20, జూన్ 2022, సోమవారం

వడియం...కథనం

 👆

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

  *నాకు నచ్చిన శ్రీ కొచ్చెర్లకోట*     *జగదీశ్ గారి కథనం "వడియం"*   

                 🌷🌷🌷  

‘ఇవాళ సాంబారు పెడుతున్నావా లేక ముక్కలపులుసా?’ వంటింట్లోకొచ్చి అడిగాడు కామేశ్వర్రావు. పార్వతి స్టవ్ మీద చామదుంపలు వేపుతోంది. 


‘సాంబారు కోసమే ముక్కలన్నీ తరిగుంచమన్నాను రాజ్యాన్ని. పన్నెండింటికల్లా అన్నం పెట్టేస్తాను. కాసేపలా టీవీ చూడండి!’ అంది భర్తని వంటింట్లోంచి ఎలాగైనా పంపించెయ్యాలని.


చెక్కబీరువా తలుపులు తెరిచి పాత బోర్నవిటా సీసాలోంచి నిమ్మబద్దొకటి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ పులుపుకి కన్నొకటి మూసేస్తూ ‘సాంబారంటున్నావు మరి వడియాలున్నాయా?’ అన్నాడు అనుమానంగా.


‘ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపడతాయా వడియాలూ? ఉన్నా వాటిని ఉండనివ్వరుకదా? పెట్టిన వారంలోపే పటపటలాడించేస్తారు!’ అంది నిష్ఠూరంగా. అలా అందేగాని ఆయన సరదా చూసి మనసులో కాస్తంత బాధపడింది పార్వతి.


పిచ్చిమనిషి. ఈ తిండియావ తప్ప వేరే దురలవాట్లూ, అవలక్షణాలూ లేవు. ఎంత సాయమైనా చేస్తాడు బంగారుతండ్రి. చుట్టుపక్కల పిల్లలందరి పుస్తకాలకి అట్టలెయ్యడాలు, వీధిలో వాళ్లతో కలిసి చలివేంద్రాల్లో మజ్జిగలు, మంచినీళ్లూ పంచడాలు, వంటింట్లో తనకి కూరలన్నీ తరిగిపెట్టడాలు... ఒకటేమిటి, సమస్తమూ సేవానిరతితో చేసేంత హనుమజ్జాతకం కామేశ్వర్రావుది. 


ఒక్కక్షణం కాలునిలవదు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం. వీధిలో సమస్యలన్నీ తనవిగానే భావిస్తాడు. తెల్లారగానే ఓ నలుగురైదుగురు తయారవుతారు గుమ్మంలో!


‘కావేఁస్సర్రావుగారు లేరామ్మా?’ అంటూ!


వీధి కుళాయిల లీకులనో, కాలవలు పొంగిపోడాలో, వరసలో ఏదో ఒక వీధిదీపం వెలగట్లేదనో రోజూ సమస్యలతో వస్తారు. ఈయనే పరిష్కారం. పనయ్యేదాకా పడుకోడు. ఖాళీగా ఉన్నా గుడికెళ్లి కూర్చోడు. మానవసేవకే ఎక్కువ మొగ్గుచూపుతాడు.


వంటింట్లోంచి తొంగిచూసింది పార్వతి. సోఫాలో అసహనంగా కూర్చుని టీవీ చూస్తున్నాడాయన.


‘....ఈ సంఘటణపై స్పందిస్తూ విద్యాశాకా మంత్రి ఇళా అన్నారు...’


తెలుగు మాస్టారిగా పనిచేసి రిటైరైన కామేశ్వర్రావుకి ఆ వార్తలు చదివే పిల్లని చెడామడా తిట్టాలనిపించింది. పక్క ఛానల్ మార్చాడు. పాత పాటొకటి వస్తోంది..


‘బిడియమేలా ఓ చెలీ... పిలిచె నిన్నే కౌగిలీ...!’


బిడియం అని వినగానే మళ్లీ వడియం గుర్తొచ్చిందాయనకి. వెంటనే టీవీ కట్టేసి లేచాడు.


‘ఇదిగో, నేనలా బొంకులదిబ్బదాకా వెళ్లొస్తా!’ చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు కామేశ్వర్రావు.


‘హాయిగా ఇంటిపట్టున కూర్చోక ఎందుకా తిరుగుళ్లు?’ అంది నవ్వుతూనే. ఆయనా ఓ నవ్వు నవ్వేసి బయటపడ్డాడు. ఇద్దరికీ సర్వసాధారణమే అదంతా!


బొంకులదిబ్బంతా కూరలతో నిండిపోయింది. ఎటుచూసినా పచ్చగా మెరిసిపోతూ ఆనపకాయలు, బీరకాయలు, దొండాబెండ! నిండా పరచుకున్న కాయగూరల మధ్య కాషాయవర్ణంలో కేరట్లు. గాఢత నిండిన రంగులంటే అమిత ఇష్టమున్న చిత్రకారుడి చేతిలోంచి బయటపడిన పెద్దసైజు కేన్వాస్‌లా ఉంది ఆ దిబ్బంతా! 


మొన్న పెద్దపండక్కి పార్వతికి కొన్న చెంగావిరంగు చీర, దానికున్న ఆకుపచ్చంచూ జ్ఞాపకం వచ్చాయి ఆయనకి. చేతిసంచితో నడుచుకుంటూ ఎవరు పిలిచినా పలక్కుండా వెళ్తున్నాడు.


డెబ్భయ్యేళ్ల వయసులోనూ ఎండకి కూర్చుని పొట్లకాయలమ్మే అచ్చియమ్మ దగ్గరకే మొట్టమొదట వెళతాడు కామేశ్వర్రావు.


‘ఏటి పంతులుగోరూ, మొన్నట్టుకెల్లిన కాయిలన్నీ తినీసేవేటప్పుడే? ఆయమ్మెలా వేగుతుందో నీతోని! ఏటి, ఇమ్మంతరా ఓ అరకేజీ?’ అంది లేతగా నవనవలాడే రెండు కాయల్ని పటుక్కు పటుక్కుమనిపిస్తూ.


‘నీ దిష్టే తగిలింది అచ్చియమ్మా నాకు! నిన్నంతా కడుపుబ్బరం. ఇంత మజ్జిగాన్నం తప్ప ఇంకేం తిన్లేదు తెలుసా?’ అన్నాడు పొట్లకాయల్ని సంచిలో పడేసుకుని.


‘మాతండ్రే! నువు సల్లంగుండాల! నీలా తినీవోల్లిప్పుడెవరూ నేరు బావూ!  ఇంద పట్టు!’ అంటూ మరో కాయ కొసరు పడేసింది. అది అభిమానంతో ఇచ్చిన కాయ. దాని రుచి వేరు.


ఆకుకూరలూ, దోసకాయలు, మావిడికాయలూ కొనేశాడు. ఆయన కళ్లు దేనికోసమో వెదుకుతున్నాయి. మొత్తం కలియదిరిగాడు. బాగా ముందుకి, ఈవార మెయిన్‌రోడ్డు ముందువరకూ వచ్చాక కనబడ్డాడు నాయుడు. 


అతని దగ్గరుంటుంది తనకి కావలసిన సరుకు. బుజ్జిగా గునగునలాడుతూ ఒళ్లంతా విభూతి పూసుకున్న శివలింగంలా చిన్న బూడిదగుమ్మడి కాయను చూడగానే ఆయన మనసు కేరింత కొట్టింది. 


ఉద్యోగంలో పదోన్నతులు, పిల్లల వృద్ధీ, మనసుకు హత్తుకునే సినిమా.. ఇలా జీవితాన మైలురాళ్లన్నింటికీ ఎంతెంత సంబరపడతాడో ఇలా కూరల్ని చూసినా అంతే ఉబలాట పడిపోతాడు. దాచుకోలేనంత అల్పసంతోషి!


‘పట్టండి మేషారూ! పిల్లలెలా ఉన్నారు? పండక్కొచ్చారా?' బుల్లి గుమ్మడికాయని శుభ్రంగా తుడిచి ఆయన సంచిలో పడేస్తూ కుశలం అడిగాడు నాయుడు.


‘ఆ వచ్చారు. కొడుకొస్తే కోడలు రాలేదు, కూతురొస్తే మనవలు రాలేదు. ఎవరికీ ఖాళీల్లేవు నాయుడూ! రోజూ ఆ వీడియోల్లో చూసుకుంటూ గంటలు గంటలు మాటాడేసుకుంటారు. ఇవాళ మాకు వర్షం పడిందని, నేనిందాక పకోడీలేశానని, పొద్దున్న బాత్రూములో బల్లిని చంపేశాను, ఫరవాలేదా? అనీ.. ఒకటికాదు‌. అన్ని కబుర్లూ చెప్పేసుకుంటారు. ఇహ రాకపోతే మాత్రం బెంగెందుకూ?’ అన్నాడాయన గుక్కతిప్పుకోకుండా.


‘ఎక్కడుంటే ఏట్లెండి, తగూల్లేకుండా ఉంటే అదే మేలు!' అన్నాడు నాయుడు తియ్యగుమ్మడి బద్దలు రెండు సంచిలో వేస్తూ. అవీ అభిమానపు తీపి గుమ్మడే! పాతసినిమాల్లో గుమ్మడిలా మమకారాన్ని పంచేదే!


ఇంటికి రాగానే కూరలసంచీ ఓమూలగా పెట్టి అందులోంచి బుజ్జి శివలింగాన్ని బయటికి తీశాడు. పిల్లిలా అడుగులేస్తూ వంటింట్లోకెళ్లి పార్వతికి కనబడేలా మంచినీళ్ల బిందెపక్కన పెట్టేసి మళ్లీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు కామేశ్వర్రావు.


బయట బాల్కనీలో తువ్వాళ్లారేసి లోపలికొచ్చిన పార్వతికి బూడిదగుమ్మడి కనబడింది. అంత చిన్నకాయను చూడగానే నవ్వొచ్చింది. కానీ బెట్టుగా మూతి బిగించి హాల్లోకొచ్చి ‘ఎవరి ముక్కులోకిటా అంత చిన్నకాయ?’ అంది.


‘మరీ ఎక్కువంటే నీకు కష్టమని చిన్నదట్టుకొచ్చా! పిండి ఉందికదా?’ అన్నాడు గొణుగుతున్నట్టు.


‘సర్లెండి, మీమటుక్కు ఓ పదిపదిహేను వడియాలు వస్తాయేమో! మళ్లా వారందాకా అడక్కండి!’ అనేసి ఫ్రిజ్‌లోంచి మినప్పిండి తీసింది.


పక్కకి తిరిగి చూస్తే ఇంకేముంది? చక్కగా సన్నటి పొడుగాటి ముక్కలు తరుగుతూ కనబడ్డాడు భర్త.


‘చిన్న గంటుపెట్టేసి వెళిపోతే నే తరుక్కుంటా కదా? మీకెందుకివన్నీ?' అంది అభిమానంతో.


‘తినేది నేనేగా? సర్లే, నీకూ ఓ రెండిస్తాలే!’ అని చిరునవ్వు నవ్వుతూ ముక్కలన్నీ మూటగట్టి ఆ మూటమీద చిన్న రాతిపొత్రాన్ని పెట్టాడు.


మర్నాడు ఉదయానికల్లా ముక్కల్లో నీరంతా దిగిపోగానే పిండిలో ఇంగువ, పచ్చిమిరపకాయలూ ముద్దచేసుకుని కలిపి, అందులో ఈ ముక్కలు కలిపేసింది. ఈలోగా ఆయన కొట్టుగదిలోంచి పెద్దపీట తీసుకొచ్చేశాడప్పుడే! దానిమీద వడియాలు పెట్టేశాడు. ఇద్దరూ కలిసి సాయంపట్టి పీటని ఎండలో పెట్టేశారు.


అదిమొదలు. ఇక వాటిచుట్టూనే తిరుగుతున్నాడు కామేశ్వర్రావు. ఈ వడియాలకోసం తప్పిస్తే అంతటి ఎండల్ని ఎవరుమాత్రం ఇష్టపడతారు? లోపలికొస్తాడు, మళ్లీ పదినిముషాలకే బయటకెళతాడు. పార్వతి అదంతా గమనిస్తూనే ఉంది. 


నిన్నటిది కాకుండా మళ్లీ మరింత ఘుమఘుమలాడే సాంబారు పెట్టింది. ప్రతిక్షణమూ ఆయన ఇష్టాన్నే తలుచుకుంటూ వేసే ప్రతి పదార్ధాన్నీ ఆత్మీయంగా వేస్తూ చేస్తుంది వంట.


భోజనాలవేళ ఆ పీటమీంచి ఓ అరడజను వడియాలు తీసి మూకుట్లో వేపింది. ఇంకా కాస్త పచ్చి మిగిలేవున్నా ఆయనకలా కూడా ఇష్టం.


వేడివేడి అన్నం మంచుతో చేసిన శివలింగంలా పొగలు కక్కుతోంది. దానికి నేతితో అభిషేకం చేశాడు. అటుపిమ్మట ఒకటొకటిగా ఆదరువులన్నీ అందులో ఐక్యమైపోతూంటే తన్మయత్వంతో తడిబారిన కళ్లతో తృప్తిగా భోంచేస్తున్నాడు. 


వడియాల్ని రంగరించి పులుసన్నం ముద్దలు ఆబగా తింటున్నాడు. పొలమారి ఉక్కిరిబిక్కిరి అయితే మృదువుగా కోప్పడింది పార్వతి.


‘ఎక్కడికి పోతాయి ఆ వడియాలూ? నిమ్మళంగా తినండి!’ అంది మంచినీళ్లందిస్తూ.


‘ఇంద్రుడు తలుచుకుంటున్నాడే నా భాగ్యాన్ని చూసి! అక్కడ ఇవన్నీ ఉండవుగా? నే వెళ్లేటప్పుడు పట్టుకెళ్లాలి!’


‘ఛ నట్టింట్లో కూర్చుని ఏమ్మాటలవి! కమ్మగా తినండి. మీ మంచిమనసే మీకు శ్రీరామరక్ష!’ అంటూ ఆయన చూడకుండా కళ్లు తుడుచుకుంది పార్వతి.


......జగదీశ్ కొచ్చెర్లకోట


బొమ్మ కూడా నేనేసిందే! 😝

కామెంట్‌లు లేవు: