20, మార్చి 2023, సోమవారం

బిల్వ చెట్టు వృత్తాంతం

 *బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత*


శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. 

శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.


*శివపూజకు సంబంధించినంత వరకు*


వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.


వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.


వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.


వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.


వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.


వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.


వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.


వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.


వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.


వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.


వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. 


_శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు._


ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.


పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. 

ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.


ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు.

రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు.

మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. 

నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి,

ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. 

ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.


సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి, మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం.

లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. 

మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. 

అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.


ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. 

అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. 

అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. 

మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.


ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. 

అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు.


ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట.


గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. 

కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. 

సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. 

దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. 

బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. 

శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. 

మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.


*ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి!!*


మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. 

బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. 

వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.


దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని

శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

చేయవలసిన పనులు:

 .

               _*సూక్తిసుధ*_


*చేయవలసిన పనులు:*           పితృవాక్యపరిపాలనచేత శ్రీరాముడు కీర్తి వహించెను. పితృవాక్య పరిపాలనచేత గరుడుడు యశయము పొందెను. సత్యవాక్యపాలనముచేత హరిశ్చంద్రుడు ఖ్యాతి పొందెను. దానంచేత బలిచక్రవర్తి వినుతికెక్కెను, ఓర్పుచేత ధర్మరాజు గొప్పను పొందెను, పెద్దలుతలపెట్టిన  పని నెరవేర్చుటచేత బగీరథుడు ప్రఖ్యాతిగాంచెను, కావున ఈ పనులు పురుషునకు ఆవశ్యకంబులు.

మునగ ఆకు ఉపయోగాలు

 మునగ ఆకు ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 


    మనలో చాలామందికి మునగ ఆకును ఆహారముగా తీసుకొవచ్చు అనే సంగతి చాలమందికి తెలియదు . మరికొంతమందికి మునగ ఆకు శరీరానికి వేడి చేస్తుందని అపొహ కూడా కలదు. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్ధాలలో మునగాకును తప్పకుండా చేర్చాలి. మునగాకులో ఉన్న విటమిన్స్ గాని , ఖనిజ లవణాలు శరీరానికి అమితమైన మేలుని కలిగించును.  


        ఇప్పుడు మునగాకులోని ఆహారపు విలువల గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 


  మునగాకులో ఆహారపు విలువలు - 


         16 కిలోల మాంసంలో విటమిన్ A ఎంత ఉంటుందో ఒక కప్పు మునగాకు రసంలో అంతే A విటమిన్ ఉంటుంది. అదేవిధముగా 9 గుడ్లలో గాని , 80 కప్పుల తాజా ఆవుపాలలో గానీ , అరకిలో వెన్నలో గానీ విటమిన్ A ఎంత ఉంటుందో 1 కప్పు మునగాకు రసంలో అంత ఉంటుంది. 


               16 అరటిపళ్ళలో గానీ , 8 ఆపిల్స్ లో గానీ , 6 కమలాలలో గానీ , రెండున్నర కిలోల ద్రాక్షలోగానీ , 6 నిమ్మకాయలలో గానీ , 20 మామిడి కాయలలో గానీ , ఏడున్నర కిలోల పుచ్చకాయలలో గానీ విటమిన్ C ఎంత ఉంటుందో అంత 1 కప్పు మునగాకు రసంలో C విటమిన్ ఉంటుంది. 


        900 గ్రాముల బాదంపప్పులో గానీ , 8 కమలాలలో గానీ , మూడున్నర కిలోల బొప్పాయిలోగాని , 20 కోడిగుడ్లలో గానీ , రెండున్నర కిలోల మాంసంలో గానీ ఎంత క్యాల్షియం ఉంటుందో అంత 1 గుప్పెడు మునగాకులో అంత క్యాల్షియం ఉంటుంది. 


             అదేవిధముగా దీనిలో ఉన్న మాంసకృత్తులు కూడా మాంసం , చేపలు , గుడ్లు , పాలు మొదలగు వాటిలో ఉన్నవాటికంటే అధికంగా ఉన్నాయి. 


             పైన మీకు మునగాకులో ఉన్న విలువైన విటమిన్ల గురించి పోషకాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మునగాకుతో ఔషధయోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


  మునగాకుతో ఔషధ యోగాలు - 


 * మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు , 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి , ఉబ్బసం , రక్తహీనత , మామూలు జలుబు , దగ్గు , నిస్సత్తువ వంటివి దరిచేరవు . 


 * ఒక స్పూన్ మునగాకు రసము , కొద్దిగా తేనె , ఒక గ్లాసు కొబ్బరినీటిలో కలిపి కలరా , విరేచనాలు , కామెర్ల వ్యాధులలో ఔషధాలు వాడుకుంటూ ఈ మిశ్రమాన్ని కూడా రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటూ ఉంటే మంచిఫలితాలు వస్తాయి. 


 * ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ప్రతిరోజూ పిల్లలకు తినిపిస్తుంటే పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండి చిన్నచిన్న వ్యాధులను లెక్కచేయకుండా చక్కగా ఆడుకుంటారు. వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది. 


 * ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసులవారు స్త్రీపురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు. 


 * బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట , కొన్ని మూత్రపిండాల వ్యాధులు , మలబద్దకం తగ్గును. 


 * ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును . 


 * పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును. 


 * మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంతవరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి , దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును. 


 * మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు , బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును. 


 * మునగాకు రసము లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును. 


 * ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును. 


          పైన చెప్పిన విధంగా ఎన్నో విలువైన యోగాలు కలవు. ఇప్పుడు మీకు మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు కొన్ని వివరిస్తాను . 


  * మునగ కాయలు , పచ్చిమామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్ , విటమిన్ C లోపించకుండా ఉంటాయి. 


 * మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును. 


 * ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి , అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును . 


 * మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా మునగపువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును. 


           * సమాప్తం * 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

శివసల్లాపము

 .

              _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లో𝕝𝕝 

*తద్దినం దుర్దినం మన్యే*

*మేఘఛ్ఛిన్నం న దుర్దినం౹

*యద్దినం శివ సల్లాప* 

*కథా పీయూష వర్జితం॥*


*మేఘములు కమ్మి సూర్యుడు కనబడని రోజు సామాన్యులకు దుర్దినం.....ఏ రోజు శివుడి కబురు లేకుండా, శివుడి తలంపు లేకుండా గడిచిపోతుందో అది దుర్దినము... కష్టాలు అనుభవించిన రోజు దుర్దినం అని మేము అనం...కష్టాలు అనుభవించినా సరే శివుడిని స్మరిస్తే అది సుదినమే*..... (ఇక్కడ శివసల్లాపము అనగా భగవంతునితలంపు అనువిస్తృతార్థమునుగ్రహించాలి).

నీటిలో పడిన నూనె బిందువులా

 శ్లోకం:☝️

*యస్తు సంచరతే దేశాన్*

 *యస్తు సేవేత పండితాన్ l*

*తస్య విస్తారితా బుద్ధిః*

 *తైలబిందు రివాంభసి ll*


భావం: ఎవరు దేశాలు తిరుగుతారో, ఎవరు పండితులను సేవిస్తారో, వారి బుద్ధి నీటిలో పడిన నూనె బిందువులా విస్తరిస్తుంది!

శ్రీ మహాభారతం

 .


               శ్రీ మహాభారతం 

                ➖➖➖✍️

                 300 వ భాగం

    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:



 #మహానుభావులు:


#విష్ణువుని_దర్శించిన_నారదుడు


భీష్ముడు ధర్మరాజుతో “ధర్మనందనా! నేను నీకు శ్వేతద్వీపంలో ఉండే మహా పురుషులగురించి చెబుతుండగా ప్రసంగవశాత్తు ఉపరిచరమనువు గురించి చెప్పాను. ఇక ఆ మహానుభావుల గురించి చెప్తాను…. 


‘నారదుడు శ్వేతద్వీపముకు వెళ్ళి అక్కడ ఉన్న అద్భుత శరీరాలతో ప్రకాశిస్తున్న మహాపురుషులను చూసి వారికి నమస్కరించాడు. వారుకూడా నారదుడిని ఆదరించారు. అప్పుడు నారదుడు విష్ణువును గురించి స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు నారదుడి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. విష్ణువు అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదములు, అనేక రంగులతో కమండలంతో ఓంకారము గాయత్రిని జపిస్తూ చతుర్వేదములు పారాయణం చేస్తూ నారదుడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. 


నారదుడు వినయంతో విష్ణుమూర్తికి నమస్కరించాడు. 


అప్పుడు విష్ణుమూర్తి ‘నారదా ! నన్ను చూడడం అందరికీ సాధ్యం కాదు. లేశమాత్రమైనా అహంకారము లేనంత మాత్రాన అనన్య భక్తివలన నీవు నన్ను చూడగలిగావు. నీకు కావలసిన వరము కోరుకో’ అన్నాడు. 


నారదుడు ‘పరాత్పరా ! నీ దివ్యదర్శనం కంటే నా కేమీ వద్దు’ అన్నాడు. 


విష్ణువు ‘ఎవరు ఇంద్రియనిగ్రహము కలిగి త్రిగుణాతీతుడై ప్రళయకాలంలో కూడా నిశ్చలంగా వెలుగుతుంటాడో అతడే ఆత్మసాక్షి, అజుడు, నిష్కళంకుడుగా వెలుగుతుండే అతడు క్షేత్రజ్ఞుడు, జీవుడు అనబడే వాసుదేవుడు అతడే, సంకర్షుణుడు అతడే. మనస్సు, అహంకారమే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని అంటారు. ఇది నా మాయ. నేను 24 తత్వములకు అధినాధుడనైన 25వ తత్వమును. పరమపురుషుడను నాకంటే వేరు పరము లేదు. మహామునులు సతతము ఎవరి కొరకు తపస్సు చేస్తుంటారో ఆ వాసుదేవుడను నేనే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకలభూతములలో ఉన్న ధాతుశక్తి వేరుగా లేదు ఆ శక్తిని నేనే. ఆ జీవశక్తి సర్వవ్యాప్తంగా సకల లోకములలో విస్తరించి ఉంది. లేని ఎడల ఈ లోకలో చైతన్యము లేదు. జీవుడు వేరు శరీరము వేరు జీవుడిని గురించి నేను తెలుసుకున్నాను అనుకోవడము నా మాయవిలాసము. ఆ మాయ నేను కల్పించినదే. జీవుడికి నాకు భేదము లేదు రెండూ ఒకటే. అచంచలమైన భక్తితో నన్ను కొలిచిన వారికి నేను ముక్తి ప్రసాదిస్తాను. అదిత్యులు, మరుత్తులు, రుద్రులు మొదలైన దేవతా గణములు, బ్రహ్మదేవుడు, చతుర్వేదములు నా స్వరూపములే. నేనే బ్రహ్మదేవుడిని సృష్టించి ఈ సృష్టి కార్యము అప్పగించి నేను నిర్వికారంగా, నిమిత్త మాత్రంగా, ఏకాకిగా కోరిన వారికి సహకరిస్తాను.’



#లోకరక్షణ:


‘ఒక్కోసారి జగద్రక్షణార్ధమై అవతారం ఎత్తుతుంటాను. వరాహరూపంలో హిరణ్యాక్షుడిని, నరసింహరూపంలో హిరణ్యకశిపుని, పరశురాముడిగా క్షత్రియకులాన్ని, దశరధపుత్రుడిగా రావణుడిని సంహరించాను. యాదవకుల సంజాతుడనై ఇంద్రకుమారుడి సాయంతో భూభారాన్ని తగ్గించాను. పూర్వము నేను నరుడు, నారాయణుడు అనే రెండు రూపాలతో మునులుగా అవతరించి లోకరక్షణ చేసాను. తరువాతి కాలంలో మానవరూపంలో అవతరించి లోక కంటకులైన కాలయవనుడిని, కంసుడిని, మురాసురుడిని, నరకాసురుడిని, బాణాసురుడిని సంహరించాను. బాణాసుర వధసమయంలో నన్ను ఎదిరించి నిలిచిన దేవసేనాని కుమారస్వామితో, మహాశివుడితో పోరాడి బాణాసురుడి గర్వము అణిచాను. అంతకు ముందు మత్సత్వము, కూర్మత్వము పొంది దేవతలను వేదములను రక్షించాను. ధర్మరక్షణ కొరకు నేను చేయవలసినది చేసాను. నేను చేయవలసిన కార్యము పూర్తికాగానే నేను తిరిగి నా మూల ప్రకృతిలో చేరిపోతాను. నారదా ! నీవు ఏకాగ్రచిత్తుడవై నన్ను ధ్యానించినందున ఇది నీకు చెప్పాను’ అని విష్ణువు భోదించాడు. 


తరువాత నారదుడుకి శ్వేతద్వీపంలోని మహాపురుషులను చూపి ‘నారదా కాంతి దేహధారులై నిరంతరం నన్నే ధ్యానించే ఈ మహాపురుషులకు నీ ఉనికి భంగము కలిగిస్తుంది కనుక నీవు ఇక ఇక్కడ నుండి వెళ్ళు’ అని చెప్పాడు.


#బదరికావనము:

విష్ణుమూర్తి ఆదేశంతో నారదుడు శ్వేతద్వీపము నుండి బదరికావనము వెళ్ళి అక్కడ ఉన్న నరనారాయణులను దర్శించుకున్నాడు. అక్కడ తాను సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖతః విన్న వేదార్ధసారమును, యోగము, సాంఖ్యముల సారమును మునులందరికీ ఉపదేశించాడు. అక్కడి నుండి బ్రహ్మసభకు వెళ్ళి అక్కడి వారికి విష్ణుమూర్తి సందేశం వినిపించాడు. అలా ఆ ఉపదేశం క్రమంగా ముల్లోకాలలో వ్యాపించింది. దానిని నేను నా తండ్రి శంతనుడి ద్వారా విని ఇప్పుడది నేను నీకు చెప్పాను. ఈ ఉపదేశమును దేవతలు మునులు ఎంతో శ్లాఘిస్తారు. వారు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు, శ్రద్ధతో జపిస్తారు, ఏకాగ్రతతో ధ్యానిస్తారు. ధర్మనందనా ! నీవు కూడా విష్ణుమూర్తిని అనన్య భక్తితో పూజించి తరించు. నీవు దీనిని విష్ణుభక్తులకు, నీతిపరులకు, ఇంద్రియ నిగ్రహము కల వారికి మాత్రమే ఉపదేశించు. నీవిప్పటి వరకు విన్న కథలేవి ఈ ఉపదేశముకు సాటి రావు. ఇది విన్న వారికి, తెలుసుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు తప్పక సిద్ధిస్తాయి.” అని భీష్ముడు నారదుడికి స్వయంగా విష్ణుమూర్తి ఉపదేశించిన ఉపదేశమును ధర్మరాజుకు ఉపదేశించాడు. 


ఈ పవిత్రమైన ఉపాఖ్యానమును పఠించుతూ పాండవులు విష్ణుమూర్తిని భజిస్తూ కాలంగడిపారు” అని వైశంపాయనుడు జనమే జయుడికి చెప్పాడు.


వ్యాసమహర్షి ఆకాశగమనం:

జనమేజయమహారాజా వ్యాసుడు కూడా విష్ణుమూర్తిని తలచుకుంటూ ఆకాశమార్గాన ప్రయాణిస్తున్నాడు అని వైశంపాయనుడు చెప్పగా … జనమేజయుడు “మహర్షీ ! నీవు మోక్షము అత్యంత సుఖప్రథము అని చెప్పావు. కాని సదా ప్రాపంచిక సుఖములలో మునిగితేలే ప్రజలు వారే కాక దేవతలు కూడా హవిర్భాగాలు పొందడానికి చూపించే ఉత్సుకత మోక్షసాధన అందు చూపరు కదా ! ఇలా ఎందుకు జరుగుతుంది అని నా మనసు సదా మధనపడుతుంది. మానవులే కాక దేవతలు సహితము ఇలా మోక్షమార్గమును వదిలి కర్మబంధాలలో చిక్కుకు పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించండి”అని అడిగాడు. 


వైశంపాయనుడు …”జనమేజయమహారాజా ! వ్యాసభగవానుడు తన శిష్యులకు నాలుగు వేదములను భారతమును బోధించాడు. ఆ సమయంలో సుమంతుడు, పైలుడు, జైమిని నీవు అడిగిన విధంగా మేము మా గురువు గారిని అడిగాము. అప్పుడు మా గురువైన వ్యాసుడు నేను ఒకప్పుడు భూతభవిష్యత్తు వర్తమానం తెలుసుకోవడానికి క్షీరసాగరంలో తపస్సు చేసాను. ఆ నారాయణుడి దయ వలన నాకు భూత, భవిష్యత్తు వర్తమానం తెలుసుకునే దివ్యజ్ఞానం లభించింది. దాని ప్రభావంతో నేను ఈ కల్పంలో బ్రహ్మదేవుడు మొదలైన వారు చేసిన పనులు చూడగలిగాను. వాటిని మీకు చెప్తాను. మరుత్తులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు మొదలగు దేవతా గణములు, మునులు, బ్రహ్మదేవుడిని చూసి ‘మాకర్తవ్యము బోధించండి’ అని అడిగారు. 


బ్రహ్మదేవుడు ‘నా మనసులో మెదిలే విషయమే మీరు నాకు గుర్తుచేసారు. మనమందరం విష్ణుమూర్తిని అడిగి మన కర్తవ్యం తెలుకుందాము రండి’ అని వారిని విష్ణులోకము తీసుకు వెళ్ళి అక్కడ వారంతా కలిసి విష్ణువును గురించి తపస్సు చేయగా వారికి అప్పుడు ఒక దివ్యమైన వాక్కు వినిపించింది…



#పరమాత్మ వాణి:


దివ్యవాణి… “దేవతలారా ! మునులారా ! మీరు వచ్చిన పని నాకు తెలుసు. బ్రహ్మదేవుడు ఈ లోకములకు గురువు. ఆయన చెప్పినదే వేదవాక్కు. నాకు కూడా ఆయన చెప్పినదే వేదవాక్కు. మీరందరూ కలిసి వేదోక్తంగా యజ్ఞము చేసి అందు నాకు హవిర్భాగం కల్పించండి” అని పలికింది. 


ఆ మాటలకు ఆనందించిన బ్రహ్మదేవుడు ఒక యాగమును ఏర్పాటు చేయమని దేవతలకు ఆదేశం ఇచ్చాడు. 


దేవతలందరూ వేదోక్తంగా యాగం చెయ్యడానికి పూనుకున్నారు. ఆ యాగమునందు విష్ణుమూర్తికి హవిర్భాగము కల్పించారు. 


విష్ణుమూర్తి అదృశ్యరూపంలో ఆకాశంలో నిలబడి “దేవతలారా ! మునులారా ! మీరు నేను చెప్పినట్లు యజ్ఞము చేసారు. మీరు చేసిన పుణ్యముకు తగిన ప్రతిఫలం ఇస్తాను. మరీచి, పులహుడు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అను బ్రహ్మమానసపుత్రులు వేదములకు ఆచార్యులు. వీరు ఏర్పరిచిన నియమాలు, ఆచారములు, పద్ధతుల ప్రకారం మానవులు యజ్ఞములు చేస్తారు. అందులో మీకందరికి హవిర్భాగములు సమర్పిస్తారు. దానితో వారు తృప్తి పొందుతారు. బ్రహ్మమానస పుత్రులైన సన, సనక, సనంద, కపిల, సనత్కుమారులు సహజమైన జ్ఞానసంపద కలిగి ముక్తి గురించే సదా చింతిస్తుంటారు. వీరు మోక్షధర్మములను జగములకు వివరిస్తారు. మీ అందరికి తల్లి, తండ్రి, గురువు బ్రహ్మదేవుడే. అతడు నా అభీష్టము మేరకు లోకాలను శాసిస్తాడు. నా నుండి పుట్టిన రుద్రుడు లోకాలకు ఆరాధనీయుడు, పూజ్యుడు, సకల వరములను ప్రసాదించు కరుణామయుడు. ఇక మీరు వెళ్ళి మీకు విధించిన వేదోక్త కర్మలను బ్రహ్మ, మరీచి, ప్రజాపతులు చెప్పినట్లు విని ఆచరించండి. ఇది కృతయుగము అను పేరుతో ఉత్తమమైన కాలంగా వర్ధిల్లుతుంది. యజ్ఞయాగములలో పశువధ చేయరాదు. ఇందు ఏమాత్రము సందేహము లేదు” అన్నాడు. దేవతలు, మునులు విష్ణుమూర్తికి నమస్కరించి వెళ్ళారు.



#హయగ్రీవుడు:


దేవతలు, మునులు వెళ్ళినా అక్కడే ఉన్న బ్రహ్మదేవుడి ముందు హయగ్రీవరూపంలో వేదాధ్యయనం చేస్తూ దండ కమండలములతో ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుడిని కౌగలించుకుని “బ్రహ్మదేవా ! నీవు సర్వ లోకములకు విధాతవు, గురుడవు, అధిపతివి అందుకే నేను ఈ జగముల భారం నీ అందు ఉంచి నేను సుఖంగా ఉన్నాను. ఈ లోకమును సక్రమంగా నడపడం నీ బాధ్యత. ఈ లోకమును నడపడంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నేను కల్పించుకుని తీర్చుతుంటాను”అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. 


ఇలా యజ్ఞయాగములలో అగ్రభాగమునకు అర్హుడు, యజ్ఞధారి అయిన మహావిష్ణువు ప్రవృత్తి ధర్మమును నిర్వహించడానికి బ్రహ్మదేవుని, దేవతలను నియమించి తాను మాత్రం నివృత్తి ధర్మమును నిర్వర్తిస్తూ జ్ఞానమూర్తి అయి సర్వత్రా సంచరిస్తున్నాడు.” అని వ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు.



#విష్ణుతత్వము:


వ్యాసుడు ఇంకా ఇలా ….                     “వైశంపాయనా ! ఈ సమస్త లోకములను వాటిని పదిలంగా రక్షిస్తూ తిరిగి వాటిని తనలో లీనం చేసుకునే విష్ణుమూర్తిని నేను కొలుస్తాను. అజుని, విశ్వమే తన రూపముగా కలవాడిని, మృత్యంజయుడిని, దేవతలకు అధినాధుడిని, ఆది అయిన వాడిని, నాలుగు వేదములను అధ్యయనం చేసిన వాడిని, ఆత్మతో కాని ఎరుగ లేని వాడిని, ఈశానుడిని, నాశనం లేని వాడిని, అన్ని తపములకు కర్మఫలదాతను నేను ఆశ్రయిస్తాను. ఈ విధంగా వ్యాసుడు నారాయణుడిని స్తుతించాడు. వ్యాసుడు మమ్ము చూసి నా పూర్వ వృత్తాంతము మీకు చెప్పాను. మీరు కూడా నాకు విష్ణుమూర్తి చెప్పిన ఉపదేశములను ఆచరించండి. ఆ పరమేశ్వరుడిని కొలవండి. వేదముల చెప్పిన ప్రకారము నడవండి అని మాకు చెప్పాడు. మేము వ్యాసుడు చెప్పిన విధముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల ప్రకారము ఈ త్రిలోకాధిపతిని స్తుతించాము. మనసులో ఆరాధించాము” అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. జనమేజయ మహారాజా ! వ్యాసుడు మాకు బోధించిన పుణ్యప్రథమైన విష్ణుతత్వము చదినను విన్న విప్రుడు వేదవేదాంగములను చదివిన ఫలమును పొందుతాడు, క్షత్రియుడు సర్వత్రా విజయము పొందుతాడు, వైశ్యుడు ధనలాభము పొందుతాడు, శూద్రుడు అత్యంత సుఖములను పొందుతాడు. పెళ్ళికాని వారికి పెళ్ళి జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరిగి మంచి పుత్రుడిని పొందుతుంది. గొడ్రాలు సంతానవతి ఔతుంది” అని వైశంపాయనుడు ఫలశృతి చెప్పాడు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                    .🙏