20, అక్టోబర్ 2021, బుధవారం

గజేంద్రమోక్షం

 బమ్మెర పోతన రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం అనే ఘట్టం లోనిది ఈ క్రింది పద్యం.


"లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు, పెం

జీకటి కవ్వల నెవ్వడు

నేకాకృతి వెలుగునతని నేసేవింతున్‌’’


మన పురాణాల్లో ప్రస్తావించబడుతున్న, నేటి శాస్త్ర పరిశోధకులు వివరిస్తున్న అనేక లోకాలు ఒకానొక దశలో ఉండవు. ఈ కోటానుకోట్ల సూర్యుళ్లూ అంతరిస్తారు. 


మనం చూస్తున్న మహాసముద్రాలు, బృహత్‌ పర్వతాలు, అగమ్య అరణ్యాలు, 84 లక్షల జీవరాశులు, జంగమ, స్థావరములు, విశ్వాంతరాళాల్లోని పాలపుంతలు, స్వర్గ, నరక లోకాలు ఇవేవీ ఉండక సమసిపోతాయి. అవధుల్లేని, ఎల్లలు లేని ఈ ఆకాశమూ ఉండదు. 


మనం గణించే ఘడియ, విఘడియలు, శత, సహస్ర యుగ మన్వంతర లాంటి కాల ప్రమాణాలు ఉండవు. ‘అవిశ్వం’ ఏర్పడుతుంది. నిర్వచించరాని అంధకారము ఏర్పడుతుంది. 


ఇలాంటి వాటికి ఆవల ‘ఒక శేషత్వం’ ఉంటుంది. అది ‘అనాది మధ్యం’ లేనిది. అది పురుష స్ర్తీ నపుంసక కాదు. అంతము అదియే అయి ఉంటుంది. అంతము అందులోనే అణగి ఉంటుంది.

 

ఆ శక్తి విశ్వాన్ని వెలువరించగలదు, ఇముడ్చుకోగలదు. నిష్కళంకమై, అన్నింటికీ సాక్ష్యమై ఉంటుంది. ఆ శక్తికి రూపం, రసం, గంధం ఉండవు. జనన మరణాలుండవు. ఆ శక్తి నామగోత్ర పరిచయ శూన్యం. వర్ణరహితం. పాప,పుణ్య రహితం, తత్వ రహితం, సహజమై ఉంటుంది. మానవ మేధస్సుకి అందని మహాద్భుత తేజస్సు ఏకాకృతిన వెలుగుతుంటుంది. 


అట్టి మహత్తర శక్తిని ఆరాధించుచూ, సేవించుకొనుచున్నాను అని గజేంద్రుడు ఆ శక్తిని వేడుకున్నాడు. 


అయస్కాంతం నిరంతరం ఉత్తరం వైపే చూస్తున్నట్టుగా మనం కూడా పెనుచీకటికి ఆవల ఉన్న ఆ పరమాత్ముని వైపే మరలి, అర్చించడమో, వందనం చేయడమో దాస్యం చేయడమో, సఖ్యం చేయడమో, ఆత్మనివేదగావించడమో, స్మరణమో, పాదసేవనమో చేద్దాం. ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని శుష్క చర్చలను విడనాడి పరమాత్ముని సన్నిధి చేరదాం. కర్మ కుర్మన్‌ భజే దైవం. మనం మన పనిని దైవ కార్యంగానే తలచి సర్వేశ్వరానుగ్రహాన్ని పొందుదాం. 


శేషాయ నమః

కామెంట్‌లు లేవు: