🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 55*
చాణక్యుడు వోరకంట వారినందర్నీ గమనిస్తూ "అపర్ణాహపు వేళ ఆకలి బాధతో నకనకలాడుతున్న నేను సరియైన వేళకే ఈ సంతర్పణకి వచ్చినట్లున్నాను. తమ పంక్తిలో తమ సరసన కూర్చుందామన్న కోరిక నాకున్నా ఒక్క ఆసనం కూడా ఖాళీగా లేదు. తమరు అనుమతిస్తే ఆ సువర్ణాసనాన్ని అలంకరిస్తాను" అని అడుగు ముందుకు వేశాడు.
పండితుడొకడు వారిస్తూ "క్షమించండి చాణక్య మహాశయా ! ఆ సువర్ణ పీఠాలు నంద ప్రభువులు, వారి అమాత్యుడు రాక్షసుల వారికి" అని చెప్పాడు వినయంగా.
చాణక్యుడు రత్న ఖచ్చిత స్వర్ణ సమున్నత పీఠం వైపు చూస్తూ "ఆహా ! అలాగా ! అట్లయిన స్వర్ణమణిమరకతాలంకృతమైన ఆ సమున్నత దశమ పీఠాన్ని అలంకరిస్తాను" అంటూ మరో అడుగు ముందుకు వేశాడు.
ఇంకొక పండితుడు తన పీఠం నుంచి చప్పున లేచి "ఆర్యా ! తమరు నా పీఠాన్ని అలంకరించండి. ఆ సమున్నత పీఠం వేదవేదాంగ వేత్త అయిన మహాపండితుడి కోసం నిర్దేశించబడింది" అని చెప్పాడు.
చాణక్యుడు తలపంకించి,
"ఓహో ! వేద వేదాంగ వేత్త కోసమా !" అంటూ పండితుల వైపు తిరిగి "మహాపండితోత్తముల్లారా ! మీలో ఎవరైనా .... ఏ ఒక్కరు గానీ .... కలిసికట్టుగా గానీ .... ఏ శాస్త్రమందైనా నాతో వాదించడానికి సిద్ధంగా ఉన్నారా ?" అని ప్రశ్నించాడు గంభీరస్వరంతో.
ఒక్కరు కూడా బదులు పలకలేదు. చాణక్యుడు పండితులను తేరిపార చూస్తూ "వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, వేదాంత, వైరాగ్య, ధర్మ, న్యాయ, మత, మీమాంస, గణిత, జ్యోతిష్య, ఖగోళ, తర్క, వితర్క, తదితర శాస్త్రాలలో దేనిలోనైనా నాతో వాదనకు మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా ?" అని ప్రశ్నించాడు ఉచ్చైస్వరంతో.
చాణక్యుని పాండిత్య ప్రజ్ఞా పాటవాలను అంతకుముందే విని ఉన్న పండితుల్లో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అతనితో వాదించి ఓడిపోవడానికి ఒక్కరూ సంసిద్ధత ప్రకటించలేదు.
చాణక్యుడు తలపంచి "మీ మౌనమే నా సర్వజ్ఞతకు ఆమోదం. కనుక మీ అందరి ఆమోద అనుమతులతో... వేద వేదాంగ వేత్త కోసం నిర్దేశించబడిన ఆ ఉన్నత పీఠాన్ని నేను అలంకరిస్తున్నాను" అని ప్రకటించి చరచరా వెళ్లి ఆ పీఠం మీద ఆశీనుడయ్యాడు.
బ్రాహ్మణలోకం యావత్తు అతడు చర్యకు మాన్ప్రడిపోయింది. ఒక పండితుడు తేరుకుంటూ చప్పున లేచి నమస్కరిస్తూ "ఆర్యా ! ఆ స్థానం రాజగురువు సుబంధుల వారికోసం ...." అని తెలిపాడు.
"ఆహా ! సుబంధుడా ! అతడే వేదవేదాంగవేత్తా...? తర్కంలో మమ్మల్ని మించిన వాడా?" వ్యంగంగా ప్రశ్నించాడు చాణక్యుడు.
అంతలో అటుగా వచ్చిన పర్యవేక్షకుడు ఒకరు ఆ ప్రశ్నవిని, చాణక్యుని అదోలా చూస్తూ "వారు రాజగురువులు. ప్రభువులకు పూజనీయులు" అని చెప్పాడు.
చాణక్యుడు తలపంకించి "మంచిదే. వారి పూజ్యత, దక్షత ఏ పాటితో మేము పరీక్షిస్తాం. రానివ్వండి" అన్నాడు నిర్భయంగా.
సరిగ్గా అప్పుడే నందులు వస్తున్నట్లు సంకేతంగా జయజయధ్వనులు వినిపించాయి. కాసేపట్లో నందులు రానే వచ్చారు. రాక్షసామాత్యుడు, సుబంధులవారిని వెంటబెట్టుకొని. సుకల్పనందుడు వచ్చీ రావడంతోటే అతని దృష్టి చాణక్యుని మీద పడింది. తక్షణమే అప్రయత్నంగా తెలియని జడుపు ఏదో వెన్నుపూసలోంచి జరజరప్రాకి భయకంపితుడిని చేసింది. సరిగ్గా అప్పుడే రాక్షసుని దృష్టి చాణక్యుని మీద పడింది. ఆ ఆకారాన్ని చూసీ చూడగానే ఒక్కసారిగా ఆయనకి గంగవెర్రులెత్తినట్లయింది. ముఖం నిండా చెమటలు పట్టేశాయి.
అదంతా ఒకే ఒక్క క్షణం. ఆ మరుక్షణమే సుకల్పనందుడు తేరుకుంటూ "ఎవరెక్కడ ? ఈ బడుగు బాపడిని ఈ మహాపీఠం మీద ఎవరు కూర్చోబెట్టారు ?" అని అరిచాడు ఆగ్రహంతో.
"బడుగు బాపడిని కాదు. వేదవేదాంగ వేత్త కోసం నిర్దేశింపబడిన పీఠం అని విన్నాను. ఈ పండితులని వాదనకు ఆహ్వానించాను. ఎవ్వరూ చర్చకు సిద్ధపడలేదు. వారి మౌనం నా వేదవేదంగా సర్వజ్ఞతకు ఆమోదంగా భావించి నా అంతట నేనే ఈ ఆసనాన్ని అలంకరించాను. నా పేరు .... చాణక్యుడు...." ప్రకటించాడు చాణక్యుడు.
చాణక్యుడి పేరు వినగానే రాక్షసామాత్యునికి ఒక్కసారిగా గొంతులో తడారిపోయింది. చలి జ్వరం తగిలినట్లు ఒళ్లంతా వణికిపోయింది.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి