*సర్వ శుభప్రదం భాద్రపదం*
మానవ జీవితంలోని ఒడిదుడుకులను తొలగించి సకల శుభాలను అందించే మాసంగా భాద్రపదమాసం శాస్త్ర ప్రసిద్ధికెక్కిన కారణాలను తెలుసుకుందాం.
సకల విఘ్న నివారకుడు, గౌరీ పుత్రుడు, విఘ్నేశ్వరుడు, ప్రతికల్పంలోనూ భాద్రపద శుద్ధ చతుర్థినాడు ఆవిర్భవిస్తాడు. ఒక కల్పంలో విష్ణువే గణపతిగా పార్వతికి పుత్రుడై వచ్చినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. ఈ కల్పంలో అనగా శ్వేత వరాహకల్పంలో మాత్రం పార్వతీదేవీ శరీర నుండి ఆవిర్భవించాడు.
పార్వతీ దేవీ శరీరం దివ్య శరీరం. అయినా ఆ తల్లి కావాలని పాంచభౌతిక శరీరానికి కలిగే లక్షణాలను తన శరీరానికి కల్పించుకోవడంతో, ఆమె శరీరం నుండి మట్టి పుట్టింది. అందులో నుండి గణపతి పుట్టాడు. ఎందుకో గాని కొందరు వ్యాఖ్యాతలు దానికి నలుగు పిండి నుండి పుట్టినట్లు వ్యాఖ్యానాలు వ్రాసారు. కానీ కంచి పరమాచార్యులు మాత్రం శరీరపు చెమట నుండి పుట్టిన మట్టి నుండి గణపతి జన్మించినట్లు వివరించారు. నిజానికిక్కడ పిండి ప్రసక్తి లేనేలేదు. అలా
పుట్టిన పార్వతీ పుత్రుని శిరస్సును శివుడు ఖండించి, గజముఖం ప్రసాదించడంతో శ్రీ గణేశుడు గజముఖుడు అయ్యాడు. సర్వ విఘ్న నివారకుని జన్మకు కారణమైన భాద్రపదం భద్ర పదమే. గణేశుని పూజించి జనులు సకల శుభాలనూ పొందగలరని నారదపురాణంలోని 113వ అధ్యాయంలో ఉన్నది. శుక్ల చతుర్థినాడు 21 పత్రాలతో గణపతిని పూజించి, వినాయక ప్రతిమను దక్షిణతో గురువులకు దానం చేసిన వాడు ఐహికము, ఆముష్మికమూ రెండు పొందుతాడు, అని నారదపురాణంలో స్పష్టంగా వ్యాసుడు వివరించాడు.
భాద్రపద పూర్ణిమా తిథిన మొట్టమొదటిసారి ఉమామహేశ్వరులు అర్థనారీశ్వరులయ్యారు. అందువల్ల ఈ తిథిన మునులు ఉమామహేశ్వర వ్రతం, చేసారు. అర్ధనారీశ్వర ప్రతిమను భక్తితో, షోడశోపచారాలతో, పూజించాలి. బిల్వపత్రాలతో శివపార్వతులను పూజించిన పుణ్యాత్ములు, ఆదర్శ దంపతులై సకల సుఖాలతో జీవిస్తారు. ఇటువంటి వ్రతం మరోకటి లేదనీ, ఇంతటి వ్రతాన్ని మనకందించిన భాద్రపదమాసం వంటి మాసం లేదనీ అగస్త్యుడు అన్నాడు.
భాద్రపదం అనగానే అందరికీ స్ఫురించే విషయం. మహాలయం. పద్మకల్పంలో రుద్రుడు భాద్రపద బహుళ పాడ్యమి నుండి పదిహేను రోజుల పాటు లోకాలను తనలో లయం చేసుకున్నాడనీ, అందుకే ఆ కాలానికి అనగా భాద్రపద కృష్ణ ప్రతిపత్ తిథి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే కాలాన్ని మహాలయ పక్షములు అంటారని వ్యాసుడు వివరించాడు. ఈ కాలంలో పితృ శ్రాద్ధాలు చేయాలి. ఈ శ్రాద్ధాల వల్ల పితృదేవతలు సంతృప్తులౌతారు. వంశాభివృద్ధి అవుతుంది మరియు అకాల మరణాలు ఉండవు. ముఖ్యంగా భరణీ నక్షత్రం నాడు పితృదేవతలకు శ్రాద్ధం పెడితే కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.
*🚩 డైలీ విష్ 🚩*
ఆధ్యాత్మికం ఆనందం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి