శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
(21-17)
ఎక్కడో ఒకచోట సంపాదించి కౌశికుడి ఋణం తీరుస్తాను. ప్రాణాలు పోయినా యాచనకుమాత్రం దిగను
నాథా ! కాలమనేది శక్తి స్వరూపం. సమస్థితినీ విషమస్థితినీ కలిగిస్తూంటుంది. అవమానాలు
సమ్మానాలూ చేయిస్తూంటుంది. పురుషుణ్ణి మహాదాతను చేసిన కాలమే యాచకుణ్ణి చేస్తూంటుంది. మన
జీవితమే చూడరాదూ, క్షణంలో ఎంత తలకిందులయ్యిందో ! ఒక విప్రుడి క్రోధం కారణంగా రాజ్యం
పోయింది. సుఖాలూ పోయాయి.
దేవీ ! కత్తి పుచ్చుకుని నా నాలుకను నిలువనా చీరనాసరే, అభిమానం చంపుకుని దేహి దేహి
అనిమాత్రం అననుగాక అనను. నేను క్షత్రియుణ్ణి. ఎవరినీ ఏదీ యాచించును. భుజబలంతో సంపాదించి
మరొకరికి ఇంత ఇస్తాను.
ప్రభూ ! యాచనకు నీ మనస్సు అంగీకరించకపోతే పోనీ మరొక పని చెయ్యి. ఇంద్రాదిదేవతలు
న్యాయంగా నన్ను నీకు సమర్పించారు. నేను ముమ్మాటికీ నీ సొత్తును. నా రక్షణ పోషణ శాసన భారాలన్నీ
నీవే. అందుచేత నన్ను అమ్మేసి ఆ డబ్బుతో ఋణం తీర్చు.
ఈ మాట వింటూనే హరిశ్చంద్రుడు కష్టం కష్టం అంటూ విలపించాడు. అయినా ఈసారి
మాధవీదేవి ధైర్యం కోల్పోలేదు. పట్టువదలలేదు. నాథా ! నా మాట విను.కాదనకు. అట్టే వ్యవధిలేదు.
సూర్యాస్తమయమే గడువు. విప్రశాపాగ్నిలో దహించుకుపోయి నీచత్వం పొందకు. నన్ను అమ్ముతున్నది
జూదం కోసం కాదు, మద్యంకోసం కాదు, రాజ్యంకోసం కాదు, భోగంకోసం కాదు. గురు ఋణం
తీర్చడానికి, సత్యవ్రతం సఫలం చేసుకోడానికి. కాబట్టి కించపడవలసింది లేకపోగా ఇది గర్వించదగిన
అంశం. దయచేసి నా మాట ఆలకించు. నన్ను ఎవరికైనా అమ్మేయ్.
ఇలా మాధవీదేవి పోరగా పోరగా కట్టకడపటికి గతిలేక హరిశ్చంద్రుడు అంగీకరించాడు. సరే,
దేవీ ! నిన్ను అమ్మేస్తాను. కఠినాతి కఠినుణ్ణి. నాకు దిగులేమిటి! నీచాతినీచులుకూడా చెయ్యని పనికి సిద్ధం
అవుతున్నాను. నాకు సిగ్గేమిటి! అంటూనే రెక్కపట్టుకుని భార్యను చరచరా తీసుకువెళ్ళి వీథిమొగలో
ఒక ఆరుగుమీద నిలబడ్డాడు జీరబోయిన గొంతుతో నలుగురికీ వినిపించేట్టు అరిచాడు