5, సెప్టెంబర్ 2024, గురువారం

ఆది శంకరాచార్య చరిత్రము 3

 *ఆది శంకరాచార్య చరిత్రము 3 వ భాగము*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


*శంకరుని బాల్యలీలలు:*


ఒకనాడు ఆర్యాంబ బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలలో జోకొట్టి బిడ్డ నిద్రపోయాక లోపలికి వెళ్ళింది. భర్తకూ శిష్యులకూ భోజనాల య్యాక.తానుపెట్టుకొనితింటున్నది. అంతలో ఉయ్యాల లోని బిడ్డ క్రింద పడినట్లు చప్పుడయ్యింది. గుండెలు దడదడ కొట్టు కొంటూండగా పరుగు పరుగున వెళ్ళి బిడ్డను చూచి గుండెలు బాదుకొంటూ గొల్లుమన్నది. భార్య రోదన విన్న శివగురువు వెళ్ళి చూచే సరికి ఆర్యాంబ మూర్చ లో ఉంది. ఉపచారాలు చేయగా లేచి 'పాము మెడలో ఆడుతోంది బిడ్డను బ్రదికించండి, పాముల వాణ్ణి పిలిపిం చండి' అన్న మాటలు విని భర్త కూడా ఒళ్ళు పట్టు తప్పి పడ్డాడు. 'పాము పాము' అన్న కేకలు విన్న శిష్యులు పరుగున కఱ్ఱలతో వచ్చారు. బిడ్డ సుఖంగా ఆడుకొంటు న్నాడు. ఏమీ కాలేదు లేవండి అని తెలివి వచ్చిన తల్లికి చెప్పారు. తల్లి బిడ్డను ఎత్తుకొని రొమ్ముకు అద్దుకొంది. పెద్దలు 'మీ శంకరుడు నాగధరుడు. తన లీలలు మీకు చూపిస్తున్నాడు. మీరెంతో ధన్యులుసుమా!' అన్నారు.


వేరొక రోజున మరొక విచిత్రం జరిగింది. బిడ్డకు ఉగ్గుపెట్టి, నీళ్ళు పోసి, పాలిచ్చి నిద్ర పుచ్చాక దొడ్లోనికి స్నానానికి వెళ్ళుతూండగా భర్త ఎదురయ్యాడు. 'శంకరుడు నిద్రపోతున్నాడు. నేను ఇప్పుడే వస్తాను బిడ్డను చూస్తుండండి' అని చెప్పి వెళ్ళింది ఆర్యాంబ. 'సరే' అన్న శివగురుడు గది గుమ్మంలో కూర్చొని పార్వతీ పరిణయం పారాయణ చేస్తున్నాడు. అంతలో గదిలో పెద్ద వెలుగు వెలిగింది. గది లోనికి తొంగి చూచాడు. బలిసిన ఒక పెద్ద యెద్దు, దాని మెడలో పెద్ద గంట చెవులు గింగురు మనేలా గణగణ ధ్వని వినిపించాయి. శివగురుని గుండెలు దడదడ కొట్టుకొన్నాయి. ఆ యెద్దుపై హస్తం ఆన్చి నిలబడి ఉంది ఒక నల్లని వనిత. ఉయ్యాల లోని బిడ్డను చూస్తూ ఒయ్యారంగా ముసి ముసి నవ్వులను అందిస్తోంది ఆమె. బిడ్డడు నవ్వుల మూటగా చూస్తున్నాడు. అంతలోనే ఆ దృశ్యం మటుమాయ మయింది. సంగతి విన్న ఆర్యాంబ, శివగురువులు పరమేశ్వ రునికి పరిపరి విధాలుగా నమస్కారాలు చెప్పుకొన్నారు.


మరొక సమయంలో బిడ్డ పరుండిన తర్వాత బిడ్డను చూస్తుండమని శిష్యులకు చెప్పి బయటికి వెళ్ళింది ఆర్యాంబ. శివగురుడు ఆవుకు కుడితి పెడుతు న్నాడు. శిష్యులు పాఠాలు వల్లెవేస్తున్నారు. మధ్య మధ్య ఒక శిష్యుడు గది లోనికి వెళ్ళి బాలుణ్ణి చూచి వస్తున్నాడు. అలా వెళ్ళిన శిష్యుడు చూచి గొంతెత్తి పెద్ద కేక వేసాడు. విని మిగిలిన శిష్యులూ వచ్చి వాళ్ళూ గొల్లు మన్నారు. గందరగోళం విన్న ఆర్యాంబా, శివగురువూ వచ్చి చూస్తే మాటరాక క్రింద చదికిల పడ్డ శిష్యులు, ఉయ్యాల లో హాయిగా పరున్న బిడ్డడు. కొంత తమాయించు కొన్న పిదప చెప్పారు శిష్యులు తాము చూచినది. నాలుగు చేతులున్న నల్లని వాడు, నాలుగు ముఖాల వాడు, గడ్డాలు మీసాలు ఉన్న వాళ్ళు పలువురు బిడ్డ చుట్టూ మూగి తొంగి తొంగి చూస్తున్నారట. బిడ్డను ఎత్తుకు పోతారేమో అని భయం వేసిందండీ అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆర్యాంబా శివగురువులకు ఏమి చెప్పాలో తెలియ లేదు.


శంకరుడు ఆరోజుకారోజు ఎదుగుతున్నాడు. కూర్చుండడం, ప్రాకడం కలకల లాడుతూ ఇల్లంతా కలయబ్రాకేవాడు. గడపలు పట్టుకొని నడవడంతో మొదలుపెట్టి తప్పటడుగు లతో మెల్లి మెల్లిగా నడక నేర్చుకొంటున్నాడు. అయినా తల్లి బిడ్డను చంకను వేసుకొనే తిరిగేది ఎక్కడ కంది పోతాడో అని. కాలడిలో అందరూ శివభక్తులు కాదు. అలాంటి వాళ్ళు కూడా ఈ బాలుణ్ణి చూచి ఆ వర్ఛస్సు, నుదుటనున్న ముక్కంటి రేఖ, కంఠాన నాగరేఖలూ మొదలైనవి చూచి తేరుకొని శంకరావతారమే అని నిర్ధారించుకొని వెళ్ళారు.


*పరివారము:*


రావణాది క్రూరరాక్షసుల ను సంహరించడానికి భగవానుడు

శ్రీరామునిగా అవతరించినపుడు సోదరులుగా భరత లక్ష్మణ శత్రుఘ్నులుకూడ భువిపై వెలశారు. తర్వాతి యుగంలో శ్రీకృష్ణునితో బాటు యుధిష్ఠిరాదులు జనించారు. యుగే యుగే ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకొంటాడు పరమాత్ముడు. కలియుగంలో మన శంకరుని అవతారాశయ ము కూడ ధర్మ సంస్థాపనమే. క్షీణించుచున్న కర్మకాండ లను ఉద్ధరించడానికి కుమారస్వామి అంశతో కుమారిల భట్టు, బ్రహ్మగారి అంశతో మండనమిశ్రుడు జన్మించారు. విష్ణ్వంశతో పద్మపాదుడు పుట్టి గురుభక్తి మహిమను లోకానికి చాటాడు. సూత్రభాష్యాన్ని, ఉపనిషద్భావాలను సుళువుగా తెలియజేయ డానికి బృహస్పతి అంశతో ఆనందగిరి ఉద్భవించాడు. హస్తామలకుడు వాయు దేవుని అంశతో పుట్టాడు. భారతదేశం ఆనాడు అల్లకల్లోల స్థితిలో ఉంది. నాస్తికత బలపడింది. ఆస్తికపండితులు పరస్పర వైరుద్ధ్యాలతో దారి తెన్ను తెలియని అయోమయ అవస్థలో మునిగిఉన్నారు. వైదిక ధర్మార్థాన్ని పునరుద్ధరించవలసిన అవసరం బలవత్త రంగాఉంది. ధర్మానికిగ్లాని కలిగినపుడు ఉదయిస్తా నన్నాడు కదా పరమాత్మ. ఆపరిస్థితులలో శంకరావతారమునకు ఆవశ్యకత ఏర్పడిన అపురూపమైన తరుణం అది.


*సరస్వతికి శాపము:*


చతురాననుని అధ్యక్షతలో సత్యలోకంలో ఒక మహా సభ. మహర్షులు నిలబడి వేదవాక్కులతో బ్రహ్మను ప్రస్తుతిస్తున్నారు. నలువ రాణి వింటున్నది కాని ఆ మహామహిషికి రుచించడం లేదు. కారణం దూర్వాసుని బోసినోట వెడలిన ఉచ్చారణ స్వరం. సరస్వతీదేవి పక్కున నవ్వింది. కారణం


అర్థం చేసికొన్న దూర్వాసమహర్షికి అవమానంతో క్రోధాగ్నితో భగభగ మండింది శరీరం. శపించాడు ఆ వాగ్దేవిని: 'మానవులకు సుస్వరం లేదని నీకు తెలియదా? ఈ విషయం నీవు తెలిసికోవలసి ఉన్నది. ఇందుకు మానవజన్మ ఎత్తుదువు కాక!'. శాపం విన్న శారదామాత బ్రహ్మ వైపు చూచింది. మహర్షుల వైపు చూచింది. అందరూ దిగ్భ్రాంతులై చేసేది లేనివారుగా అవాక్కుల య్యారు. ఋషి శాపానికెదురు లేదా? ఎవ్వరూ ఉలుకరు పలుకరు. అప్పుడు గత్యంతరం లేక ఆ దూర్వాసమునీశ్వరుని వంక తిరిగి నమస్కరించింది. తక్కిన ఋషులందరు ధైర్యంతో దూర్వాసుని వేడుకొన్నారు శాపోపహరణం కోసం. అప్పటికి కొంత దిగిన కోపోగ్రతతో ఇలాఅన్నాడు. 'అద్వైతమతవ్యాప్తికై పరమేశ్వరుడు శంకరావతారం ధరిస్తాడు. వారి దర్శనంతో నీకు శాపవిముక్తి లభిస్తుంది. పైగా నీ పతి దేవుడు కూడ నీతోనే ఉంటాడు'. ఈవిధంగా బ్రహ్మ గారికి కూడా తన శాపాన్ని తగిలించాడు మహర్షి పుంగవుడు! మహనీయుల శాపాలు శాపవిమోచ నాలూ అన్నీ లోకకల్యాణకరాలే!


*సరస్వతి భూలోకమున జన్మించుట:*


శోణనదీ తీరాన పరమ శ్రోత్రియవంశం లోని విశ్వమిత్రుడు విద్యా వినయసంపన్నుడు, తేజోమూర్తి. భాగ్యశాలి అయినా నమ్రశీలి. అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ బంధు మిత్రులకు ఏడుగడయై, ఎల్లరి మన్ననలను పొందుతున్న గృహస్థగ్రామణి. లేక లేక పుట్టింది ఆ యింట వంశ పావనిగాసాక్షాత్తు సరస్వతీ మాత. తెల్లని మేని ఛాయతో, దివ్య తేజస్సుతో, పద్మపత్రాల వంటి కన్నులతో చూపరులకు అద్భుతంగా కనిపిస్తూ వెలసినదా చదువులతల్లి. శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానయై ఆ బిడ్డ పసితనంలోనే చూపించిన తెలివితేటలు ప్రజలకు మిక్కిలి అబ్బురంగా అనిపించాయి.


ఆ బిడ్డను తడవు లేకుండా ఉభయభారతి అనే సార్థక నామంతో పిలిచారు. యుక్త వయస్సు వచ్చాక ఆమెకు తనకు కాబోయే వరుడెక్కడ ఉన్నాడో తెలిసికోవాలన్న తపన మొదలైంది. విశ్వమిత్రుని యింటికి ప్రతిరోజూ విప్రవర్యులు దూరదేశాల నుండి వచ్చే వారు. ఆ వచ్చిన వారి నుండి వివరాలు అడిగి తెలిసికొనేది తనకు కాబోయే వరుడెక్కడ వెలిసాడోనని. జాడ తెలియక అలమట పడేది.


*విశ్వరూపునిగా బ్రహ్మ ఆవిర్భావము:*


వేరొక పవిత్ర గృహంలో అవతరించి ఉన్నాడు విరించి. కతిపయదూరంలో ఉన్న హిమమిత్రుడనే పుణ్యాత్మునింట విశ్వరూపనామం ధరించి. అటు ఉభయభారతిలాగే ఈయన కూడా తపన పడుతున్నాడు తనకై ఉదయించిన సత్యలోకపు యిల్లాలు గురించి. ఈ ఉభయుల తపనలూ ఆందోళనలు, ఆరాటాలు రోజు రోజుకీ పెరిగిపోతూ శరీరాల్ని కృశింప జేస్తు న్నాయి. అటు ఉభయ భారతి తల్లిదండ్రులకు గాని, ఇటు విశ్వరూపుని మాతాపితలకు గాని ఈ ఇరువురి మనోగత విరహాగ్ని పరిస్థితులు తెలియనే తెలియవు. ఏ విధమైన లోట్లు లేవు. ఏ రకపు అసంగతపు విషయాలు లేనే లేవు. ఆకలి దప్పులు లేని విధంగా ఏదో విధమైన బెంగ ఆవహిల్లి వారిద్దరి దేహాలను క్రుంగదీస్తోంది. పెద్ద వాళ్ళకు ఏమీ తోచక భిషగ్వరులను రప్పించి చూపించారు. కారణం ఎవ్వరికీ అవగతం కాలేదు. ఒక్క విషయంలో ఇరు వైపుల వైద్యులూ ఆయా చోట్ల ఒకే నిర్ణయానికి వచ్చారు అచ్చట విశ్వరూపునికీ ఇక్కడ ఉభయభారతి గురించీ. ఏ రుగ్మత లేదని తేల్చి చెప్పారు. అయినా తల్లిదండ్రులకు చింత పోలేదు. అక్కడ హిమమిత్రుడు పుత్రుణ్ణి చేరదీసి 'నాయనా! నువ్విలా చిక్కిపోతుండడం చూడలేకపోతున్నాము. నిన్ను వేధిస్తున్నది, బాధిస్తున్నది ఏదయినా ఉందా? దాచక చెప్పు' అని అడిగాడు.


అదే విధంగా ఒకనాడు విశ్వమిత్రుడు ప్రియ పుత్రికను చేరదీసి 'అమ్మా! నిన్ను మనస్సు వికలం చేస్తున్నదేమో చెప్పు. ఏ నగలు కావాలి? ఏ నాణ్యాలు కావాలి?' అని అడగగానే ఉభయభారతి తండ్రితో 'నాయనా! నాకు కావలసినది, మీరియ్యనిదేమున్నది?' అని సమాధానం చెప్పింది.


ఒక నాడు హిమమిత్రుడు ఊరకుండ లేక తనయుణ్ణి నిర్బంధంగా అడిగాడు దాచక కారణం చెప్పమని. ఇక దాచి లాభం లేదని తెలుసుకొన్న విశ్వరూపుడు తండ్రి దగ్గఱ తన వ్యథ నంతటినీ వెల్లడించాడు: 'నాన్నా! శోణనదీ తీరంలో విశ్వమిత్రుడనే బ్రాహ్మణోత్త ముడున్నాడు. ఆయనకు ఒక్క గానొక్క కూతురు రూప గుణ విద్యా వైభవాదులలో సరి లేని కాంతామణి. మీకు కోడలుగాను అమ్మ ఆశయాలకు అను గుణం గాను. అమ్మ ఆశయాలకు తగినదై ఈ యింటికి కోడలు కాదగ్గ కాంత, కాకుండా పోతుందేమో అని దిగులు పడుతున్నాను' అని విశదీకరించాడు వెంటనే హిమ మిత్రుడు సమర్థు లైన విప్రవరులను ఇద్దరిని రావించి కావలసిన దారిబత్తెములిచ్చి విశ్వమిత్రుని ఊరికి పంపిం చాడు.


అటు ఇక వేచి ఉండలేక ఉభయభారతి కూడ తండ్రితో తన మనోవ్యథకు కారణం బయట పెట్టింది. 'తన ఆశయాల కనుకూలుడు సుగుణరాశి అయిన సుందర రూపుడొకడున్నాడు. అతని పేరు విశ్వరూపుడు. నిరంతరం నా వైకల్యానికి కారణమదే. మనస్సు ఆయన పాదారవిందాలనే భజిస్తోంది. అలాంటి అల్లుడు మీకు లభించడం అదృష్టం. మీరందుకు తోడ్పడాలి' అని తల్లి దండ్రులను వేడుకొన్నది ఉభయభారతి. విశ్వమిత్రుని హృదయం కుదుటపడ్డది తమ ముద్దుల బిడ్డ అన్ని విధాలా తగిన వరుణ్ణి ఎన్నుకొన్నదని. కాని ఆ ప్రాంతము వారి ఆచారం ప్రకారం నాడు కన్యాన్వేష ణే కాని వరాన్వేషణ చేసే వారు కాదు. అందు వలన వరుని కొఱకు ఎదురు చూస్తున్నాడు.


*హరహర శంకరకాలడి శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*3 వ భాగము సమాప్తము*

🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

కామెంట్‌లు లేవు: