20, అక్టోబర్ 2021, బుధవారం

శ్రీమద్భాగవతము

 *20.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2297(౨౨౯౭)* 

*10.1-1433-వ.*

*10.1-1434-*


*శా. "నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్*

*నా పే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్*

*గోపాలాంగన లెంత జాలిఁబడిరో? కోపించిరో? దూఱిరో?*

*వ్రేపల్లెన్ నిజధర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై."* 🌺



*_భావము: శిష్యులై యుండి, మహత్తరమైన కార్యాన్ని సాధించిన బలరామకృష్ణులను ఉద్దేశించి గురువు సాందీపనిగారు: "ఓ మహానుభావులారా! మీరు నాకు శిష్యులైనందుకు నేను కృతార్థుడనైనాను", అని వారిని ఆశీర్వదించగా, ఇద్దరు కృతకృత్యులమైనామని సంతోషించి ఆయన వద్ద సెలవు తీసుకుని రథమెక్కి మథురా నగరానికి ప్రయాణమయ్యారు. పట్టణ ద్వారం సమీపిస్తూనే, శ్రీకృష్ణుడు పాంచజన్యమును పూరించగా వినిన నగర పౌరులు, పోయిన సొమ్ములు దొరికిన వారి వలె సంతోషించారు._*  

*_ఆ తరువాత ఒకానొక నాడు శ్రీకృష్ణుడు తనలో తాను వ్రేపల్లెలో గోపీజనుల గురించి ఇలా అనుకుంటున్నాడు: "మనస్సులు నిరంతరము నా పైనే నిలిపి, నా కొరకే ఎదురు చూస్తూ, నా నామములనే స్మరించి, తలుచుకుంటూ, వ్రేపల్లెలో తమ తమ గృహములలో, ఈ గోపాంగనలెంతగా తపించారో, దిగులుచెందారో, నాపై కోపించారో, నన్ను తిట్టుకున్నారో, చైతన్యమే కోల్పోయారో"._* 🙏



  *_Meaning: Guru Sandeepani was complimenting his disciples, the exemplery and incredible achievers, Balarama and Sri Krishna: "My life's mission is fulfilled by having You as my Sishyas" and blessed them on completion of their learning (Vidyabhyasamu). They too felt happy on having met with success in their studies, took leave of their Guru and were on their way to Madhura in their chariot. While on the outskirts of Madhura city, Sri Krishna blew his powerful conch, Panchajanya. On hearing this sankhanadam, the citizens of the city joyfully felt like having got back their lost riches._*

*_On elapsation of some time, one of those days, Sri Krishna thought of the people at Vrepalle: "They have always focussed their minds on me, were waiting for me and were eternally reciting my names. For this long absence, they must be blaming me, cursing on me or have been suffering from the pangs of separation."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

సంస్కృత మహాభాగవతం

 *20.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*


*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.17 (పదిహేడవ శ్లోకము)*


*తేజో బలం ధృతిః శౌర్యం తితిక్షౌదార్యముద్యమః|*


*స్థైర్యం బ్రహ్మణ్యమైశ్వర్యం క్షత్రప్రకృతయస్త్విమాః॥12871॥*


తేజస్సు (శత్రువులచేతిలో ఓటమిపాలుగాకుండుట), బలము (శత్రువులను జయించు సామర్థ్యము గలిగియుండుట), ధైర్యము, పరాక్రమము, సహనము, ఔదార్యము (త్యాగబుద్ధి), ప్రయత్నము, స్థిరత్వము, బ్రాహ్మణభక్తి, ఐశ్వర్యము (పరిపాలనా సామర్థ్యము) అనునవి క్షత్రియవర్ణమువారి సహజలక్షణములు.


*17.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ఆస్తిక్యం దాననిష్ఠా చ అదంభో బ్రహ్మసేవనమ్|*


*అతుష్టిరర్థోపచయైర్వైశ్యప్రకృతయస్త్విమాః॥12872॥*


ఆస్తికబుద్ధి (దైవమునందును, వేద, శాస్త్రములయందును విశ్వాసము), దానగుణము, ఆదంభము (మోసబుద్ధి లేకుండుట), బ్రాహ్మణులను సేవించుట, అర్థార్జనము చేయుటలో తృప్తిపడకుండుట ఇవి అన్నియును వైశ్యవర్ణమవారి స్వభావములు.


*17.20 (ఇరువదియవ శ్లోకము)*


*శుశ్రూషణం ద్విజగవాం దేవానాం చాప్యమాయయా|*


*తత్ర లబ్ధేన సంతోషః శూద్రప్రకృతయస్త్విమాః॥12873॥*


బ్రాహ్మణులను, గోవులను, దేవతలను నిష్కపటభావముతో సేవించుట, దైవానుగ్రహమున వచ్చినదానితో తృప్తిపడుట అనునవి శూద్రవర్ణమువారి స్వభావములు.


*17.20 (ఇరువదియవ శ్లోకము)*


*అశౌచమనృతం స్తేయం నాస్తిక్యం శుష్కవిగ్రహః|*


*కామః క్రోధశ్చ తర్షశ్చ స్వభావోఽన్తేవసాయినామ్॥12874॥*


అశౌచము (అపవిత్రత), అనృతము (అసత్యము), చౌర్యము, నాస్తికబుద్ధి (వేదశాస్త్రములయందు అవిశ్వాసము), అకారణముగా ,పోట్లాడుట, కామము, క్రోధము, అర్థకామతృష్ణ మొదలగునవి నిమ్నశ్రేణికి చెందిన స్వభావములు. ఈ లక్షణములు ఎవ్వరును కలిగియుండరాదు.


*17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*అహింసా సత్యమస్తేయమకామక్రోధలోభతా|*


*భూతప్రియహితేహా చ ధర్మోఽయం సార్వవర్ణికః॥12875॥*


ఉద్ధవా! అహింస (ఇతరులను మానసికముగా, శారీరకముగా, వాచికముగా హింసింపకుండుట), సత్యనిష్ఠ, దొంగిలింపకుండుట, కామ, క్రోధ, లోభములను జయించుట, సకలప్రాణులకును ప్రియమును, హితమును కూర్చుటయందు ఆసక్తిని కలిగియుండుట ఇవి అన్నియును అన్ని వర్ణములవారికిని ఉండవలసిన లక్షణములు.


*17.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ద్వితీయం ప్రాప్యానుపూర్వ్యాజ్జన్మోపనయనం ద్విజః|*


*వసన్ గురుకులే దాంతో బ్రహ్మాధీయీత చాహుతః॥12876॥*


ద్విజులుగా పేర్కొనబడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులయొక్క జాతకర్మాది సంస్కారములను వివరించెదను - ద్విజులు జాతకర్మాదుల అనంతరము ద్వితీయజన్మయైన ఉపనయన సంస్కారమును పొందవలెను. ఇంద్రియనిగ్రహము కలిగి, గురుకులవాసము చేయుచుండవలెను. గురుశుశ్రూష లొనర్చుచు ఆతని ఆజ్ఞమేరకు వేదాధ్యయనమును, వేదార్థ విచారములను గావింపవలెను.


*17.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మేఖలాజినదండాక్షబ్రహ్మసూత్రకమండలూన్|*


*జటిలోఽధౌతదద్వాసోఽరక్తపీఠః కుశాన్ దధత్॥12877॥*


బ్రహ్మచారి మేఖలను (కటిసూత్రమును), జింకచర్మమును, మోదుగ దండమును, రుద్రాక్షమాలను (తులసిమాలను), యజ్ఞోపవీతమును, కమండలువును కలిగియుండవలెను. కేశములకు అభ్యంగనాది సంస్కారములు లేకుండుటచే జుట్టు జడలుగట్టియుండును. దంతధావనమునందును, వస్త్రములను ధరించుట యందును మక్కువ చూపరాదు. రంగురంగుల ఆసనములపై కూర్చుండరాదు. కుశలను ధరింపవలెను.


*17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*స్నానభోజనహోమేషు జపోచ్చారే చ వాగ్యతః|*


*నచ్ఛింద్యాన్నఖరోమాణి కక్షోపస్థగతాన్యపి॥12878॥*


స్నాన, భోజన, హోమ సమయములయందును, జపముచేయునప్పుడును, మల, మూత్రవిసర్జన సమయములందును మౌనమును పాటింపవలెను. చక్కదనముకొరకై గోళ్ళను, జుట్టును కత్తిరించకూడదు. కక్షల (చంకల) యందలి, మర్మాంగమునందలి రోమములను తొలగించకూడదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*465వ నామ మంత్రము* 20.10.2021


*ఓం కాంతిమత్యై నమః*


తేజోవంతమయిన అవయవసంపదతో అలరారు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కాంతిమతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కాంతిమత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఇహపరదాయకమైన శాంతిసౌఖ్యములు సంప్రాప్తమగును.


*సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్|*


*పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్ సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్॥*


అమ్మవారు సిందూరం మాదిరిగా ఎర్రనైన శరీరంతో, మూడు కన్నులతో, తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్యకిరీటమునందు ధరించి, చిఱునగవుతో కూడిన ముఖంతో, ఉన్నతమైన వక్షస్థలంతో, చేతులలో మద్యంతో నిండిన రత్నభాండాన్ని, ఎర్రని కలువను ధరించి, సౌమ్యమైన రూపంతో రత్న ఘటమందున్న ఎర్రని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ధ్యానించాలి తప్ప ఆ తల్లి తేజస్సును గాని, సౌందర్యమునుగాని వర్ణించడానికి నేను *(పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం)* ఎంతటి వాడను. ఆ తల్లి పాదాలను కూడా తదేకంగాచూచి భక్తిపారవశ్యంతో ధ్యానించడానికి కూడా అర్హత చాలని వాడను. 


ఆ అమ్మను కనులుమూసుకొని, నాకు సాధ్యమైనంతవరకే ఆ తల్లి రూపాన్ని మనోనేత్రాలలో చిత్రించుకోగలను తప్ప *(ఉద్యద్భాను సహస్రాభా* యని లలితా సహస్ర నామావళి యందు ఆరవ నామ మంత్రంలో ఉదయించుచున్న వేయి (అనంతకోటి) సూర్యుల కాంతితో తేజోమయరూపంతో ఉన్న పరమేశ్వరిని స్తుతింపబడిన) ఆ తల్లి తేజస్సును చూడగలనా?


పరబ్రహ్మస్వరూపిణి. నారాయణి. శివాని. ఆ తల్లి సర్వదేవతా స్వరూపిణి. *సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవిత* గా (లక్ష్మీ, వాణిలు ఆ తల్లి తనకు ఇరువైపులా నిలచి వింజామరలు వీచువైభవంతో) భాసిల్లు తల్లి. అనంతకోటి జీవరాశులలో తేజోమయిగా విలసిల్లే మూలప్రకృతి స్వరూపిణి. ఆ తల్లి తేజస్సును చూడాలన్నా, ఆస్వాదించాలన్నా కేవలం కామేశ్వరునికి మాత్రమే సాధ్యమగును గనుకనే అమ్మవారు *కాంతిమతీ* యని అనబడినది. 


అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం కాంతిమత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

తులసితో చికిత్స -

 మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -


      మలేరియా జ్వరం వర్షాకాలం నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 


  నివారణోపాయాలు - 


 * 7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న మలేరియా జ్వరం 3 రోజులలో హరించును . 


 * మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 


 * తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 


 * మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 


 * తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 


 * మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.


  గమనిక - 


      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.


  నా అనుభవం - 


         ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 


   

           


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భారతీయ ధర్మమే చాలా గొప్పది

 *భారతీయ ధర్మమే చాలా గొప్పది, భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు. ఎలాగో మీరే చూడండి.*


పెద్ద పోస్ట్ అని చదవడం మనేయకండి


1)సూర్యుడి నుంచి వెలువడుతున్న *ఓంకారమని* నాసా ఎందుకు పేర్కొన్నట్టు? 🚩


2) మన దేశీయ *గోమూత్రం* మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?🚩


3) న్యూజెర్సీ *"సిటాన్ హాలు"* యూనివర్సిటీలో *భగవద్గీత* తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?🚩


4) ముస్లిం దేశమైన ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు *"గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్"* అని, జాతీయ ఎంబ్లెమ్ కు *"గరుడ పంచశిల"* అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?🚩


5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద *వినాయకుడి బొమ్మ* ఉంటుందేం?🚩


6) అమెరికా మాజీ అధ్యక్షుడు *బారక్ ఒబామా* తన జేబులో ఎప్పుడూ *హనుమంతుడి* చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?🚩


7) *యోగ, ప్రాణాయామాలకు* ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది? 🚩


8)వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు *భూమి గుండ్రంగా* ఉందని చెప్పారేం? 🚩


9) *'లుప్త', 'హంస'* అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు *'లుఫ్తాన్సా'* అని పేరెందుకు పెట్టారు?🚩


10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను *"హిందూకుష్"* పర్వతాలని ఎందుకంటారు?🚩


11) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి *శ్రీమహావిష్ణు విగ్రహం* ఎలా కనిపించింది?🚩


12) అమెరికా శాస్త్రవేత్త *డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్* పరిశోధన చేసి *గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు.* దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?🚩


13) స్వామి దయానంద సరస్వతి రాసిన *"సత్యార్థ ప్రకాశ్"* చదివి భాగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో *"మహేంద్ర పాల్ ఆర్య"* పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ.. డా. జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?🚩


14) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క *"కుష్వాహా"* కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది? 🚩


15) *ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది.* వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?🚩


16) అమెరికా నటి, నిర్మాత *జూలియా రాబర్ట్స్* హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?🚩


17) రామాయణం మిథ్య అయితే, *ప్రపంచంలోని రాళ్ళలో* రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు *నీటిపై తేలుతున్నాయి?🚩*


18) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో *80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది? 🚩*


19) *5000 సంవత్సరాల పురాతనమైనది,* మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది? 🚩


20) అలెగ్జాండర్ మనదేశం నుండి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లాడా?


*అందుకే, ప్రియమైన భారతీయులారా ఆత్మ బంధువులారా... భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి. ✊*


*భారతీయునిగానే మరణించండి.*


మన భారతదేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు. 


మనదేశం యొక్క గొప్పతనాన్ని పొగడకపోయినా కనీసం మనదేశాన్ని మనమే కించపరకాకుండా ఉంటే చాలు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ముందు తరాలవారు తెలియచేశారు.


భారతీయులు ఎవరికీ తీసిపోరు, వారికి ఎవరూ సాటిరారు.


*పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలపరా నీజాతి నిండు గౌరవమును.*


*భారతీయునిగా పుట్టినందుకు గర్వించు.*


జై శ్రీరామ్

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఒకరికి ఒకరు...*


ఆ దంపతులు, వాళ్ళిద్దరి పిల్లలూ శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని..మందిర ఆవరణ లోనే ఓ ప్రక్కగా కూర్చున్నారు..పిల్లలిద్దరూ తల్లిని ఏదో ఒకటి అడుగుతూనే వున్నారు..కానీ ఆమె వాళ్లకు సైగలతోనే బదులిస్తోంది..శ్రీ స్వామివారి వద్ద తీసుకున్న ప్రసాదాన్ని తన చేతులతోనే పిల్లలకు పెట్టి..భర్తకూ తినిపించింది..వాళ్ళను దగ్గరగా గమనిస్తున్న మాకు కొద్దిగా తేడాగా అనిపించింది..కొద్దిసేపు గమనించిన తరువాత అర్ధమైంది ఏమిటంటే..ఆ భార్యకు మాటలు రావు..మూగ మనిషి..కానీ తన సైగలతోనే భర్తను, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నది..


అతనిని పిలచి "మీదేఊరు?" అని అడిగాను..వంగిరెడ్డిపాలెం అని చెప్పాడు.."అయ్యా..నేను రోజువారీ కూలీ పని చేసుకుంటూ ఉండేవాడిని..ఉన్నంతలో బాగానే బ్రతుకుతున్నాను.. పెద్దవాళ్ళు ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు..ఆ పెళ్లి జరిగిన సంవత్సరానికి నాకు కంటి చూపు మందగించింది..సరిగా చూడలేను..కళ్ల డాక్టర్ల కు చూపించుకున్నాను..కళ్ళద్దాలు ఇచ్చారు..ఆపరేషన్ చేసినా చూపు మెరుగుపడదు అని చెప్పారు..పగటి పూట కళ్ళు సుమారుగా కనబడతాయి కానీ..రాత్రి పూట కొద్దిగా వెలుతురు తగ్గినా నాకు కనబడదు..కంటి చూపు సరిగా లేదని నా భార్య నన్ను వదిలేసింది....మొదటినుంచీ నాకు ఈ స్వామివారంటే భక్తి..చాలా సార్లు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి వెళ్లిపోయేవాడిని..ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్లిపోయిన తరువాత చాలా బాధపడ్డాను..జీవితం లో నాకు తోడుగా ఉండేవాళ్ళు లేరే అని వెలితి పడి..నా బాధను ఆ స్వామివారికే చెప్పుకున్నాను.." అన్నాడు..


"మీ తల్లి దండ్రులు లేరా?.."అని అడిగాను.."ఇప్పుడు లేరు.." అన్నాడు..


"ఈ అమ్మాయి ఎవరు?..ఆ పిల్లలూ...?" నా ప్రశ్న పూర్తి కాక ముందే..అడ్డుకొని చెప్పసాగాడు.."ఆ అమ్మాయి మూగది.. మాటలు రావు..దాదాపుగా నాలాటి జీవితమే తనది కూడా..పెళ్లి అయింది..ఈ మూగ దానితో వేగలేనని ఆ కట్టుకున్నవాడు వదిలేసాడు..కాకుంటే..పెళ్ళైన ఆరు నెలలకే ఈ అమ్మాయిని వదిలించుకున్నాడు..తాను కూడా ఇక్కడికే రావడం మొదలు పెట్టింది.."


"స్వామివారు నాకు తోడు చూపాలని అనుకున్నారేమో తెలీదు..ఏడేళ్ల క్రిందట ఈ అమ్మాయి వాళ్ళమ్మతో వచ్చినప్పుడు నేను ఆమెను అడిగాను..తన కూతురు మూగది..మాట్లాడలేదు అని చెప్పింది..నేనూ నా సమస్య చెప్పాను..కళ్ళు సరిగా కనబడవని చెప్పాను..మొత్తంమీద ఒప్పుకున్నది..ఇద్దరమూ ఈ స్వామివారి సమక్షం లోనే పెళ్లిచేసుకున్నాము..ఇక్కడ వివాహం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతి అడిగాను..మీరు సరే అన్నారు.." అన్నాడు..నిజానికి నాకు ఆ సంగతి గుర్తులేదు..


"పెళ్ళైన తరువాత ఎటువంటి ఇబ్బందీ లేదు..నేను కూలీ పనికి వెళతాను..తాను ఇల్లు చూసుకుంటుంది..ఇద్దరు పిల్లలు..వాళ్ళను తానే చూసుకుంటుంది..మూగది అనే ఆలోచనే రాదు..అన్నీ చక్కబెట్టుకుంటుంది.." అని చెప్పుకుపోతున్నాడు..


ఎవరికి ఎవరిని తోడుగా వుంచాలో ఆ దైవానికి తెలుసు..ఆ దంపతులిద్దరికీ శ్రీ స్వామివారంటే అపరితమైన భక్తి..అదే వాళ్ళను ఒకటిగా చేసిందేమో తెలీదు..గతి తప్పాయనుకున్న వాళ్ళ జీవితాలకు ఒక అర్ధం ఏర్పడింది..తమకు ఆ స్వామివారే దారి చూపారని అతను పదే పదే చెప్పుకుంటాడు..అది నిజమే కదా!..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

సూర్యోపస్థాన మంత్రం

 @⁨Subramanyam Vidik Fn Dr Homeo⁩ గారు, మీరు పెక్కు సమయాలలో మధ్యాహ్నీక సంధ్యావందన శుభాకాంక్షలను మన సమూహపు మిత్రులందరికి తెలియజేస్తూనే వుంటారు. ఎంతటి గొప్ప ఆలోచన. 


ఈ మధ్యాహ్నీకంలోని సూర్యోపస్థాన మంత్రం ఎంతో గొప్పదైనది. ఈ మంత్ర భావము తెలుగులోను ఆంగ్లంలోను సభ్యుల విజ్ఞానం పెంపొందుటకు ఈ సమూహములో పొందుపరుస్తున్నాను. 


పశ్యేమ శరదఃశతం

జీవేమ శరదఃశతం

నందామ శరదఃశతం

మోదామ శరదఃశతం

భవామ శరదఃశతం

శృణవామ శరదఃశతం

ప్రబ్రవామ శరదఃశతం

అజీత శ్యామ శరదఃశతం

జ్యోక్చ సూర్యం దృశే


భావము:


వందయేళ్ళు ప్రార్థించాలి

వందయేళ్ళు జీవించాలి

వందయేళ్ళు భంధువులతో కలిసిమెలిసి వుండాలి

వందయేళ్ళు ఆహ్లాదంగా గడపాలి

వందయేళ్ళు కీర్తి యశస్సుతో మెలగాలి

వందయేళ్ళు మంచిదే వినాలి

వందయేళ్ళు మంచివే మాట్లాడాలి

వందయేళ్ళు యెటువంటి కీడు దరి రానీయకుండా జీవించాలి

యెల్లప్పుడు సూర్యభగవానుని వీక్షించుటయే నా ప్రార్థన


అంటే మనం వంద ఏళ్ళు ఆ ప్రత్యక్ష దైవము సూర్య భగవానుని అనుగ్రహంతో, కీర్తి యశస్సులతో, ఆయురారోగ్యైశ్వర్యాదులతో సద్గుణసంపన్నులుగా నిండు నూరేళ్ళ పైగా దైనందిన జీవనవిధానమగు భౌతిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక కర్తవ్యాలను నిర్వహించడానికి గాను తగు దేహారూఢ్యముతో జీవించాలని ప్రార్థిస్తున్నామన్నమాట.


అనగా వంద ఏళ్ళు జీవించడం అన్నది దేవుడెరుగు, కాని మనం ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంతో దేహదారూఢ్యంతో ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. ఎలాంటి అనారోగ్యం పాలుకాకుండా మన దైనందిన కర్తవ్యాల గురించి పరాధీనులు కాకుండా శాంతియుతంగా నిష్కృమించాలన్నదే దీని ఉద్దేశం.

గజేంద్రమోక్షం

 బమ్మెర పోతన రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం అనే ఘట్టం లోనిది ఈ క్రింది పద్యం.


"లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు, పెం

జీకటి కవ్వల నెవ్వడు

నేకాకృతి వెలుగునతని నేసేవింతున్‌’’


మన పురాణాల్లో ప్రస్తావించబడుతున్న, నేటి శాస్త్ర పరిశోధకులు వివరిస్తున్న అనేక లోకాలు ఒకానొక దశలో ఉండవు. ఈ కోటానుకోట్ల సూర్యుళ్లూ అంతరిస్తారు. 


మనం చూస్తున్న మహాసముద్రాలు, బృహత్‌ పర్వతాలు, అగమ్య అరణ్యాలు, 84 లక్షల జీవరాశులు, జంగమ, స్థావరములు, విశ్వాంతరాళాల్లోని పాలపుంతలు, స్వర్గ, నరక లోకాలు ఇవేవీ ఉండక సమసిపోతాయి. అవధుల్లేని, ఎల్లలు లేని ఈ ఆకాశమూ ఉండదు. 


మనం గణించే ఘడియ, విఘడియలు, శత, సహస్ర యుగ మన్వంతర లాంటి కాల ప్రమాణాలు ఉండవు. ‘అవిశ్వం’ ఏర్పడుతుంది. నిర్వచించరాని అంధకారము ఏర్పడుతుంది. 


ఇలాంటి వాటికి ఆవల ‘ఒక శేషత్వం’ ఉంటుంది. అది ‘అనాది మధ్యం’ లేనిది. అది పురుష స్ర్తీ నపుంసక కాదు. అంతము అదియే అయి ఉంటుంది. అంతము అందులోనే అణగి ఉంటుంది.

 

ఆ శక్తి విశ్వాన్ని వెలువరించగలదు, ఇముడ్చుకోగలదు. నిష్కళంకమై, అన్నింటికీ సాక్ష్యమై ఉంటుంది. ఆ శక్తికి రూపం, రసం, గంధం ఉండవు. జనన మరణాలుండవు. ఆ శక్తి నామగోత్ర పరిచయ శూన్యం. వర్ణరహితం. పాప,పుణ్య రహితం, తత్వ రహితం, సహజమై ఉంటుంది. మానవ మేధస్సుకి అందని మహాద్భుత తేజస్సు ఏకాకృతిన వెలుగుతుంటుంది. 


అట్టి మహత్తర శక్తిని ఆరాధించుచూ, సేవించుకొనుచున్నాను అని గజేంద్రుడు ఆ శక్తిని వేడుకున్నాడు. 


అయస్కాంతం నిరంతరం ఉత్తరం వైపే చూస్తున్నట్టుగా మనం కూడా పెనుచీకటికి ఆవల ఉన్న ఆ పరమాత్ముని వైపే మరలి, అర్చించడమో, వందనం చేయడమో దాస్యం చేయడమో, సఖ్యం చేయడమో, ఆత్మనివేదగావించడమో, స్మరణమో, పాదసేవనమో చేద్దాం. ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని శుష్క చర్చలను విడనాడి పరమాత్ముని సన్నిధి చేరదాం. కర్మ కుర్మన్‌ భజే దైవం. మనం మన పనిని దైవ కార్యంగానే తలచి సర్వేశ్వరానుగ్రహాన్ని పొందుదాం. 


శేషాయ నమః