20, మార్చి 2023, సోమవారం

బిల్వ చెట్టు వృత్తాంతం

 *బిల్వ చెట్టు వృత్తాంతం, బిల్వాష్టకం - విశిష్టత*


శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. 

శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.


*శివపూజకు సంబంధించినంత వరకు*


వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.


వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.


వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.


వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.


వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.


వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.


వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.


వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.


వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.


వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.


వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. 


_శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు._


ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.


పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. 

ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.


ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు.

రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు.

మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. 

నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి,

ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. 

ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.


సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి, మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం.

లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. 

మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. 

అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.


ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. 

అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. 

అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. 

మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.


ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. 

అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు.


ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట.


గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. 

కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. 

సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. 

దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. 

బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. 

శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. 

మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.


*ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి!!*


మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. 

బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. 

వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.


దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని

శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.

కామెంట్‌లు లేవు: