6. " మహా దర్శనము " ---ఆరవ భాగము--అదీ దోహదమేనా ?
అదీ దోహదమేనా ?
ఆలంబినీ దేవి ఇప్పుడు , పగలూ రాత్రీ యనక , మడి , మైల అను ఆలోచనయే లేక మంత్ర జపము చేస్తున్నది . మంత్రపు ప్రభావమేమో , ఆమెకు దేనిని చూసిననూ ఒక తేజోరాశి వలె కాన్పించును . దానితో పాటూ ఇంకో విశేషమేమనిన , ఎవరో ఒకరు , ఎల్లపుడూ తనతో పాటే ఉన్నట్టనిపిస్తుంది . అదెవరు అని తెలుసుకోవలెనన్న కుతూహలము ఆమెకు అప్పుడప్పుడు కలుగుతుంది . అయితే ఆ కుతూహలము ప్రయత్నముగా మారులోపే మాఘ మాసపు తేలికపాటి తెల్ల మేఘము వలె పుట్టగానే కరగిపోతుంది . ఆ భావనయే రాత్రి పూట పడుకొని యున్నపుడు ఒక చిన్న శిశువు ఒడిలో పడుకొని యున్నట్లు ఒక భావనను కలిగిస్తుంది . వెంటనే లేచి , శిశువు ఒడిలో లేనిది చూసి అటూనిటూ చూచుట సామాన్యమైపోయినది . అగ్ని పరిచర్య చేస్తూ మూఢములను ఇస్తున్నపుడైతే సందేహము లేకుండా ఎవరో అమ్మా అంటూ తన చెంగు పట్టుకొని తిరుగాడినట్లనిపిస్తుంది . పొద్దున్నే లేచి మడి కట్టుకొని వచ్చి చల్ల చిలుకుటకు కూర్చున్నపుడు " అమ్మా , ఆ తాజా వెన్న ఇక్కడ కొంచమియ్యమ్మా ’ అని ఎవరో అడిగినట్లు భ్రమ చెంది వెన్నముంతలో నుండీ ఇంత దేవుకొని ఇచ్చుటకు తిరిగి , ఎవరూ లేనిది చూసి ఇదంతా నా భ్రాంతి అనుకుంటుంది . మొత్తానికి ఆమెకు సర్వమూ భర్తీ అయినట్లు , సర్వమూ పూర్ణముగా నున్నట్లు , ఎక్కడ చూసినా అంతా సమృద్ధిగా నిండియున్నట్లు అనిపిస్తుంది .
ఇలాగే ఆశ్వయుజ మాసము గడచినది . కార్తీకము ప్రవేశించినది . కార్తీకముతోనే ఆలంబినీ దేవి మాతృత్వపు దినములూ దగ్గరపడినాయి . ఇప్పుడు గర్భములో పిండము అటూ ఇటూ కదలుటయే కాదు , తాను ఒక్కోసారి మనసులో మంత్రాన్ని మరిస్తే , తేనుపు వచ్చినదానికన్నా స్పష్టమైన ధ్వనితో లోపలినుండీ పూర్ణమదః అని మంత్ర జపము చేసినట్లు వినిపిస్తుంది . వృద్దులై , పది పన్నెండుగురు సంతానమును కన్న వారిని ఇదేమిటి ? అని అడిగినది . వారు నవ్వుతూ , ’ తల్లీ , ఆలంబీ ! ఇదేమిటో విచిత్రమును చెప్పుతున్నావు . మేము పెద్దలు చెప్పగా విన్నాము , మహాపురుషులు గర్భమునకు వచ్చినపుడు ఇలాగవుతుందని . కానీ మాకు ఆ అనుభవము లేదు . నువ్వు చెప్పేది వింటుంటే వెనకటి పెద్దల మాట గుర్తుకు వస్తున్నది . ఏమైనా కానీ , నువ్వు కోపము చేసుకోను అంటే చెబుతాను , నీ కడుపు చూస్తే నీకు కవల పిలలు పుడతారేమో అనిపిస్తున్నది . ఏదేమైనా , దేవుడి దయ వలన గింజ వేరే , పొట్టు వేరే అయ్యి , మీ తల్లీ బిడ్డలు సుఖముగా ఉండుటను చూస్తే అదే మా భాగ్యము .’ అంటారు .
ఆలంబినీ దేవి తల్లికి , " ఈ పెరిగిన కడుపు ఇంత పెద్దగా కనిపిస్తున్నదే ? ఇందులో ఇంత పెద్ద బిడ్డ ఉన్నదా ? ఆలంబిని ఆ బిడ్డను ప్రసవించుట ఎలాగో ? " అని ఒక చిన్న కలవరము . " అయితేనేమి ? ఆమె దినమూ శ్రద్ధగా సేవ చేస్తున్న యజ్ఞేశ్వరుడు ఆమె చేతిని విడువడు " అని తర్కాతీతమైన ఒక దృఢవిశ్వాసము .
ఒక దినము దేవరాతుడు నడిమింట్లో ఏదో గ్రంధపరిశీలనలో యున్నాడు . హఠాత్తుగా కార్తీక శుద్ధ సప్తమి గుర్తుకు వచ్చినది . ఆ దినపు విశేషమేమి యని ఎంత ఆలోచించినా గుర్తుకు రాదు . చివరికి దీర్ఘ కాలము ఆలోచించిన పిమ్మట , యాజ్ఞవల్క్యుడు వెనుక చెప్పినది జ్ఞాపకమైనది . చివాలున లేచి భార్యను వెతుక్కుంటూ వెళ్ళినాడు . ఆమెను చూచి , " మర్నాడు సప్తమీ గురువారము , ఆ దినము నువ్వు తల్లివవుతావు " అన్నాడు . ఆమె సహజమైన సిగ్గుతో తల వంచుకున్నది . దేవరాతుడు లజ్జా సుందరియైన ఆ పత్నిని సంభావిస్తూ " ఆలంబీ , నువ్వు నాకొక వరమును ఇవ్వాలి " అని ప్రార్థించినాడు .
ఆమె నీరవముగా తలయెత్తి చూసి , ’ మీరు నన్ను ప్రార్థించుటయా ? ’ అన్న భక్తి భావముతో కూడిన కటాక్షమును అతని వైపుకు సారించి ,’ ఏమని ? ’ అని అడిగినది .
నాథుడు ఆడవారి కన్న ఎక్కువ సిగ్గు పడుతూ , " నువ్వు కన్న బిడ్డకు మేధా జననము కావలెను , అది కూడా గర్భ నాళ ఛేదనము కన్నా ముందుగనే చేయుటకు అవకాశము నివ్వవలెను . " అన్నాడు .
పడతి , " మీరు అడుగుట ఎంత బాగున్నది ? మంత్రసానిని ఎలా తప్పించి మీకు ఆ అవకాశము నిచ్చెదను ? సాధ్యమేనా ? మీరే చెప్పండి ? " అన్నది . ఆ మాటలో , తాను ఒప్పుకున్నా అది జరుగుట సాధ్యము కాదు అను నిర్ధారణ నిండి ఉండింది .
ఆచార్యుడు భార్యను పిలుచుకొని పోయి నడిమింటికి వచ్చినాడు . అక్కడ తానొక వేత్రాసనము నందు కూర్చొని , పక్కనే ఇంకొక వేత్రాసనమును లాగి వేసి , భర్యను దానిపై బలవంతముగా కూర్చోబెట్టి ’ విను ’ అని చెప్పనారంభించినాడు .
" ఈ జగత్తు అగ్నిష్టోమాత్మకమైనది . దీనిలో నున్న ప్రాణులను ఖనిజములు , ఉద్భిజ్జములు , అండజములు , జరాయుజములు అని నాలుగు విధములుగా వర్గీకరించిననూ , వాస్తవమునకు అన్నీ జరాయుజములే ! అనగా , ఒంటి పొర సంచీ లో పెరిగేవే ! మిగిలిన మూడూ గర్భమును వదలి వచ్చిన తరువాత పెరిగేవి , కానీ జరాయుజము మాత్రము గర్భములో పెరిగి బయటికి వచ్చును . తండ్రి బీజమును తల్లి తన గర్భములో ఉంచి , దానిని తన అంగము కన్నా ఎక్కువగా అభిమానించి తన రక్త మాంసములను దానికిచ్చి పోషించి , సర్వావయవ విశిష్టముగా తల్లిదండ్రుల వలెనే ఉండు ప్రాణిగా చేయును . నాళఛ్చేదనము వరకూ ఆ బిడ్డకు వ్యక్తిత్వము రాదు . అలాగ ఆ బిడ్డ , ప్రత్యేక వ్యక్తి యగుటకన్నా ముందే తండ్రియైన వాడు వచ్చి ఆ శిశువు కుడి భుజమును ముట్టుకొని , విహితములైన మంత్రోచ్చారణ చేసినచో ఆ శిశువు మనస్సూ , బుద్ధీ తండ్రి మనో బుద్ధుల స్థాయికి వస్తాయి . అప్పటినుండి , పెరిగే ఆ శిశువుతో పాటే అవి కూడాపెరుగును . ఇటుల , దోహదము చేయగా , ’ పెరిగిన చెట్టు యొక్క పెరుగుదల అనే ఫలమును పొందుట ’ వంటిదే ఇది కూడా ! కాబట్టి , నా వంశపు వృద్ధిని లక్ష్యముగా పెట్టుకొని , వంశ భూషణుడైన కొడుకును ఇచ్చు తల్లివైన నీ నుండీ ఈ వరమును కోరినాను . "
" సరియే , కుడి భుజము అంటిరి కదా ! అదేమి ? "
" దేవతలు దేహము లోనికి ప్రవేశించునది కుడి భుజము నుండియే ! ఈ దేహము యజ్ఞ మహా యజ్ఞముల వలన బ్రాహ్మణమగును . అటుల జరిగినపుడు దేహములో ఎక్కడంటే అక్కడ దేవతలను చూడ వచ్చు . అలాగ దేహము దేవాయతనమగు వరకూ ఆవాహన చేయవలసిన ఆవశ్యకత ఉంటుంది . ఆ ఆవాహన కుడి భుజమును ముట్టుకొనియే చేయవలెను . అది యెటుల అను దానిని నీకు చూడవలెనన్న కుతూహలము ఉంటే , మనము అష్టకా శ్రాద్ధమును చేస్తాము కదా ! అప్పుడు గుర్తు చేయి . విశ్వేదేవతలు వచ్చి బ్రాహ్మణులలో ఉండుటనూ , కార్యాంతములో వదలి , లేచి వెళ్ళిపోవుటనూ చూపించెదను . "
" ఈ కర్మను చేయకుండిన ఏమగును ? "
" మన బిడ్డ మన వంశపు విశిష్ట లక్షణములను పొందుటకు బదులుగా తన పూర్వ వాసనలకు అనుగుణముగా పెరిగి , తన వ్యక్తిత్వమును దృఢము చేసుకొనును . ఇప్పుడు నేను ఈ కర్మను చేయలేదనుకో , నీ కొడుకు మన వంశమునకు తగ్గట్టు కర్మఠుడై పెరుగుటకు బదులుగా ఇంకేమో కావచ్చును . మేము రాజభవనము నకు వెళ్ళుట తెలుసు కదా , అయితే అది రాజానుగ్రహమును యాచించుటకు కాదు , రాజును అనుగ్రహించుటకు . అప్పుడు ఇటుల కాకుండా , ఇంకెందుకో కావచ్చును . కాబట్టి అట్టి భిన్న ప్రకృతిని చూడవలసి వచ్చుట ఇష్టము లేకనే నిన్ను కోరినది . నువ్వు ఒప్పుకొనియే తీరవలెను . నీ కొడుకు తపోలోకము నుండీ వచ్చినవాడు . అదీకాక, నీచేత పగలూ రాత్రీ ’ పూర్ణ మదః ’ అను మంత్ర జపమును చేయిస్తూ పూర్ణ ధ్యానములో నున్నవాడు . వాడికి మేధా జననము కాకున్న , వాడి కర్మశ్రద్ధ సడలిపోయి పుట్టునపుడే బ్రహ్మజ్ఞుడై పుట్టుట వలన అటులనే పెరిగి సన్యాసి కావచ్చును . అటుల కారాదు . కర్మఠుల వంశములో కర్మ లోపము కాకూడదని ఈ ప్రార్థన . "
ఆలంబిని ఎన్నడూ , ఏ రీతిలోనూ భర్త మాటకు ప్రతి మాట చెప్పి ఎరుగదు. ఇప్పుడు అతడు స్త్రీ సహజమైన లజ్జను త్యజించి వర్తించవలెను అని ప్రార్థన చేయుచున్నాడు . ఊ అంటే తన స్త్రీత్వము అపరాధము అంటుంది . ఊహూ అంటే పత్నీత్వమునకు ద్రోహమైనట్టవుతుంది . ఏమి చేయుట ?
ఆమె ఒక ఘడియ ఆలోచించినది . " భర్త చెప్పుతున్నది సరియైనదే . భర్త ఇంటి సాంప్రదాయము కర్మకు పెట్టింది పేరు . పది మందే శిష్యులను ఇంటిలో ఉంచుకొని అధ్యాపనాదులను జరిపిస్తున్ననూ ఆచార్యుడు అను ప్రాశస్త్యానికి పాత్రమైనది . దేశ విదేశములలో ఆచార్య దేవరాతుని ఆధ్వర్యమంటే , బ్రహ్మ మొదలగు మిగిలిన ఋత్విజులందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఆర్తిజ్యమును వహించుటనూ , ఇక యాగము చేయించు యజమానులైతే , ’ ఆచార్యులు ఆధ్వర్యము వహిస్తే తమ ఇష్ట సిద్ధి ప్రాప్తించినట్లే ’ అని విశ్వాసముతో సంతోషించుటనూ తాను కళ్ళారా చూచినది . ఇప్పుడు అతడే ప్రార్థిస్తున్నపుడు కాదని ఎలాగ అనుట ? తనకు లజ్జతో ప్రాణమే పోయినట్లైననూ చింతలేదు . భర్త ఇంటి పేరు ప్రఖ్యాతులు కాపాడియే తీరవలెను . " అన్న దృఢ నిశ్చయమునకు వచ్చినది . " అలాగే కానివ్వండి , కానీ మంత్రసాని ఉంటుంది కదా ? "
దేవరాతుడు అన్నాడు , " నువ్వు ఒప్పుకున్నావు , ఇక మంత్రసాని సంగతి వదిలేయి . ఈ దినము ఇంకా చతుర్థి . ఇంకా మూడు దినములుంది . అంతలోపల ఆమెకు కర్మ స్వరూపమును తెలియజెప్పి , జననమగునపుడు నువ్వొక ఘడియ బయటికి రావలెను అని చెప్పి ఉంచుదాము . "
ఆలంబినికి అది అంత సులభ సాధ్యముగా అగుపించలేదు . కానీ దానికోసము తానెందుకు వెనుకాడాలి ? ఏదైనా సరే , అది వారికే కట్టబెడితే సరి , అని ’ ఆ పనేదో మీరే చేసుకోవలెను , నావల్ల సాధ్యము కాదు ’ అన్నది .
భార్యతో అన్నాడు , " చూడు ,మరచే పోయాను , మీ అమ్మగారు తొలిచూలు కానుపు అని అప్పుడే వచ్చియున్నారు . వారికి కర్మ స్వరూపమును , దాని ఫలమునూ తెలియజేయి , మిగతాది ఆమెయే చూచుకొనగలరు "
ఆలంబినికి ఈ మాట నచ్చింది. " సరే , అటులే " అన్నది . మొగుడూ పెళ్ళాలిద్దరికీ మోస్తున్న భారమేదో దింపినట్టైంది .
ఆలంబినికి ఏదో జ్ఞాపకము వచ్చి , వెళుతున్నది తిరిగి నిలచి , భర్తనడిగింది , " జననమైన తరువాత ’ భద్రం కర్ణేభిః " అనే మంత్రమును ఉపదేశము చేస్తాను అంటిరి కదా , దానివలన ఈ కార్యము జరగదా ? "
దేవరాతుడు భార్యకు గుర్తుందన్న తృప్తితో నవ్వుతూ , " నేను చెప్పిన కర్మ , బీజమంత్రము వంటిది . జపాదులు దానికి ఎరువు వంటివి మాత్రమే . " అన్నాడు .
సరేనంటూ ఆలంబిని వెళ్ళిపోయింది .