*తెలుగు చమత్కారం*💥💥💥
🙂 🙂 🙂 🙂 🙂 🙂
'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట. ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు.
కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.
'వాడెదవ' అంటే తిట్టనుకునేరు .చెరకుగడ చివరిభాగం.
tip of the sugar cane అన్నాడు బ్రౌన్.
'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.
'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా!)
'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.
'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)
'ముండపులుసు' అనేది దూషణ అనుకునేరు. ' మృతుని ఇంటికి దూరపు బంధువులు వచ్చినపుడు భోజనం చేసివెళతారట. ఆ భోజనంలో తాలింపు లేకుండా ఉప్పు, కారం, చింతపండు, వేసి పచ్చిపులుసు చేస్తారట అదే ముండపులుసు.
( తెలంగాణా జాతీయాలు, వేముల పెరుమాళ్ళు )
కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని 'దొంగ బడవా' అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈ మాటకు ' ముండలను తార్చేవాడు' 'లుచ్చా' అనే అర్ధాలిచ్చాడు బ్రౌన్.
ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట.
తండ్రికి తగ్గ ఆ కొడుకు " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.
ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)
సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ "
శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.
ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది.
' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.
గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.
'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.
గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.
పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.
బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది
'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.
( డాక్టర్ కె ఆనంద్ కిషోర్, పూర్వ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గారి వాల్ నుండి)