19, ఏప్రిల్ 2021, సోమవారం

కొత్త యుద్ధం*

 🦌🦌 *కొత్త  యుద్ధం*

 *సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు*


*అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .*


*ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.*


*అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.*


*"అవును మాది జింకలవనం " అంది.*


*" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.*


*" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.*


*అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .*


 *సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .*


*వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .*


 *తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .*


*కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి.* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .*


*పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .*


*అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.*


*" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.*

*ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.*


*ఈ సింహం ఆహారం లేకుండా*

*14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.*


*కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.*


*ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.*


*జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.*


*పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.*


ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..

*ఇంట్లోనే ఉండండి* 

*కరోనా రక్కసి పనిపట్టండి*


మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా 🤔🙏🙏

శివునికి అభిషేకం

 శివునికి అభిషేకం చేయుట వలన ఫలితం వక పరిశీలన. జలం నారాయణ స్వరూపం. ప్రకృతిని ప్రకృతి పరంగా ఆరాధన. అనగా ప్రకృతి సిద్దమైన లింగం ప్రకృతిపరమైన జలంతో అభిషేకం. దీని ఫలితం అవభృధ స్నాన ఫలితం. యీ స్నానము అశ్వమేధ యాగంలో వక భాగం. యిది లేనిదే యాగ ఫలితం లేదు. అందుకే రుద్రంలో మంత్రపూరిత అభిషేకం అవభృధశ్చమే స్వగాకారశ్చమే యని కలదు. స్వయంగా దేహ ధారి యైన జీవునికి ప్రకృతిని వుపాశన చేయుట. అభిషేక ప్రక్రియ. లింగారాధన నిర్గుణ రూప ప్రకృతిని ప్రకృతిపరమైన జలం ద్వారా సగుణోపాశన వలన సృష్టి ధర్మమని తెలియుచున్నది. దీని ఫలితం ప్రకృతి చైతన్యం.జల తత్వం లక్షణ మైన భూమి నిర్వీర్యం మహా ప్రళయం. భూమి కూడా దహించబడి సూక్ష్మ రూపం దాల్చి హవిస్సు పూర్వకంగా మారుట. అనగా సర్వం నారాయణ తత్వం లో కలియుట.తిరిగి పునః సృష్టిలో సృష్టి నారాయణ సంకల్పంతో మాత్రమే. అనగా జల తత్వమే నారాయణ స్వరూపమని తెలియును. సృష్టి మూలం ముందు తెలియదు లేదు. సృష్టించిన తరువాతనే దాని లక్షణము తెలియును.అప్పుడే మాయతో అహంకారం ప్రబలును. యిది ఆదిలో నారాయణ తత్వం బ్రహ్మకుకూడా  తెలియలేదు. సాధన వలన దీనిని తెలిసికొని పిదప సృష్టి సంకల్పము. మనకు లింగారాధన ద్వారానే సృష్టి ధర్మం తెలియుట. నారాయణ తత్వం పరమేశ్వర తత్వం. దీనికి లింగభేదం లేదు. బ్రహ్మ సృష్టి తరువాతనే ప్రకృతి పరమైన లింగభేదం తెలిసినది. తెలుసుకుంటూనే వుందాం.

రామాయ‌ణం-యుద్ధ‌కాండ‌*

 శ్రీ శ్రీ శ్రీ

*రామాయణ దివ్యకథా పారాయణం*


*శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినం వ‌ర‌కు*

  

         *7 వ  రోజు*

  *రామాయ‌ణం-యుద్ధ‌కాండ‌*

               ***


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం 

రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ****

అతులిత బలదామం, స్వర్ణ శైలాభ దేహం

దనుజ వన కృశానుం, జ్ఞానినా మగ్ర గణ్యం ।

సకల గుణ నిధానం, వానరాణా మధీశం

రఘు పతి ప్రియ భక్తం వాత జాతం నమామి.

                *****


హనుమంతుడు సీతాన్వేషణానంతరం ముందుగా "చూశాను సీతను" అని చెప్పి, ఆ త‌ర్వాత‌ తన సాగర లంఘనం, లంకా ప్రవేశం, సీతాన్వేషణ, సీతను ఓదార్చటం, రావణునితో సంభాషించ‌టం, లంకా దహనం గురించి రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వివరించాడు. ఒక్క నెల లోపు రాముని చూడకుంటే తాను బ్రతుకనని సీత చెప్పినదన్నాడు.


*యుద్ధానికి సిద్ధం*


హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు,  "ఇంతటి క్లిష్టకార్యాన్ని మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణాల‌ను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనం కంటె నీకు నేనేమి బహుమానం ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొన్నాడు. సీత‌ప‌డుతున్న క‌ష్టాలను త‌ల‌చుకుని దుఃఖిస్తున్న‌ రామడిని ఓదార్చి  సుగ్రీవుడు ధైర్యం  చెప్పాడు. రాముడికి జయం తప్పదన్నాడు. హనుమంతుడు లంకా నగర రక్షణ వ్వవస్థను విశదంగా తెలిపాడు. తరువాత అందరూ తర్కించి యుద్ధానికి నిశ్చ‌యించారు.


సరైన సమయం చూసి, నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కపిసేన కోలాహలంగా దక్షిణ దిక్కుగా ప‌య‌న‌మైంది. రాముడి ఆజ్ఞపై ఆ వానర సేన జనావాసాలమీద పడకుండా జాగ్ర‌త్త‌గా అడవులు, కొండలు, గుట్టలు, నదులు, సరస్సుల మీదుగా నడచింది. రాముని ఆజ్ఞలో నడచిన ఆ సేనకు నీలుడు సేనా నాయకుడు. సుగ్రీవుడు పాలకుడు. 

హనుమంతుని భుజాలపైన రాముడు, అంగదుని భుజాలపైన లక్ష్మణుడు అధిరోహించారు. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి, శతబలి, కేసరి, పనసుడు, గజుడు, అర్కుడు, వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు వంటి ఎందరో మహా వీరులు ఆ వానర భల్లూక సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. రామకార్యం సాధించడానికి విక్రమోజ్వలులై ఉల్లాసంగా సాగరతీరం చేరుకొన్న ఆ సేన మరొక సాగరంలా ఉంది. వానర వీరులు ఒక చోట, గోలాంగూల వీరులు ఒకచోట, భల్లూకవీరులు మరొక చోట - ఇలా మూడు భాగాలుగా విడిది చేశారు.


*విభీషణ శరణాగతి*


అక్కడ లంకలో రావణుడికి రాముడు స‌సైన్యంగా యుద్ధానికి బ‌య‌లుదేరాడ‌న్న స‌మాచారం అందింది. ఈ విషయమై తనవారితో మంత్రాంగం నెరప సాగాడు. పుర భద్రత కట్టుదిట్టంగా ఉండాలని  ఆదేశించాడు. రాక్షస వీరులు రావణుని ప్రతాపాన్ని పొగిడారు.తమ శక్తి సామర్ధ్యాలను  తామే కీర్తించుకొని, త‌మ‌కు ఎదురులేద‌ని స‌ర్ది చెప్పుకున్నారు. ఒక్కొక్కరు తానే రామలక్ష్మణులను కడతేర్చగలమన్నారు. కాని రావణుని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించాడు. రామలక్ష్మణుల క్రోధాగ్నికి లంక భస్మమవ్వడం తథ్యమని, రావణుడు అనాలోచితంగా సీత అనే కాలనాగును తన మెడకు చుట్టుకొన్నాడని నచ్చచెప్పడానికి యత్నించాడు. సీతను రాముడికి అప్పగించి చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోమన్నాడు. మళ్ళీ రావణుని సౌధానికి వెళ్లాడు. చివ‌రి ప్ర‌య‌త్నం చేద్దామ‌నుకున్నాడు.  లంకలో అశుభ నిమిత్తాలనేకం ముప్పిరిగొన్నాయని, రానున్న విపత్తునుండి రాక్షసజాతిని కాపాడమని ప్రార్థించాడు.

మరునాడు రావణుడు మంత్రగృహంలో కొలువుతీరినపుడు సకల అమాత్య బంధుగణంతో పాటు కుంభకర్ణుడు కూడా ఉన్నాడు. రావణుడు పొరపాటు చేశాడని, అయినా తాను విజృంభించి అతని కార్యం సిద్ధింపజేస్తానని కుంభకర్ణుడు అన్నాడు. మళ్ళీ విభీషణుడు హితవు చెప్పబోగా ఇంద్రజిత్తు, రావణుడు అతనిని నిందించారు. ఇక రావ‌ణుడు మార‌డ‌ని తెలుసుకున్నాడు విభీష‌ణుడు. రావ‌ణ ప‌త‌నం త‌ప్పద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చాడు. వెంట‌నే  తనకు ఆప్తులైన నలుగురు రాక్షసులతోకలిసి విభీషణుడు అన్నగారి వ‌ద్ద‌ సెలవు తీసికొని ఆకాశానికి ఎగిరి, సాగరందాటి, రాముని శరణు వేడాడు.

 విభీష‌ణుడిని నమ్మవద్దని కపివీరులన్నారు. విభీషణుడు సౌమ్యుడని, నమ్మదగినవాడని హనుమంతుడు చెప్పాడు. శరణుకోరిన సకల భూతాలకు అభయం ఇవ్వడం తన వ్రతమని చెప్పి రాముడు, విభీషణునకు ఆశ్రయమిచ్చాడు. రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు వంటి మహాయోధుల పరాక్రమాన్ని, లంకా నగరం పటిష్ఠతను విభీషణుడు వివరించాడు. సపుత్ర బాంధవంగా రావణుడిని చంపిగాని తాను అయోధ్యకు మరలనని రాముడు తన తమ్ములు ముగ్గురిమీదా ఒట్టుపెట్టి చెప్పాడు. కానున్న లంకాధిపతిగా విభీషణునికి సాగరజలాలతో  అప్ప‌టిక‌ప్పు డే అభిషిక్తుని చేయించాడు రాముడు.


తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రాముడికి సాయం చేయవద్దని, రావణుడు సుగ్రీవుడికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదు గనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ఈ ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు.

 సముద్రం దాట‌డానికి మార్గం ఏమిటని హనుమంతుడు, సుగ్రీవుడు విభీషణుని అడిగారు. రాముడు సముద్రుడి సాయం కోసం అర్ధించాలని విభీషణుడు సలహా ఇచ్చాడు. సముద్రుడి సహాయం కోరి రాముడు మూడు రాత్రులు నియమంగా దీక్ష వహించినా సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. కోపించి రాముడు సముద్రాన్ని ఎండగట్టేస్తానని ధనుస్సు ఎక్కుపెట్టాడు. సముద్రుడు వచ్చి, వినయంగా నమస్కరించి, తన స్వభావాన్ని త్యజింపలేనని మనవి చేశాడు. విశ్వకర్మ కొడుకైన నలుని ప్రజ్ఞతో వారధిని నిర్మింపవచ్చునని తెలిపాడు. సముద్రుడి కోరికపై రాముడు తన అస్త్రాన్ని ద్రుమకుల్యంలోని దస్యులపై విడిచిపెట్టాడు.


*సముద్రంపై వార‌ధి*


ఇక స‌ముద్రాన్ని దాటడానికి అద్భుతమైన వారధి నిర్మాణం నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది.  అయిదు రోజుల‌లో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి నిర్మించారు. విభీషణుడు ఒక ప్రక్క వారధికి రక్షణగా నిలిచాడు. వానర భల్లూకసేనలు, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా  రామకార్యానికి సన్నద్ధమై ఉంది. దుంపలు, ఫలాలు, జలం పుష్కలంగా ఉన్నచోట  వారంతా విడిది చేశారు.


త్రికూట పర్వతం పైన లంకా పట్టణం  అద్భుతంగా క‌నిపిస్తున్న‌ది.. ఆ శోభను గమనించి రాముడు ఆశ్చర్య పోయాడు. 

రావణుడి గూఢ‌చారులైన‌ శుక సారణులు వాన‌ర‌సేన విడిది చేసిన ప్రాంతాన్నిగ‌మ‌నించారు.

 రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమంతాది వీరుల పరాక్రమాన్ని రావణునికి వివరించారు. వానరసేన ఎంత ఉందో లెక్కపెట్టడం అసాధ్యమన్నారు. ఇంత సేనావాహిని లంకాన‌గ‌రం వెలుప‌ల వేచి ఉన్న‌ద‌ని ఇక ఇప్ప‌టికైనా  సీతమ్మ‌ను  రామునకప్పగించడం మంచిదని తమకు తోచింద ని విన‌యంతో రావ‌ణుడికి చెప్పారు. ప్రాసాదం పైకి తీసుకెళ్ళి వానరవీరుల సేనానాయకులలోని ముఖ్యులను చూపించారు -


రావణుడు పంపిన మరొక గూఢ‌చారి శార్దూలుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. వానర భల్లూక వీరుల పరాక్రమం గురించి మరిన్ని విషయాలు చెప్పాడు. సీత‌మ్మ‌ను అప్ప‌గించ‌డ‌మే శ్రేయ‌స్క‌రం అన్నాడు. యుద్ధ‌మంటూ జ‌రిగితే ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో తెలియ‌జెప్పాడు. అయినా రావ‌ణుడు ప‌ట్టించుకోలేదు. ఈ  ద‌శ‌లో సీత మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీయాల‌నుకున్నాడు రావ‌ణాసురుడు.


*యుద్ధానికి ముందు*


రావణుడు విద్యుజ్జిహ్వుడనే మాయలమారి రాక్షసుని పిలిపించి రాముని శిరస్సును పోలిన ఒక మాయా శిరస్సును, ధనుర్బాణాలను చేయించాడు. యుద్ధంలో రామలక్ష్మణులు, వానర సైన్యం నశించారని సీతతో చెప్పి ఆ మాయా శిరస్సును, ధనుర్బాణాలను చూపాడు. సీత కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. రావణుడు వెళ్ళిపోయాక విభీషణుని భార్య, సరమ అనే సాధ్వి సీతను ఓదార్చి అది మాయ అని, రహస్యంగా తాను అంతా విన్నానని చెప్పింది. యుద్ధానికి భల్లూక వానర సమేతంగా రాముడు 

 లంకా న‌గ‌రం వెలుప‌ల విడిది చేసి సిద్ధంగా ఉన్నాడని, సీతకు శుభ సౌభాగ్య సమయం ఆసన్నమయందని అనునయించింది. రావణుని వినాశనం అనివార్యమని చెప్పింది..


     సైన్యాన్ని సమాయత్తపరచి రక్షణకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయించాడు రావణుడు. తూర్ప ద్వారంలో ప్రహస్తుడు, దక్షిణాన మహాపార్శ్వ మహోదరులు, పశ్చిమాన ఇంద్రజిత్తు, ఉత్తరాన శుక సారణులు అప్రమత్తులై యున్నారు. విరూపాక్షుడు లంకానగరం మధ్యనున్నాడు. రావణుడు స్వయంగా ఇతర స్థలాలతో పాటు ఉత్తర ద్వారాన్ని పర్యవేక్షిస్తానని చెప్పాడు. 

      ఇవన్నీ విభీషణుని చారుల ద్వారా రాముడు తెలుసుకొన్నాడు. తూర్పు ద్వారం వైపు నీలుడు, దక్షిణానికి అంగదుడు, పశ్చిమం ప్రక్కకు హనుమంతుడు తమ సైన్యాలతో దండు వెళ్ళేలాగా నియమించాడు. తాను స్వయంగా ఉత్తర ద్వారం వైపు విజయం చేస్తానన్నాడు. సుగ్రీవుడూ, జాంబవంతుడూ, విభీషణుడూ సైన్యం మధ్యలో ఉండి అంతా చక్కబెడతారు. ఇలా నియమించి, సువేల శిఖరంపైకి ముఖ్య నాయకులతో వెళ్ళి రాముడు లంకానగరాన్ని పర్యవేక్షించాడు. దూరాన ఒక గోపురాగ్రాన రావణుడు కనిపించాడు. అతనిని చూడగానే క్రోధంతో సుగ్రీవుడు ఎగిరి వెళ్ళి భీకరమైన మల్లయుద్ధం చేశాడు. రావణుడు మాయలు ప్రయోగించడానికి సన్నద్ధమయ్యేసరికి ఒక్కగెంతున తిరిగి వచ్చేశాడు.


రాముడి త‌ర‌ఫున‌ అంగదుడు దూతగా వెళ్ళి చివరిసారిగా రావణునికి రాముని సందేశాన్ని వినిపించాడు. సీత నిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలి వేస్తాడని చెప్పాడు. అంగదుడి సూచ‌న‌ను రావణుడు తిర‌స్క‌రించాడు. అంగదుడు రావణుని గోపుర శిఖరాన్ని కాలితో తన్ని పడగొట్టి తిరిగి వచ్చాడు.


*రామ లక్ష్మణ సుగ్రీవులకు జయం*


*జ‌యత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః*

*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః*


అంటూ వానరసేన లంకను ముట్టడించింది. ముందుగా మట్టితోను, బండరాళ్ళతోను, చెట్లతోను అగడ్తను పూడ్చివేసి ప్రాకరాలు ఆక్రమించారు. గోపురాలు, ప్రాకార తోరణాలు పడగొట్టేశారు. వీరబాహువు, సుబాహుడు, నలుడు ప్రాకారాలు భేదించ సాగారు. కుముద, ప్రఘన, పనసులు తూర్పున, శతవలి దక్షిణాన, సుషేణుడు పడమర, మహాకాయ గవాక్ష ధూమ్రులు ఉత్తరాన ద్వారాలు బ్రద్దలుకొట్టసాగారు. ప్రళయకాల సముద్రంలాగా కాల మేఘాల్లాంటి రాక్షససేన సింహనాదాలతో, దుందుభి ధ్వానాలతో వానరులను ఎదుర్కొంది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. ఒక్క క్షణంలో యుద్ధం భీకరం అయి భూమి అంతా రక్త మాంసాలతో నిండిపోయింది.


వానర రాక్షస ప్రముఖుల మధ్య ద్వంద్వ యుద్ధాలు ఆరంభమయ్యాయి.  రాత్రి అయినా కొనసాగుతున్న యుద్ధం వల్ల రక్తం నదులుగా ప్రవహించింది. అది  కాళ‌రాత్రిగా మారింది.


*నాగపాశ విమోచన*


అంగదుని చేత పరాభవం పొందిన ఇంద్రజిత్తు ఒక్కసారిగా మాయమైపోయాడు. మాయాయుద్ధం ప్రారంభించి,  నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన  పరుగులు తీసింది. అందరు వానర సైన్యాధిపతులూ ఇంద్రజిత్తు బాణాలతో గాయపడినవారే. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. రావణుడు ఆనందించి, ఆ రాఘవుల మృతదేహాలను సీతకు చూపమని ఆదేశించాడు. పుష్పకంపై సీతను తెచ్చి ఆ దృశ్యం చూపగా ఆమె విలపించ సాగింది. రామలక్ష్మణులు కేవలం మూర్ఛ‌పోయార‌ని, త్వరలో కోలుకొంటారని చెప్పి, త్రిజట సీతను ఊరడించింది.


భయభీతులైన వానరులంతా రామ ల‌క్ష్మ‌ణుల‌ చుట్టూ కూర్చుని దుఃఖించసాగారు.

సంపాతి, పనసుడు, హనుమంతుడు వెళ్ళి దివ్యౌషధాలను తెస్తే ప్రయోజనం ఉంటుందని సుషేణుడన్నాడు.


అంతా విషణ్ణులైన సమయానికి పెద్ద సుడిగాలి వీచి సముద్రం కల్లోలమయ్యింది. గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చాడు. అతని రాకతో శరరూపంలో రామ సౌమిత్రులను పట్టుకొని ఉన్న సర్పాలన్నీ పారిపోయాయి. గరుడుడు తన రెండు చేతులతోను రామలక్ష్మణుల సర్వావయవాలను నిమిరాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటికంటె ఎక్కువ తేజస్సు, బల వీర్య పరాక్రమాలు సమకూరాయి. వారిని కౌగలించుకొని గరుడుడు - "మీరు జాగరూకతతో ఉండండి. నేను మీకు స్నేహితుడనెలా అయ్యానో తరువాత తెలుస్తుంది. రామా! నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి సీతను పొదడం తథ్యం" - అని చెప్పి, రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరి పోయాడు.


*రాక్షస వీరుల మరణం*


రామలక్ష్మణులు మూర్ఛ‌నుంచి తేరుకుని, వానరులు కుప్పిగంతులు వేస్తూ, సింహనాదాలు చేస్తూ, పరవళ్ళు తొక్కుతూ చెట్లు పీకి యుద్ధానికి సన్నద్ధులయ్యారు. తెల్లబోయిన రావణుడు ధూమ్రాక్షుని యుద్ధానికి పంపాడు. ధూమ్రాక్షుడు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని దక్షిణద్వారానికి వెళ్ళి వానరులను చెండాడసాగాడు. ప్రతి వానరవీరుడూ తన పేరు చెప్పుకొంటూ రాక్షసులను చావబాదసాగాడు. హనుమంతుడు విసిరి వేసిన పెద్ద గిరిశిఖరం క్రింద పడి ధూమ్రాక్షుడు పచ్చడి అయిపోయాడు.


*అకంపనుడు*

 మహావీరుడైన అకంపనుడు యుద్ధోత్సాహంతో, సముద్రంలాంటి తన సేనను వెంటబెట్టుకొని బయలుదేరాడు. వానరులు, రాక్షసులు ఒకరికొకరు తీసిపోకుండా భీకరమైన పోరు సాగించారు. . హనుమంతుడు అతనిని నిలువరించాడు. హనుమ పాదతాడనంతో భూమి కంపించింది. ఒక మహావృక్షాన్ని పెరికి దానితో అకంపనుని చూర్ణం చేసేశాడు. 


 *ప్రహస్తుడు*

ఇప్పుడేమి చేయాలని రావణుడు ప్రహస్తుని అడిగాడు. ప్రహస్తుడు రావణుని సేనానాయకుడు. శస్త్రాస్త్రవేది. మహావీరుడు.


శత్రుభీకరమైన మహోన్నత సేనను సమకూర్చుకొని తూర్పు ద్వారంవైపు యుద్ధానికి బయలుదేరాడు. మేఘంపైకి సుడిగాలిలాగా నీలుడు ప్రహస్తుని మీదకురికాడు. ఇద్దరూ మదపుటేనుగుల్లాగా కలియబడ్డారు. ఒక పెద్ద బండరాతితో నీలుడు ప్రహస్తుని తల బద్దలుకొట్టి చంపేశాడు. రాక్షససేన కట్టతెగిన నదీప్రవాహంలాగా లంకలోకి పారిపోయింది.


*రావణునికి పరాభవం*


ఇక లాభం లేదనుకొని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని దివ్యరథంపై యుద్ధానికి బ‌య‌లుదేరాడు. అతనివెంట రాక్షససేన కదలి వచ్చే కాటుక కొండలలాగా ఉంది. ఆ సైన్యం అగ్ర భాగాన ముందు సూర్యబింబంలా ప్రజ్వలించే అకంపనుడు,  ఇంద్రజిత్తు, వింధ్యపర్వత సదృశ దేహుడైన మహోదరుడు, పిడుగులాంటి పిశాచుడు, మెరుపులాంటి శూలం పట్టుకొన్న త్రిశిరుడు, సర్ప ధ్వజుడైన కుంభుడు, వజ్రాలు పొదిగిన పరిఘను పట్టుకొన్న నికుంభుడు, అగ్నిలాంటి రథం అధిరోహించిన నరాంతకుడు రణోత్సాహులై ఉన్నారు. వారి మధ్య శ్వేతఛత్ర ధారియై రావణుడు ప్రచండ భానునిలా మెరిసిపోతున్నాడు. రావణుని తేజస్సును చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. సీతను అపహరించిన పాపానికి రావణునికి అంత్యకాలం సమీపించిందని చెబుతూ రాముడు ధనుస్సు ఎక్కుపెట్టాడు.


లంకా నగర రక్షణార్ధమై తక్కిన రాక్షస నాయకులను రావణుడు వెనుకకు పంపేశాడు.హనుమంతుని అరచేతి చరుపుకు రావణుడు, రావణుని పిడికిలి పోటుకు హనుమంతుడు కంపించిపోయారు. నీలుడు అంగుష్ఠమాతృడై రావణుని చికాకు పరచాడు. నీలుడు అగ్ని పుత్రుడు గనుక రావణుని ఆగ్నేయాస్త్రం నీలుని సంహరించలేకపోయింది. లక్ష్మణుడి బాణాలతో రావణుడి ధనుసు విరిగిపోయింది. రావణుడి శక్తితో లక్ష్మణుడు తెలివి తప్పాడు. అతనిని రావణుడు ఎత్తలేకపోయడు. హనుమంతుడు లక్ష్మణుని ఎత్తి రామునివద్ద పడుకోబెట్టాడు. హనుమంతుని గుద్దుకు రావణుడు నెత్తురు కక్కి మూర్ఛిల్లాడు. తెలివి తెచ్చుకొని మళ్ళీ శరాఘాతం ప్రాంభించాడు.


హనుమంతుని భుజాలపై అధిరోహించి రాముడు రావణునిపై పోరు సాగించాడు. రావణుని వాడి బాణాలకు ఆంజనేయుడు జంకలేదు. అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని రథం, గుర్రాలు, ఛత్రం, ధ్వజం ధ్వంసమయ్యాయి. కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణునికి చెప్పాడు. సిగ్గుతో రావణుడు లంకలోకి వెళ్ళిపోయాడు.

🌸🌸🌸🌸🌸


చరితం రఘునాథస్య

శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్

జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్

స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్

రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్


*(యుద్ధకాండ* 

*తరువాయి భాగం రేపు)*

మొగలిచెర్ల

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*(రెండవరోజు)*


రాబోయే సంక్రాంతి పండుగ తరువాత తాను మౌనం వీడుతానని ఆ యువకుడు వ్రాసి చూపిన తరువాత..శ్రీధర రావు గారు తిరిగి మొగలిచెర్ల గ్రామానికి వచ్చేసారు..ఇంటికి రాగానే భార్య ప్రభావతి తో..తాను మాలకొండలో ఒక దిగంబర యోగిపుంగవుడిని చూశాననీ.. అతన్ని చూసిన మరుక్షణమే ఒక మహాత్ముడిని చూసిన అనుభూతి కలిగిందనీ.. ఈసారి తాను వెళ్ళేటప్పుడు..తనతో పాటు ఆమెను కూడా తీసుకెళతాననీ..ఎంతో ఉద్వేగంతో చెప్పారు..నిజానికి శ్రీధరరావు గారికి ఇంకా ఆ సాధకుడిని చూసినప్పుడు కలిగిన అనుభూతి వెంటాడుతూనే ఉంది..మాలకొండ నుంచి, మొఫలిచెర్ల దాకా ఎద్దులబండి లో దాదాపు రెండు గంటల ప్రయాణం చేసి వచ్చినా..ఆయన మనసంతా పార్వతీదేవి మఠం లో తాను ఆ సాధకుడి తో గడిపిన ఆ కొద్దిక్షణాల కాలమే గుర్తుకొస్తోంది..


శ్రీధరరావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు..


"ఈరోజుల్లో.. యోగులు!..మహర్షులు!!..అయ్యోరామ!..ఎవడో వేషం వేసుకొని వచ్చి ఉంటాడు..  ..ఇదిగో మీ లాటి వాళ్ళను తెలివిగా బుట్టలో వేసుకొని..ఈ రకంగా నాలుగు డబ్బులు వెనకేసుకొని..వెళ్ళిపోతారు..వీళ్లంతా కాంతా కనకాలకు ఆశపడే వాళ్లే..నేను రాను!..మీరూ ఊరికే వెళ్లి అతన్ని కలవకండి!..ఏదో ఆ నరసింహ స్వామి దయవల్ల ఇలా హాయిగా బ్రతుకుతున్నాము..మనఇద్దరికీ పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ లక్ష్మీనారసింహుడి సేవ చేసుకొనే అవకాశం వచ్చింది..కొండమీదకు ఆ రోడ్డు వేయిస్తే..ఎంతో మందికి స్వామిని దర్శించుకోవడం సులభం అవుతుంది..మీరు ముందాపని చూడండి..ఇటువంటి కుహనా యోగుల చుట్టూ తిరక్కుండా వుండండి.. మరోమాట..మనం సన్యాసులం కాదు..బాధ్యత గల సంసారులం.." అని సున్నితంగా కాదు గట్టిగానే చెప్పారు..


శ్రీధరరావు గారికి, ఆవిడ చేసిన ఈ బోధ రుచించలేదు..కాల,మాన పరిస్తితులనుబట్టి, ఆవిడ ఆవిధంగా ఊహించడంలో తప్పులేదు కానీ..అందరినీ ఒకే గాట కట్టటం తగదని ఆయన నచ్చచెప్పబోయారు..ప్రభావతి గారు చాలా సేపటి దాకా సమాధాన పడలేదు..

చివరకు.."సరే నండీ!..మీరంతగా చెపుతున్నారు కదా!..తరువాత చూద్దాం..ఎప్పుడో వీలున్నప్పుడు.." అని దాటవేశారు..

కానీ..శ్రీధరరావు గారు మాత్రం మాలకొండ కు వెళ్లినప్పుడల్లా..పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లి, ఆ యోగి వచ్చేదాకా ఎదురుచూసి.. ఆయనను కలిసి రావడం ఒక నియమంగా పెట్టుకొని ఆచరించసాగారు..అలాగే..తాను ఆ యోగిని కలిసివచ్చిన తరువాత తన అనుభూతి ని ప్రభావతి గారితో పంచుకోవడమూ చేసేవారు..


శ్రీధరరావు గారు పదే పదే చెపుతున్న మాటల వల్ల కావొచ్చు..సహజమైన కుతూహలం వల్ల కావొచ్చు..తాను ఈసారి శ్రీధరరావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పేసారు..ఆ తరువాత  రెండు మూడు రోజుల్లోనే సంక్రాంతి ఉంది..ఎలాగూ మౌన వ్రతం అయిపోతుంది కదా అని..ఆ దంపతులు పండుగ నాడు తమ గూడు బండిలో..మాలకొండకు ప్రయాణమయ్యారు..దారి పొడవునా..శ్రీధర రావు గారు ఆ యోగి గురించి చెపుతూనే వున్నారు..మాలకొండ క్రింద బండి ని ఆపేసి, బండితోలే అతనికి అక్కడే వుండమని చెప్పి..ఇద్దరూ పార్వతీదేవి మఠం వద్దకు మెట్లెక్కి వెళ్లారు..


సన్నగా వర్షం మొదలైంది..దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం ముందున్న చిన్న పందిరిలో నిలబడి వున్నారు..అమ్మవారి ఆలయం తలుపులు వేసేసి ఉన్నాయి..ఆ యోగి ఆలయం లో ఉన్నాడా?..లేక వేరేచోటికి వెళ్లాడా?..అని ఆలోచిస్తూ నిలబడ్డారు..


ఇంతలో..పై నున్న శివాలయం గుహ వద్ద నుంచి..మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యోగి, ఆ రాళ్ళ మధ్య నుంచి దిగి వస్తున్నాడు..నడుముదాకా వ్రేలాడుతూ..నీళ్లు కారుతున్న జుత్తు.. తెల్లటి మేని ఛాయ.. ఆరడుగుల శరీరం..చల్లటి చూపు..చిరునవ్వు తో కలిసిన విగ్రహం..ఒక చేతిలో దండము, మరో చేతిలో కమండలమూ..మొలకు కట్టుకున్న చిన్న అంగవస్త్రం తో దిగి వస్తున్నాడు..నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్దిదూరంలో నిలుచున్నాడు..చేయెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఊపి..పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకొని లోపలికి వెళ్లి..లోపలే ఉన్న చిన్న అరుగుమీద కూర్చుని ప్రక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకుని..తెల్లటి పాదాలను తుడుచుకోసాగాడు..


శ్రీధరరావు గారు ముందుగా వెళ్లి..ఆయన పాదాలకు నమస్కారం చేశారు..చిరునవ్వుతో ఆశీర్వదించారు..ప్రభావతమ్మ కూడా నమస్కరించబోయింది..చటుక్కున తన పాదాలను వెనక్కు తీసేసుకున్నాడా యోగి..ప్రభావతి గారికి ఒక్కసారిగా మనస్సు చివుక్కుమనిపించింది..తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒకానొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది..


"నాయనా!..నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం ..నా భర్త గారు నమస్కరిస్తే..ఆశీర్వదించావు..అదే నేను నమస్కారం చేస్తే..తిరస్కరిస్తున్నావు..మేమిద్దరమూ సమానమే గదా..ఈలోపల నీకీ తేడా ఎందుకు?.." అని నేరుగా అడిగేసింది..


ఒక్కక్షణం పాటు ప్రభావతి గారిని నవ్వుతూ చూసి..తాను కూర్చున్న అరుగు మీదనుండి లేచి..పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి..ఆ అమ్మవారి విగ్రహం పాదాలవద్ద..ఈశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో చూపి, అందులో ఉన్న పార్వతీదేవితో ప్రభావతి గారు సమానమనీ..తాను వినాయకుడితో సమానమనీ..తల్లి ఎప్పుడూ బిడ్డకు నమస్కరించరాదనీ...సైగలతో చెప్పి..మరలా పార్వతీదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి..వచ్చి..అరుగుమీద కూర్చున్నాడు..


"అమ్మా!..ఈనాటితో నా మౌనం పూర్తి అయింది..ఇక మీతో మాట్లాడతాను!.." అన్నారా యోగి మొదటిసారిగా ఆ దంపతులతో..ఇద్దరూ ఆయన కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వేసుక్కూర్చున్నారు..సాక్షాత్ దక్షిణామూర్తి తమ ఎదురుగా ఉన్న అనుభూతి కలిగిందా దంపతులకు!..


ఆదిత్య హృదయం అప్పజెప్పడం..స్వామి వారి బోధ..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114... సెల్..94402 66380 & 99089 73699).

ధ్యానం చేస్తుంటే

 ఓ కరుణా సముద్రుడైన శంకరా! నేను నా చేతుల వలన, పాదాల వలన, మాటల ద్వారా, మరియు శరీరం వలన గాని, వినికిడి వలన గాని, చూచుట వలన గాని, మనస్సు వలన గాని, తెలిసి గాని, తెలియక గాని, ఏదయినా అపరాధం చేసి నట్లయితే అవన్నీ క్షమించవలసినది.


🙏🏻🙏🏻🙏🏻


నిద్రకు ఉపక్రమించే ముందు కాసేపు భగవన్నామ స్మరణ చేసి ఈరోజును ముగిద్దాం. మీ ఇష్టదైవాన్ని కాసేపు తప్పక ప్రార్ధించండి .. రోజు మన దేహాన్ని శుభ్రం చేసుకున్నట్టు మన మనసుని కూడా నిద్రించే ముందు భగవన్నామ స్మరణతో పరిశుభ్రం చేసుకోవాలి . రోజు ధ్యానం చేస్తుంటే క్రమేణా జీవితం లో సకల సౌభాగ్యాలు సమకూరుతాయి .  మనసుకి ధ్యానం అలవాటు చేయండి