మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*ఒకరికి ఒకరు...*
ఆ దంపతులు, వాళ్ళిద్దరి పిల్లలూ శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని..మందిర ఆవరణ లోనే ఓ ప్రక్కగా కూర్చున్నారు..పిల్లలిద్దరూ తల్లిని ఏదో ఒకటి అడుగుతూనే వున్నారు..కానీ ఆమె వాళ్లకు సైగలతోనే బదులిస్తోంది..శ్రీ స్వామివారి వద్ద తీసుకున్న ప్రసాదాన్ని తన చేతులతోనే పిల్లలకు పెట్టి..భర్తకూ తినిపించింది..వాళ్ళను దగ్గరగా గమనిస్తున్న మాకు కొద్దిగా తేడాగా అనిపించింది..కొద్దిసేపు గమనించిన తరువాత అర్ధమైంది ఏమిటంటే..ఆ భార్యకు మాటలు రావు..మూగ మనిషి..కానీ తన సైగలతోనే భర్తను, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నది..
అతనిని పిలచి "మీదేఊరు?" అని అడిగాను..వంగిరెడ్డిపాలెం అని చెప్పాడు.."అయ్యా..నేను రోజువారీ కూలీ పని చేసుకుంటూ ఉండేవాడిని..ఉన్నంతలో బాగానే బ్రతుకుతున్నాను.. పెద్దవాళ్ళు ఒక సంబంధం చూసి పెళ్లి చేశారు..ఆ పెళ్లి జరిగిన సంవత్సరానికి నాకు కంటి చూపు మందగించింది..సరిగా చూడలేను..కళ్ల డాక్టర్ల కు చూపించుకున్నాను..కళ్ళద్దాలు ఇచ్చారు..ఆపరేషన్ చేసినా చూపు మెరుగుపడదు అని చెప్పారు..పగటి పూట కళ్ళు సుమారుగా కనబడతాయి కానీ..రాత్రి పూట కొద్దిగా వెలుతురు తగ్గినా నాకు కనబడదు..కంటి చూపు సరిగా లేదని నా భార్య నన్ను వదిలేసింది....మొదటినుంచీ నాకు ఈ స్వామివారంటే భక్తి..చాలా సార్లు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి వెళ్లిపోయేవాడిని..ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్లిపోయిన తరువాత చాలా బాధపడ్డాను..జీవితం లో నాకు తోడుగా ఉండేవాళ్ళు లేరే అని వెలితి పడి..నా బాధను ఆ స్వామివారికే చెప్పుకున్నాను.." అన్నాడు..
"మీ తల్లి దండ్రులు లేరా?.."అని అడిగాను.."ఇప్పుడు లేరు.." అన్నాడు..
"ఈ అమ్మాయి ఎవరు?..ఆ పిల్లలూ...?" నా ప్రశ్న పూర్తి కాక ముందే..అడ్డుకొని చెప్పసాగాడు.."ఆ అమ్మాయి మూగది.. మాటలు రావు..దాదాపుగా నాలాటి జీవితమే తనది కూడా..పెళ్లి అయింది..ఈ మూగ దానితో వేగలేనని ఆ కట్టుకున్నవాడు వదిలేసాడు..కాకుంటే..పెళ్ళైన ఆరు నెలలకే ఈ అమ్మాయిని వదిలించుకున్నాడు..తాను కూడా ఇక్కడికే రావడం మొదలు పెట్టింది.."
"స్వామివారు నాకు తోడు చూపాలని అనుకున్నారేమో తెలీదు..ఏడేళ్ల క్రిందట ఈ అమ్మాయి వాళ్ళమ్మతో వచ్చినప్పుడు నేను ఆమెను అడిగాను..తన కూతురు మూగది..మాట్లాడలేదు అని చెప్పింది..నేనూ నా సమస్య చెప్పాను..కళ్ళు సరిగా కనబడవని చెప్పాను..మొత్తంమీద ఒప్పుకున్నది..ఇద్దరమూ ఈ స్వామివారి సమక్షం లోనే పెళ్లిచేసుకున్నాము..ఇక్కడ వివాహం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతి అడిగాను..మీరు సరే అన్నారు.." అన్నాడు..నిజానికి నాకు ఆ సంగతి గుర్తులేదు..
"పెళ్ళైన తరువాత ఎటువంటి ఇబ్బందీ లేదు..నేను కూలీ పనికి వెళతాను..తాను ఇల్లు చూసుకుంటుంది..ఇద్దరు పిల్లలు..వాళ్ళను తానే చూసుకుంటుంది..మూగది అనే ఆలోచనే రాదు..అన్నీ చక్కబెట్టుకుంటుంది.." అని చెప్పుకుపోతున్నాడు..
ఎవరికి ఎవరిని తోడుగా వుంచాలో ఆ దైవానికి తెలుసు..ఆ దంపతులిద్దరికీ శ్రీ స్వామివారంటే అపరితమైన భక్తి..అదే వాళ్ళను ఒకటిగా చేసిందేమో తెలీదు..గతి తప్పాయనుకున్న వాళ్ళ జీవితాలకు ఒక అర్ధం ఏర్పడింది..తమకు ఆ స్వామివారే దారి చూపారని అతను పదే పదే చెప్పుకుంటాడు..అది నిజమే కదా!..
సర్వం..
దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి