5, సెప్టెంబర్ 2024, గురువారం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము* *2

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము* 

*2 వ భాగము* 

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗


*ఆర్యాంబా శివగురుల తపస్సు:* 

ఆర్యాంబ మనసు లోని తపన శివగురునికి అర్థం అయ్యింది. కాలంపరుగెత్తు చున్నది, వయసు మీరు తోంది. పుత్రుల వలననే పరలోకసుఖాలు లభిస్తవి. పుత్రులు లేక పోతే వంశం అంత రిస్తుంది. ముందుముందు సంతాన హీనుల్ని పలకరించే వారు కూడా ఉండరు.ఇలావారు ఇరువురూ మానసికంగా తపిస్తూండగా ఒక నాడు ఆర్యాంబ ధైర్యం చేసి, నాధుడితో ఇలా అంది. 'స్వామీ! పరమేశ్వరుడు మన కోరిక తప్పక తీరుస్తాడు. ఆయన పరమ కరుణామయుడు. త్వరగా ఆ విశ్వేశ్వరుని వేడుకొందము రండి' అని భర్తకు పిలుపు నిచ్చింది. శివగురునికి ఈ ఉపాయం బాగా నచ్చింది.


మరునాటి వేకువనే లేచి కాలకృత్యాలు చేసికొని, పూర్ణా నదిలో స్నానం చేసి, సంధ్యను ఉపాసించి తర్వాత వారిరువురు నది ఒడ్డున సుఖాసీనులయి నారు. చిత్తాలను పరమేశ్వరా యత్తం చేసి, నిమీలిత నేత్రాలతో తపస్సు మొదలు పెట్టారు. కొలది రోజులు కంద మూలాలను తిని, తరువాత అవి మాని వాయు భక్షణం చేస్తూ కఠోర నియమాలతో వారి ఘోర తపం నడుస్తోంది. ఆర్యాంబ శరీరం శుష్కించ సాగింది.


*శివుని వరము*: 

ఒకనాటి రాత్రి స్వప్నంలో శివగురునికి పరమశివుని సాక్షాత్కారం లభించింది. భక్తుని కోరిక విన్న పరమేశ్వరుడు శివ గురువును ఇట్లా అడిగాడు.

‘అల్పాయుష్కుడై సద్గుణ సంపన్నుడైన ఒక పుత్రుడు కావాలా లేక పెక్కురు దుష్ట సంతానం కావాలా?' అని. శివగురువు సత్పుత్రుణ్ణి కోరు కొన్నాడు. ఈశ్వరుడు అట్లనే కలుగునని ఇక తపస్సు మానమని సెలవిచ్చి అంతర్ధానమ అయినాడు. మెలకువ వచ్చి భార్య ఆర్యాంబతో జరిగిన వృత్తాంతము చెప్పాడు. తపం చాలించి ఇంటికి మరలారు. నిజ నివాసంలో బ్రాహ్మణ సమారాధన చేసి శేషించిన ఆ ప్రసాదం భుజించిన శివగురువులోనికి ఈశ్వర తేజం ప్రవేశించింది. తన కోరిక ఫలించిన ఆర్యాంబ ఈశ్వర తేజస్సుతో గర్భం ధరించింది.


శివుని పరమానుగ్రహ మహిమ సామాన్యమా? ఆర్యాంబ నూతన కాంతు లతో వెలుగుతోంది. పదునాల్గు భువనాలు మోయడ మంటే మాటలా. నడక మంద మయినా ఉత్సాహం నానాటికీ ఇనుమడిస్తోంది. ఆభరణాలు గంధ మాల్యాదులు ధరించ డానికి ఆమెకు భారం మెండుగా ఉంది. ఇరుగు పొరుగువారు అనుమానం తో అదో రకంగా పలుకరిస్తున్నారు. ఆర్యాంబ మనస్సులో క్రొత్త క్రొత్త కోరికలు ఉదయింప సాగాయి. అవి తీర్చబోతే తిరస్కరించేది. మరల మరొక కోరిక పుట్టడం, దానిని తీర్చబోతే తిరిగి తిరస్కరించడం మామూలై పోయింది. బంధుమిత్రులు ఆప్యాయంగా తీసుకొని వచ్చిన సూడిదలన్నీ గ్రామంలో అందరికీ పంచిపెట్టడమే. మామూలుగా గర్భవతులకు వచ్చే అరుచి, ఆందోళన, నీరసం అలాంటివి ఆర్యాంబకు లేవు. నడుస్తున్నా, పని చేస్తున్నా చూచే వాళ్ళకు జాలి పుట్టు కొచ్చేది. ఇన్నాళ్ళకు గర్భం వచ్చింది ఎలా మోస్తుందో పాపం అనుకొన్నారు చుట్టుప్రక్కలవాళ్ళు. కాని భిషగ్వరుడు సాక్షాత్తు సర్వేశ్వరుడే ఆమె గర్భంలో ఉండగా ఆరోగ్యానికి ఏమికొదవ? మరి కొన్నాళ్ళకు ఆర్యాంబకు శంకరుడు చాటుగా మాటుగా కనిపించడం మొదలు పెట్టాడు. ఆమె గుమ్మాలు ఎక్కడం దిగడం మానుకొంది. ఒకనాడు స్వప్నంలో జయజయ నాదాలమధ్య సపరివారంగా కనిపిం చాడు. కళ్ళు విప్పి చూస్తే ఏమీ లేదు. విభ్రాంతురాల య్యింది. ఆమె చూపే దయ ఆదరం పరమ సాత్వికత వలన ఊరంతటికీ ఆర్యాంబ ప్రీతిపాత్రురాలు. పదవ మాసం వచ్చి పది రోజులయ్యింది. ఆర్యాంబ బాగా సొక్కింది. అలాటి సమయం పరమ పవిత్ర మయినది. లోక కల్యాణ కరుడు ధర్మసంస్థాపనా చార్యుడు సాక్షాత్ పరమశివుడే భూతలాన అవతరించినవేళ. దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవ దుందుభులు మ్రోగాయి. కృష్ణద్వైపాయనాది మహర్షులు హర్షాతిరేకం పొందారు. శంకర జననంతో ఆ గది కోటి సూర్యుల వెలుగునకు ఆకారమయ్యింది. బిడ్డ పుట్టగానే క్షణం సేపు మూర్ఛిల్లిన తల్లి అంతలో తేరుకుంది.


*శంకరుని జననము:*


నెమళ్ళు పింఛాలు ఎత్తి మనోహరంగా నాట్యం చేస్తున్నాయి. చూపరులను మైమరపించే విధంగా తరు లతాదులు పుష్పశోభలతో ఆనందంగా సుగంధాల్ని దశదిశలా వెదజల్లు తున్నాయి. ఆనంద బాష్పాలు గ్రుమ్మరిస్తున్నాడు సంతోషంతో ఉబ్బిన మేఘుడు పర్వతవీధుల నుండి. సెలయేళ్ళ కోలాహలం చెప్పనలవి కాదు. నదీఝరులు కన్ను మిన్ను కానని రీతిలో ఉరకలు వేసికొంటూ ఒడ్లను దూసు కొంటూ పారుతున్నాయి. సహజ వైరుధ్యమున్న జంతువులు మైత్రీభావంతో మెలగుతున్నాయి.


సుజనులకు శుభ నిమిత్తాలు, దుర్జనులకు దుర్నిమిత్తాలూ గోచరించ సాగాయి. యుధిష్ఠిర శకంలో రెండు వేల ఆరు వందల ముప్పది సంవత్సరాలుగడచాయి. నందన నామ సంవత్సరం. వైశాఖ శుక్ల పంచమి భానువారం కర్కాటక లగ్నం,మేషమందు రవి, పునర్వసులో చంద్రుడు గురుని తోడ, మందుడు తులయందు, అంగార కుడు మకరమందు ఉన్నారు. ఈ వార్త క్షణంలో ఊరంతా ప్రాకి, స్త్రీ లందరూ చూడ వచ్చి చూడలేక పోతున్నారు ఆ రవిసహస్ర దేదీప్యమాను డైన చిట్టి పాపణ్ణి. మంత్రసానికి కోద్దామంటే బొడ్డు కాన రావటం లేదు. అంతా చాలా హడావిడిగా ఉంది.. 


బిడ్డ కెవ్వుమన్న ఏడ్పు అందరు బిడ్డలలా లేదు. ఓంకారరవం అంటున్నారు. బొడ్డు కోసి నీళ్ళు పోసి బిడ్డను పరుండ బెట్టారు. పాపని చూచిన వారుచూచి నట్లుగా నిలబడిపోయి ఉంటున్నారు. ఒకసారి చూచిన వాళ్ళే తనివి తీరక మరల మరల వచ్చి చూస్తున్నారు.


బిడ్డడు కేవలం అవతార పురుషుడని చెప్పు కొంటున్నారు. అది విన్న మగవాళ్ళు కూడ చూడ వచ్చారు. ఆనాడు శివగురుని గృహం ఒక యాత్రాస్థలం అవ్వడంలో ఆశ్చర్యమేముంది? పుట్టిన శిశువు సామాన్యుడయితే కదా! మూడు నెలల బిడ్డ డేమో అన్నట్లు ఉన్నాడు.చక్కటి ముక్కు, తామర రేకుల వంటి కన్నులు, శ్రీకారాలను పోలిన చెవులు, విశాల ఫాలం, వెడల్పయిన వక్షఃస్థలం, మల్లెపువ్వు వంటి మేని ఛాయ, తుమ్మెద రెక్కల బోలిన నల్లని కురులు, బిడ్డ రూప విలాసాలు ముచ్చట గొలుపుతు న్నాయి. ఆర్యాంబా శివగురుల తపఃఫలమని అందరూ సంబరపడ్డారు.


శివగురుడు జన్మకాల ఘడియలు కట్టుకొని జాతకం వ్రాసి కొన్నాడు. పురుడు పది రోజులు సుఖంగా గడిచాయి. పదకొండవ నాడు పురిటిస్నానం చేయించి శాంతులు తీర్చి జాతకర్మ యథావిధిగ చేసికొన్నాడు. వంశం వారందరూ శివ భక్తులు. శివ ప్రసాదంగా జనించిన బిడ్డడు కాబట్టి శంకరుడని నామకరణం చేసాడు. శ్రీ శంకరుడే ఇలా అవతరించాడని తెలియదు కదా!


*శంకరుని పసితనము*:


తెలివైన దైవజ్ఞులను రావించి కుమారుని జాతకం వ్రాయించాడు శివగురుడు. భావాలన్నీ పరిశీలించారు వారు. పిల్లవాడు మంచి మేధావి, విద్యలకు వ్యాసుడు, స్వాతంత్ర్య విషయానికి సర్వేశ్వరుడు, ధర్మమూర్తి, గురువులకు గురువు, కవనానికి ప్రాచేతసుడు, మేధలో సురగురుడు, బ్రహ్మణ్యుడు, యోగరాశి, శాంతమూర్తిగా ప్రఖ్యాతి గాంచుతాడని ఆనంద కరమైన ముత్యాలను కుప్పగా పోశారు. తండ్రికి ఆ రాజాధిరాజ యోగాలు వీనుల విందొన గూర్చాయి. ఆయువు సంగతి మఱుగయ్యింది. సంతోషంతో వారికి మంచి పారితోషికాలిచ్చి పంపించాడు.


మంచి ముహూర్తం చూచి ఆర్యాంబ ముద్దుబిడ్డను తొట్టెలో పెట్టడానికి సంరంభం ఆరంభిం చింది. ఊరి ముత్తైదువు లందరినీ పిలుచుకొని వచ్చి, వచ్చిన పేరంటాండ్రకు కాళ్ళకు పసుపులు తానే రాసి బొట్లు పెట్టి చందన చర్చ చేసింది. శనగలు, అరటి పండ్లతో బాటు అత్తరువు లద్దిన రవికల గుడ్డలతో తాంబూలాలిచ్చి ముచ్చట తీర్చుకుంది. ఉయ్యెలకు మధ్యగా మణులతో మనోహరంగా అలంకరించి కట్టి వేళ్ళాడ దీసినారు. ఆ పాలవెల్లిని చూచి శిశువు సుఖంగా ఆడుకొంటాడని. వచ్చిన నారీమణులు బిడ్డను ఎత్తుకొని ముద్దాడి విడువ లేక విడువ లేక ఎవరి ఇండ్లకు వారు వెళ్ళే సరికి జాము రాత్రి అయ్యింది ఆనాడు. అమ్మలక్కలందరూ ఏదో వేళ వచ్చి ఆ బిడ్డను చూడకుండా ఉండగలిగే వారు కారు. వారి దైనందిన కార్యక్రమంలో ప్రముఖ స్థానం అది! శంకరశిశువు వారికి ప్రత్యక్ష శివునిలానే అనిపించి అలరించేవాడు. ఆ పరమా నందానుభవంలో వారు ఇల్లూ, వాకిలీ, భర్తా, బిడ్డలూ మరచిపోయే వారు. 


ఆర్యాంబాశివగురువుల గృహం శివాలయమే అయింది. చీకటి పడే సరికి పిల్లవాడు ఓంకార రవం చేసేవాడు. అప్పుడొక ముసలి అవ్వ వచ్చి విభూతి మంత్రించి పెట్టమన్నది. అలా చేయగానే బిడ్డ ఊరకుండి పరుండేవాడు. పరమేశ్వరునికి విభూతి ప్రీతికరమైనది కదా! మరొక పెద్దముత్తైదువు వచ్చి రుద్రాక్ష కట్టింది. ఒక ఉవిద తాయెత్తును, మరొకామె మొలకు పులి తోలును కట్టింది. వేరొక వనిత మెడ కొక మంత్రించిన త్రాడు వేసింది. ఇవన్నీ చూస్తే శివదర్శనానుభూతి కలిగినట్లు పరవశించి పోయే వారందరూ.


*శంకర శంకర కాలడి శంకర* 

**

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 2 వ భాగము*

*సమాప్తము* 

🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️

కామెంట్‌లు లేవు: