29, జులై 2020, బుధవారం

సెలవ రోజు

“రేపు ఆఫన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు?" కొంచెం కోపాన్ని మిళితం చేసి సంధించిన ప్రశ్నకి నీళ్ళూ, వక్కపొడీ కలిపి నముల్తున్నాను. 

“నువ్వలా ఈడీవాళ్ళలా ప్రశ్నిస్తే డాడీ ఏంచెప్తారమ్మా? ఆఫ్ ఎప్పుడు తీసుకోవాలా అని సాయంత్రం దాకా డైలమాలోనే వున్నార్ట!" అప్పుడప్పుడు సపోర్టుకొచ్చే పిల్లలు ఆరోజూ వచ్చారు.

మనం ఆఫ్ తీసుకుంటే ఆరోజు ఇల్లు సర్దుకోవడానికి కేటాయిస్తూవుంటాం. ఇది రామాయణకాలంనించీ జరుగుతున్నదే మాయింట్లో.

ఇల్లు సర్దడం విషయంలో ఎన్టీయార్ కి లక్ష్మీపార్వతిలా వుంటుంది నాసహాయం. ఆ సహాయం పనికొచ్చేదో, పనికిరానిదో చెప్పడం కష్టం. బయటివాళ్ళకి చూస్తే సాయంలాగే అనిపిస్తుంది. తనకిమాత్రం నేను తనపనికి అడ్డం పడుతున్నట్టు అనిపిస్తుంది.

పిల్లలు ఇప్పుడంటే పెద్దాళ్ళైపోయారుగానీ చిన్నప్పుడు ఏం ఏడిపించారని! స్కూల్నించి రాగానే యూనిఫారాలు మార్చమని చెవినిల్లు కట్టుకుని పోరినా చలించేవారు కాదు.

ఒకవేళ మార్చినా మా రెండోవాడు పాము కుబుసం విడిచిపెట్టినట్టు ఎక్కడ విప్పితే అక్కడే వదిలేసేవాడు బట్టలు! ఉతకాల్సిన బట్టలకోసం ఓ బుట్టుంటుందనీ, అందులోనే వెయ్యాలని చెప్పిచెప్పి అలిసిపోయాం.

ఇక మన సంగతి. స్వతహాగా పుస్తకాల పురుగునవడంవల్ల ఇంట్లో చాలా పుస్తకాలుంటాయి. వాటిలో పనికిరాని చెత్తంతా ఏరేసి పాతపేపర్లవాడికి ఇచ్చేద్దామని తను, ‘అలా ఎలా ఏరేస్తాం?' అని నేనూ కాశ్మీర్ సమస్యలా చాలాకాలంనించీ నానుస్తున్నాం.

పోనీ కష్టపడుతోందికదా సాయంచేద్దామని చిన్న స్టూల్ తెచ్చుకుని పై అల్మైరాలు సర్దుతోంటే...‘పొట్టాడా! పొట్టాడానీ! అవికూడా అందవు! ఓసారి అద్దంలో చూస్కో!' అంటూ ర్యాగింగ్!

మనకి కొన్ని సరదాలున్నాయి. ఇల్లెప్పుడూ ఒకేలావుంటే నచ్చదు నాకు. ఏదో మొనాటనీ కనబడుతుంది. అంచేత తిరపతి కొండమీద ఆఫీసులు మాటిమాటికీ మార్చేసినట్టు మాయింట్లో వస్తువులన్నిటినీ వాటివాటి స్థానాల్ని మార్చేస్తూవుంటాను.

ఓ రెండునెలలు కంప్యూటర్‌ టేబుల్ హాల్లోవుంటే తరవాత బెడ్రూంలోకి చేరుతుంది. మాకిద్దరికీ పెద్దగా ట్రాన్స్‌ఫర్లు లేవుగానీ దానికిమాత్రం తరచూ బదిలీలే!

మంచాల్ని వేరే దిశలోకి మార్చడం, ‘అచ్చం నీమొహంలా వుంది!' అని తనన్న తరవాత మళ్ళీ యథాస్థానంలోకి మార్చెయ్యడం చాలాసార్లయింది. అయినా సరదా తీరదు మనకి!

ఎల్లైసీలు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులూ...ఇవన్నీ ఇప్పుడంటే టాబ్లెట్లో కట్టిపడేస్తున్నానుగానీ ఒకప్పుడు అవన్నీ గుట్టలుగుట్టలుండేవి ఇంట్లో. ఇక మన ఐటీ రిటర్న్స్, ఆఫీసువాళ్ళిచ్చిన లవ్ లెటర్సూ లక్షల్లో వుంటాయి.

‘ఓసారిలా రండి! నేను మీకు డేట్లవారీగా ఇస్తూవుంటాను. వేటికవి ఒకపక్కగా పెట్టండి!' అన్న పిలుపుతో మనం వింటున్న పాటలు ఆపేసి మొత్తం కాగితాలన్నీ పరుపుమీద పరిచేసేవాణ్ణి.

ఆ పనికి ఎప్పుడూ దుర్ముహూర్తమే సెట్టయేది. మొదలెట్టిన మూడునిమిషాల్లో మూడుకేసులున్నాయని ఫోను మోగేది.

ఆమధ్య మాయింట్లో ఎప్పుడు చూసినా ఒక ఎలక్ట్రీషియనో, ప్లంబరో తిరుగుతూ కనబడేవారు. నేనుకూడా వాళ్ళలో కలిసిపోయి వెనకాల వైర్లవీ మెళ్ళో వేసుకుని చాలా బిజీగా ఇల్లంతా తిరిగేస్తూవుండేవాణ్ణి!

ఇంట్లో రకరకాల లైట్లు, ఫోకస్ లేంప్స్, లేజర్ లైట్లు, ఎల్యీడీ లైట్లు వుంటాయి.....అన్నీ పెడితే దసరాలకి మైసూర్ ప్యాలస్ లావుంటుంది ఇల్లు! అదో సరదా!

జీవితానికి రంగులద్దుకోమని చెప్పాడుగా అదేదో సినిమాలో! అంచేత మనకి మనమే అలా కలర్‌ఫుల్ గా మార్చేసుకుంటే తుత్తిగావుంటుంది.

మొత్తానికి రెండింటిదాకా సర్ది, కాస్తంత కడుపులో పడేసుకుని, నిద్రపోదామని గదిలో చేరాను.

మధ్యాహ్నం పూట కాసేపలా కునుకుతీద్దామంటే ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకువాళ్ళూ, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకువాళ్ళూ ఒప్పుకోరు. నా ఆరోగ్యంపట్ల వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ.

‘అలా మధ్యాన్నాలు నిద్దరోతే డాట్రారికి పొట్టొచ్చేస్తుంది! వెళ్ళి లేపండమ్మా!’ అని ఇద్దరమ్మాయిల్ని ఉసిగొల్పి వదిలారు.

మామూలుగానే వాళ్ళు లోనిస్తాననడం, నేనేమో ఆల్రెడీ నాకున్న ఇన్‌స్టాల్మెంట్ల వివరాలన్నీ అష్టోత్తరంలా చదవడం, ఆపిల్ల నేచెప్పిందంతా శ్రద్ధగా విని, ఆనక మళ్ళీ ‘లోన్ తీసుకోండ్సార్!’ అని గోముగా అడగడం.....ఇదంతా మాకు విషాదభరిత వినోదం!

హాల్లోకి వచ్చేసరికి మాటీవీ సీరియల్లో హీరోయిన్ ఏడుస్తోంది. మిగతా అన్ని ఛానళ్ళలోనూ లలితా జ్యూయలర్స్ యాడొస్తోంది. నాకేంచెయ్యాలో తోచక రిమోట్ పట్టుకుని వెర్రిచూపులు చూస్తోంటే తను రెండుకప్పుల్లో కాఫీ పట్టుకునొచ్చింది.

‘నాకు పెద్ద కప్పెందుకిచ్చావు? నాకోసం నీ ప్రమోషన్లన్నీ ఫోర్‌గో అయిపోయావు, పిల్లల్ని స్కేటింగులకీ, ట్యూషన్లకీ బండిమీద తిప్పావు, నాకు హాస్పిటల్‌కి కేరేజీ కూడా చాలాసార్లు మోసుకొచ్చావు. అన్ని త్యాగాలు చేసిన నువ్వు తక్కువ కాఫీ తాగుతావా?’ అన్నాను ఆరాధనగా తన కళ్ళలోకి చూస్తూ!

‘సంతోషించాంలేగానీ, త్వరగా తాగి ఆ ఆంధ్రాబ్యాంక్ పాస్‌బుక్ ఎక్కడుందో వెతుకు. నేను హాలంతా బోర్లించేసాను. కనబడళ్ళేదు!’ అంటూ సున్నితంగా హెచ్చరించింది. తను ఆ రేంజిలో చెప్పకపోతే నేను రెండువేల ముప్ఫై వరకూ కూడా వెతకను. ఆసంగతి తనకి బాగాతెలుసు.

మరిక లాభంలేదని లేచి శోధించడం మొదలెట్టాను. అదేంటో మనం ఏదన్నా వెదకడం మొదలెడితే అదితప్ప చాలా దొరుకుతాయి.

నేను మెడిసిన్ ఫస్టియర్లో రాసిన కవిత ఒకటి కనబడింది.

‘అన్నార్తుల ఆక్రందనలు...
 అభాగ్యుల హాహాకారాలు...
 అల్పజీవుల అష్టకష్టాలు..’

ఇలాసాగింది ఆ కవిత! బాగా గుర్తుంది. ఆరోజు శ్రీకన్యాలో సెకండ్‌షో అర్ధరాత్రి స్వతంత్రం సినిమా చూసొచ్చాక అర్ధరాత్రి కూచుని రాసానిది. అందులో పురాణం సూర్యని చూసి నాలాగే వున్నాడనిపించి తెగ ఫీలైపోయాను.

అన్నట్టు మీకు ఇంతవరకూ ఎప్పుడూ చెప్పలేదుకదూ? నేను అప్పట్లో నక్సలైటైపోదామని చాలా బలంగా అనేసుకున్నాను. ఒకరోజైతే రెండుజతల బట్టలు సర్దుకుని బయల్దేరిపోయాను కూడా...అక్కడెలాగూ యూనిఫారాలుంటాయి కదా అని!

బస్టాండులో గంటసేపు కూచున్న తరవాత అమ్మానాన్నలు, అన్నయ్యలిద్దరూ, అక్కాచెల్లీ.. అందరూ గుర్తొచ్చి బెంగొచ్చేసింది. అదీకాక అసలెవర్ని కలవాలో, ఎలాచేరాలో తెలీక ‘ఆనక చూద్దాంలే’ అని తిరిగొచ్చేసాను.

ఒకవేళ నేనలా అటేపు వెళిపోయుంటే మీరీపాటికి పేపర్లలో ‘అనంత్ అలియాస్ వెంకట్ అలియాస్ సూర్యం అలియాస్ జగదీష్ అలియాస్ కుమార్ కోసం పోలీసుల గాలింపం’టూ చదువుతుండేవారు. ఆతరవాత ఇక ఆవిషయం లైట్ తీసుకున్నాను.

ఇప్పుడవన్నీ చదివితే ఇరవయ్యారేళ్ళుగా కాపరంచేస్తూ, ఇద్దరు పిల్లల్నీ, మూడిళ్ళని, నాలుగురాళ్ళనీ వెనకేసుకున్న నేనేనా అవన్నీ రాసిందీ? అననిపిస్తుందా లేదా చెప్పండి?

ఇదేదో పెద్దదే కవరుందే? దీన్నిండా బిల్లులు, రసీదులు, గ్యారంటీ కార్డులు.

పదిహేడేళ్ళక్రితం మేం విజయనగరం వచ్చిన కొత్తలో కొన్న సోనీ సీడీ ప్లేయర్ గ్యారంటీ కార్డు కనబడింది. అది కనబడలేదని మాదగ్గర రిపేరు చేసిన ప్రతిసారీ బోల్డు డబ్బులు తీసుకున్న సంగతి గుర్తొచ్చింది. ఇప్పుడు కనబడి ప్రయోజనం ఏఁవుంది?

ఇదేంటిది? మా పెద్దాడు పుట్టిన కొత్తలో తనకి నేరాసిన ఉత్తరంలా వుందే? అప్పుడు మనం తిరుపతిలో వున్నాం.

‘నీవులేక వీణ’....

ఉత్తరానికి పేరొకటీ!! హవ్వ!

‘నువ్వులేని తిరపతి...పరపతిలేని ఎమ్మెల్యేలా వుంది! ఒక్కణ్ణీ వెళ్ళి ఎక్కబోతోంటే మేటరేంటని స్కూటరడుగుతోంది...’ ఇలాసాగిందా ఉత్తరం!

పాపం, అన్నీ నమ్మేసేది తను!

ఇలాక్కాదని చెప్పి మొత్తం ఫోల్డర్లన్నీ మంచమ్మీద పడేసుకుని కూర్చున్నాను. ఒకచిన్న కవర్లో మా నలుగురివీ పాస్‌పోర్టు సైజు ఫొటోలున్నాయి. ఈ పాస్‌పోర్టు ఫొటోలకి మావూళ్ళో ఇంకోపేరుంది.

పాస్‌ఫొటో!

‘మీ పాస్‌ఫొటో  అయిదునిమిషాల్లో తీసి ఇవ్వబడును!’ అని బోర్డుంటుంది. అసలలా పాస్ పోసుకుంటోంటే ఫొటో తియ్యడఁవే తప్పు! మళ్ళీ మనకివ్వడం కూడానూ!

‘కరెంట్ పోయినచో ఫొటో తియ్యబడును!’..ఇంకో లైను! అంటే జనరేటరుందీ, కరెంట్ పోయినా కూడా ఫొటోల్తీస్తామని చెప్పడం వెలుగది!

‘కలర్ ఫొటో ఇచ్చినచో బ్లాక్&వైట్ చేసి ఇవ్వబడును!’..ఇదింకా దారుణం! ఏండీ..అంటే అన్నాఁవంటారుగానీ కలర్ ఫొటో ఇస్తే బ్లాకండ్ వైట్ చేసివ్వడం ఏంటసలు?

ఇలాంటి బోర్డులన్నీ చూసి హాయిగా నవ్వేసుకుంటాం!

సరేసరే..కబుర్లతో పక్కకెళిపోయాను చూసారా! కవర్లోంచి ఫొటోలు తీసి చూద్దునుకదా.. నేరాలూ ఘోరాలూ బయటపడ్డాయి! మేఁవందరం మారేషాల్లో తిరుగుతున్న దొంగల్లా వున్నాం! ఇలాంటివి దాచినందుకు తన్ననాలి!

హాల్లోకెళ్ళి తనని తీసుకొచ్చి చూపించాను ఫొటోలన్నీ! చచ్చాం నవ్వుకోలేక!

‘ఇదంతాసరే, పాస్‌బుక్కెక్కడోయ్ జగన్నాథం?’ అంది కమాండింగ్ గా!

‘అదే కనబడుతుందిలెద్దూ వెధవ పాస్‌బుక్కు! ఇలా హాయిగా నవ్వేసుకుంటే చాలదూ?’ అనేసాను చిదానందస్వామిలా!                 
....... *.జగదీశ్ కొచ్చెర్లకోట*

కామెంట్‌లు లేవు: