మహాస్వామి వారి చిత్రపటం
చిత్రకారుడు సిల్పి (పి.యమ్. శ్రీనివాసన్) తను చేస్తున్న ఒక పనికోసం నెలరోజులుగా నిరీక్షించిన పరమాచార్య స్వామి వారి దర్శనం లభించిన రోజది. ఆ గొప్ప చిత్రకారుడి జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పిన రోజు. రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత, ప్రపంచం మొత్తం గాఢనిద్రలోకి జారుకున్న సమయాన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది.
ఒకరు జగద్విఖ్యాతి చెందిన మహాపురుషులైన సన్యాసులు కాగా, మరొకరు ప్రపంచానికి అంతగా తెలియని గొప్ప చిత్రకారుడు. ఆ పరమపవిత్రమైన గదిలో, నూనెదీపపు వెలుగులో ఆ చిత్రకారునికి ఒక రహస్యాన్ని చెప్పడానికి ఆ సన్యాసి కళ్ళు అత్యంత తెజోవంతములై మెరిశాయి.
“ఇప్పటిదాకా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు. అన్ని జన్మలలో భగవంతుణ్ణి ఎంతో భక్తితో సేవించావు. క్రిందటి జన్మలలో ఎన్నో దేవాలయాలకు స్థపతివై ఎన్నో దైవీ శక్తులు కలిగిన శిల్పాలను మలిచావు. ఇది నీకు చివరి జన్మ. నీకు సంప్రాప్తమైన ఈ దైవకళను వ్యర్థం చెయ్యకు. ఇప్పటినుండి కేవలం దేవతా రూపాలను మాత్రమె చిత్రిస్తానని వాగ్దానం చెయ్యి. నీ ప్రతిభ ఆసాదారణమైనది. నీకు జన్మతః శిలా శాస్త్రము, సాముద్రికా లక్షణము తెలుసు. ఇక వేరే చదువు నీకు అక్కరలేదు. నీ దైవదత్తమైన కళ ద్వారా దైవిత్వాన్ని అన్ని ఇళ్ళల్లో ఆవిష్కరించే లక్ష్యంతో రేపు ఉదయాన్నే ప్రపంచంలోకి వెళ్ళు” అని ఆదేశించారు.
ఆ చిత్రకారుడు శ్రీవారి వద్ద సెలవు తీసుకుని, బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో మారుమూల దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న వివిధ మూర్తులను తన క్యాన్వాసుపై చిత్రిచసాగాడు. అది అంత సులువైన పని కాదు, అత్యంత నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో ఉన్నవారికి మాత్రమె కుదిరే కార్యం.
“నీ ఊహలను ఎంతమాత్రమూ చిత్రించారాదు. శిల్ప శాస్త్రాన్ని అనుసరించి, సాముద్రికా లక్షణంలో తెల్పిన ప్రకారం వివిధ శక్తులతో ఉన్న దేవతా మూర్తులను నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే చిత్రించాలి. కొత్తగా వెలుగును ఏర్పాటు చేసుకోకుండా, పరిమితమైన దీపపు వెలుగులో, నువ్వు చిత్రించే సమయంలో నీకు ధ్యానస్థితిలో అగుపించే విశేషాలను మాత్రమె చిత్రించు. నీ కుంచె కదిలికలవల్ల ఆ మూర్తి యొక్క శక్తిని, తేజస్సును కూడా నీ చిత్రాలలో చిత్రించగలుగుతావు” అని స్వామివారు చెప్పిన విషయాలను ఎన్నడూ మరువలేదు.
తనకు గురువు, దైవం, మార్గదర్శకులు చెప్పినట్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించి, జీవితాంతం స్వామివారు ఆశిస్సులే ఊపిరిగా బ్రతికాడు. సిల్పి సంసారస్థుడు. తన భార్య పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు. ఆమె వయోభారం చేత మఠానికి వెళ్లి పరమాచార్య స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడానికి కుదరడంలేదు. అందుకనే ఆమె పరమాచార్య స్వామివారి చిత్రపటాన్ని చిత్రించి ఇంటిలో ఉంచుకుంటే జీవితాంతం వారిని ఆరాధించుకుంటానని తన భర్తని కోరింది. 1956లో తన భార్య కోసం స్వామివారిని చిత్రించడానికి సిల్పి వెళ్ళాడు.
కాని స్వామివారు అతనికి సహకరించడం తప్ప అన్నీ చేస్తున్నారు. అటూ, ఇటూ కదులుతూ సిల్పి సహనాన్ని, భక్తిని పరీక్షిస్తున్నారు. చివరికి అంతా ముగిసిన తరువాత సిల్పి చేతిలో ఒక గొప్ప కళాఖండం రూపుదాల్చుకుంది. తన భక్తికి పరాకాష్టలా మహాస్వామివారి కాలివేలి గోళ్ళు మొదలుకుని వారి నుండి వెలువడే దివ్యకాంతి వరకు ఆ చిత్రపటంలో నిండి నిబిడికృతమైంది.
అది చాలా ప్రత్యేకమైన చిత్రపటం. మహాస్వామివారి చూపులను అత్యంత సూక్ష్మమమైన రంగుల్లో అందంగా చిత్రించాడు. వేసుకున్న బిల్వమాలలోని బిల్వ దళాలు తాజాగా ఉంటాయి. ఏ ఫోటో కూడా తనలో నింపుకోలేని తేజస్సును తన కుంచె ద్వారా ఆవిష్కరించాడు. ఆ గదిలో స్వామివారి పాదాల వద్ద వెలిగించిన ఒకేఒక్క దీపం స్వామివారి వెలుగులో చిన్నబోయింది. ఇంత అద్బుతంగా ఎప్పుడూ ఎవ్వరూ స్వామివారిని చిత్రించలేదు. ఆ గదిలో కదలకుండా కూర్చుని చిత్రకారుని గమనించి, పూర్తైన తరువాత ఆశీస్సులు అందించి మన పుణ్యవశమున దాన్ని బయలుపరిచారు.
చిత్రకారుడు సిల్పి క్యాన్వాసుపై కంచి పెరియవ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పటికి సజీవంగా ఉన్నారు. 1956లో సిల్పి కుంచె నుండి జాలువారిన మహాత్తరమైన స్వామివారి చిత్రపటం ఇదే.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం