20, అక్టోబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం

 *20.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదిహేడవ అధ్యాయము*


*వర్ణాశ్రమ ధర్మ నిరూపణము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*17.17 (పదిహేడవ శ్లోకము)*


*తేజో బలం ధృతిః శౌర్యం తితిక్షౌదార్యముద్యమః|*


*స్థైర్యం బ్రహ్మణ్యమైశ్వర్యం క్షత్రప్రకృతయస్త్విమాః॥12871॥*


తేజస్సు (శత్రువులచేతిలో ఓటమిపాలుగాకుండుట), బలము (శత్రువులను జయించు సామర్థ్యము గలిగియుండుట), ధైర్యము, పరాక్రమము, సహనము, ఔదార్యము (త్యాగబుద్ధి), ప్రయత్నము, స్థిరత్వము, బ్రాహ్మణభక్తి, ఐశ్వర్యము (పరిపాలనా సామర్థ్యము) అనునవి క్షత్రియవర్ణమువారి సహజలక్షణములు.


*17.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ఆస్తిక్యం దాననిష్ఠా చ అదంభో బ్రహ్మసేవనమ్|*


*అతుష్టిరర్థోపచయైర్వైశ్యప్రకృతయస్త్విమాః॥12872॥*


ఆస్తికబుద్ధి (దైవమునందును, వేద, శాస్త్రములయందును విశ్వాసము), దానగుణము, ఆదంభము (మోసబుద్ధి లేకుండుట), బ్రాహ్మణులను సేవించుట, అర్థార్జనము చేయుటలో తృప్తిపడకుండుట ఇవి అన్నియును వైశ్యవర్ణమవారి స్వభావములు.


*17.20 (ఇరువదియవ శ్లోకము)*


*శుశ్రూషణం ద్విజగవాం దేవానాం చాప్యమాయయా|*


*తత్ర లబ్ధేన సంతోషః శూద్రప్రకృతయస్త్విమాః॥12873॥*


బ్రాహ్మణులను, గోవులను, దేవతలను నిష్కపటభావముతో సేవించుట, దైవానుగ్రహమున వచ్చినదానితో తృప్తిపడుట అనునవి శూద్రవర్ణమువారి స్వభావములు.


*17.20 (ఇరువదియవ శ్లోకము)*


*అశౌచమనృతం స్తేయం నాస్తిక్యం శుష్కవిగ్రహః|*


*కామః క్రోధశ్చ తర్షశ్చ స్వభావోఽన్తేవసాయినామ్॥12874॥*


అశౌచము (అపవిత్రత), అనృతము (అసత్యము), చౌర్యము, నాస్తికబుద్ధి (వేదశాస్త్రములయందు అవిశ్వాసము), అకారణముగా ,పోట్లాడుట, కామము, క్రోధము, అర్థకామతృష్ణ మొదలగునవి నిమ్నశ్రేణికి చెందిన స్వభావములు. ఈ లక్షణములు ఎవ్వరును కలిగియుండరాదు.


*17.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*అహింసా సత్యమస్తేయమకామక్రోధలోభతా|*


*భూతప్రియహితేహా చ ధర్మోఽయం సార్వవర్ణికః॥12875॥*


ఉద్ధవా! అహింస (ఇతరులను మానసికముగా, శారీరకముగా, వాచికముగా హింసింపకుండుట), సత్యనిష్ఠ, దొంగిలింపకుండుట, కామ, క్రోధ, లోభములను జయించుట, సకలప్రాణులకును ప్రియమును, హితమును కూర్చుటయందు ఆసక్తిని కలిగియుండుట ఇవి అన్నియును అన్ని వర్ణములవారికిని ఉండవలసిన లక్షణములు.


*17.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ద్వితీయం ప్రాప్యానుపూర్వ్యాజ్జన్మోపనయనం ద్విజః|*


*వసన్ గురుకులే దాంతో బ్రహ్మాధీయీత చాహుతః॥12876॥*


ద్విజులుగా పేర్కొనబడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులయొక్క జాతకర్మాది సంస్కారములను వివరించెదను - ద్విజులు జాతకర్మాదుల అనంతరము ద్వితీయజన్మయైన ఉపనయన సంస్కారమును పొందవలెను. ఇంద్రియనిగ్రహము కలిగి, గురుకులవాసము చేయుచుండవలెను. గురుశుశ్రూష లొనర్చుచు ఆతని ఆజ్ఞమేరకు వేదాధ్యయనమును, వేదార్థ విచారములను గావింపవలెను.


*17.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*మేఖలాజినదండాక్షబ్రహ్మసూత్రకమండలూన్|*


*జటిలోఽధౌతదద్వాసోఽరక్తపీఠః కుశాన్ దధత్॥12877॥*


బ్రహ్మచారి మేఖలను (కటిసూత్రమును), జింకచర్మమును, మోదుగ దండమును, రుద్రాక్షమాలను (తులసిమాలను), యజ్ఞోపవీతమును, కమండలువును కలిగియుండవలెను. కేశములకు అభ్యంగనాది సంస్కారములు లేకుండుటచే జుట్టు జడలుగట్టియుండును. దంతధావనమునందును, వస్త్రములను ధరించుట యందును మక్కువ చూపరాదు. రంగురంగుల ఆసనములపై కూర్చుండరాదు. కుశలను ధరింపవలెను.


*17.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*స్నానభోజనహోమేషు జపోచ్చారే చ వాగ్యతః|*


*నచ్ఛింద్యాన్నఖరోమాణి కక్షోపస్థగతాన్యపి॥12878॥*


స్నాన, భోజన, హోమ సమయములయందును, జపముచేయునప్పుడును, మల, మూత్రవిసర్జన సమయములందును మౌనమును పాటింపవలెను. చక్కదనముకొరకై గోళ్ళను, జుట్టును కత్తిరించకూడదు. కక్షల (చంకల) యందలి, మర్మాంగమునందలి రోమములను తొలగించకూడదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదిహేడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: