20, జూన్ 2022, సోమవారం

కోటప్పకొండ

 🙏🕉️ *ఓం నమః శివాయ*🕉️🙏


🔱 *కోటప్పకొండ*🔱


పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతిచెందింది. *‘చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా...’* అంటూ యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది.


*దేవాలయ_చరిత్ర*


దీనికి కచ్చితమైన ఆధారాలేమి లేకపోయినప్పటికీ శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీ.శ 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు భారి విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసిన మూడు శిఖరాలు కనబడుతుంటాయి. అందుకే దీనికి త్రికూటాచలమనే పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.


*పురాణ_కథనం*


శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తూంటాడు. ఆ సమయంలో బ్రహ్మ దేవతలందరితోను కలిసి దక్షిణామూర్తిని సందరిస్తాడు. స్వామి వారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరు కూడా త్రికూటాచలానికి వస్తారు అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలసి వారందరికి జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు. ఆ ప్రదేశంలో ఉన్న గుడికే పాత కోటప్పగుడి అని పేరు. ఆలయం లోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది. గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని, పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరమని అంటారు.

దక్ష యజ్ఞం సమయంలో హవిస్సును స్వీకరించిన పాపం పోవడానికి విష్ణువు ఈ శిఖరం పై తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేల మీద పొడుస్తాడు. అలా పొడిచినప్పుడు ఏర్పడ్డ రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానమాచరిస్తే సకల పాపాలు తొలుగుతాయని చెప్తాడు. విష్ణువు శివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ వెలసిన శివున్ని పాపవినాశనేశ్వరుడనే పేరుంది. 

రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరాలపై స్వయంభువుగా లింగాలు వెలిశాయి. కానీ బ్రహ్మ శిఖరం పై ఏమి లేకపోవడంతో బాధపడిన బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసి లింగావిర్భవం అయ్యేటట్లు చేస్తాడు. ఈ ప్రదేశానికి తూర్పున మునిమంద/ ఎల్లమంద అనే పేర్లు గల చిన్న పల్లెటూరు ఉంది. ముందుగా బ్రహ్మదిదేవతలంతా ఈ ప్రదేశంలో ఉన్నారని అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ప్రశస్తి.   బ్రహ్మ శిఖరం మీద ఉన్న లింగానికే కొత్త కోటప్పకొండ అని పేరు.


*మహాభక్తురాలు.. #ఆనందవల్లి*


స్థలపురాణం ప్రకారం శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది.  పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే ఒక దంపతులకు ఆనందవల్లి అనే పాప జన్మించింది. పెరిగేకొద్ది శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. కొంతకాలం అనంతరం తపస్సు చేయడంతో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఈ సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది. ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబజీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై వల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం శివునిలో ఆమె ఐక్యమైంది.


*ప్రభలు.*


మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతోంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను వూరేగింపుగా తీసుకువస్తారు. కొన్ని ప్రభలు యాభై అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండటం విశేషం. గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.


*దర్శన_వేళలు*


ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది.


*రాకపోకలకు_మార్గాలు*


విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా, నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల భక్తులు నరసరావుపేట మీదుగానే కోటప్పకొండకు చేరవచ్చు. మాచర్ల, గురజాల, కారంపూడి యాత్రికులు కూడా నరసరావుపేట మీదుగా కోటప్పకొండకు వెళ్లే మార్గం ఉంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతంకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు...


              🌷 *సేకరణ*🌷

          🌹🌷🕉️🔱🌷🌹

                  *న్యాయపతి*

               *నరసింహా రావు*

🌴🎋🌾🌹🕉️🛕🕉️🌹🌾🎋🌴

వడియం...కథనం

 👆

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

  *నాకు నచ్చిన శ్రీ కొచ్చెర్లకోట*     *జగదీశ్ గారి కథనం "వడియం"*   

                 🌷🌷🌷  

‘ఇవాళ సాంబారు పెడుతున్నావా లేక ముక్కలపులుసా?’ వంటింట్లోకొచ్చి అడిగాడు కామేశ్వర్రావు. పార్వతి స్టవ్ మీద చామదుంపలు వేపుతోంది. 


‘సాంబారు కోసమే ముక్కలన్నీ తరిగుంచమన్నాను రాజ్యాన్ని. పన్నెండింటికల్లా అన్నం పెట్టేస్తాను. కాసేపలా టీవీ చూడండి!’ అంది భర్తని వంటింట్లోంచి ఎలాగైనా పంపించెయ్యాలని.


చెక్కబీరువా తలుపులు తెరిచి పాత బోర్నవిటా సీసాలోంచి నిమ్మబద్దొకటి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ పులుపుకి కన్నొకటి మూసేస్తూ ‘సాంబారంటున్నావు మరి వడియాలున్నాయా?’ అన్నాడు అనుమానంగా.


‘ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపడతాయా వడియాలూ? ఉన్నా వాటిని ఉండనివ్వరుకదా? పెట్టిన వారంలోపే పటపటలాడించేస్తారు!’ అంది నిష్ఠూరంగా. అలా అందేగాని ఆయన సరదా చూసి మనసులో కాస్తంత బాధపడింది పార్వతి.


పిచ్చిమనిషి. ఈ తిండియావ తప్ప వేరే దురలవాట్లూ, అవలక్షణాలూ లేవు. ఎంత సాయమైనా చేస్తాడు బంగారుతండ్రి. చుట్టుపక్కల పిల్లలందరి పుస్తకాలకి అట్టలెయ్యడాలు, వీధిలో వాళ్లతో కలిసి చలివేంద్రాల్లో మజ్జిగలు, మంచినీళ్లూ పంచడాలు, వంటింట్లో తనకి కూరలన్నీ తరిగిపెట్టడాలు... ఒకటేమిటి, సమస్తమూ సేవానిరతితో చేసేంత హనుమజ్జాతకం కామేశ్వర్రావుది. 


ఒక్కక్షణం కాలునిలవదు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం. వీధిలో సమస్యలన్నీ తనవిగానే భావిస్తాడు. తెల్లారగానే ఓ నలుగురైదుగురు తయారవుతారు గుమ్మంలో!


‘కావేఁస్సర్రావుగారు లేరామ్మా?’ అంటూ!


వీధి కుళాయిల లీకులనో, కాలవలు పొంగిపోడాలో, వరసలో ఏదో ఒక వీధిదీపం వెలగట్లేదనో రోజూ సమస్యలతో వస్తారు. ఈయనే పరిష్కారం. పనయ్యేదాకా పడుకోడు. ఖాళీగా ఉన్నా గుడికెళ్లి కూర్చోడు. మానవసేవకే ఎక్కువ మొగ్గుచూపుతాడు.


వంటింట్లోంచి తొంగిచూసింది పార్వతి. సోఫాలో అసహనంగా కూర్చుని టీవీ చూస్తున్నాడాయన.


‘....ఈ సంఘటణపై స్పందిస్తూ విద్యాశాకా మంత్రి ఇళా అన్నారు...’


తెలుగు మాస్టారిగా పనిచేసి రిటైరైన కామేశ్వర్రావుకి ఆ వార్తలు చదివే పిల్లని చెడామడా తిట్టాలనిపించింది. పక్క ఛానల్ మార్చాడు. పాత పాటొకటి వస్తోంది..


‘బిడియమేలా ఓ చెలీ... పిలిచె నిన్నే కౌగిలీ...!’


బిడియం అని వినగానే మళ్లీ వడియం గుర్తొచ్చిందాయనకి. వెంటనే టీవీ కట్టేసి లేచాడు.


‘ఇదిగో, నేనలా బొంకులదిబ్బదాకా వెళ్లొస్తా!’ చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు కామేశ్వర్రావు.


‘హాయిగా ఇంటిపట్టున కూర్చోక ఎందుకా తిరుగుళ్లు?’ అంది నవ్వుతూనే. ఆయనా ఓ నవ్వు నవ్వేసి బయటపడ్డాడు. ఇద్దరికీ సర్వసాధారణమే అదంతా!


బొంకులదిబ్బంతా కూరలతో నిండిపోయింది. ఎటుచూసినా పచ్చగా మెరిసిపోతూ ఆనపకాయలు, బీరకాయలు, దొండాబెండ! నిండా పరచుకున్న కాయగూరల మధ్య కాషాయవర్ణంలో కేరట్లు. గాఢత నిండిన రంగులంటే అమిత ఇష్టమున్న చిత్రకారుడి చేతిలోంచి బయటపడిన పెద్దసైజు కేన్వాస్‌లా ఉంది ఆ దిబ్బంతా! 


మొన్న పెద్దపండక్కి పార్వతికి కొన్న చెంగావిరంగు చీర, దానికున్న ఆకుపచ్చంచూ జ్ఞాపకం వచ్చాయి ఆయనకి. చేతిసంచితో నడుచుకుంటూ ఎవరు పిలిచినా పలక్కుండా వెళ్తున్నాడు.


డెబ్భయ్యేళ్ల వయసులోనూ ఎండకి కూర్చుని పొట్లకాయలమ్మే అచ్చియమ్మ దగ్గరకే మొట్టమొదట వెళతాడు కామేశ్వర్రావు.


‘ఏటి పంతులుగోరూ, మొన్నట్టుకెల్లిన కాయిలన్నీ తినీసేవేటప్పుడే? ఆయమ్మెలా వేగుతుందో నీతోని! ఏటి, ఇమ్మంతరా ఓ అరకేజీ?’ అంది లేతగా నవనవలాడే రెండు కాయల్ని పటుక్కు పటుక్కుమనిపిస్తూ.


‘నీ దిష్టే తగిలింది అచ్చియమ్మా నాకు! నిన్నంతా కడుపుబ్బరం. ఇంత మజ్జిగాన్నం తప్ప ఇంకేం తిన్లేదు తెలుసా?’ అన్నాడు పొట్లకాయల్ని సంచిలో పడేసుకుని.


‘మాతండ్రే! నువు సల్లంగుండాల! నీలా తినీవోల్లిప్పుడెవరూ నేరు బావూ!  ఇంద పట్టు!’ అంటూ మరో కాయ కొసరు పడేసింది. అది అభిమానంతో ఇచ్చిన కాయ. దాని రుచి వేరు.


ఆకుకూరలూ, దోసకాయలు, మావిడికాయలూ కొనేశాడు. ఆయన కళ్లు దేనికోసమో వెదుకుతున్నాయి. మొత్తం కలియదిరిగాడు. బాగా ముందుకి, ఈవార మెయిన్‌రోడ్డు ముందువరకూ వచ్చాక కనబడ్డాడు నాయుడు. 


అతని దగ్గరుంటుంది తనకి కావలసిన సరుకు. బుజ్జిగా గునగునలాడుతూ ఒళ్లంతా విభూతి పూసుకున్న శివలింగంలా చిన్న బూడిదగుమ్మడి కాయను చూడగానే ఆయన మనసు కేరింత కొట్టింది. 


ఉద్యోగంలో పదోన్నతులు, పిల్లల వృద్ధీ, మనసుకు హత్తుకునే సినిమా.. ఇలా జీవితాన మైలురాళ్లన్నింటికీ ఎంతెంత సంబరపడతాడో ఇలా కూరల్ని చూసినా అంతే ఉబలాట పడిపోతాడు. దాచుకోలేనంత అల్పసంతోషి!


‘పట్టండి మేషారూ! పిల్లలెలా ఉన్నారు? పండక్కొచ్చారా?' బుల్లి గుమ్మడికాయని శుభ్రంగా తుడిచి ఆయన సంచిలో పడేస్తూ కుశలం అడిగాడు నాయుడు.


‘ఆ వచ్చారు. కొడుకొస్తే కోడలు రాలేదు, కూతురొస్తే మనవలు రాలేదు. ఎవరికీ ఖాళీల్లేవు నాయుడూ! రోజూ ఆ వీడియోల్లో చూసుకుంటూ గంటలు గంటలు మాటాడేసుకుంటారు. ఇవాళ మాకు వర్షం పడిందని, నేనిందాక పకోడీలేశానని, పొద్దున్న బాత్రూములో బల్లిని చంపేశాను, ఫరవాలేదా? అనీ.. ఒకటికాదు‌. అన్ని కబుర్లూ చెప్పేసుకుంటారు. ఇహ రాకపోతే మాత్రం బెంగెందుకూ?’ అన్నాడాయన గుక్కతిప్పుకోకుండా.


‘ఎక్కడుంటే ఏట్లెండి, తగూల్లేకుండా ఉంటే అదే మేలు!' అన్నాడు నాయుడు తియ్యగుమ్మడి బద్దలు రెండు సంచిలో వేస్తూ. అవీ అభిమానపు తీపి గుమ్మడే! పాతసినిమాల్లో గుమ్మడిలా మమకారాన్ని పంచేదే!


ఇంటికి రాగానే కూరలసంచీ ఓమూలగా పెట్టి అందులోంచి బుజ్జి శివలింగాన్ని బయటికి తీశాడు. పిల్లిలా అడుగులేస్తూ వంటింట్లోకెళ్లి పార్వతికి కనబడేలా మంచినీళ్ల బిందెపక్కన పెట్టేసి మళ్లీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు కామేశ్వర్రావు.


బయట బాల్కనీలో తువ్వాళ్లారేసి లోపలికొచ్చిన పార్వతికి బూడిదగుమ్మడి కనబడింది. అంత చిన్నకాయను చూడగానే నవ్వొచ్చింది. కానీ బెట్టుగా మూతి బిగించి హాల్లోకొచ్చి ‘ఎవరి ముక్కులోకిటా అంత చిన్నకాయ?’ అంది.


‘మరీ ఎక్కువంటే నీకు కష్టమని చిన్నదట్టుకొచ్చా! పిండి ఉందికదా?’ అన్నాడు గొణుగుతున్నట్టు.


‘సర్లెండి, మీమటుక్కు ఓ పదిపదిహేను వడియాలు వస్తాయేమో! మళ్లా వారందాకా అడక్కండి!’ అనేసి ఫ్రిజ్‌లోంచి మినప్పిండి తీసింది.


పక్కకి తిరిగి చూస్తే ఇంకేముంది? చక్కగా సన్నటి పొడుగాటి ముక్కలు తరుగుతూ కనబడ్డాడు భర్త.


‘చిన్న గంటుపెట్టేసి వెళిపోతే నే తరుక్కుంటా కదా? మీకెందుకివన్నీ?' అంది అభిమానంతో.


‘తినేది నేనేగా? సర్లే, నీకూ ఓ రెండిస్తాలే!’ అని చిరునవ్వు నవ్వుతూ ముక్కలన్నీ మూటగట్టి ఆ మూటమీద చిన్న రాతిపొత్రాన్ని పెట్టాడు.


మర్నాడు ఉదయానికల్లా ముక్కల్లో నీరంతా దిగిపోగానే పిండిలో ఇంగువ, పచ్చిమిరపకాయలూ ముద్దచేసుకుని కలిపి, అందులో ఈ ముక్కలు కలిపేసింది. ఈలోగా ఆయన కొట్టుగదిలోంచి పెద్దపీట తీసుకొచ్చేశాడప్పుడే! దానిమీద వడియాలు పెట్టేశాడు. ఇద్దరూ కలిసి సాయంపట్టి పీటని ఎండలో పెట్టేశారు.


అదిమొదలు. ఇక వాటిచుట్టూనే తిరుగుతున్నాడు కామేశ్వర్రావు. ఈ వడియాలకోసం తప్పిస్తే అంతటి ఎండల్ని ఎవరుమాత్రం ఇష్టపడతారు? లోపలికొస్తాడు, మళ్లీ పదినిముషాలకే బయటకెళతాడు. పార్వతి అదంతా గమనిస్తూనే ఉంది. 


నిన్నటిది కాకుండా మళ్లీ మరింత ఘుమఘుమలాడే సాంబారు పెట్టింది. ప్రతిక్షణమూ ఆయన ఇష్టాన్నే తలుచుకుంటూ వేసే ప్రతి పదార్ధాన్నీ ఆత్మీయంగా వేస్తూ చేస్తుంది వంట.


భోజనాలవేళ ఆ పీటమీంచి ఓ అరడజను వడియాలు తీసి మూకుట్లో వేపింది. ఇంకా కాస్త పచ్చి మిగిలేవున్నా ఆయనకలా కూడా ఇష్టం.


వేడివేడి అన్నం మంచుతో చేసిన శివలింగంలా పొగలు కక్కుతోంది. దానికి నేతితో అభిషేకం చేశాడు. అటుపిమ్మట ఒకటొకటిగా ఆదరువులన్నీ అందులో ఐక్యమైపోతూంటే తన్మయత్వంతో తడిబారిన కళ్లతో తృప్తిగా భోంచేస్తున్నాడు. 


వడియాల్ని రంగరించి పులుసన్నం ముద్దలు ఆబగా తింటున్నాడు. పొలమారి ఉక్కిరిబిక్కిరి అయితే మృదువుగా కోప్పడింది పార్వతి.


‘ఎక్కడికి పోతాయి ఆ వడియాలూ? నిమ్మళంగా తినండి!’ అంది మంచినీళ్లందిస్తూ.


‘ఇంద్రుడు తలుచుకుంటున్నాడే నా భాగ్యాన్ని చూసి! అక్కడ ఇవన్నీ ఉండవుగా? నే వెళ్లేటప్పుడు పట్టుకెళ్లాలి!’


‘ఛ నట్టింట్లో కూర్చుని ఏమ్మాటలవి! కమ్మగా తినండి. మీ మంచిమనసే మీకు శ్రీరామరక్ష!’ అంటూ ఆయన చూడకుండా కళ్లు తుడుచుకుంది పార్వతి.


......జగదీశ్ కొచ్చెర్లకోట


బొమ్మ కూడా నేనేసిందే! 😝

నివాళి

 పుల్లెల శ్రీరామచంద్రుడు 

____________________

వెల్చేరునారాయణరావు


🟢 జూన్ 24వ తేదీకి పుల్లెల శ్రీరామచంద్రుడుగారు కన్ను మూసి ఏడేళ్ళు అయిపోయాయి . ఒక్క చేతిమీదుగా ఆయన సంస్కృత విజ్ఞానాన్ని పదిమందికి బోధపడే తెలుగులో వ్యాఖ్యానించి మనకిచ్చారు. ఇది చిన్న పని కాదు. ఆయన రాసిన దాదాపు రెండు వందల పుస్తకాలలో అలంకారశాస్త్రం, వ్యాకరణశాస్త్రం, వేదాంతం, ధర్మశాస్త్ర గ్రంథాలు, దాదాపుగా అన్నీ వున్నాయి. భరతుడి నాట్యశాస్త్రం పరమ ప్రామాణికంగా మూలంతో సహా చక్కని వివరణతో మనకందించారు ఆయన. అభినవగుప్తుడి వ్యాఖ్యానంతో కూడిన ఆనందవర్ధుని ధ్వన్యాలోకం ఆయనవల్లే సుష్టుగా మనకందింది. దండి కావ్యాదర్శం, భామహుడి కావ్యాలంకారం, వామనుడి అలంకారసూత్రవృత్తి, కుంతకుడి వక్రోక్తి జీవితం, మమ్మటుడి కావ్యాదర్శం, రాజశేఖరుడి కావ్యమీమాంస ఇవన్నీ ఆయన చేతి చలవ వల్లే మనకు వచ్చాయి. ప్రధానమైన శాస్త్ర గ్రంథాలలో కౌటిల్యుడి అర్థశాస్త్రం ఆయన సాధికారంగా తెనిగించారు.


ఆయన రాసిన గ్రంథాలన్నీ అచ్చుతప్పులు లేకుండా చక్కగా అచ్చయ్యాయి. వాటికి ఆయన రాసిన ఉపోద్ఘాతాలు, చేసిన వ్యాఖ్యలు ఇటు ఆధునిక రచనా సంప్రదాయల్ని, ప్రాచీన శాస్త్ర సంప్రదాయాలని రెంటినీ సమర్ధంగా అనుసరిస్తాయి. సమాచారాన్ని బాధ్యతగా ఇవ్వటం లోను, అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పటం లోను ఆయన మార్గం నాకు తెలిసినంతలో ఎవరూ అనుసరించలేదు. వ్యాఖ్యానం రాసేటప్పుడు, పుస్తకానికి ఉపోద్ఘాతం రాసేటప్పుడు ఆయన క్లిష్టమైన శాస్త్ర విషయాలని స్పష్టమైన వచనంలో చెప్పగలిగే వారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే ఆయన అభినవగుప్తుడి వంటి పరమ ప్రామాణికుడైన సాహిత్యశాస్త్ర నిర్మాతని కూడా నిస్సందేహంగా కాదనగలిగేవారు. మమ్మటుడి కావ్యప్రకాశకి ఆయన రాసిన ఉపోద్ఘాతం ఎన్ని సార్లు చదివినా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే వుంటాయి. 


జగన్నాథపండితరాయల మీద ఆయన ఇంగ్లీషులో రాసిన రెండు భాగాల మహాగ్రంథం ఆయనకి అటు జగన్నాథ పండితుడి మీద, ఇటు సర్వ అలంకారశాస్త్రం మీద ఆయనకున్న అధికారానికి ఒక చిన్న ప్రదర్శన. ఆయన రాసిన ప్రతి శాస్త్ర గ్రంథం లోను తాను స్వతంత్రంగా ప్రతిపాదించిన కొత్త సమన్వయాలు, తనకన్నా ముందు గొప్ప వాళ్లయిన వారి అభిప్రాయాలతో సున్నితంగా, అయినా స్పష్టంగా నిష్కర్షగా చెప్తూ విభేదిస్తూ రాసిన విశేషాలూ, ఈ వ్యాసంలో వివరించడానికి వీల్లేనంత పెద్దవి. బ్రహ్మసూత్ర శాంకరభాష్యం వేదాంత విదులకి తప్ప ఇతరులకి బోధపడటానికి వీలులేనంత గహనమైనదైనా, ఆయన వ్యాఖానం తోడు తీసుకుని కొంచెం శ్రద్ధ పెట్టి చదివితే నాలాంటివాళ్లకి కూడా బోధపడుతుంది.


సంస్కృత గ్రంథాలు, వాటి సమయ సందర్భాలు తెలియని అజ్ఞానం కారణం గానూ, భారత దేశానికి పాశ్చాత్య ప్రపంచం కన్నా గొప్ప నాగరికత వున్నదని అంగీకరించడానికి తమ నాగరికతా గర్వం అడ్డు రావడం కారణం గానూ, కొందరు పాశ్చాత్యులు చేసిన దుర్వ్యాఖ్యానాలని సహేతుకంగా కాదనగలగడం శ్రీరామచంద్రుడుగారు చేసిన మహోపకారం. ఈ పని, భారత దేశంలో ప్రతిదీ గొప్పది, పాశ్చాత్యమైనది ప్రతిదీ చెడ్దది అనే చెక్కపడి పద్ధతిలో కాకుండా, సహేతుకంగా, సున్నితంగా చెయ్యడం ఆయన ప్రత్యేకత. దీనికి తోడు ఆధునికులమని చెప్పుకునే భారతీయులు కూడా పాశ్చాత్య ప్రభావంలో పడి సంస్కృత గ్రంథాలని తప్పుగా అర్థం చేసుకోవడం ఆయన గమనించారు. భారతీయ వ్యాఖ్యాతల చేతిలోనే సంస్కృత గ్రంథాలు దెబ్బ తినడం చూసి, ఆయన ఆ లోపాలని నెమ్మదిగా సరిదిద్దారు. వలసవాద ప్రభావం మన మీద ఎంత గాఢంగా వుందో ఆయనకి నిజంగా అర్థం అయింది.


కౌటిల్యుడి అర్థశాస్త్రం పేరు చెప్పగానే 15వ శతబ్దిలో మాకియవిల్లి రాసిన ‘ది ప్రిన్స్ ‘అనే రాజనీతి గ్రంథాన్ని పోలిక తెస్తారు. మాకియవిల్లికీ కౌటిల్యుడికీ పోలిక లేదని చక్కని ఉపపత్తులతో నిరుపించారు శ్రీరామచంద్రుడు. 


మానవుడెప్ప్పుడూ స్వార్థపరుడే అనీ, ఎప్పుడు తన లాభం కోసమే ప్రయత్నిస్తూంటాడనీ, వంచన, కృతఘ్నత, పిరికితనం, దురాశ, మానవుడి సహజ లక్షణాలనీ, అవసరం కొసమే మంచితనం చూపిస్తూంటాడనీ, రాజు ఎప్పుడూ ప్రజల్ని భయపెట్టి పరిపాలించాలనీ మాకియవిల్లి రాశాడు. ఇలాటి నిరాశావాదం కౌటిల్యుడిలో లేదనీ, కౌటిల్యుడిలో ధర్మం వ్యక్తిలో వున్న మంచిని పెంపొదించేది అనీ శ్రీరామచంద్రుడు గారు వివరించారు.


ఆయన పరమ సంప్రదాయజ్ఞుడు, అయినా సంప్రదాయనికి దాసుడు కాదు. పరమ ఆధునికుడు, అలా అని ఆధునికతావ్యామోహితుడు కాదు. ఇటు కావ్య స్వారస్యాన్ని వ్యాఖ్యానించగల శక్తీ, అటు తర్కకర్కశమైన శాస్త్ర విషయాల్ని ప్రపంచించగల సామర్ధ్యమూ, అన్నిటికన్నా మించి అచ్చమైన, అందమైన తెలుగు వాక్యాలు రాయగల రచనా ప్రావీణ్యమూ, ఇవన్నీ కలిసిన ఒక మహావ్యక్తి శ్రీరామచంద్రుడుగారు.

ఇంత చేసి కూడా ఆయన ప్రతి పుస్తకంలోను దేవతల అనుగ్రహము, తల్లిదండ్రుల తపస్సు, తన గురువుల కృప ఇవే తన పుస్తకాలకి కర్తలనీ తాను కేవలం ఉపకరణం మాత్రమే అని సవినయంగా చెప్పుకోగల మహానుభావుడాయన.


ఆయన తెలుగువాడై పుట్టడం మన గొప్ప. ఆయన గొప్పతనాన్ని సంపూర్ణంగా బోధపరుచుకుని, ఆయన్ని ఇంకా ఎక్కువ గౌరవించ లేకపోవడం మన లోపం.


ఎనిమిదవ వర్థంతి సందర్భంగా వారి స్మృతిలో నివాళి .


🟢🔴🔵

పితృదేవోభవ

 శ్లోకం:☝

*జనితాచోపనేతా చ*

    *యేన విద్యోపదిశ్యతే |*

*అన్నదాతా భయత్రాతా*

     *పంచైతే పితరస్స్మృతాః ||*


భావం: జన్మనిచ్చిన వాడు, ఉపనయనము చేసినవాడు, అన్నదానము చేసినవాడు, విద్యాదానము చేసినవాడు (గురువు) మరియు ఆపత్కాలంలో దైన్యముతో ఉన్నప్పుడు భయాన్ని తొలగించి ధైర్యాన్ని కలిగించువాడు, ఈ ఐదుగురు తండ్రులుగా చెప్పబడుచున్నారు , పూజింపబడుచున్నారు. మరి ఈ ఐదూ చేసిన జన్మనిచ్చిన తండ్రి దైవంతో సమానం.

    🙏 *పితృదేవోభవ*🙏