30, జులై 2021, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సంతాన సాఫల్యం..*


సుమారు ఆరేడు ఏళ్ల క్రిందట..నవంబరు నెల  చివరి శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం దగ్గరకి ఓ భార్యా భర్త వచ్చారు..


"ఇక్కడ ఈ రాత్రికి నిద్ర చేయాలంటే..రూము ఏదైనా ఉంటుందా ?.." అని అడిగారు..అప్పటికి శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద ఒకటి రెండు రూములు తప్ప మరేమీ లేవు..వచ్చిన భక్తులలో ఎక్కువమంది శ్రీ స్వామివారి మందిరం లోని మంటపాల లోనే కాలం గడుపుతూ వుండేవారు..ఆ వచ్చిన దంపతులు అదే మొదటిసారి శ్రీ స్వామివారి మందిరానికి రావడం..ఆ శనివారం నాడు పెద్దగా భక్తుల తాకిడి లేని కారణంగా వారి పేర్లు నమోదు చేసుకొని..ఒక గది వాళ్లకు ఇచ్చాము..


ఇద్దరూ తమ గదికి వెళ్లి..స్నానాదికాలు ముగించుకొని..మళ్లీ ఐదు గంటలకల్లా మందిరం లోకి వచ్చారు..నేరుగా నేను కూర్చుని ఉన్న చోటుకి వచ్చి.."అయ్యా!..మేము ఇదే మొదటిసారి ఈ గుడికి రావడం..ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి?..ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే..చాలా మంచి జరుగుతుందట కదా..మాకు మా ఊళ్ళో వాళ్ళు చెప్పగా విని..ఒకసారి చూసి..నిద్ర చేసిపోదామని వచ్చాము..శ్రీ స్వామివారి గురించి కూడా మాకు పెద్దగా తెలీదు.. మీరు మాకు వివరిస్తారా?.." అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలుంకురిపించారు..


ముందు వాళ్ళను స్థిమితంగా కూర్చోమని చెప్పి..క్లుప్తంగా శ్రీ స్వామివారి గురించి..ఆయన చేసిన తపోసాధన గురించి..వివరించి..ఏదైనా సమస్యలున్నవాళ్ళు..ఇక్కడ నిద్ర చేసి..ఆ స్వామివారికిి తమ సమస్య గురించి చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం ఉన్నదనీ..మీకు కూడా ఏదేని సమస్య ఉన్నట్లయితే..మీరు కూడా మొక్కుకోవచ్చనీ తెలిపాను..అంతా విన్న తరువాత..ఆ దంపతులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని.."మాకు వివాహం జరిగి దాదాపు పది సంవత్సరాలు గడిచాయండీ..సంతానం లేదు..మూడు నాలుగు సంతాన సాఫల్య కేంద్రాలలో పరీక్షలు కూడా చేయించుకున్నాము..ఏవో ట్రీట్మెంట్ అంటూ చెప్పారు గానీ..ఫలితం లేదు..డబ్బు మాత్రం ఖర్చు అయింది..ఇక్కడికొచ్చి మ్రొక్కుకుంటే...సంతానం కలుగుతుందని విన్నాము.. అందుకోసమే ఇక్కడ నిద్ర చేయాలని నిశ్చయించుకుని..వచ్చాము.." అన్నారు..


"మీరు మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి మీద విశ్వాసం ఉంచి..ఆ సమాధి ముందు మ్రొక్కుకోండి..ఆ పై మీ అదృష్టం.." అని చెప్పి.."ఇంకాసేపటిలో పల్లకీ సేవ మొదలవుతుంది..అందులో పాల్గొనండి.." అని చెప్పాను..సరే అన్నట్లు తలా ఊపారిద్దరూ..


ఆరోజు పల్లకీ సేవలో ఆ దంపతులిద్దరూ తమ పేరుతో అర్చన చేయించుకున్నారు..భర్త మాత్రం శ్రీ స్వామివారి మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు పల్లకీ మోస్తూ తిరిగాడు..రాత్రికి ఆ మంటపం లోనే పడుకున్నారు.. మళ్లీ ఉదయం లేచి..శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని..తమ ఊరికి వెళ్లిపోయారు..వెళ్లేముందు నా దగ్గరకు వచ్చి..నా ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లారు..


ఆ తరువాత వాళ్ళ గురించి వివరాలేమీ తెలియలేదు..మూడు నెలలు గడిచిపోయాయి..మళ్లీ మహాశివరాత్రి గడచిపోయిన తరువాత..ఒక శనివారం మధ్యాహ్నం నాడు..మళ్లీ మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఇద్దరి ముఖాలూ సంతోషంతో విప్పారి ఉన్నాయి..నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి.."అయ్యా..శ్రీ స్వామివారు మమ్మల్ని కరుణించారు.." అన్నారు..

నేను మాట్లాడేలోపలే.."ఆరోజు ఇక్కడ నిద్రచేసి..తెల్లవారి శ్రీ స్వామివారి సమాధికి మ్రొక్కుకొని మా ఊరికి వెళ్ళామా..ఆరోజు రాత్రి తనకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఆశీర్వదించినట్లు కనిపించింది..తాను ఉలిక్కిపడి లేచి కూర్చుని..నన్ను నిద్రలేపి..నాకు విషయం చెప్పింది..ఆ ప్రక్కరోజు నుంచి..ఇద్దరమూ అత్యంత విశ్వాసం తో శ్రీ స్వామివారి ని కొలుచుకుంటున్నాము..ప్రస్తుతం తనకు రెండో నెల!.." అని చెప్పాడు..ఆ దంపతుల విశ్వాసమే వాళ్లకు ఫలితాన్ని ఇచ్చింది..నమ్మి కొలిచిన వాళ్ల కోరికలు తీరుస్తాననీ.. తన సమాధి నుంచే తాను అందరినీ కాపాడుతాననీ..శ్రీ స్వామివారు చెప్పిన మాట మరొక్కసారి ఋజువు అయింది..


మొదటి సంతానంగా ఆడపిల్ల, ఆతరువాత మరో రెండేళ్లకు మగపిల్లవాడు పుట్టారు..అమ్మాయి కి మూడోనెల వయసు వచ్చిన తరువాత మందిరానికి వచ్చి..అన్నదానం చేసి వెళ్లారు..అలాగే పిల్లవాడు పుట్టిన మూడు నెలలకు మళ్లీ అన్నదానం చేసి వెళ్లారు..ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆ దంపతులు ఆనందంగా వున్నారు..తరచూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి నిద్ర చేసి వెళుతుంటారు..


ఎందరో భక్తులు..ఒక్కొక్కరివి ఒక్కొక్క అనుభవం..తెలుసుకోవాలే గానీ..శ్రీ స్వామివారు చూపిన..చూపుతున్న మహిమలను లెక్కగట్టగలమా?..మనం గోరంత విశ్వాసాన్ని చూపితే..కొండంత ఫలితాన్ని ఇస్తాడు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: