9, జులై 2022, శనివారం

రెండు న్యాయాలు

 ప్రియ సాధక బంధువులారా ఇక్కడ నేను రెండు ఆధ్యాత్మిక న్యాయాలను (సూత్రాలను) పేర్కొంటున్నాను.  ఆధ్యాత్మిక జగతిలో పయనించే సాధకులకు దాదాపుగా ఈ రెండు న్యాయాలగూర్చిన పరిచయం కలిగి వుంటారు. నేను మిమ్ములను కోరేది ఏమిటంటే ఆ రెండు న్యాయాలను క్షుణ్ణంగా చదివి మీరు ఏ న్యాయానికి మద్దతు ఇస్తారు అనే విషయాన్ని సహేతుకంగా (అంటే వివరణాత్మకంగా ) పేర్కొనండి.  ఒకరకంగా ఇది సాధకులకు ఒక చిన్న సమస్య లాంటిది అనుకోండి. ఇక ఆలస్యం ఎందుకు ఆ రెండు న్యాయాలు ఏమిటో పరికించండి. 

మొదటిది:  మర్కట కిశోర న్యాయం: 

మర్కట=కోతి, కిషోర=శిశువు , న్యాయం =సూత్రం కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు భగవంతుడిని ఒక తల్లిలా భావించి కోతి పిల్ల తన  తల్లికి వేలాడే విధంగా  దేవునికి వేలాడుతూ వుండాలని భావిస్తారు.  పిల్ల కోతులు తమ తల్లిని గట్టిగా పట్టుకుంటాయి, అవి పడిపోయినప్పుడు కూడా పడవు. తల్లి చెట్టు నుండి చెట్టుకు దూకుతుంది. అదే విధంగా కొంతమంది భక్తులు తీవ్రమైన పరీక్షా పరిస్థితుల్లో కూడా భగవంతుని (ఆధ్యాత్మిక అభ్యాసాలు) అంటిపెట్టుకుని ఉంటారు. ఈ భక్తులు వారి ఆధ్యాత్మిక సాధనలో స్థిరంగా ఉంటారు మరియు అసాధారణమైన ప్రయత్నాలను చేయగలరు. ఈ సూత్రంలో పిల్లది భాద్యత కానీ తల్లిది కాదు.  తల్లి తన పిల్లపై ద్రుష్టి పెట్టకుండా ఒక చెట్టుమీదినుండి ఇంకొక చెట్టుమీదికి, ఒక గోడమీద నుండి ఇంకొక గోడమీదికి పరిగెత్తటం, గెంతటం ఎగరటం ఇలా తన ఇష్టమొచ్చి నట్లు పరిగెడుతుంది.  పిల్ల తల్లి పొట్టను గట్టిగా  పట్టుకోవాలి. పిల్ల కోతి ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా అది కిందపడటం తథ్యం.  కానీ మనం చూస్తూవుంటాము ఎట్టి పరిస్థితిలోను పిల్ల కోతి తల్లి కోతిని వదలదు అందుకే అది అస్సలు క్రింద పడదు.  ఈ న్యాయాన్ని అనుసరించే సాధకుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భగవంతుని వీడడు. భగవంతునితోనే వుండి చివరకు భగవంతుని చేరుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవిధంలో సాధకుడు సంపూర్ణంగా భగవంతుని శరణాగతుడు అవుతాడు. 

 ఇక రెండో న్యాయం: 

 మార్జాల కిశోర న్యాయం 

ఇది పిల్లి, పిల్లి పిల్ల సూత్రం (మార్జాల=పిల్లి, కిషోర=శిశువు, న్యాయ=సూత్రం) కొందరు ఆధ్యాత్మిక సాధకులు దేవుడే అన్ని చూసుకుంటాడు అని పూర్తిగా భగవంతుని మీదనే నమ్మకం ఉంచుతాడు. తమ తల్లి తీసుకువెళ్లి, బిడ్డకు మంచిదని తల్లి భావించిన చోట ఉంచిన పిల్లుల వలె, ఈ భక్తులు భగవంతుడు తమను చూసుకుంటారని నమ్ముతారు, ఈ భక్తులు ఆధ్యాత్మికంగా ఎలా భావిస్తారంటే అన్ని భగవంతుడే చూసుకుంటాడని పూర్తిగా నమ్ముతారు, కానీ ఈ న్యాయంలో సాధకుడు భగవంతుని మీదనే భారం వేస్తాడు కానీ తాను స్వయంగా భగవంతుని అంటి పెట్టుకొని ఉండడు  అంటే భగవంతుడు తనంతట తానె భక్తుని రక్షించాలని  చూస్తారు. కానీ భగవంతుడు ఈ సాధకుని మీద శ్రేర్ధ ఎప్పుడు చూపుతాడు అనేది కేవలం భగవంతుని దయ మీదనే ఆధార పడివుంటుంది. 

ఒక చిన్న ఉదాహరణతో ఈ రెండు న్యాయాలను వివరించేప్రయత్నిస్తాను. నీకు ఒక పొలిసు ఆఫీసరు తెలుసు అనుకో నీవు అతనిని కలవటానికి ఆయన ఇంటికి వెళ్ళావు అనుకో నీకు ఆయన ఇంట్లో ఒక కుక్క వున్నదని తెలుసు కాబట్టి నీవు గేటు వద్ద కనిపిస్తే అది నీ మీద దాడి చేస్తుంది, అందుకని నీవు కష్టమే అయినా నీవు కూడా పొలిసు దుస్తులు ధరించి గేటు తీసుకొని నీ మిత్రుని మాదిరిగా దైర్యంగా కుక్క వైపు చూడకుండా నీ మిత్రుడి ఇంట్లోకి వచ్చాడనే భావన కుక్కకు కలిగేలాగా లోపలికి  వెళ్లి నీ మిత్రుణ్ణి  కలుస్తావు. ఈ విధమైన ప్రయత్నంలో ఎంతో ప్రమాదం (RISK) వున్నది ఎందుకంటె ఆ కుక్క నిన్ను ఏమాత్రం పసిగట్టినా  నిన్ను కరవటం ఖాయం. ఇది మర్కట కిశొరా న్యాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ సాధకుడు ఎటువంటి కష్టాన్నయినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాడు. దీనిని మనం జ్ఞ్యానమార్గంగా పేర్కొనవచ్చు.  జ్ఞ్యాన మార్గం చాలా కఠినమైనది కానీ తొందరగా మోక్షం లభిస్తుంది.  ఎందుకంటె ఇక్కడ సాధకుని ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది కాబట్టి.  త్వరగా భగవంతుని చేరుకోగలడు . 

ఇక ఇదే ఉదాహరణతో రెండో న్యాయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేద్దాము. నీకు నీ మిత్రుని ఇంట్లో వున్న కుక్క గూర్చి బాగా  తెలుసు. నీ మిత్రుడు కాకుండా అయన ఇంట్లోకి ఎవ్వరు వచ్చినా అది  కరుస్తుంది. కాబట్టి నీవు ఇంటి గేటువద్దనే నిలబడి నీ మిత్రుని పదే పదే పెద్దగా అరుస్తూ పిలుస్తావు నీ పిలుపు ఆయనకు వినబడితే అప్పుడు నిన్ను ఇంటిలోపలికి తనతో తీసుకొని  వెళతాడు. నీ మిత్రుడు నీతోడుగా వున్నాడు కాబట్టి అక్కడి కుక్క నిన్ను ఏమి అనదు .దీనిని మార్జాల కిశోర న్యాయంగా పేర్కొన వచ్చు. ఈ విధానంలో ప్రమాదం ఏమాత్రం లేదు కానీ నిన్ను భగవంతుడు గుర్తించినదాకా ఎదురు చూడాలి. ఈ న్యాయంలో భక్తుడు పూర్తిగా భగవంతుని మీదనే ఆధారపడి ఉంటాడు.  కేవలం భగవంతుడే భక్తుని మోర ఆలకించాలి.  దీనిని మనం భక్తి మార్గంగా పేర్కొనవచ్చు.  ఈ ,మార్గం జ్ఞ్యానమార్గం అంత కఠినమైనది కాదు.  కానీ ఇక్కడ పూర్తిగా భక్తుడు దేముడి అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంటాడు.  కాబట్టి ఇది చాలా సుదీర్ఘమైనది. త్వరగా సిద్దించదు. 

ఈ రెండు న్యాయాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే మొదటిది నిన్ను నీవు భగవంతుడు గుర్తించేలా చేసుకోవటం. ఇక రెండోవది నిన్ను భగవంతుడు గుర్తించేదాకా ఎదురు చూడటం లాంటిది. 

సాధక మిత్రమా నీకు రెండు న్యాయాలు తెలిసాయి కదా ఇప్పుడు నీవు ఏ న్యాయానికి మద్దతు ఇస్తావో వివరణాత్మకంగా తెలపండి. 

ఓం తత్సత్ 

ఓకే శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 


బుజ్జి చమక్కులు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

    *🥰 బుజ్జి చమక్కులు 🥰* 

                 🌷🌷🌷

మొన్నీమధ్య, మా పెద్ద ఆడపడుచు కూతురు సింగపూర్ నుండి వచ్చింది. వాళ్ళ కో చిన్న పాప. తన పేరు శ్రీహిత. పిట్ట కొంచెం, కూత ఘనం టైప్.

ఆ పాప లాజిక్కులు, చమక్కులకి మా ఇంట్లో అందరం ఫ్లాట్. తెలుగెంత చక్కగా మాట్లాడుతోందో. వాళ్ళు మా ఇంట్లో రెండురోజులు ఉన్నారు. అందరం కలిసి కార్లో బయటకు వెళ్ళాం. దారిలో హోటల్ సుప్రభాత్.. SUPRABHAT, కనబడింది. వెంటనే ఈ పాప, సూప్రా భట్...అంటే పూజాభట్ సిస్టరా మామ్? అంది. ఈ పిల్లకి పూజాభట్ ఎలా తెలుసు ..అని అడిగా. 

వాళ్ళమ్మ, నా వేపు చూసి ..మొన్న టీవీలో పూజాభట్ హిందీ మూవీ వచ్చిందిలే అత్తయ్యా ..అంది.

అందరం నవ్వాం.

 ఆ రాత్రి, మంచం మీద పడుకుని, దుప్పటి కప్పుకోవడానికి నానా అవస్థ పడుతున్న శ్రీహిత ను చూసి, పోనీ నేను కప్పనా? అని అడిగాను. నువ్వు కప్పవా? అని కిచకిచ నవ్వింది. నువ్వు టైగర్..అంది.

ఏం చెప్పాలబ్బా..అని తికమక పడుతూ, పోనీ నేను దుప్పటి పరవనా...అని మాట మార్చాను.

మళ్ళీ నవ్వింది. ఈ సారేం సెటైర్ వేస్తుందోనని, దాని మైండ్ డైవర్ట్ చేయడానికి , నాకేం..దుప్పటి తో సరిగా కవర్ చేసుకోకుంటే,దోమలు కుడతాయి. అన్నాను. 

అంటే రెండమ్మలు....టైలరింగ్ చేస్తాయా..? అని అడిగింది. ఇదో..ఇలానే ..చంపుతుంది అత్తా. క్షణం కూడా నోరు మూయదు.

దోమలు అంటే... తెలుగు లో రెండు అమ్మలు గా ఆవిడ సొంత ట్రాన్స్ లేషన్.

కుడతాయి...అంటే అవి stitching చేస్తాయా..అంటుంది...అని వాళ్ళమ్మ explain చేయగానే , మా పిల్లలు, నేను నవ్వులు.  

ఇంకో సందర్భంలో దానికి బొద్దింక కనబడింది మా ఇంట్లో. బొద్దింకా..ఇటు రావద్దింక...అని అరిచింది. ఇంత తెలుగు నేర్పిస్తున్నారు పాపకి. చాలా బాగుంది. అన్నాను. 

అది, మేము మాట్లాడుకునే మాటలు వింటుంది. ఇదో ..ఎప్పుడో ..ఢామ్మంటూ పేలుస్తుంది. మొన్న ఈ ట్రిప్ లోనే మా ఆయన ఊరు వైజాగ్ వెళ్ళాం అత్తా. ఆయన, అరకు వెళ్దామన్నారు. వెడుతుంటే, దానికి మధ్యలో బస్సులమీద "పాడేరు" ...అని కనిపించింది. అమ్మా! ఎవరు పాడేరు ..?

సింగర్ నేమ్ నాట్ రిటెన్...అంది బస్ పై బోర్డు చదివి. అది ఊరు పేరు తల్లీ..అని వాళ్ళ నాన్న మురిసి పోయారు.

ఒకసారి, మేమంతా

గుడికి వెళ్ళాం. పూజారిగారు దీనికి శఠగోపం పెట్టలేదట. వెంటనే నాకూ "ముచ్చు టోపీ" పెట్టండీ...అని అరుపులు అక్కడ. "ముచ్చు" ఏంటి ? అడిగాను. అదీ...వెండిని , సిల్వర్ ఫాయిల్ నీ తేడా తెలియడానికి దానికలా చెప్పాం లే. చస్తున్నాం అనుకో ఈవిడ అడిగే ప్రశ్నలకు, వెదుక్కుని మరీ సమాధానాలు చెప్పాల్సివస్తోంది. అంది వాళ్ళమ్మ.

బాగుంది.మొత్తానికి గొప్ప చమత్కారం పిల్లే...అని అందరం నవ్వుకున్నాం.

వచన కవితల పోటీ

 బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ 6వ జాతీయస్థాయి వచన కవితల పోటీ 


గుంటూరుకు చెందిన "బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్" నిర్వహిస్తున్న 6వ

జాతీయస్థాయి వచన కవితల పోటీకి కవితల్ని ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కవి రచయిత బండికల్లు జమదగ్ని, ప్రధాన కార్యదర్శి బండికల్లు శ్యాంప్రసాద్ సంయుక్తంగా తెలియజేస్తున్నారు. కవిత నిడివి 30 పంక్తులకు మించకూడదు. సామాజిక అంశాలను ప్రతిబింబించే కవితలకు, క్లుప్తత, గాఢత వున్న కవితలకు ప్రాధాన్యత.. ఒక్కొక్కరికీ రెండు కవితల వరకు పంపే అవకాశం వుంది. ఒక్కో కవిత రెండు కాపీలు పంపాలి. కవిత రాసిన పేజీ పై కవి పేరు గానీ, ఇతర సమాచారం గానీ రాయకూడదు. హామీపత్రం పై మాత్రమే ఆ వివరాలు రాయాలి. ఆసక్తి గల కవులు తమ కవితలను బండికల్లు జమదగ్ని, ప్లాట్ నెం. 402, హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు-522 002 చిరునామాకు 2022 జులై 30వ తేదీలోపు పోస్టు ద్వారా గానీ, కొరియర్ ద్వారా గానీ పంపాలి. ఎంపిక విషయంలో నిర్వాహకులకు పూర్తి స్వేచ్చ వుంటుంది. ప్రధమ బహుమతికి ఎంపికైన కవితకు రు.2,500/- ద్వితీయ బహుమతి కవితకు రు.2,000/-లు, తృతీయ బహుమతి కవితకు రు.1,500/- మరియు రు.750/-ల చొప్పున నాలుగు ప్రోత్సాహక బహుమతులుంటాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలకు బండికల్లు జమదగ్ని, 98482 64742 నెంబరులో సంప్రదించవచ్చు.


Forward from watsapp

వెర్రివాలకం

 ఏమిటి అలా వెర్రివాలకం వేసుకుని ఆ మొహం మీరునూ.  ఈరోజు కూడా నేను చెప్పిన మాట  మర్చిపోయి చక్కా వచ్చారా!   అంటూ ఆగ్రహంగా ఉరిమిచూస్తోంది భర్త వాలేశ్వరరావుని.

       ఆ ఆ లేదు పర్వతం..అదీ అంటూ నసుగుతూ భయం 

భయంగా ఏదో చెప్పబోయి మరేదో చెప్పేసాడు..

మరి వారికి అరెసెలూ, సున్నండలు చేయించమని చెప్పారే.

       ఎవరూ ఆ చెప్పింది..మీక్కావలసినవన్నీ చేయించుకు తినమని చెప్పారూ ?

        పిల్లని చూడ్డానికి ఎపుడొస్తారని అడిగి రమ్మంటే అరెసెలూ, అటుకులూ అంటారూ. 

                      

 ఇదిగో      అడిగి తెలుసుకునే వస్తున్నానే. వచ్చే బుధవారం సాయంత్రం వస్తారట.   వస్తూ వస్తూ అబ్బాయికి

ఫలహారాలు ఏమి చేయించమంటారో అబ్బాయి మేనమామని  అడిగి తెలుసుకుని అతనిని కూడా తప్పకుండా రమ్మని చెప్పే వచ్చాను. నీ బండబడ. అన్నిటికీ

కేకలేస్తుంటే ఎలా వేగేది..పర్వతం, శాంతం.

     ఏమిటి నిజమే ఇవన్నీ?

      అవుననే  తలూపేసాడు  వాలేశ్వరరావు.

హమ్మయ్యా ఇన్నాళ్ళకి ఓ మంచిపని చేసారు..ఇహ నేనూ

ఆ  ఏర్పాట్లలో ఉంటాను. వాళ్ళకే కాదు మీకు ఇష్టమైన జాంగ్రీ,  మిఠాయి కూడా సిధ్ధం చేస్తాను.  ఈ రెండు రోజులూ

అక్కడకి,  ఇక్కడకి  వెళ్లకుండా  వరాన్ని ఇంట్లో ఉండమని చెప్పండి అంది కాస్త కటువుగా పర్వతం.   

ఆ అలాగే చెప్తాలే, వాలేశ్వరరావు

మరో రెండు రోజులు ప్రశాంతంగా నా జోలికి రాకుండా ఉండాలంటే అపుడపుడూ ఇలాంటివి తప్పవు మరి.

పెళ్ళి కొడుకు అమెరికా వెళ్లిపోతున్నాడు.  ఇప్పట్లో రాలేనన్నాడని చెప్తే చంపేయదూ? . నన్ను  పాతరేసేస్తుంది

ఆ బుధవారం ఏదో వచ్చాక ఆ సమయానికి బుధ్ధికి   తట్టినట్టు చెప్పొచ్చు అనుకుంటూ కోర్ట్ కి బయలుదేరాడు వకీలు వాలేశ్వరరావు.

    అతిథులకు రెండు రకాలు, నా కోసం మరో రెండు రకాలు సిధ్ధం చేస్తే అన్నీ ఇహ మనవేనోయ్ మనవేనోయ్. కార్ లో 

కూనిరాగాలు తీస్తూ సాగిపోతున్నాడు....వవా....   


డాక్టర్ దేవులపల్లి పద్మజ, విశాఖపట్నం 








       ఏ

పరమాచార్య అనుగ్రహం

 అంతా పరమాచార్య అనుగ్రహం


మా పాట్టి (బామ్మ) పరమాచార్య స్వామివారికి భక్తురాలు. మఠం అందరూ తనని ‘దేవకొట్టై ఆచి’ అని పిలిచేవారు. ఆమె గురించి తెలియని వారు ఎవరూలేరు. ఆవిడ మాకు ఒక మార్గదర్శిలా మమ్మల్ని నడిపింది. కేవలం ఆవిడ వల్లనే చాలా చిన్నతనం నుండే మాకు శ్రీమఠంతో సంబంధం ఉండేది. ఇది నాకు కలిగిన భాగ్యం అని తలుస్తాను. మా పాట్టిని నేను ఎప్పటికి మరచిపోను. పరమాచార్య స్వామివారు చెప్పేవారు, ‘మనకు ఎవరైనా మంచి చేస్తే లేదా సహాయం చేస్తే, మనం ఎప్పటికి కృతజ్ఞతను మరచిపోరాదు’. ఈ మాటలను స్వామివారు చెబుతున్నప్పుడు నేను విన్నాను. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సప్పటి నుండి నేను శంకర మఠంకి వస్తున్నాను. మా బామ్మ నన్ను అక్కడకు తీసుకునివెళ్ళేది.


పరమాచార్య స్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నప్పుడు, మా బామ్మ ప్రతీ శుక్రవారం ఒక బ్రాహ్మణ బాలుడిని కండకావేరి చెరువులోని కమలాలను కోయమని చెప్పి, వాటిని రెండు బుట్టలలో పెట్టుకుని, వాటిని తీసుకురమ్మని ఆ పిల్లాడికి చెప్పి, నన్ను మా పిన్ని కొడుకు అళగప్పన్ ని (ఇప్పుడు వాడిని బామ్మ దత్తత తీసుకుంది) వెంటబెట్టుకుని వెళ్లి, ఆ పూలను ఇలయత్తాంగుడిలో పూజలో సమర్పించి, పూజ తరువాత ఇద్దరు ఆచార్యుల దర్శనం చేసుకుని, తరువాత నైవేద్యం పెట్టిన చక్కర పొంగలిని మాకు పెట్టేది; అందులోనుండి నెయ్యి అలా కారుతూ ఉండేది. మేము చెరువు గట్టున ప్రసాదాన్ని ఆరగించి, చివరి బస్సు పట్టుకుని దేవకొట్టై వెళ్ళిపోయేవాళ్ళం.


ఆ రోజులని ఎప్పటికి మరచిపోలేను. అక్కడ శ్రీమఠం మకాం ఉన్నన్నిరోజులూ అక్కడి ప్రజలకు, మాకు మనస్సు నిండిపోయింది. అది పరిపూర్ణ ఆనందం. ఈ భువిపై అటువంటి నడిచే దైవం ఉండడం ఈ ప్రపంచ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ భువిపై ఆ దైవం ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామన్న భావన అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది.


మరొక సందర్భంలో ఇద్దరు ఆచార్యులు కార్వేటినగరంలో మకాం చేస్తున్నారు. అప్పటికి నాకు వివాహం అయ్యింది. నేను, నా భర్త, మా నాన్నగారు మరియు పాట్టి - మేమందరమూ అక్కడికి వెళ్లి వారంరోజులు ఉన్నాము. అక్కడ ఒక కొలను ఉంది. గట్టుపై ఒక పాక నిర్మించారు. పూజ అయిపోయిన తరువాత మహాస్వామివారు అక్కడకు వచ్చి దర్శనం ఇచ్చేవారు. ప్రశాంతమైన ప్రదేశం. అక్కడకు వచ్చిన భక్తులతో స్వామివార్లు మాట్లాడేవారు. మేము ఆ సంభాషణలను వింటుండేవాళ్ళం. (మేము అక్కడకు వెళ్ళినప్పుడు నా మనస్సు స్థిమితంగా లేదు). అక్కడ సమయం ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. ఎన్నో మంచి విషయాలను మాట్లాడుతూ, వాటిని హాస్య సంభాషణలుగా మలచేవారు. వారంరోజుల పాటు వారి మాటలను విన్నాను; ఫలితంగా నా మనస్సుకు శాంతి కలిగింది.


మా బంధువులందరి ఇళ్ళల్లోని పూజ గదిలో స్వామివారికోసం ఒక ప్రత్యేక హుండి ఉండేది. ఇంటి ఖర్చులతో మొదలుకుని ప్రతి సందర్భంలోనూ స్వామివారిని తలచుకుని అందులో డబ్బులు వేసి, పని మొదలుపెట్టేవాళ్ళం. శ్రావణ మాసంలో ఆ హుండి డబ్బులను సేకరించి, భిక్షావందనానికి శంకర మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ జమ చేసేవాళ్ళం. దాంతోపాటు మా బంధువులందరూ చిన్న మొత్తాల్లో ఇచ్చిన డబ్బుతో కలిపి మేమి భిక్షావందనం చేశాము. తరువాత బామ్మకు వయసైపోయింది. తను అందరి వద్ద హుండి డబ్బులు సేకరించి, అదనంగా ఇచ్చే డబ్బును చేర్చి దాంతో భిక్షావందనం నిర్వహించేది.


బామ్మ ఒక వారం ముందరే అక్కడకు వెళ్లి ఏర్పాట్లు చేసేది. తనకు చాలా వయసైపోయిన తరువాత, మహాస్వామివారితో, “నేను ముసలిదాన్నైపోయాను. నేను కొద్దిగా ధనం సేకరించి మఠంలో జమ చేస్తాను. ఇందులోకి దేవకొట్టై నగరత్తార్ లను కూడా చేర్చుకోవచ్చా?” అని అడిగింది. స్వామివారు అందుకు అంగీకరించారు. తరువాత బామ్మ ధనాన్ని సేకరించి మఠంలో సమర్పించింది. అప్పటినుండి క్రమం తప్పకుండా ఆగష్టు 30న ‘దేవకొట్టై నగరత్తార్ భిక్షా వందనం’ జరుగుతోంది. మా బామ్మ వల్లనే మాకు ఈ అదృష్టం కలిగింది. ఇప్పుడు మా బామ్మ లేదు. కాని తను ఏర్పాటు చేసినవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి. మా బామ్మ తన మనవళ్ళు మనవరాళ్ళను శ్రీమఠానికి దగ్గర చేయడం ఎప్పటికి మరచిపోలేని విషయం.


మా బామ్మ ఒకసారి మహాస్వామి వారి దర్శనం కోసం కాంచీపురానికి వెళ్ళింది. తను స్వామివారితో మాట్లాడేటప్పుడు, స్వామివారు మా పాట్టితో, “కాంచీపురంలో ఎన్నో శివలింగాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. ఆ ఎండ వానల నుండి రక్షణగా వాటికి ఒక చిన్న దేవాలయం నిర్మించి, రోజుకు ఒక్కపూట నైవేద్యానికి ఏర్పాటు చెయ్యాలి; అవకాశం ఉన్నవారు దీన్ని చెయ్యాలి” అని చెప్పారని బామ్మ మాతో చెప్పింది. తరువాత స్వామివారు మా బామ్మను పిలిచి, “నువ్వు ఒక దేవాలయం నిర్మించు” అని ఆదేశించారు. అందుకు మా బామ్మ, “దేవాలయం నిర్మించమని నా మనవరాలిని అడుగుతాను. బహుశా మూడువేల రూపాయలు అవ్వొచ్చు” అని చెప్పింది. తరువాత కాంచీపురం నుండి చేన్నిలోని మా ఇంటికి వచ్చి, స్వామివారు చెప్పిన విషయాలను మాకు తెలిపింది.


నేను అందుకు సరే అని చెప్పి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయాను. రెండేళ్ళు గడిచిపోయాయి. బామ్మ తరచుగా కాంచీపురం వెళ్తోంది. అలా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని, పూజ అయిపోయిన తరువాత ఫలహారం కోసమని దగ్గరలోని హోటలుకు వెళ్ళింది. స్వామివారు దగ్గర ఉన్న ఒక సేవకుడితో, “ఆచి ఎక్కడ ఉంది? ఆమెను పిలువు” అని తెలిపారు. ఫలహారం చెయ్యడానికి ఆచి హోటలుకు వెళ్లిందని చెప్పి, అక్కడకు వెళ్లి ఆచితో, “ఆచి అమ్మ, పరమాచార్య స్వామివారు పిలుస్తున్నారు” అని చెప్పాడు. ‘నన్ను ఎందుకు పిలిచారబ్బా’ అని పాట్టి పరుగుపరుగున వచ్చింది.


తను వచ్చి స్వామివారిని కలవగానే, “దేవాలయం నిర్మిస్తానని తెలిపావు కదా! అది ఏమైంది?” అని అడిగారు స్వామివారు. రెండేళ్ళు గడిచిపోవడంతో బామ్మకు వెంటనే గుర్తుకురాలేదు. కాస్త తీవ్రంగా ఆలోచించి, విషయం గుర్తుకు వచ్చి, “నా మనవరాలు నిర్మిస్తానని తెలిపింది. నేను చెన్నై వెళ్లి తనని స్వామివారిని దర్శించమని చెబుతాను” అని చెప్పింది. తరువాత మా బామ్మ చెన్నై రాకుండా దేవకొట్టై వెళ్లి అక్కడినుండి నాకు ఫోను చేసింది. నేను స్వామివారిని కలుస్తానని చెప్పాను.


“అళగప్పన్ కూడా అక్కడకు వస్తాడు; ఇద్దరూ వెళ్లి స్వామివారిని కలవండి” తను నాకు చెప్పింది. మరుసటిరోజు అళగప్పన్ మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరమూ కాంచీపురం వెళ్లి, స్వామివారిని కలవడానికి వచ్చామని అక్కడున్నవారితో చెప్పాము. “దేవకొట్టై ఆచి మనవడు, మనవరాలు వచ్చారు” అని వారు స్వామివారికి తెలిపారు.


మా రాకకు కారణం తెలుసుకోవాలని “ఏమిటి?” అని అడిగారు స్వామివారు.

“ఒక శివలింగానికి దేవాలయం నిర్మించాలని అనుకున్నాము. ఆ విషయమై పరమాచార్య స్వామివారిని కలవమని పాట్టి చెప్పింది. అందుకు వచ్చాము” అని తెలిపాము స్వామివారికి.


మంగళా తీర్థం వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని మాకు చూపమని ఒక అయ్యర్ ను మాకు తోడుగా పంపారు స్వామివారు. కేవలం ఇక ప్లాస్టరింగ్ పని మాత్రమే మిగులుంది. అక్కడున్నవారు మాతో, “ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న ఇంజనీయరు చెన్నై వెళ్ళాడు, ఇప్పుడు ఇక్కడ లేడు. అతను వచ్చిన తరువాత మిగతా విషయాలు కనుక్కోండి” అని తెలిపారు.


అంతేకాక ఇప్పటి దాకా ఎనభై వేల రూపాయలు అయ్యిందని, దాదాపు లక్షదాకా అవుతుందని చెప్పారు. నేను అళగప్పన్ ని, “దీనికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని మన ఆచి చెప్పింది కదా! మీ బావకు ఈ ఇవన్నీ తెలియవు. మా చిన్న మావగారిని సంప్రదించిన తరువాతనే నేను ఏమైనా చెయ్యగలను. స్వామివారు ఏమి చెబుతారో? ఏమి చేద్దాం ఇప్పుడు?” అని అడిగాను.


“ఈ స్థలం సరిగ్గా మఠానికి ఎదురుగా ఉంది. మహాస్వామివారు తరచుగా అక్కడకు వెళ్తుంటారు. ఇది చాలా మంచి అవకాశం. ఎలాగోలా నువ్వే కట్టించు. ఈ అవకాశం మరలా రాదు” అన్నాడు అళగప్పన్.


తరువాత మేము స్వామివారితో, “ఇంజనీయరు చెన్నై వెళ్ళాడుట” అని చెప్పి, “పాట్టి మాతో మూడు వేల రూపాయలు అవుతుంది అని చెప్పింది. కాని వారు ఇప్పుడు లక్ష దాకా అవుతుంది అని అంటున్నారు” అని అడిగాను. స్వామివారు ఏమనుకున్నారో తెలియదు కాని, “ఆ ఇంజనీయరు చెన్నై నుండి వచ్చిన తరువాత మీకు విషయం తెలుపుతాము. ఇప్పుడు మీరు వెళ్ళండి” అన్నారు స్వామివారు.


నాకు ఏమీ అర్థం కాలేదు. నేను నా తమ్ముడు అళగప్పన్ తో, “నాకు మనస్సులో చాలా దిగులుగా ఉంది. మనం అలా చెప్పకుండా ఉండాల్సింది. సరే, నా వద్ద పది సవర్ల బంగారు గొలుసు ఉంది. దాన్ని అమ్మి, మిగిలిన డబ్బు కూడా ఎలాగో అలా ఏర్పాటు చేసి, నేనే ఆ దేవాలయాన్ని నిర్మిస్తాను” అని అన్నాను. స్వామివారితో కూడా, “ఖర్చు ఎంతైనా ఈ దేవాలయాన్ని నేనే నిర్మిస్తాను” అని చెప్పాను. “మేము తెలియజేస్తాము. ప్రభుత్వమే నిర్మిస్తుందని అంటున్నారు. అలా కాకపొతే, నువ్వే నిర్మించవచ్చు” అన్నారు స్వామివారు.


నేను చెన్నై తిరిగొచ్చాను; అళగప్పన్ కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు. మఠం నుండి ఎటువంటి సమాచారం రాలేదు. అళగప్పన్ అన్ని విషయాలు చెప్పడంతో బామ్మ మా ఇంటికి వచ్చింది. “దిగులు పడకు. మనవాళ్ళని డబ్బు అడుగుదాము” అని ధైర్యం చెప్పింది. పదివేల రూపాయలు తీసుకుని నేను, బామ్మ కాంచీపురం వెళ్లి, మా ప్రణాళిక స్వామివారికి తెలిపాము. “అవకాశం రాని, చూద్దాం” అన్నారు స్వామివారు.


తరువాత బామ్మ స్వామివారితో, “శివునికోసం పది వేలు తీసుకుని వచ్చాను. దీన్ని ఇంటికి తీసుకునివెళ్ళలేను. మఠంలో జమ చేస్తాను” అని చెప్పిడంతో స్వామివారు సరే అన్నారు. ఆ డబ్బు నేను మఠంలో జమ చేశాను.


అయినా నా మనసుకు శాంతి లేదు. ఏడుస్తూనే ఉన్నాను. నా బాధను పోగొట్టాలని పాట్టి నాతో, “స్వామివారికి మన ఆర్తి తెలుసు, తప్పక పరిగణిస్తారు. ఆ దేవాలయాన్ని నిన్నే నిర్మించమని చెబుతారు, అలా దిగులు పడకు. నేను కాంచీపురం వెళ్లి దేవకొట్టై వెళ్తాను” అని చెప్పింది. బామ్మ వెళ్తూ ఒక మాట చెప్పింది, “ముందు వొద్దన్న ఒకామెకు కూడా రెండు దేవాలయాలు నిర్మించడానికి అనుమతిచ్చారు స్వామివారు. మంచి అనుకో; మనకు అనుకూలంగానే జరుగుతుంది”.


కలత చెందిన మనసుతో సోఫాలో వాలుకుని నిద్రలోకి జారుకున్నాను. బహుశా మధ్యాహ్నం పన్నెండు గంటలు అనుకుంటా. మా బామ్మ వచ్చి తలుపు కొడుతోంది. నాకు తలుపు కొట్టిన చప్పుడుతో పాటు మాటలు కూడా వినబడుతున్నాయి. “లక్ష్మీ తలుపు తెరువు. దేవాలయ నిర్మాణం నువ్వే చెయ్యమన్నారు మహాస్వామివారు”. హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఏమి అద్భుతం! బామ్మ నిజంగానే తలుపు కొడుతోంది.


అది తలుచుకుంటే ఇప్పటికి నాకు పారవశ్యం కలుగుతుంది. ఈ సంఘటనని నేను ఎన్నటికి మరచిపోలేను. వెంటనే నేను తలుపు తీశాను. బయట బామ్మా నిలబడి ఉంది. “ఊరికి వెళ్ళలేదా?” అని అడిగాను. “లేదు. పరమాచార్య స్వామివారు నిన్నే దేవాలయం నిర్మించమన్నారు. వచ్చేయ్, ఇప్పుడే కాంచీపురం వెళ్దాము” అని చెప్పింది. వెంటనే స్వామివారి దర్శనానికి బయలుదేరాము. మేము స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు, “నీవే దేవాలయం నిర్మించు” అని ఆదేశించారు. నాకు చాలా సంతోషం కలిగింది. “నేను మా ఊరికి వెళ్లి, మా మావగారికి విషయం తెలిపి డబ్బుకు ఏర్పాట్లు చేస్తాను” అని స్వామివారికి తెలిపాను. అదనుకు స్వామివారు సరే అన్నారు.


నేను మా ఊరికి వెళ్లి మా నాన్నగారికి, చిన్న మామగారికి విషయం తెలిపాను. వాళ్ళు ‘సరే చూద్దాం’ అన్నారు. నాన్న ఒక్కరే ఏమీ చెయ్యలేరు. అవకాశం రానివ్వు అన్నారు ఇద్దరూ. నాకు కొద్దిగా కోపం వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చి చెన్నై చేరుకొని నాకు తెలిసిన వారితో మాట్లాడాను. వారు ఆహృదయులు; “మాకు తెలిసిన వారిని సంప్రదించి అవసరమైన ధనాన్ని ఏర్పాటు చేస్తాము” అని అన్నారు. నేను సరే అన్నాను; వెంటనే వారు ముప్పైవేల రూపాయల చెక్కును ఇచ్చారు. దాన్ని డబ్బుగా మార్చుకుని మరుసటిరోజే కాంచీపురం బయలుదేరాను. “ఏమిటి, మీ ఊరికి వెళ్లి, మీవాళ్ళను అడిగావా?” అని అడిగారు స్వామివారు. జరిగిన విషయం మొత్తం స్వామివారికి తెలిపాను. “సరే ఈ డబ్బుని మేనేజరు నీలకంఠ అయ్యర్ కు ఇచ్చి రశీదు తీసుకో. రాతిపై నీ భర్త పేరు వేయించాల్సి ఉంటుంది కనుక పేరు విలాసము ఇచ్చి వెళ్ళు” అని ఆదేశించారు. స్వామివారు చ్పెపినట్టు చేశాను.


ఇదంతా జరిగేటప్పటికి రాత్రి పది గంటలు అయ్యింది. దేవాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది అన్న నా ప్రశ్నకు, బహుశా నలుగు నెలలు పట్టవచ్చు అని చెప్పారు. దాదాపు రెండు నెలలు గడచినా తరువాత బామ్మ ఫోను చేసింది. “కుంభాభిషేకానికి ఏర్పాటు చేశారు. మీ మనవరాలికి చెప్పు; మీ బంధువులని తీసుకునిరా” అని స్వామివారు బామ్మతో చెప్పారు. నా భర్త మలేషియాలో ఉండడం వల్ల నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఇక్కడ లేకుండా చెయ్యడం ఎలా? నేను వెంటనే స్వామివారిని కలిసి విషయం తెలిపాను.


“అంతా సజావుగా జరుగుతుంది. ఓక ఫోను చేసి విషయం చెప్పు. అలాగే మీ బంధువులకు కూడా తెలుపు” అన్నారు స్వామివారు. వంటనే నేను చెన్నై వచ్చాను. అప్పటికే మలేషియా వెళ్ళడానికి మా చిన్న మామగారి అమ్మాయి వచ్చింది. నా భర్తను ఇక్కడకు త్వరగా పంపమని తనకు తెలిపి మా ఊరికి వచ్చేశాను. సమయం లేకపోవడంతో అందరికి విషయం చెప్పలేక, మా చిన్న మామగారికి మాత్రం కుంభాభిషేకం విషయం తెలిపాను.


నేను ఇక్కడకు రాగానే తెలిసిన విషయం ఏమిటంటే, మలేషియా నుండి నా భర్త నేరుగా కాంచీపురం వచ్చారని, వెంటనే నన్ను కూడా అక్కడకు రమ్మన్నారని.


ఆరోజు అక్కడకు ఆర్.యం. వీరప్పన్ కూడా వచ్చారు. మంగళా తీర్థం కొలను స్వామివారు స్నానం చేశారు. ప్రభుత్వం తరుపున మంగళా తీర్థం కొలనును జీర్ణోద్ధరణ చెయ్యడానికి ఆర్.యం. వీరప్పన్ గారు ఏర్పాట్లు చేశారు. స్నానం తరువాత స్వామివారు మంగళేశ్వరర్ దర్శనం చేసుకున్నారు. అక్కడి నుండి నేరుగా మఠానికి వచ్చారు. మా అమ్మాయి ముత్తు కరుప్పితో పాటుగా నేను స్వామివారి దర్శనం చేసుకునాను. అప్పుడు అక్కడ ఆర్.యం. వీరప్పన్ కూడా ఉన్నారు. స్వామివారు మమ్మల్ని ఆయనకు పరిచయం చేశారు. తరువాత స్వామివారు కట్టిన పూల ఉండను మా అమ్మాయి చేతిలో వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. దాంతోపాటు ఏకామ్రేశ్వర కామాక్షి అమ్మవార్ల పెళ్లి పట్టు చీరను కూడా ఇచ్చారు. అది ఇప్పటికి నా వద్ద భద్రంగా ఉంది.


అక్కడున్నవారు అందరూ ఆ పట్టు వస్త్రాన్ని ఎంతో భక్తిగా తాకి కళ్ళకద్దుకుని, “అంతటి పవిత్రమైన వస్తువు ఎవరికీ లభించలేదు. మీకు లభించింది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందిమంచి భర్త లభిస్తాడు” అని మాతో అన్నారు. వారు అన్నట్టుగానే తరువాత తనకు ఒక మంచి డాక్టరు భర్తగా లభించాడు. తనకు ఇప్పుడు ఒక కూతురు, కొడుకు. ఆరోజు కామాక్షి అమ్మవారి కల్యాణోత్సవం. తరువాత నేను స్వామివారిని, “మా బంధువులు వస్తారు. వారికి ఆహారం పెట్టాలి. వంట చేసేవారు ఎవరూ లేరు. అందుకు అవసరమైన సరుకులు కొనాలి. మాకు ఒక మండపం కూడా కావాలి. ఏమి చెయ్యాలి?” అని అడిగాను.


“దేని గురించి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు; అంతా సవ్యంగా జరుగుతుంది” అన్నారు స్వామివారు. మాకు బాలాజీ కళ్యాణ మండపాన్ని ఇచ్చారు; మఠం నుండి కావాల్సిన కిరాణా వస్తువులను ఇచ్చారు. మరుసటి రోజు ఉదయమే ఆలయ కుంభాభిషేకం. కుంభకోణం నుండి వంట బ్రాహ్మణుడు ఒకరు స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారు అతనితో, “నువ్వు వెళ్లి ఆచి అమ్మ కోసం వంట చెయ్యి” అని ఆదేశించగా అతను సరేనన్నాడు.


“ఈ నగరత్తారులకి మంచిగా వడలు, పాయసము తయారు చెయ్యి” అని అతనికి చెప్పారు స్వామివారు. అలాగే అతను కూడా చాలా గొప్పగా వంట చేశాడు. స్థానికంగా ఉన్నవారు కూడా వచ్చి ఆహారం స్వీకరించారు. మాకు ఎంతో సంతృప్తి కలిగింది. కుంభాభిషేకం ఆహ్వాన పత్రికతో సహా అన్నీ స్వామివారే చూసుకున్నారు.


కుంభాభిషేకానికి ముందు స్వామివారిని పూర్ణ కుంభంతో స్వాగతించాము. స్వామివారు యాగశాలలో ఉంది కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తరువాత కుంభాభిషేకం కూడా నిర్విహించారు.


ఎలా ఎన్నో సంఘటనలను చెప్పవచ్చు. నా జీవితంలో ఇలా ఎన్నో జరిగాయి. వాటిని వ్రాస్తూ జీవితాంతం గడపవచ్చు. అటువంటి నడిచే దైవం ఉన్న సమయంలో మనం ఉన్నాము అన్న భావనే మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.


--- లక్ష్మి, మంగలేశ్వరర్ కోవిల్, దేవకొట్టై ఆచి మనవరాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం