ, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకువాళ్ళూ ఒప్పుకోరు. నా ఆరోగ్యంపట్ల వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ.

‘అలా మధ్యాన్నాలు నిద్దరోతే డాట్రారికి పొట్టొచ్చేస్తుంది! వెళ్ళి లేపండమ్మా!’ అని ఇద్దరమ్మాయిల్ని ఉసిగొల్పి వదిలారు.

మామూలుగానే వాళ్ళు లోనిస్తాననడం, నేనేమో ఆల్రెడీ నాకున్న ఇన్‌స్టాల్మెంట్ల వివరాలన్నీ అష్టోత్తరంలా చదవడం, ఆపిల్ల నేచెప్పిందంతా శ్రద్ధగా విని, ఆనక మళ్ళీ ‘లోన్ తీసుకోండ్సార్!’ అని గోముగా అడగడం.....ఇదంతా మాకు విషాదభరిత వినోదం!

హాల్లోకి వచ్చేసరికి మాటీవీ సీరియల్లో హీరోయిన్ ఏడుస్తోంది. మిగతా అన్ని ఛానళ్ళలోనూ లలితా జ్యూయలర్స్ యాడొస్తోంది. నాకేంచెయ్యాలో తోచక రిమోట్ పట్టుకుని వెర్రిచూపులు చూస్తోంటే తను రెండుకప్పుల్లో కాఫీ పట్టుకునొచ్చింది.

‘నాకు పెద్ద కప్పెందుకిచ్చావు? నాకోసం నీ ప్రమోషన్లన్నీ ఫోర్‌గో అయిపోయావు, పిల్లల్ని స్కేటింగులకీ, ట్యూషన్లకీ బండిమీద తిప్పావు, నాకు హాస్పిటల్‌కి కేరేజీ కూడా చాలాసార్లు మోసుకొచ్చావు. అన్ని త్యాగాలు చేసిన నువ్వు తక్కువ కాఫీ తాగుతావా?’ అన్నాను ఆరాధనగా తన కళ్ళలోకి చూస్తూ!

‘సంతోషించాంలేగానీ, త్వరగా తాగి ఆ ఆంధ్రాబ్యాంక్ పాస్‌బుక్ ఎక్కడుందో వెతుకు. నేను హాలంతా బోర్లించేసాను. కనబడళ్ళేదు!’ అంటూ సున్నితంగా హెచ్చరించింది. తను ఆ రేంజిలో చెప్పకపోతే నేను రెండువేల ముప్ఫై వరకూ కూడా వెతకను. ఆసంగతి తనకి బాగాతెలుసు.

మరిక లాభంలేదని లేచి శోధించడం మొదలెట్టాను. అదేంటో మనం ఏదన్నా వెదకడం మొదలెడితే అదితప్ప చాలా దొరుకుతాయి.

నేను మెడిసిన్ ఫస్టియర్లో రాసిన కవిత ఒకటి కనబడింది.

‘అన్నార్తుల ఆక్రందనలు...
 అభాగ్యుల హాహాకారాలు...
 అల్పజీవుల అష్టకష్టాలు..’

ఇలాసాగింది ఆ కవిత! బాగా గుర్తుంది. ఆరోజు శ్రీకన్యాలో సెకండ్‌షో అర్ధరాత్రి స్వతంత్రం సినిమా చూసొచ్చాక అర్ధరాత్రి కూచుని రాసానిది. అందులో పురాణం సూర్యని చూసి నాలాగే వున్నాడనిపించి తెగ ఫీలైపోయాను.

అన్నట్టు మీకు ఇంతవరకూ ఎప్పుడూ చెప్పలేదుకదూ? నేను అప్పట్లో నక్సలైటైపోదామని చాలా బలంగా అనేసుకున్నాను. ఒకరోజైతే రెండుజతల బట్టలు సర్దుకుని బయల్దేరిపోయాను కూడా...అక్కడెలాగూ యూనిఫారాలుంటాయి కదా అని!

బస్టాండులో గంటసేపు కూచున్న తరవాత అమ్మానాన్నలు, అన్నయ్యలిద్దరూ, అక్కాచెల్లీ.. అందరూ గుర్తొచ్చి బెంగొచ్చేసింది. అదీకాక అసలెవర్ని కలవాలో, ఎలాచేరాలో తెలీక ‘ఆనక చూద్దాంలే’ అని తిరిగొచ్చేసాను.

ఒకవేళ నేనలా అటేపు వెళిపోయుంటే మీరీపాటికి పేపర్లలో ‘అనంత్ అలియాస్ వెంకట్ అలియాస్ సూర్యం అలియాస్ జగదీష్ అలియాస్ కుమార్ కోసం పోలీసుల గాలింపం’టూ చదువుతుండేవారు. ఆతరవాత ఇక ఆవిషయం లైట్ తీసుకున్నాను.

ఇప్పుడవన్నీ చదివితే ఇరవయ్యారేళ్ళుగా కాపరంచేస్తూ, ఇద్దరు పిల్లల్నీ, మూడిళ్ళని, నాలుగురాళ్ళనీ వెనకేసుకున్న నేనేనా అవన్నీ రాసిందీ? అననిపిస్తుందా లేదా చెప్పండి?

ఇదేదో పెద్దదే కవరుందే? దీన్నిండా బిల్లులు, రసీదులు, గ్యారంటీ కార్డులు.

పదిహేడేళ్ళక్రితం మేం విజయనగరం వచ్చిన కొత్తలో కొన్న సోనీ సీడీ ప్లేయర్ గ్యారంటీ కార్డు కనబడింది. అది కనబడలేదని మాదగ్గర రిపేరు చేసిన ప్రతిసారీ బోల్డు డబ్బులు తీసుకున్న సంగతి గుర్తొచ్చింది. ఇప్పుడు కనబడి ప్రయోజనం ఏఁవుంది?

ఇదేంటిది? మా పెద్దాడు పుట్టిన కొత్తలో తనకి నేరాసిన ఉత్తరంలా వుందే? అప్పుడు మనం తిరుపతిలో వున్నాం.

‘నీవులేక వీణ’....

ఉత్తరానికి పేరొకటీ!! హవ్వ!

‘నువ్వులేని తిరపతి...పరపతిలేని ఎమ్మెల్యేలా వుంది! ఒక్కణ్ణీ వెళ్ళి ఎక్కబోతోంటే మేటరేంటని స్కూటరడుగుతోంది...’ ఇలాసాగిందా ఉత్తరం!

పాపం, అన్నీ నమ్మేసేది తను!

ఇలాక్కాదని చెప్పి మొత్తం ఫోల్డర్లన్నీ మంచమ్మీద పడేసుకుని కూర్చున్నాను. ఒకచిన్న కవర్లో మా నలుగురివీ పాస్‌పోర్టు సైజు ఫొటోలున్నాయి. ఈ పాస్‌పోర్టు ఫొటోలకి మావూళ్ళో ఇంకోపేరుంది.

పాస్‌ఫొటో!

‘మీ పాస్‌ఫొటో  అయిదునిమిషాల్లో తీసి ఇవ్వబడును!’ అని బోర్డుంటుంది. అసలలా పాస్ పోసుకుంటోంటే ఫొటో తియ్యడఁవే తప్పు! మళ్ళీ మనకివ్వడం కూడానూ!

‘కరెంట్ పోయినచో ఫొటో తియ్యబడును!’..ఇంకో లైను! అంటే జనరేటరుందీ, కరెంట్ పోయినా కూడా ఫొటోల్తీస్తామని చెప్పడం వెలుగది!

‘కలర్ ఫొటో ఇచ్చినచో బ్లాక్&వైట్ చేసి ఇవ్వబడును!’..ఇదింకా దారుణం! ఏండీ..అంటే అన్నాఁవంటారుగానీ కలర్ ఫొటో ఇస్తే బ్లాకండ్ వైట్ చేసివ్వడం ఏంటసలు?

ఇలాంటి బోర్డులన్నీ చూసి హాయిగా నవ్వేసుకుంటాం!

సరేసరే..కబుర్లతో పక్కకెళిపోయాను చూసారా! కవర్లోంచి ఫొటోలు తీసి చూద్దునుకదా.. నేరాలూ ఘోరాలూ బయటపడ్డాయి! మేఁవందరం మారేషాల్లో తిరుగుతున్న దొంగల్లా వున్నాం! ఇలాంటివి దాచినందుకు తన్ననాలి!

హాల్లోకెళ్ళి తనని తీసుకొచ్చి చూపించాను ఫొటోలన్నీ! చచ్చాం నవ్వుకోలేక!

‘ఇదంతాసరే, పాస్‌బుక్కెక్కడోయ్ జగన్నాథం?’ అంది కమాండింగ్ గా!

‘అదే కనబడుతుందిలెద్దూ వెధవ పాస్‌బుక్కు! ఇలా హాయిగా నవ్వేసుకుంటే చాలదూ?’ అనేసాను చిదానందస్వామిలా!                 
....... *.జగదీశ్ కొచ్చెర్లకోట*