శ్రావణమాసం అంటే ఏమిటి..?
శ్రావణమాసము:- ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.
పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.
శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.
శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.
వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.
పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.
ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు.
ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.
శ్రావణ మాసం లక్ష్మీ ప్రదమైనమాసం
శ్రావణ మాసం.
స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే “శ్రావణ మాసం“.
చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి.
మంగళగౌరీ వ్రతం:
శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
వరలక్ష్మీ వ్రతం:
శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శుక్లచవితి-నాగచతుర్థి:
దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.
శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి:
శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.
శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ:
అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.
పూర్ణిమ – హయగ్రీవ జయంతి:
ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.
కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:
మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.
కృష్ణపక్ష అష్టమి –
శ్రీకృష్ణాష్టమి:
శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.
కృష్ణపక్ష ఏకాదశి – కామిక
ఏకాదశి:
ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.
కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య:
పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి, పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
*ఆదిరాజు ప్రసాద్ శర్మ*