10, మే 2023, బుధవారం

సుఖించాను

 .

            _*సుభాషితమ్*_


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*యదా కించిద్‌జ్ఞోఽహం ద్విప ఇవ మదాంధః సమభవం*

*తదా సర్వజ్ఞోఽస్మీత్యభవ దవలిప్తం మమ మనః ।*

*యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం*

*తదా మూర్ఖోఽస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥*


తా॥ 

నాకేమి తెలియని కాలములో -  అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను....తదుపరి ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించాను....*

వైశాఖ పురాణం - 19 వ అధ్యాయము🚩*_

 _*🚩వైశాఖ పురాణం - 19 వ అధ్యాయము🚩*_


🕉🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️


*పిశాచత్వ విముక్తి*


🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷


నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవుడిట్లనెను , రాజా ! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు.


వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు.


ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు , తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో , తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును , వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా ! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి ?  కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము , ధ్యానము , మననము , ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము , విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని , విష్ణుకథగాని , సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము , మననము , స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన ఇష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు , చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము , చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు , నిరాశ్రయుడు యెండిన పెదవులు , నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను , జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని శిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వారి పాదములపై బడి దుఃఖించెను.


సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను.  ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు - సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


శ్రుతకీర్త మహారాజా ! కావున శ్రీహరి కథల ప్రసంగము , శ్రవణము , ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు ఇహము , పరము , నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


*ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |*

*తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||*

*ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |*

*కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||*

*ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |*

*బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||*


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

వైశాఖ పురాణం - 18 వ అధ్యాయము

   _*🚩వైశాఖ పురాణం - 18 వ అధ్యాయము🚩*_


🕉🍁🕉️🍁🕉️🍁🕉️🍁🕉️


*విష్ణువు యముని ఊరడించుట*


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.


యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయీ ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది ? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము.  వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవారు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా ! యమధర్మరాజా ! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా ! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి / సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.


అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా ! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా ! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి.


శ్రీహరియు వారిద్దరిని జూచి *"మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా ? యముని ముఖము వాడియున్నదేమి ? అతడు శిరము వంచుకొని యేల నుండెను ? బ్రహ్మ ! ఈ విషయమును చెప్పుమని"* యడిగెను.


అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని , బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను , నా ప్రాణములను , దేహమును , శ్రీవత్సమును , కౌస్తుభమును , వైజయంతీమాలను , శ్వేతద్వీపమును , వైకుంఠమును , క్షీరసాగరమును , శేషుని , గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను , జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను ?


యమధర్మరాజా ! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్దిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా ! అప్పుడు నీకు కావలసినంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా ! *(ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు ? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము)* వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను , గురువును పూజింపవలయును , తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు /పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.


ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు , పుత్రికలు , మనుమలు. , మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి ఇహలోక సుఖములు , సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే ఇది సాధ్యము సుమా అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.


శ్రుతదేవుడును రాజా ! యుగములనుబట్టి , కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆ కథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము , గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.


*వైశాఖ పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

వైశాఖ పురాణం - 17 వ అధ్యాయము🙏

 _*🙏వైశాఖ పురాణం - 17 వ అధ్యాయము🙏*_


🕉🌷🕉️🌷🕉️🌷🕉️🌷🕉️


*యమదుఃఖ నిరూపణము*


🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను.


వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను.


స్వామీ ! సర్వలోకపితామహా ! బ్రహ్మ ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ నివారింపబడితిని. నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటను మరణము కంటె యెక్కువ బాధాకరమని తలచుచున్నను. సర్వసృష్టి విధాయకా ! వినుము. ఆజ్ఞను పొందిన యధికారి తనకు రావలసిన జీతమును తీసికొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనిచో నతడు కొయ్యపురుగు మొదలగు జన్మములనందును. అతితెలివితో లోభమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యమును చేయనిచో అతడు భయంకర నరక లోకములలో మూడువందల కల్పములు చిరకాలముండి మృగాది జన్మల నెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యమును నెరవేర్చనిచో ఘోరనరకములలో చాలకాలముండి కాకి మున్నగు జన్మలనెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పినపనిని నాశనము చేయువాడు. ఇంటియందు యెలుక జన్మనెత్తి మూడువందల కల్పముల కాలము బాధపడును. సమర్థుడైనను తన కర్తవ్యమున చేయక ఇంటియందూరక నుండువాడు పిల్లిగా జన్మించును. ప్రభూ ! మీ యాజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును , పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్యపాపములను బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులగు మునులతో విచారించి ధర్మమార్గానుసారముగ ప్రజలను పరిపాలించు కాని ఇప్పుడు నీ యాజ్ఞను పూర్వము వలె పాటీంచలేని స్థితిలోనున్నాను. కీర్తిమంతుడను రాజు వలన నేను నా కర్తవ్యమును నిర్వర్తింపలేకున్నను. కీర్తిమంతుడను ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖమాస వ్రత ధర్మయుక్తముగ పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచినవారు , తండ్రిని పూజింపనివారు , పెద్దలను గౌరవింపనివారు , తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు , యోగసాంఖ్యములను విడిచినవారు , ప్రాణాయామము చేయనివాడు , హోమమును స్వాధ్యాయమును విడిచినవారు , మరి ఇంకను పెక్కు పాపములను చేసినవారు ఇట్టివారందరును వైశాఖమాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు , తాతలతోబాటు విష్ణులోకమును చేరుచున్నారు. వీరేకాదు తండ్రులు , తాతలు , తల్లులు వీరును విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతము నాచరించినవారి భార్యవైపు వారును , తండ్రి వలన నితరస్త్రీలకు పుట్టినవారు వీరందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని యమ పాపములను తుడచివేయునట్లు చేసి విష్ణులోకమును చేరుచున్నారు. ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది. సామాన్యముగ ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దానివలన పుణ్యపాపములలో నేదోయొకదానిని వాడనుభవించును. కాని వైశాఖమాస వ్రతము నొకడు చేసినచో అతడేకాక వాని తండ్రివైపువారు , తల్లివైపువారు మొత్తము ఇరువదియారు తరములవారు. వారు చేసికొన్న పాపములను పోగొట్టు కొని విష్ణులోకము చేరుచున్నారు. వీరుకాక వైశాఖవ్రతమును చేసిన వారి భార్యల వైపువారును , భర్తలవైపువారును విష్ణులోకమును చేరుచున్నారు. ఈ వైశాఖ వ్రతమును చేసినవారు వారు యెట్టివారైనను నన్ను కాదని కనీసము ఇరువది యొక్క తరములవారితో విష్ణులోకమును చేరుచున్నారు. యజ్ఞయాగాదుల చేసినవారును వైశాఖవ్రతమును చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. తీర్థయాత్రలు , దానములు , తపములు , వ్రతములు యెన్ని చేసినవారైనను వైశాఖవ్రతము చేసిన వారి వలె విష్ణులోకమును చేరుట లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రమున పడువారు , యుద్దమున మరణించినవారు , భృగుపాతము చేసినవారు , కాశీక్షేత్రమున మరణించినవారు వీరెవరును వైశాఖ వ్రతము చేసినవారు పొందునంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని యందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటె వైశాఖవ్రతమును చేసినవారికి అనాయాసముగ అంతకంటె యెక్కువ పుణ్యము వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి విష్ణుపూజను చేసి వైశాఖ మహత్మ్యమును విని యధాశక్తి దానములను చేసి జీవులు సులభముగ విష్ణులోకమును చేరుచున్నారు. వైశాఖవ్రతమును చేసిన పాపాత్ములును విష్ణులోకమును చేరుట యుక్తముగ నాకు అనిపించుటలేదు. కీర్తిమంతుని యాజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసినవారు , చేయనివారు , శుద్ధులు , అపరిశుద్ధులు , వారువీరు అననేల అందరును శ్రీ హరి లోకమును చేరుచున్నారు.


సృష్టికర్తా ! జగత్ర్పభూ ! మీ యాజ్ఞను పాటించుచున్న నన్ను నా పనిచేయనీయక అడ్డగించినవారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరును వైశాఖ వ్రతము నాచరించి వారెట్టివారైనను విష్ణులోకమునకే పోదురు. ఇందువలన నరకము , స్వర్గము మున్నగు లోకములు శూన్యములై యుండును. పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదములకడ నుంచుచున్నాను. వీనిని యేమి చేయుదురో మీ ఇష్టము. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి యెందులకు యెట్లు కన్నదో నాకు తెలియుటలేదు. శత్రువును గెలువని నా బోటి వాని జన్మవ్యర్థము. అట్టివానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రు విజయము నందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రువిజయమును సాధించి కీర్తినందని వాని జన్మయేల వాని తల్లిపడిన శ్రమయు వ్యర్థమే.


కీర్తిమంతునివంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతెయే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా ? నా వ్రాతనే మార్చినవాడుకదా ! ఇట్లు నా వ్రాత నెవరును ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము అందరిచే వైశాఖవ్రతము నాచరింపచేసి స్వయముగ హరి భక్తుడై జనులందరిని విష్ణులోకమునకు పంపిన వాడు కీర్తిమంతుడే. ఇట్టివారు మరెవ్వరును లేరు. అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను.


*వైశాఖ పురాణం లోని పదిహేడవ అధ్యాయం సంపూర్ణం*


            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

ఆర్య చాణక్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 55*


చాణక్యుడు వోరకంట వారినందర్నీ గమనిస్తూ "అపర్ణాహపు వేళ ఆకలి బాధతో నకనకలాడుతున్న నేను సరియైన వేళకే ఈ సంతర్పణకి వచ్చినట్లున్నాను. తమ పంక్తిలో తమ సరసన కూర్చుందామన్న కోరిక నాకున్నా ఒక్క ఆసనం కూడా ఖాళీగా లేదు. తమరు అనుమతిస్తే ఆ సువర్ణాసనాన్ని అలంకరిస్తాను" అని అడుగు ముందుకు వేశాడు. 


పండితుడొకడు వారిస్తూ "క్షమించండి చాణక్య మహాశయా ! ఆ సువర్ణ పీఠాలు నంద ప్రభువులు, వారి అమాత్యుడు రాక్షసుల వారికి" అని చెప్పాడు వినయంగా. 


చాణక్యుడు రత్న ఖచ్చిత స్వర్ణ సమున్నత పీఠం వైపు చూస్తూ "ఆహా ! అలాగా ! అట్లయిన స్వర్ణమణిమరకతాలంకృతమైన ఆ సమున్నత దశమ పీఠాన్ని అలంకరిస్తాను" అంటూ మరో అడుగు ముందుకు వేశాడు. 


ఇంకొక పండితుడు తన పీఠం నుంచి చప్పున లేచి "ఆర్యా ! తమరు నా పీఠాన్ని అలంకరించండి. ఆ సమున్నత పీఠం వేదవేదాంగ వేత్త అయిన మహాపండితుడి కోసం నిర్దేశించబడింది" అని చెప్పాడు. 


చాణక్యుడు తలపంకించి, 

"ఓహో ! వేద వేదాంగ వేత్త కోసమా !" అంటూ పండితుల వైపు తిరిగి "మహాపండితోత్తముల్లారా ! మీలో ఎవరైనా .... ఏ ఒక్కరు గానీ .... కలిసికట్టుగా గానీ .... ఏ శాస్త్రమందైనా నాతో వాదించడానికి సిద్ధంగా ఉన్నారా ?" అని ప్రశ్నించాడు గంభీరస్వరంతో. 


ఒక్కరు కూడా బదులు పలకలేదు. చాణక్యుడు పండితులను తేరిపార చూస్తూ "వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వేదాంత, వైరాగ్య, ధర్మ, న్యాయ, మత, మీమాంస, గణిత, జ్యోతిష్య, ఖగోళ, తర్క, వితర్క, తదితర శాస్త్రాలలో దేనిలోనైనా నాతో వాదనకు మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా ?" అని ప్రశ్నించాడు ఉచ్చైస్వరంతో. 


చాణక్యుని పాండిత్య ప్రజ్ఞా పాటవాలను అంతకుముందే విని ఉన్న పండితుల్లో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అతనితో వాదించి ఓడిపోవడానికి ఒక్కరూ సంసిద్ధత ప్రకటించలేదు. 


చాణక్యుడు తలపంచి "మీ మౌనమే నా సర్వజ్ఞతకు ఆమోదం. కనుక మీ అందరి ఆమోద అనుమతులతో... వేద వేదాంగ వేత్త కోసం నిర్దేశించబడిన ఆ ఉన్నత పీఠాన్ని నేను అలంకరిస్తున్నాను" అని ప్రకటించి చరచరా వెళ్లి ఆ పీఠం మీద ఆశీనుడయ్యాడు. 


బ్రాహ్మణలోకం యావత్తు అతడు చర్యకు మాన్ప్రడిపోయింది. ఒక పండితుడు తేరుకుంటూ చప్పున లేచి నమస్కరిస్తూ "ఆర్యా ! ఆ స్థానం రాజగురువు సుబంధుల వారికోసం ...." అని తెలిపాడు. 


"ఆహా ! సుబంధుడా ! అతడే వేదవేదాంగవేత్తా...? తర్కంలో మమ్మల్ని మించిన వాడా?" వ్యంగంగా ప్రశ్నించాడు చాణక్యుడు. 


అంతలో అటుగా వచ్చిన పర్యవేక్షకుడు ఒకరు ఆ ప్రశ్నవిని, చాణక్యుని అదోలా చూస్తూ "వారు రాజగురువులు. ప్రభువులకు పూజనీయులు" అని చెప్పాడు. 


చాణక్యుడు తలపంకించి "మంచిదే. వారి పూజ్యత, దక్షత ఏ పాటితో మేము పరీక్షిస్తాం. రానివ్వండి" అన్నాడు నిర్భయంగా. 


సరిగ్గా అప్పుడే నందులు వస్తున్నట్లు సంకేతంగా జయజయధ్వనులు వినిపించాయి. కాసేపట్లో నందులు రానే వచ్చారు. రాక్షసామాత్యుడు, సుబంధులవారిని వెంటబెట్టుకొని. సుకల్పనందుడు వచ్చీ రావడంతోటే అతని దృష్టి చాణక్యుని మీద పడింది. తక్షణమే అప్రయత్నంగా తెలియని జడుపు ఏదో వెన్నుపూసలోంచి జరజరప్రాకి భయకంపితుడిని చేసింది. సరిగ్గా అప్పుడే రాక్షసుని దృష్టి చాణక్యుని మీద పడింది. ఆ ఆకారాన్ని చూసీ చూడగానే ఒక్కసారిగా ఆయనకి గంగవెర్రులెత్తినట్లయింది. ముఖం నిండా చెమటలు పట్టేశాయి. 


అదంతా ఒకే ఒక్క క్షణం. ఆ మరుక్షణమే సుకల్పనందుడు తేరుకుంటూ "ఎవరెక్కడ ? ఈ బడుగు బాపడిని ఈ మహాపీఠం మీద ఎవరు కూర్చోబెట్టారు ?" అని అరిచాడు ఆగ్రహంతో. 


"బడుగు బాపడిని కాదు. వేదవేదాంగ వేత్త కోసం నిర్దేశింపబడిన పీఠం అని విన్నాను. ఈ పండితులని వాదనకు ఆహ్వానించాను. ఎవ్వరూ చర్చకు సిద్ధపడలేదు. వారి మౌనం నా వేదవేదంగా సర్వజ్ఞతకు ఆమోదంగా భావించి నా అంతట నేనే ఈ ఆసనాన్ని అలంకరించాను. నా పేరు .... చాణక్యుడు...." ప్రకటించాడు చాణక్యుడు. 


చాణక్యుడి పేరు వినగానే రాక్షసామాత్యునికి ఒక్కసారిగా గొంతులో తడారిపోయింది. చలి జ్వరం తగిలినట్లు ఒళ్లంతా వణికిపోయింది. 


(ఇంకా ఉంది)...🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఎంద‌రోమ‌హానుభావులు

 #ఎంద‌రోమ‌హానుభావులు

ఘనాలంకార, ఘనచక్రవర్తి, వేదసమ్రాట్ 

#బ్రహ్మశ్రీవిశ్వనాధజగన్నాధఘనాపాఠి

 (జనవరి 27, 1910 - 1994 ఆగస్టు27) : - 

యావద్భారతదేశంలో పర్యటించి, 'వేద ప్రచారం' గావించిన ఘనపాఠీ, 'వేదవాఙ్మయ సౌరభాన్ని' లయబద్దంగా విశ్వానికి చాటిచెప్పిన సనాతన ధర్మజ్యోతి, 'రాజమహేంద్రవరం' కీర్తిని ఇనుమడింపజేసి, నగర చరిత్రలో అంతర్భాగంగా నిలిచిన ధన్యజీవి, ప్రముఖ వేద విద్వాంసులు 'కీ.శే. శ్రీ విశ్వనాధ జగన్నాధ ఘనాపాఠి' వారు.

"వేదం వింటే విధాత సమక్షంలో వినాలి, లేదంటే బ్రహ్మశ్రీ జగన్నాధ ఘనపాఠి నోట వినాలి", అన్నారు శృంగేరి శారదా పీఠాధిపతులు శ్రీ విద్యాతీర్ధస్వామి వారు'.

విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి వారి కంఠస్వరం మధురమైనది. స్వచ్ఛమైన ఉచ్ఛారణ ఆయన సొత్తు. సనాతన వేదవాఙ్మయ సౌరభాన్ని లయబద్దంగా విశ్వానికి చాటిచెప్పారాయన. ఆయన వేదం చెబుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేదని పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఎక్కడైనా 'వేదసభలు' జరుగుతుంటే అందరితో కలసి జగన్నాధ ఘనపాఠి 'వేదస్వస్తి' చెప్పేవారు. అక్కడున్న వేద పండితులంతా కనీసం ఒక పనసైనా చెప్పాలని పట్టుబట్టేవారు. ఘనాపాఠి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. 

జీవితవిశేషాలు....

శ్రీ విశ్వనాధ జగన్నాధ ఘనాపాఠి వారు, బ్రహ్మశ్రీ సుబ్బావధానులు, శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు సద్బ్రాహ్మణ పండిత వంశములో, విశాఖపట్నం జిల్లా, చోడవరం తాలూకా, చిన్ననందిపల్లి అగ్రహారంలో సౌమ్య పుష్య బహుళ విదియనాడు (జనవరి 27, 1910) జన్మించారు. రాజోలు సమీపంలోని నరేంద్రపురంలో బ్రహ్మశ్రీ రాణి సుబ్బావధానులు దగ్గర కూడా కొంతకాలం శిష్యరికం చేసారు. పిన్నవయస్సులోనే 'ఆదిభట్ల నారాయణదాసు' దగ్గర లయబద్దంగా వేదస్వస్తి చెప్పి, ప్రశంసలు అందుకున్నారు.

#పురస్కారాలు...

* భారత తొలి రాష్ట్రపతి డా.బాబూ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 1961 జూలై 2న విద్యా వాచస్పతి పురస్కారం అందుకున్న ఘనపాఠీ గారు ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. 

* ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డా జాకీర్ హుస్సేన్, వి. వి. గిరి, డా. శంకర్ దయాళ్ శర్మ, నాటి ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, పి. వి. నరసింహారావు అలాగే డా కె.ఎల్.రావు వంటి ప్రముఖుల చేత సత్కారాలు పొందారు. 

* శృంగేరీ జగద్గురువులు శ్రీ మదభినవ విద్యా తీర్ధులవారు 'ఘనాలంకార' బిరుదుతో సత్కరించగా, శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదుగా 'ఘనపాటిచక్రవర్తి' బిరుదుతో సన్మానం అందుకున్నారు. 

* విజయనగరం వేద పరిషత్ 'వేద సమ్రాట్' బిరుదుతో సత్కారం చేయగా, సువర్ణ పతకంతో శృంగేరి శారదా పీఠాధిపతులు, సువర్ణ హారంతో కంచి కామకోటి పీఠాధిపతి సన్మానించారు. సువర్ణ గండ పెండేరంతో 'విశాఖ వేద శాస్త్ర పరిషత్' సత్కరించింది.

#సువర్ణఘంటాకంకణసన్మానం...

* రాజమహేంద్రవర పుర వాసులు 1964లో జగన్నాధ ఘనపాఠీ వారికి 'సువర్ణ ఘంటా కంకణ సన్మానం' చేసారు. 

* 1970లో వేదపండితులైన "పద్మ భూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి" గారి ఆధ్వర్యాన ఘనపాఠిగారి "షష్టిపూర్తి మహోత్సవం" కన్నులపండుగగా నిర్వహించారు. 

* 1975లో రాష్ట్ర ప్రభుత్వంనుంచి 'పండిత పురస్కారం' అందుకున్నారు. శ్రీ రామభక్త గానసభ ఆధ్వర్యాన 'బ్రహ్మశ్రీ విశ్వనాధ జగన్నాధ ఘనపాఠీకి' కనకాభిషేకం చేయగా, 1991 జనవరి2న రాజమండ్రి పురపాలక సంఘం పౌర సన్మానం చేసి, గౌరవించింది. అదేరోజు ఘనపాఠీ వారి సహస్ర చంద్ర దర్శన మహోత్సవం పురవాసులు ఘనంగా నిర్వహించారు.

#ప్రపంచతొలితెలుగుమహాసభలలో....

* హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తొలి తెలుగు మహాసభలు 'జగన్నాధ ఘనపాఠీ వారి వేదస్వస్తి' తోనే శుభారంభ మయ్యాయి. 

* ఇందిరాగాంధి ప్రధానిగా వుండగా, పెద జీయర్ స్వామి డిల్లీలో నిర్వహించిన "అఖిల వేదశాఖా సమ్మేళనంలో" ఘనపాఠీ గారు పాల్గొని, లయబద్దమైన వేద స్వస్తితో అందరి ప్రశంసలు పొందారు.

*  రాజమండ్రి వేదశాస్త్ర పరిషత్ తో పాటు, విజయవాడ, టి టి డి వేద శాస్త్ర పరిషత్ లు నిర్వహించే పరీక్షలకు పరీక్షాధికారిగా వ్యవహరించారు . 

* కాశీలో శ్రీ రాజేశ్వర శాస్త్రి ద్రవిడ అధ్యక్షతన జరిగిన వేద సభలలో పాల్గొని, వేద వాజ్మయంలో ఓలలాడించారు. 

* ఇక 1958 ఫిబ్రవరిలో శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనస్వస్తి ప్రారంభించి, 40 రోజుల పాటు నిర్వహించడమే కాక, పండితులందరికీ సువర్ణ కుండలాలతో సత్కారం చేయించిన ఘనత ఘనపాటి వారిదే. బ్రహ్మశ్రిలు గుళ్ళపల్లి వెంకట నారాయణ ఘనపాఠీ, చిట్టి సుబ్రహ్మణ్య ఘనపాఠీ, శ్రీపాద శ్రీరామ నృసింహ ఘనపాఠీ, ఈమని రామకృష్ణ ఘనపాఠీ వంటి ఉద్దండులతో ఈ ఘనస్వస్తిలో జగన్నాధ ఘనపాఠీ పాలుపంచుకున్నారు.

* శృంగేరీ జగద్గురువులు శ్రీ మదభినవ విద్యా తీర్ధుల వారితో కలసి కాశ్మీర్ యాత్ర సాగించారు

#వేదసభ...

యావద్భారతదేశంలో పర్యటించి, వేద ప్రచారం గావించిన ఘనపాఠీ వారికి ఎందఱో శిష్యులున్నారు. బ్రహ్మశ్రిలు గోలి కొండావధానులు, అయ్యల సోమయాజుల సుబ్బావధానులు, యడవల్లి రమణావధానులు వంటి వారంతా శిష్యగణంలోవారే. 'టిటిడి వేద పారాయణ స్కీం' పర్యవేక్షకునిగా కొంతకాలం సేవలందించిన ఘనపాఠీ గారు 1994 ఆగస్టు27 శ్రావణ బహుళ షష్టి శనివారం తెల్లవారుఝామున "మహాభి నిష్క్రమణం" చేసారు. 

ఆయన పేరిట 'వేద శాస్త్ర పరిషత్' ట్రస్ట్ పెట్టి, ప్రతియేటా కృష్టాష్టమికి 'వేదసభ' నిర్వహించి, పండిత సత్కారం చేస్తున్నారు.

2010, జనవరి 2వ తేదిన ఘనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాధ జగనాధ ఘనపాఠి శత జయంతి సభ రాజమహేంద్రవరం టిటిడి కల్యాణ మంటపంలో నిర్వహించారు. శతజయంతి కమిటీ ఆధ్వర్యాన ప్రత్రేక సంచిక ప్రచురించారు. కాగా శ్రీ ఘనపాఠి గారికి ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. రెండవ కుమారుడు శ్రీ విశ్వనాధ గోపాలకృష్ణశాస్త్రి గారు కూడా రాష్ట్రపతి పురస్కారాన్ని స్వీకరించారు.