శుభోదయం👏
కవితా చమత్కారం!
--------------------------------
చ: కలశ పయోధి మీద తరఁగల్ మరి 'హోయని' మ్రోయ , వేయిభం
గుల తలపాన్పు పాము బుసఁగొట్టఁగ , నేగతి నిద్రఁ జెందెదో ?
అలసత తండ్రి ! చీమ చిటుకన్నను నిద్దుర రాదు మాకు , ఓ
బలవదరీ ! దరీకుహర భాస్వదరీ ! యదరీ ! దరీ ! హరీ !
చాటుపద్యం- అజ్ఙాత కర్తృకం ;
కవితా చమత్కారాలు యెన్నిరీతులో? ఒకొక్క కవిది ఒక్కొక్క ఊహ! ఆవూహకు తగ్గ భావసంపద. దానిని ఆవిష్కరించే చక్కని పద్యరచన! అత్యద్భుత మనిపించక మానదు.
మనం నిద్ర పోతుంటే అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఏమాత్రం చిన్నశబ్దమైనా మెళకువ వచ్చి ప్రక్క వారిపై విసుగు ప్రదర్శిస్తాం. అదే లోకేశ్వరునకు ఆపరిస్థితే వస్తే ఆయన కెంత బాధ? కానీ యివేవీ పట్టించుకోకుండా ఓదేవాది దేవుడు
నిద్రపోతున్నాడట. ఆయన నిద్రను జూచి యీకవి యబ్బురపడుతున్నాడు. పదండి ఆసంగతేమిటో చూద్దాం;
" పాల సముద్రంలో కెరటాలు హోరుమని మోత పెడు తుండగా, వేయితలల నాగు ఆదిశేషుడు బుసలు కొడుతుండగా , లోకపాలనతో అంతగా అలసిపోయిన నీవు యెలా నిదురించినావయా ? నాయనా? మాకైతే చీమచిటుకన్నా
నిద్దుర రాదే , అబ్బో నీవు చాలా గొప్పవాడివేనయ్యా! అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడీ కవి.
అంత భయంకరమైన చప్పుడవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు నిశ్చలంగా నిదురించటం ఇక్కడ ఆశ్చర్య జనక మైన
చమత్కారం. దాన్ని కవి బహు చక్కగా వర్ణించాడు.
కడలో కెరటాలు అనంతం వాటి మ్రోతలు కూడా నిర్విరామమే! ఇక ఆది శేషునకున్నపడగలా వేయి. ఒక్క పాము బుసకొడితేనేమనం
హడలిపోతాం. అలాటిది వేయిపాములొక్కసారిగా బుసలు సారిస్తే యెంత శబ్దమో ? ఆశబ్దం కర్ణ కఠోరంగదా? మరి ఆరొదలో కదలకుండా నిద్రపోవటం మాటలా? మహ దిట్టతనమో, మొండి తనమోకావాలి. ఆరెండూ నీకున్నాయయ్యా! లేకపోతే చీమచిటుకు
మన్నామాకు మెలకువ వస్తుందే ?మరి నీకెందుకురాదు? అనికవి ప్రశ్న?
బలవదరీ! దరీకుహర భాస్వదరీ! యదరీ! దరీ! హరీ! ------ దీనివరుసచూస్తే ఇదేదో శతకానికి మకుటంలాగ ఉంది.
కవి చాలా ప్రౌఢుడు." దరీ " శబ్దాన్ని వృత్యనుప్రాసంగా ప్రయోగించి యర్ధభేదం సాధించటమేగాదు. తానెంత ప్రతిభావంతుడో మనకు
తెలియజేశాడు. అహోబలనృసింహ స్వామిని యీ సంబోధనలతో కవి సంభావిస్తున్నాడు.
బలవదరీ- బలవంతుడైన శత్రువు గలవాడా( హిరణ్య కస్యపుడు బలవంతుడేగదా) దరీకుహర- పర్వత గుహలో; భాస్వదరీ!- ప్రకాశించు నృసింహాకారా! ; అదరీ- చక్రము; దరీ- శంఖము ధరించెడువాడా ;హరీ- స్వామీ శ్రీహరీ!
బలవంతుడైన హిరణ్యకస్యపుని సంహరించినవాడా! శంఖ చక్రధారీ! పర్వత బిలమందు ( అహోబిలము) నివసించు నృసింహ స్వామీ! యని సంబోధనము.
మొత్తానికి పాలకడలిలో విష్ణమూర్తి నిద్ర కూడా కవితా వస్తువైనది.
ఇదండీ విషయం!
స్వస్తి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి