5, సెప్టెంబర్ 2024, గురువారం

దేవాలయాలు పూజలు 30*

 *దేవాలయాలు పూజలు 30*




దేవాలయపు సాయం సంధ్యా పూజలలో దిన వారి పూజాధికాలతో బాటు చివరి అంకంలో మంగళ నీరాజనం, మంత్ర పుష్పం, ఛత్రం, చామరం, నృత్యం, వాయిద్యం, సంగీతం, కీర్తనం, రాత్రి సేవలలో అనంత భోగ శయ్యాసనం మరియు పవళింపు సేవలతో ఆ దినపు పూజా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. 


గత వ్యాసంలో మంగళ నీరాజనం మరియు మంత్ర పుష్పం వివరాలు తెలుసుకున్నాము.


ఇతర సేవలలో ఛత్రం:

 ఛత్రం అనగా ఆచ్చాదన = రక్షణ = పై కప్పు. ఇంకా సాధారణంగా చెప్పాలంటే *గొడుగు*. 

*చామరం* అంటే చల్లని గాలికై వీచునది = విసన కఱ్ఱ. పరమాత్మ సేద తీరుటకు విసన కఱ్ఱతో నెమ్మదిగా నిశ్శబ్దంగా గాలి అందించడం.


 ఇన్ని కార్యక్రమాలను అర్చక స్వాముల వారు *ఛత్రం ఆచ్చదాయామి, ఛామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్య యామి* అంటూ రాగ యుక్తంగా శుశ్రూషలు చేస్తూ స్వామి వారికి పవళింపు సేవతో ఆ రోజు దేవాలయ పూజలు సమాప్తం అంటే పరిపూర్ణం చేస్తారు. రాత్రి సేవలన్నీ దాదాపు ఏకాంత సేవలు, ఏకాంత ఆరాధనలో భాగాలు. 


అవుతే, మానవ మరియు విశ్వ కళ్యాణానికి హిందూ మత సంప్రదాయం దేవాలయ పూజలతో సరిపెట్టలేదు. మరిన్ని పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞ యాగాదుల సమాచారము గూడా తెలుసుకుందాము. అందులో కొన్ని. అర్చనలు, వ్రతాలు, ప్రదోష పూజలు, నవగ్రహ హవనాలు, మండప పూజలు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, మూల మంత్ర జపాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కోటి గాయత్రి మహా యాగాలు, పూర్ణాహుతి , ఆరణి మథన పూర్వక అధర్వణ వేద అగ్ని ప్రతిష్టలు, సర్వ సౌభాగ్య దేవి గీతా జ్ఞాన యజ్ఞాలు, సామూహిక హోమాలు, దేవ ఋషి ప్రోక్త మహిమాన్విత స్తోత్రములు, విశేష స్తుతులు, వివిధ దేవతా అష్టోత్తరములు, త్రిశతి మరియు సహస్ర నామ పారాయణలు, యజుర్వేద ఋగ్వేద నిత్య సంధ్యా వందనములు, స్వర చిహ్నిత వేద సూక్తములు, యజ్ఞాలు, క్రతువులు, హోమాలు పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఇంకా ఎన్నెన్నో. ...


*గమనిక* పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు ఇత్యాది భగవత్ సేవలు *మంత్రాది లోప భూయిష్టంగా* చేయబడితే పూజా ఫలాలు, హవిస్సులు అసురుల పాలవుతాయి. అందుకే పెద్దలన్నారు *తస్మాత్ శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం*.


సాధారణంగా చూస్తూ ఉంటాము పంచేంద్రియాలు ఎడా పెడా మాలిన్యాలతో నింపేసుకోవడం అంటే అనరానివి అనడం, చూడరానివి చూడడం, చెయ్యరానివి చెయ్యడం, వినరానివి వినడం.ఇన్ని చేసి, చేస్తూ కాస్త సంధ్యావందనం, ఒక సారి దేవాలయం వెళ్ళడం ఆ తరవాత హమ్మయ్య అనుకుని ఏదో సిద్ధి పొందినట్లు భ్రమించడం. ఈ తరం ఎప్పుడు మేల్కొనేది. *మళ్ళీ ఆ పంచేంద్రియాలతోనే యధా శక్తి పాపాలను తొలగించు కోవాల్సి ఉంటుంది*. భగవత్ స్వరూపాన్ని వీక్షించండి, ప్రవచనాలను వినండి, చేతులారా భగవత్ కార్యాలు చేయండి, నోరారా భగవన్నామ కీర్తన చేయండి, నాలుగడుగులు వేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. 


*ఇన్ని రకాల భగవత్ కార్యాలు చేసి పరిశుద్ధులము కాకపోతే, మానవులు చేసే దుష్కకర్మలకు ఒక్కొక్క ఇంద్రియాన్ని ప్రక్షాళన చేసేందుకు ఒక్కొక్క జన్మ ఎత్తవలసిందే*. 


ఏ మత సిద్ధంతమైనా, ఏ సంప్రదాయమైనా ఇదే చెబుతుంది.


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: