30, జులై 2021, శుక్రవారం

కాశీ-- పర్యాటకులకు

 కాశీకి వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పిలిగ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ప్రకటించింది. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను చూడాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూరిస్ట్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి వారణాసికి టూరిస్ట్ రైలును నడపనుంది. ఈ టూరిస్ట్ రైలు దారిలో కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్ల మీదుగా వారణాసికి వెళ్తుంది. ఆయా ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ఈ టూరిస్ట్ ట్రైన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ టూరిస్ట్ రైలు వారణాసి, ప్రయాగ్‌రాజ్, గయ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను కవర్ చేస్తుంది.

మహాలయ పిండ దాన్ తర్పణ్' పేరుతో ఈ రైలును ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 2021 సెప్టెంబర్ 25న ఈ రైలు బయల్దేరుతుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.


ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర రూ.6,620 కాగా, కంఫర్ట్ ధర రూ.11,030. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, హాల్, డార్మిటరీల్లో వసతి ఉంటుంది. కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, హోటల్‌లో వసతి ఉంటుంది. దీంతో పాటు రోజూ టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ 1 లీటర్ వాటర్ బాటిల్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లాండ్రీ, ఎంట్రెన్స్ ఫీజులు లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ కావు. ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి.


Day 1: మొదటి రోజు అంటే సెప్టెంబర్ 25న సికింద్రాబాద్, కాజిపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో పర్యాటకులు రైలు ఎక్కాలి.


Day 2: రెండో రోజు అర్ధరాత్రి వారణాసి చేరుకుంటారు. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.


Day 3: మూడో రోజు మొత్తం సైట్ సీయింగ్ ఉంటుంది. గంగా నదిలో పుణ్య స్నానం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి ఆళయం, అన్నపూర్ణ దేవి ఆలయం, కాల భైరవ ఆలయాన్ని సందర్శించొచ్చు. సాయంత్రం సంధ్యా హారతి దర్శనం ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే బస చేయాలి.


Day 4: నాలుగో రోజు ఉదయం వారణాసిలో రైలు ఎక్కి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దర్శించుకోవాలి. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తిపీఠ్ దర్శించుకోవాలి. ఆ తర్వాత శృంగవేర్పూర్ వెళ్లాలి. అక్కడ రామాయణంలో అరణ్యకాండానికి సంబంధించిన ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. ఆ తర్వాత గయ వెళ్లడానికి ప్రయాగ్‌రాజ్‌లో రైలు ఎక్కాలి.


Day 5: ఐదో రోజు గయలో విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. అక్కడే పిండప్రదానం చేయొచ్చు. ఆ తర్వాత బోధ్‌గయ సందర్శించాలి. రాత్రికి బోధ్‌గయలో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.


Day 6: ఆరో రోజు ప్రయాణికులు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం తునిలో దిగొచ్చు.


Day 7: ఏడో రోజు ప్రయాణికులు సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజిపేట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో దిగాలి. దీంతో టూర్ ముగుస్తుంది.




భగవంతుడిని సాక్షి భూతంగా పేర్కొంటారు.

 భగవంతుడిని మనం ఒక బ్యాంకు మేనేజరుగా ఒక్క సారి అనుకుందాము. నేను ఒక లక్ష రూపాయల చెక్కు బ్యంకులో ద్రవ్య విడుదలకు ఉంచాననుకోండి అది చూసి మేనేజరుగారు నా అకౌంటులో బ్యాలన్సు లక్ష కన్నా ఎక్కువ ఉంటే వెంటనే దానిని ఆమోదించి నాకు లక్ష రూపాయలు విడుదల చేస్తారు. నాలాగా నీవు కూడా లక్ష రూపాయల చెక్కు బ్యాంకులో వేశావనుకో నీకు అకౌంటులో యాబై వేలే వున్నాయనుకో నీ చెక్కుకు నీవు కోరిన లక్ష రూపాయలు ఇవ్వకుండా నీ చెక్కు నీకు వాపసు చేయటం కద్దు. ఈ ఉపమానాన్ని మనం భగవంతుని విషయంలో అనుసరిద్దాము. నీవు చేసిన పూజ, జపము, నోము అనునవి భగవంతుడైన బ్యాంకు మేనేజరుగారికి అందచేసిన చెక్కు లాంటిది. నీ అకౌంటులో పుణ్య ఫలము నీవు కోరుకున్న కోరికకు సరిపడా ఉంటే నీ చెక్కు ఆమోదించబడింది అంటే నీ నోము ఫలిస్తుంది తద్వారా నీ కోరిక ఇదేరుతుంది. కానీ నీ అకౌంటులో పుణ్యఫలం తక్కువగా వున్న నీ చెక్కు రిటర్న్ అవుంతుంది అంటే నీ కోరిక తీరదు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది భావవంతుడు ఎవరి కోరికలు తీర్చాడు లేక తీర్చ నిరాకరించడు కేవలము నీ పాప పుణ్య ఫలితాలను మాత్రమే నీకు అందచేస్తాడు. అందుకే భగవంతుడిని సాక్షి భూతంగా పేర్కొంటారు. 

గాయత్రి మంత్రము

 గాయత్రి మంత్రము గురించి మహాత్ములు చెప్పినవి

వేదవ్యాస మహర్షి – గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.

శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో ‘ బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ ‘ అని చెప్పబడింది.

విశ్వామిత్రుడు – ” బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.

దేవీభాగవతము – గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రంచేస్తుంది.’ తత్ సవితుర్వరేణ్యం భర్గః ‘

కూర్మపురాణము – ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు

యాజ్ఞవల్క్యుడు – ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును.

ఆర్షసూక్తి – ‘న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం’

భీష్మాచార్యులు – ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు

అత్రి మహర్షి భవిష్య పురాణం – సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు

లఘు అత్రి సంహితా – గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించాలి

పద్మపురాణం పరాశర మహర్షి – గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి

అగ్నిపురాణం – ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు

శంఖ స్మృతి – నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు

సూత సంహితా యజ్ఞవైభవ ఖండం – అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు

నారద మహర్షి – గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు ఇందు సందేహము లేదు

వశిష్ట మహర్షి – మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును.వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు.

మహాత్మాగాంధీ – నిత్యం గాయత్రిని జపించు వారికి ఆత్మోన్నతి మరియూ రోగనాశనం ఆపద నాశనం‌ జరుగును.

ఆదిశంకరులు – గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు ఇదియే ఆది మంత్రంము.

అందుకే నిత్యం ఉదయం సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది…

దైవం మానుష రూపేణ'*

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

    *దైవం మానుషరూపేణ* 

    (కథా రచయిత సింగరాజు 

                శ్రీనివాసరావుగారు)

                 🌷🌷🌷

"సామీ ఇంద పూలు, ఆ సామి పాదాల కాడ బెట్టు" అని తెచ్చి పళ్ళెంలో పెట్టింది పున్నమ్మ. 


"నువ్వు చాలా పుణ్యాత్మురాలివి తల్లీ. నీకొచ్చిన దానిలోనే కొంత పెట్టి కొని ఆ దేవుడి పాదాలను పువ్వులతో సేవిస్తున్నావు",


ఆయనకు నేనిచ్చేదేముంది సామీ. ఆయన ఇచ్చిందే ఆయనకు ఇస్తున్నా. ఆ తండ్రి గుడి ముంగల గుడ్డపరుసుకున్నదాన్ని. ఆయన ఋణాన బతుకున్నదాన్ని. నేనాయనకు ఇచ్చేదికాదు సామీ. ఆయనే నాకీ బతుకిచ్చాడు. ఆయన పాదాల కాడ పడుండమని చెప్పాడు" దేవుడికి నమస్కరిస్తూ చెప్పింది. 


మధ్యాహ్నం దేవుడికి నైవేద్యం పెట్టేముందు పూజారికి, బిచ్చగత్తె పున్నమ్మకు మధ్య జరిగే సంభాషణ ఇది. ఆమె మాటలలో ఎంతో లోతైన భావన కనిపిస్తుంది పూజారి సాయికి. ఏ ప్రవచనకారుడి నోట వినని మాటలు ఆమె అమాయకంగా పలికే పలుకులలో వినిపిస్తాయి సాయికి. 


అందులో సాయికి నచ్చే మాట. "మనమెవరము సామీ ఆ భగమంతునికి ఇయ్యడానికి. ఈ బతుకు, ఈ పైసలు, ఈ బువ్వ అంతా ఆయనిచ్చినదే కదా. ఆయనిచ్చినదే ఆయనకిత్తున్నాం. మనం కొత్తగా ఇచ్చేదేంది. 


బతికినంత కాలం ఆయన్ను మనసులో ఉంచుకోగలిగితే సాలు ఈ జన్మలకి". ఎంతో పరిణతి చెందితే తప్ప ఆ భావన ఎవరికీ రాదు. ఆమె మాటలలో నిజాయితీ అతనికి నచ్చుతుంది. ఆమె భక్తి నచ్చుతుంది. చూడడానికి మంచి కుటుంబం నుంచి వచ్చినామెలాగే ఉంటుంది. 


ఆమె యాసగా మాట్లాడుతున్నా, అది ఆమె కావాలని అలా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది సాయికి. రాములవారి గుడిలో పూజారి సాయి. వయసు సుమారు నలభై సంవత్సరాలు ఉంటాయి. పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు దేవాలయంలో. 


అతను వచ్చిన సంవత్సరం తరువాత కాబోలు ఒకరోజు పున్నమ్మ అక్కడికి వచ్చి సాయి అనుమతితో ఆ గుడి ముందు బిచ్చగత్తెగా మారింది. అంతకుముందు అక్కడ వుండే ముసలమ్మ కాలం చేయడంతో, అక్కడ వుండే మిగిలిన బిక్షగాళ్ళు కూడ అభ్యంతరం చెప్పలేదు ఆమెకు. 


ఆమెకు ఒక కన్ను పువ్వు పూసినట్లుగా ఉంటుంది. ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. తగాదాలు పెట్టుకోదు. అంతకుముందున్న ముసలమ్మ నోటిదురుసు మనిషి. ఎవరితో ఒకరితో రోజూ గొడవ పెట్టుకునేది. అది ఆలయానికి వచ్చేవారికి, పూజారులకు కూడ ఇబ్బందిగా అనిపించేది. ఇక తోటి బిచ్చగాళ్ళకు సరేసరి. 


ఆమె స్థానంలో పున్నమ్మ వచ్చిన తరువాత ఎంతో ప్రశాంతంగా ఉంది వాళ్ళకు. అంతేకాకుండా తనతోటి బిచ్చగాళ్ళకు ఏరోజైనా తిండికి సరిపడ డబ్బులు రాకపోతే తన సొమ్ములోనుంచి కొంత వారికి ఇచ్చేది. 


ఆమెకంటూ ఇల్లు లేదు. పగలంతా గుడిలోనే ఉండేది. అందరితోపాటు తనకు పుజారి పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకునేది. 


'అదెలా సరిపోతుంది నీకు' అని అడిగితే 'బ్రతకడానికి ఆ మెతుకులు చాలవా' అనేది. 


ఆమె మాటలలో వేదాంతధోరణి అధికంగా ఉండేది. ఆమె పరిస్థితి గమనించిన సాయి, ఆమెకు తనకు తెలిసిన ఆశ్రమంలో తలదాచుకోను చోటు ఇప్పించాడు. అప్పటినుంచి ఆమె రాత్రివేళల అక్కడే ఉండేది. మితాహారమే ఆమె ఆరోగ్య రహస్యమేమో మరి. ఎప్పుడూ నలతపడగా చూడలేదు ఎవరు. ప్రతిరోజూ మధ్యాహ్నమయేసరికి నాలుగు మూరలు పూలు తెచ్చి సాయికిచ్చి దేవుడి పాదాల వద్ద పెట్టమని, ఆయనిచ్చిన ప్రసాదం పట్టుకెళ్ళి తిని, ఆ దేవాలయం నీడలోనే విశ్రాంతి తీసుకునేది. 


ఆమె అంటే ఏదో తెలియని అభిమానం పెరిగింది సాయికి. ఒకవేళ తనకు తల్లి ఉండి వుంటే ఆమె ఇదే వయసులో ఉండి ఉండేది అనుకునేవాడు. ********* 


"ఏం పంతులువయ్యా నువ్వు. తీర్థమివ్వడం, శఠగోపం పెట్టడం తప్ప, సంపాదించుకోవడమే చేతకాదు. పళ్ళెంలో వేసిన డబ్బులు ఎవడైనా ధర్మకర్తలకు లెక్కచెబుతారా. దొరికింది చాలని జేబులో వేసుకోక. అలా చేయకపోతే వీళ్ళిచ్చే అత్తెసరు అయిదువేలతో ఎలా నెట్టుకొస్తావు కాపురాన్ని" అని తోటి పూజారులు దెప్పి పొడిచేవారు. 


"నాకు దేవుడిచ్చినది చాలు. నాకేమైనా పిల్లాజెల్లా. దానికి నేను, నాకు అది అంతేగా. ఏనాడు ఏ పాపం చేశామో, ఈ జన్మలో సంతానయోగం లేకుండా పోయింది. మరల ఈజన్మలోను పాపం చేయడం దేనికి" అని చెప్పేవాడు సాయి." 


రోజులన్నీ ఇలాగే ఉంటాయా చెప్పండి. ఏ రోగమో, రొప్పో వస్తే నాలుగు రూకలు ఉండాలగదయ్యా చేతిలో. మరీ అంత మడికట్టుకుంటే బ్రతకడం చాలా కష్టం" అని సలహాలిచ్చేవారు. " అన్నింటికీ ఆ రామచంద్రుడే ఉన్నాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయనకొచ్చిన కష్టాలకంటే పెద్ద కష్టాలు మనకు రావుగా. ఏదయినా ఆయనదే భారం. 


ఆయన సేవచేస్తూ అవినీతి పనులు నేను చేయలేను. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. అయినా మన పిచ్చి కాకపోతే గుడి బయట బిచ్చమెత్తుకునే వారికి, మనకు తేడా ఏముందయ్యా. వారు ఆలయం బయట, మనం లోపల అంతేతేడా. అందరమూ బిచ్చగాళ్ళమే. ఆయన నీడలో బ్రతికేవారిమే. ఆయన ఇచ్చిన జీవితమిది. ఆయనకే అంకితం. అంతే తప్ప. నేనుగా ధర్మం తప్పను" అని ఖరాఖండిగా చెప్పేవాడు. 


ఇతనికి చెప్పినా ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే యని వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఏ దిక్కూలేని వారికి దేవుడే దిక్కు అని బ్రతుకును సాగించేవారిలో ప్రథముడని చెప్పవచ్చు పూజారి సాయిని. 


అటువంటి సాయిని భగవంతుడు పరీక్షించదలచాడేమో ఒకనాటి అర్థరాత్రి ఛాతి పట్టినట్టుగా అనిపించింది. అతడిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అది గుండెపోటని, రక్తనాళాలలో బ్లాకులు ఏర్పడ్డాయని, వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. చేతిలో వున్న ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకోవడానికి ఆ ఊరిలో వున్న ఏ ఆసుపత్రి ముందుకురాలేదు. 


ఆలయ ధర్మకర్తల మండలి వారు వాళ్ళకు తెలిసిన డాక్టరు ద్వారా ప్రయత్నించి ఆపరేషనుకు లక్ష రూపాయలు చెల్లించడానికి ఒప్పించారు. " చూడమ్మా. 


మీరొక లక్ష రూపాయలు మీ బంధువుల ద్వారా సమీకరించుకుని ఆసుపత్రిలో కట్టండి. ఆయనకు పూర్తిగా నయమయేటంత వరకు అయన మందులకు, మీ భోజనానికి తగిన ఆర్థికసహాయం మేము చేస్తాము. ఆపరేషను ఖర్చు మీరు భరిస్తే చాలు. ఇక మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. నాలుగురోజులలో ఆపరేషను చేస్తారు " అని చెప్పి వెళ్ళిపోయాడు ఒక ధర్మకర్త, సాయి భార్య సునందకు. 


సునంద కుప్పలా కూలబడిపోయింది. లక్ష రూపాయలంటే మాటలా. ఎవరిని అడగాలి. ఎక్కడ తేవాలి. తమ బంధువులంతా అంతంత మాత్రపు వాళ్ళే. కనీసం పదివేలు కూడ సర్దగలిగే స్తోమతు లేని వారే. పోనీ ఆలయానికి వెళ్ళి అక్కడికి రోజూ వచ్చేవారికి విషయం చెప్పి సహాయమడిగినా, ఇస్తారో, ఇవ్వరో. ఏంచెయ్యాలో పాలుపోవడం లేదు. అయినా ప్రయత్నిస్తే తప్పేముందని, బంధువులందరికీ ఫోను చేయాలని, తెలిసిన వారిని సహాయమడగాలని నిర్ణయించుకుంది సునంద. 

****** 


ఆపరేషను చేసే రోజు వచ్చింది. ఎంత ప్రయత్నించినా పట్టుమని ఇరవై వేలు కూడ వసూలు చేయలేకపోయింది సునంద. వాళ్ళ నాన్న గారు కూడ అక్కడ ఇక్కడ దేబిరిస్తే ఒక పదివేలు తేగలిగాడు. తండ్రి తెచ్చిన సొమ్ముతో కలిపి ముప్ఫై వేలు తీసుకుని డాక్టరు దగ్గరికి వెళ్ళింది, తన అసహాయతను తెలియజేసి, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎలాగోలా ఆపరేషనుకు ప్రయత్నించమని చెబుదామని. 


"ఏవండీ. డాక్టరు గారిని కలవాలి. కొంచెం అనుమతి ఇప్పిస్తారా" కౌంటరు దగ్గరికి వెళ్ళి అడిగింది. 


"దేనికమ్మా" అడిగాడతను. " మావారు పూజారి సాయి. ఆయనకు ఈ రోజు గుండె ఆపరేషను అన్నారు. దానికిగాను లక్ష రూపాయలు చెల్లించమని చెప్పారు. కానీ నా దగ్గర ముప్ఫైవేలు మాత్రమే ఉన్నాయి. అవి డాక్టరు గారికిచ్చి, ఆయన పాదాలు పట్టుకుని ఎలాగైనా ఆపరేషన్ చెయ్యమని వేడుకుందామని" చెప్పింది సునంద. " అదేమిటమ్మా, మీకు తెలియదా. ఆపరేషనుకు అవసరమయిన లక్ష రూపాయలు రాత్రే వచ్చి కట్టిపోయారు. మీ వారి ఆపరేషనుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో గంటలో ఆపరేషను మొదలవుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి" అని చెప్పాడతను. " ఎవరు కట్టారు " ఆశ్చర్యంగా అడిగింది సునంద. 


"ధర్మకర్తల మండలి వారే అనుకుంటాను" అన్నాడతను. ఆ రాముల వారే పంపారేమో వారి మనసును మార్చి అని ఆ భగవంతుడిని స్మరిస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు తండ్రీకూతుళ్ళు. ******** 


రెండు నెలలకల్లా మామూలు మనిషయ్యాడు సాయి. ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఒక్కక్షణం ఇంట్లో కాలు నిలువలేదు అతనికి. ఆసుపత్రిలో ఉన్నప్పుడే వచ్చి చూసివెళ్ళారు ధర్మకర్తల మండలి వాళ్ళు. ఆలయం ముందు బిచ్చగత్తె పున్నమ్మ రోజూ వచ్చి స్వామి వారి పాదాల వద్ద కుంకుమ, ఆంజనేయస్వామి వారి సింధూరాన్ని తెచ్చి సామికి పెట్టమని సునందకు ఇచ్చి సాయిని చూచి వెళ్ళేది. ఆస్తులు లేకపోయినా, అందరి అభిమానాన్ని పొందిన సాయికి వారి పలకరింపే రామయ్య దీవెనగా అనిపించేది. వారి ఆశీస్సులు, ధర్మకర్తల విశాలహృదయమే తనకు పునర్జన్మనిచ్చిందని అనుకునేవాడు. దీనికంతటికీ కారణం ఆ రామయ్య చల్లనిచూపేనని సంతోషపడేవాడు. 


ఎప్పుడెప్పుడు రాముని సేవకు పోదామా అనే తొందరను ఆపుకోలేక ఆలయానికి వస్తానని ధర్మకర్తకు ఫోను చేశాడు. అతను అంగీకరించి రేపు ఒకటవ తేదినుంచి రమ్మని చెప్పాడు. ఆనందంతో మనసు గంతులువేసింది సాయికి. 


తిరిగి ఆరోగ్యవంతుడై వచ్చిన సాయిని సాదరంగా ఆహ్వానించి గుడి బాధ్యతలు తిరిగి అప్పగించాడు, అప్పటిదాకా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్న హనుమంతుని గుడిలో పూజారి. 


అంతలో సాయిని పలకరిద్దామని వచ్చారు ధర్మకర్త మండలి వారు. " అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. మీ సహాయసహకారాలు లేకుంటే నేను ఈరోజు ఈ రామయ్య చెంత ఉండగలిగేవాడిని కాదు. లక్ష రూపాయలు ఇచ్చి, మందులకు, ఇప్పటిదాకా మా కాపురానికి కావలసిన భోజనాది ఖర్చులు ఇచ్చి మా జీవితాలను నిలబెట్టారు. నేను మీకు జీవితాంతం ఋణపడివుంటాను. 


"ఈ పూజారి పోతే మరో పూజారి వస్తాడులే" అని వదిలేయకుండా, నాకు పునర్జన్మనిచ్చిన దేవతలు మీరు. ఆ రాముడే మీ మనసులో చేరి నాకు మరల బ్రతికే అవకాశాన్ని ఇప్పించాడు. ఇక నేను బ్రతికినంతకాలం ఈ దేవాలయాన్ని విడిచిపెట్టను" అని కృతజ్ఞత నిండిన మనసుతో వారికి నమస్కరించాడు సాయి. 


"మాదేమున్నది పంతులు గారు ఇందులో. అంతా ఆ శ్రీరామచంద్రుని దయ. ధర్మకర్తలుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తించాము. 


కానీ మీకు ఆర్థికసాయం చేసి, మీరు కట్టవలసిన లక్ష రూపాయలను తను చెల్లించి, మిమ్మల్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించినది, అదిగో ఆ పున్నమ్మ. ఈ గుడిలోని రామయ్యను నమ్ముకుని ఆలయం ముందు బిచ్చమెత్తుకునే ఆ పున్నమ్మే, మీరే ఆ రామయ్య ప్రతిరూపమని నమ్మి మిమ్ముల కాపాడాలనుకుని తపనబడింది. 


మీరు కట్టవలసిన లక్ష రూపాయలను మేమే గుడికి వచ్చే వారి దగ్గర నుంచి చందారూపంలో వసూలు చేయాలనుకుని ఆలోచిస్తుంటే, తనే మా దగ్గరకు వచ్చింది. తను యాచన ద్వారా సంపాదించిన సొమ్మును తన గదిలోని పెట్టెలో దాచుకుంటూ వచ్చిందట. మీరేనటగా ఆమె తలదాచుకోను, ఆ ఆశ్రమంలో గది ఇప్పించింది. ఆ కృతజ్ఞతతో తన వద్దనున్న సొమ్మును మూటగట్టి తెచ్చి మాకిచ్చింది. అంతా లెక్కవేస్తే తొంభైవేలు తేలింది. దానికి మేము పదివేలు జోడించి, లక్షరూపాయలను ఆసుపత్రిలో కట్టివచ్చాము. 


ఆమె దొడ్డ మనసు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచింది. ఏ ఊరో, ఏ తల్లి కన్నబిడ్డో, మన ఆలయానికి వచ్చి చేరింది. ఈరోజు మీరు మరల మా మధ్య తిరుగుతున్నారంటే కారణం ఆమే. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దన్నది. కానీ నిజం చెప్పకపోతే ఆ రామయ్య మమ్మల్ని నిలదీస్తాడేమోనని భయపడి చెబుతున్నాము పూజారిగారు. 


మీకు ఆ రామయ్య రూపంలో వచ్చి ప్రాణభిక్ష పెట్టినది ఆ పున్నమ్మే " అని అసలు విషయాన్ని చెప్పాడు ప్రధాన ధర్మకర్త. 


ఆ మాటలు విన్న సాయి మనసు చలించిపోయింది. ధర్మకర్తలకు నమస్కరించి, వారి పేరున అర్చన చేసి, తీర్థమిచ్చి వారిని పంపివేశాడు. పూజకూడ పరధ్యానంగానే చేశాడు. వెంటనే వెళ్ళి పున్నమ్మకు సాగిలబడాలని మనసు తొందరపెట్టసాగింది. అంతలో పున్నమ్మ పూలు తీసుకుని లోపలికి రానే వచ్చింది. ఆమెను చూస్తూనే అతని కన్నులు అశృపూరితాలయినాయి. 


పూలు చేతిలోకి తీసుకుని పళ్ళెంలో పెట్టి, ఆమెకు చేతులు జోడించాడు. అతని బుగ్గల మీదుగా కన్నీరు జాలువారుతున్నాయి. " అమ్మా నేను మీకు ఏమవుతానని నాకోసం ఇంత త్యాగం చేశారు. మీరు సంపాదించుకున్న సొమ్మంతా నాకోసం వెచ్చించారు. ఎంత మంచి మనసమ్మా మీది. మీ ఋణం ఎలా తీర్చుకోను. 


ఏ బంధమూ లేని నన్ను ఆదుకున్న మీ దాతృత్వాన్ని ఎలా కొలువగలనమ్మా" సాయి మనసు ఆర్ద్రమయింది. 


"అంతమాటనకండి సామీ. మీరు మాకు ఆ రామయ్యతో సమానం. మీకు నేను చేసిన సాయం, ఆ రామయ్యకు వారధి కట్టడంలో ఉడత చేసిన సాయం లాంటిదేనయ్యా. 


కడుపునబుట్టిన వాళ్ళు నా ఇల్లు, వాకిలి లాగేసుకుని నన్ను వీధిలోకి నెడితే, ఊరుగాని ఊరొచ్చిన నాకు ప్రతిరోజు ప్రసాదమెట్టి కడుపునింపి, తలదాచుకోను గది చూపించి, నా బిడ్డలాగ నను చేరదీశావయ్యా. 


నీ అంతటి దేవుడిలాంటి మనిషికి ఆపద వస్తే, అక్కరకురాని సొమ్ము దేనికయ్యా. అందుకే నా దగ్గరవున్న సొమ్మంతా ఇచ్చేసినా. నాబిడ్డలాంటోడివయ్యా. ఆ రామయ్య తండ్రి నిను చల్లగ చూడాల." చేతులెత్తి రామయ్యను వేడుకుంది పున్నమ్మ." 


ఆ రామచంద్రుడే నాకోసం నిన్ను పంపాడమ్మా. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న నాకు నిన్ను పంపి నాకు తల్లిలేని లోటు తీర్చాడు. అమ్మా, నీ బిడ్డలు నిన్ను కాదన్నా, నీకు నేనున్నానమ్మా. నీవు ఎవరివైనా ఇకనుంచి నా తల్లివి. మీ మాట తీరు చూస్తే, బాగా బతికిన దానిలానే ఉన్నారు. అయినా మీ గతంతో నాకు పనిలేదు. నా ప్రాణాన్ని కాపాడిన మీ ఋణం నన్ను తీర్చుకోనివ్వండి. 


ఇకనుంచి మా ఇంట్లోనే ఒక గది మీకు ఇస్తాను. మాతో పాటే తిని, మాతో పాటే ఉండండి" అంటూ పున్నమ్మ చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. " నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలయ్యా. నాకు ఈ గుడి ముందు కూర్చుని రామయ్యను చూస్తూ, భక్తులు వేసిన కాసులతో, తమరు పెట్టే ప్రసాదంతో బ్రతకడమే సంతోషాన్నిస్తున్నది. 


శబరిలాగా ఆ రాముడి దర్శనం కోసం, ఆయన పిలుపు కోసం ఎదురుచూడడంలోనే నాకు తృప్తి సామీ. నేను చేసింది సాయం కాదు సామి, మనిషికి, మనిషి చేయవలసిన కనీస ధర్మం. అంతే. పదిమంది చేసిన దానం ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడింది. 


అది చాలు. మనమందరం ఋణపడింది ఆ రామయ్య తండ్రికి. అంతే" అంటూ ప్రసాదం వేయించుకోను పళ్ళెం తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళింది పున్నమ్మ. ఆమె వెళ్ళిన వైపే తదేకంగా చూస్తున్నాడు సాయి. 


'ఎదుటి మనిషికి సాయం చేయడానికి కావలసినది చేతినిండా డబ్బు కాదు, సాయం చేయగలిగే మనసు' అని చెప్పడం ఇన్నాళ్ళూ విన్నాడు. కానీ మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తున్నాడు. 


"అమ్మా, నీకు నేనే కొడుకును. నువ్వు కాదన్నా సరే నీ బాధ్యత నాదే. నీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈ బిడ్డ నీకు తోడుగా నిలుస్తాడు. ఇది నేను పాదాలంటి సేవించే ఈ రామచంద్రమూర్తి మీద ఆన" అని మనసులో అనుకున్నాడు సాయి. 


దైవ ప్రేరణ చిత్రమైనది. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు కలుపుతుందో తెలియదు. అందుకే దేవుడంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని గుండెనిండా నింపుకుని, ఆ రాతిబొమ్మను కొలిస్తే, ఆ రాయే కరిగి నవనీతమై మన గాయాలను మాన్పుతుంది. 


ఆ నమ్మకమే పూజారి సాయికి పునర్జన్మను ఇచ్చింది. దిక్కులేదనుకున్న పున్నమ్మకు, సాయిని దిక్కుగా చూపింది. 


అందుకేనేమో *'దైవం మానుష రూపేణ'*


అంటారు పెద్దలు. ****** 


(సమాప్తం) 


మానవ సేవే మాధవ సేవ అని తెలిపే అత్యధ్బుతమైన కథను అందించిన శ్రీ సింగరాజు శ్రీనివాసరావు గారికి నమస్సులు.

ప్రశ్న పత్రం సంఖ్య: 16

  ప్రశ్న పత్రం సంఖ్య: 16                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

నేను కూర్పు చేసి సమర్పిస్తున్న ప్రశ్న పాత్రలకు విశేష ఆదరణ లభిస్తున్నదని  నేను బొంకలేను కానీ కొద్దీ మంది సభ్యులు స్పందిస్తున్నారన్నది యదార్ధం.  వారిని స్ఫూర్తిగా  దృష్టిలో ఉంచుకొని ఈ పరంపరను కొనసాగిద్దామనుకుంటున్నాను  

క్రింది  ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) "చందమామ రావే జాబిల్లి రావే" పాట పాడని తెలుగు అమ్మ లేదు.  ఇది ఎవరు వ్రాసారో తెలుసా.  

2) "ప్రస్థాన త్రయం" అని ఏ గ్రంధాలని అంటారు.  

3) "ఉరక రారు మహాత్ములు" అనేది ఒక పద్య పాదం ఇది మనం నిత్యం వాడుతూ ఉంటాము కానీ ఈ వాక్యం ఎక్కడిదో, ఎవరు వ్రాసారో తెలుసా. 

4)  సాధారణంగా ఒక పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి. 

5) ఉపమాలంకారం అంటే ఏమిటి. 

6) " పరి పరి విధముల  వరమొసంగెడి " పాదము ఎందులోది దీనిని వ్రాసిన వాగేయకారుడు ఎవరు. 

7) "హరి హరి సిరి యురమున గల హరి"  పద్యపాదం  ఏ గ్రంధము లోనిది. కవి ఎవరు. 

8) ”పోగాలము దాపురించినవారు దీపనిర్వాణగంధమును, అరుంధతిని, మిత్ర వాక్యమును మూర్కొనరు, కనరు, వినరని పెద్దలు చెప్పుదురు”  ఏ పుస్తకములోది రచయిత ఎవరు.  ఇందులో వున్న అలంకారాన్ని చెప్పగలరా 

9) నంది తిమ్మన కవికి ఇంకోపేరు ఏమిటి. 

10) "కృష్ణం వందే జగద్గురు" అని ఎందుకు అంటారు. 

11) "పరివ్రాజకుడు"  అని ఎవరిని అంటారు. 

12) కంచుకాగడా వెలిగించి చూచినా 

13) భావగర్భితము అనగా నేమి 

14) రమణ మహర్షి ప్రకారము "ముక్తి" అనగా నేమి. 

15) పోతన తన శ్రీ భాగవతంలో " మధుపం" అనే పదం ఏ పద్యంలో వాడారు. 

16) "వరూధిని" పాత్ర ఏ గ్రంధములోనిది, దాని కవి ఎవరు. 

17) "వావి వరుస" అనే ద్వంద పదాల  అర్ధము తెలుపండి. 

18) "విద్యుత్లతలు" అంటే వృక్ష విశేషమా కాదా ఏమిటి తెలుపండి 

19) "కొంపలు మునిగినట్లు" పద ప్రయోగం ఎప్పుడు చేస్తారు.   

20) మిత్ర లాభము అనే కధ ఏ గ్రంధములోనిది దాని రచయిత ఎవరు. 

 

మనోనిగ్రహం

 *శ్రీగాయత్రీమాత్రే నమః*


*మనోనిగ్రహం*


పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు, అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు, అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి...

*"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."*

శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు..._

*"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది, జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేము..."* ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే...


*"కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."*


*నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా మనలోపల ఎల్లప్పుడూ కోరికలు అనేటివి దాగి ఉంటాయి...*

ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది, పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు, అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా అని చెప్పాడు, ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది...

ఆ విధంగానే కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి...  వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి...


*"కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొ౦టే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి."*

ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి...


రామకృష్ణ పరమహంస వారు వారి సాధనలో ని అనుభవం గూర్చి ఇలా వివరించారు


"ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు.. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను... నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు... అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు, భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."


ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు, ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి. వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు...


రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు...

"ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి.._ హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడుగు...

'ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటాడు అంతరాత్మగా .

🙏       🙏         🙏

భక్త తుకారాం

 *🧘‍♂️భక్త తుకారాం కరుణ🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


*ఈ మానవ శరీరం తోటివారి మీద ప్రేమాభిమానాలు చూపడం కోసమే భగవంతుడు సృష్టించాడు. ప్రేమ దయ లేని మనిషి కేవలం ఎముకల మీద చర్మం కప్పుకున్నట్టే అని అంటారు జ్ఞానులు.*



*తోటి మానవుల మీదనే కాక పశుపక్ష్యాదుల మీద కూడా ప్రేమ, దయ, కరుణ కలిగిన మహనీయులెందరో తమ నడవడిక ద్వారా సమాజానికి స్ఫూర్తిని కలగజేసారు. అలాటి వారిలో భక్త తుకారాం ఒకరు.*



*16 వ శతాబ్దంలో మహారాష్ట్రలో నివసించిన మహాత్ముడు. ఆయన ఒకనాటి ఉదయం పొలం గట్ల మీదుగా నడచి వెడుతున్నారు తుకారాం.*



*పక్కనున్న పంట చేలలోని ధాన్యాలను చాలా పక్షులు పొడిచి పొడిచి తినడం చూశారు తుకారాం. ఆయనని చూడగానే ఆ పక్షులన్నీ ఒక్కసారిగా రెక్కలు టప టప మనిపిస్తూ రివ్వున ఎగిరి పోయాయి. అది చూసిన తుకారాంకి ఆశ్చర్యం, వేదన కలిగింది.*



*'నన్ను చూసి ఈ పక్షులు భయపడ తున్నాయా ...అవి నన్ను చూసి భయపడు తున్నాయంటే నాలో ఏదైనా దుర్మార్గ చింతన ఉన్నదా ! ఓ భగవంతుడా! అలాటి చెడు పదార్ధమేదైనా వుంటే వెంటనే నా శరీరం నుండి తొలగించు అని ప్రార్ధిస్తూ భగవంతుని ధ్యానం లో కూర్చుండి పోయారు.*



*కొద్దిసేపట్లో ఎగిరిపోయిన పక్షులు అన్నీ తిరిగి వచ్చాయి. విశ్రాంతికై చెట్టు మీద కూర్చున్నట్లు తుకారాం దేహం మీద కూర్చున్నాయి. పక్షులు తన మీద కూర్చుని వున్న స్పృహ కూడా లేకుండా తుకారాం భగవత్ ధ్యానంలో మునిగిపోయారు.*



*ఈనాడు సర్వ జీవులను కారుణ్యంతో, స్నేహ భావంతో చూడడం మాట అలా వుండగా, తోటి మానవులనే మానవులుగా గుర్తించడం అరుదైపోతున్నది.*


🕉️🌞🌏🌙🌟🚩

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సంతాన సాఫల్యం..*


సుమారు ఆరేడు ఏళ్ల క్రిందట..నవంబరు నెల  చివరి శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం దగ్గరకి ఓ భార్యా భర్త వచ్చారు..


"ఇక్కడ ఈ రాత్రికి నిద్ర చేయాలంటే..రూము ఏదైనా ఉంటుందా ?.." అని అడిగారు..అప్పటికి శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద ఒకటి రెండు రూములు తప్ప మరేమీ లేవు..వచ్చిన భక్తులలో ఎక్కువమంది శ్రీ స్వామివారి మందిరం లోని మంటపాల లోనే కాలం గడుపుతూ వుండేవారు..ఆ వచ్చిన దంపతులు అదే మొదటిసారి శ్రీ స్వామివారి మందిరానికి రావడం..ఆ శనివారం నాడు పెద్దగా భక్తుల తాకిడి లేని కారణంగా వారి పేర్లు నమోదు చేసుకొని..ఒక గది వాళ్లకు ఇచ్చాము..


ఇద్దరూ తమ గదికి వెళ్లి..స్నానాదికాలు ముగించుకొని..మళ్లీ ఐదు గంటలకల్లా మందిరం లోకి వచ్చారు..నేరుగా నేను కూర్చుని ఉన్న చోటుకి వచ్చి.."అయ్యా!..మేము ఇదే మొదటిసారి ఈ గుడికి రావడం..ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి?..ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే..చాలా మంచి జరుగుతుందట కదా..మాకు మా ఊళ్ళో వాళ్ళు చెప్పగా విని..ఒకసారి చూసి..నిద్ర చేసిపోదామని వచ్చాము..శ్రీ స్వామివారి గురించి కూడా మాకు పెద్దగా తెలీదు.. మీరు మాకు వివరిస్తారా?.." అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలుంకురిపించారు..


ముందు వాళ్ళను స్థిమితంగా కూర్చోమని చెప్పి..క్లుప్తంగా శ్రీ స్వామివారి గురించి..ఆయన చేసిన తపోసాధన గురించి..వివరించి..ఏదైనా సమస్యలున్నవాళ్ళు..ఇక్కడ నిద్ర చేసి..ఆ స్వామివారికిి తమ సమస్య గురించి చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం ఉన్నదనీ..మీకు కూడా ఏదేని సమస్య ఉన్నట్లయితే..మీరు కూడా మొక్కుకోవచ్చనీ తెలిపాను..అంతా విన్న తరువాత..ఆ దంపతులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని.."మాకు వివాహం జరిగి దాదాపు పది సంవత్సరాలు గడిచాయండీ..సంతానం లేదు..మూడు నాలుగు సంతాన సాఫల్య కేంద్రాలలో పరీక్షలు కూడా చేయించుకున్నాము..ఏవో ట్రీట్మెంట్ అంటూ చెప్పారు గానీ..ఫలితం లేదు..డబ్బు మాత్రం ఖర్చు అయింది..ఇక్కడికొచ్చి మ్రొక్కుకుంటే...సంతానం కలుగుతుందని విన్నాము.. అందుకోసమే ఇక్కడ నిద్ర చేయాలని నిశ్చయించుకుని..వచ్చాము.." అన్నారు..


"మీరు మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి మీద విశ్వాసం ఉంచి..ఆ సమాధి ముందు మ్రొక్కుకోండి..ఆ పై మీ అదృష్టం.." అని చెప్పి.."ఇంకాసేపటిలో పల్లకీ సేవ మొదలవుతుంది..అందులో పాల్గొనండి.." అని చెప్పాను..సరే అన్నట్లు తలా ఊపారిద్దరూ..


ఆరోజు పల్లకీ సేవలో ఆ దంపతులిద్దరూ తమ పేరుతో అర్చన చేయించుకున్నారు..భర్త మాత్రం శ్రీ స్వామివారి మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు పల్లకీ మోస్తూ తిరిగాడు..రాత్రికి ఆ మంటపం లోనే పడుకున్నారు.. మళ్లీ ఉదయం లేచి..శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని..తమ ఊరికి వెళ్లిపోయారు..వెళ్లేముందు నా దగ్గరకు వచ్చి..నా ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లారు..


ఆ తరువాత వాళ్ళ గురించి వివరాలేమీ తెలియలేదు..మూడు నెలలు గడిచిపోయాయి..మళ్లీ మహాశివరాత్రి గడచిపోయిన తరువాత..ఒక శనివారం మధ్యాహ్నం నాడు..మళ్లీ మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఇద్దరి ముఖాలూ సంతోషంతో విప్పారి ఉన్నాయి..నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి.."అయ్యా..శ్రీ స్వామివారు మమ్మల్ని కరుణించారు.." అన్నారు..

నేను మాట్లాడేలోపలే.."ఆరోజు ఇక్కడ నిద్రచేసి..తెల్లవారి శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని మా ఊరికి వెళ్ళామా..ఆరోజు రాత్రి తనకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఆశీర్వదించినట్లు కనిపించింది..తాను ఉలిక్కిపడి లేచి కూర్చుని..నన్ను నిద్రలేపి..నాకు విషయం చెప్పింది..ఆ ప్రక్కరోజు నుంచి..ఇద్దరమూ అత్యంత విశ్వాసం తో శ్రీ స్వామివారి ని కొలుచుకుంటున్నాము..ప్రస్తుతం తనకు రెండో నెల!.." అని చెప్పాడు..ఆ దంపతుల విశ్వాసమే వాళ్లకు ఫలితాన్ని ఇచ్చింది..నమ్మి కొలిచిన వాళ్ల కోరికలు తీరుస్తాననీ.. తన సమాధి నుంచే తాను అందరినీ కాపాడుతాననీ..శ్రీ స్వామివారు చెప్పిన మాట మరొక్కసారి ఋజువు అయింది..


మొదటి సంతానంగా ఆడపిల్ల, ఆతరువాత మరో రెండేళ్లకు మగపిల్లవాడు పుట్టారు..అమ్మాయి కి మూడోనెల వయసు వచ్చిన తరువాత మందిరానికి వచ్చి..అన్నదానం చేసి వెళ్లారు..అలాగే పిల్లవాడు పుట్టిన మూడు నెలలకు మళ్లీ అన్నదానం చేసి వెళ్లారు..ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఆనందంగా వున్నారు..తరచూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి నిద్ర చేసి వెళుతుంటారు..


ఎందరో భక్తులు..ఒక్కొక్కరివి ఒక్కొక్క అనుభవం..తెలుసుకోవాలే గానీ..శ్రీ స్వామివారు చూపిన..చూపుతున్న మహిమలను లెక్కగట్టగలమా?..మనం గోరంత విశ్వాసాన్ని చూపితే..కొండంత ఫలితాన్ని ఇస్తాడు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).