ప్రియ సాధక బంధువులారా ఇక్కడ నేను రెండు ఆధ్యాత్మిక న్యాయాలను (సూత్రాలను) పేర్కొంటున్నాను. ఆధ్యాత్మిక జగతిలో పయనించే సాధకులకు దాదాపుగా ఈ రెండు న్యాయాలగూర్చిన పరిచయం కలిగి వుంటారు. నేను మిమ్ములను కోరేది ఏమిటంటే ఆ రెండు న్యాయాలను క్షుణ్ణంగా చదివి మీరు ఏ న్యాయానికి మద్దతు ఇస్తారు అనే విషయాన్ని సహేతుకంగా (అంటే వివరణాత్మకంగా ) పేర్కొనండి. ఒకరకంగా ఇది సాధకులకు ఒక చిన్న సమస్య లాంటిది అనుకోండి. ఇక ఆలస్యం ఎందుకు ఆ రెండు న్యాయాలు ఏమిటో పరికించండి.
మొదటిది: మర్కట కిశోర న్యాయం:
మర్కట=కోతి, కిషోర=శిశువు , న్యాయం =సూత్రం కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు భగవంతుడిని ఒక తల్లిలా భావించి కోతి పిల్ల తన తల్లికి వేలాడే విధంగా దేవునికి వేలాడుతూ వుండాలని భావిస్తారు. పిల్ల కోతులు తమ తల్లిని గట్టిగా పట్టుకుంటాయి, అవి పడిపోయినప్పుడు కూడా పడవు. తల్లి చెట్టు నుండి చెట్టుకు దూకుతుంది. అదే విధంగా కొంతమంది భక్తులు తీవ్రమైన పరీక్షా పరిస్థితుల్లో కూడా భగవంతుని (ఆధ్యాత్మిక అభ్యాసాలు) అంటిపెట్టుకుని ఉంటారు. ఈ భక్తులు వారి ఆధ్యాత్మిక సాధనలో స్థిరంగా ఉంటారు మరియు అసాధారణమైన ప్రయత్నాలను చేయగలరు. ఈ సూత్రంలో పిల్లది భాద్యత కానీ తల్లిది కాదు. తల్లి తన పిల్లపై ద్రుష్టి పెట్టకుండా ఒక చెట్టుమీదినుండి ఇంకొక చెట్టుమీదికి, ఒక గోడమీద నుండి ఇంకొక గోడమీదికి పరిగెత్తటం, గెంతటం ఎగరటం ఇలా తన ఇష్టమొచ్చి నట్లు పరిగెడుతుంది. పిల్ల తల్లి పొట్టను గట్టిగా పట్టుకోవాలి. పిల్ల కోతి ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా అది కిందపడటం తథ్యం. కానీ మనం చూస్తూవుంటాము ఎట్టి పరిస్థితిలోను పిల్ల కోతి తల్లి కోతిని వదలదు అందుకే అది అస్సలు క్రింద పడదు. ఈ న్యాయాన్ని అనుసరించే సాధకుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భగవంతుని వీడడు. భగవంతునితోనే వుండి చివరకు భగవంతుని చేరుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవిధంలో సాధకుడు సంపూర్ణంగా భగవంతుని శరణాగతుడు అవుతాడు.
ఇక రెండో న్యాయం:
మార్జాల కిశోర న్యాయం
ఇది పిల్లి, పిల్లి పిల్ల సూత్రం (మార్జాల=పిల్లి, కిషోర=శిశువు, న్యాయ=సూత్రం) కొందరు ఆధ్యాత్మిక సాధకులు దేవుడే అన్ని చూసుకుంటాడు అని పూర్తిగా భగవంతుని మీదనే నమ్మకం ఉంచుతాడు. తమ తల్లి తీసుకువెళ్లి, బిడ్డకు మంచిదని తల్లి భావించిన చోట ఉంచిన పిల్లుల వలె, ఈ భక్తులు భగవంతుడు తమను చూసుకుంటారని నమ్ముతారు, ఈ భక్తులు ఆధ్యాత్మికంగా ఎలా భావిస్తారంటే అన్ని భగవంతుడే చూసుకుంటాడని పూర్తిగా నమ్ముతారు, కానీ ఈ న్యాయంలో సాధకుడు భగవంతుని మీదనే భారం వేస్తాడు కానీ తాను స్వయంగా భగవంతుని అంటి పెట్టుకొని ఉండడు అంటే భగవంతుడు తనంతట తానె భక్తుని రక్షించాలని చూస్తారు. కానీ భగవంతుడు ఈ సాధకుని మీద శ్రేర్ధ ఎప్పుడు చూపుతాడు అనేది కేవలం భగవంతుని దయ మీదనే ఆధార పడివుంటుంది.
ఒక చిన్న ఉదాహరణతో ఈ రెండు న్యాయాలను వివరించేప్రయత్నిస్తాను. నీకు ఒక పొలిసు ఆఫీసరు తెలుసు అనుకో నీవు అతనిని కలవటానికి ఆయన ఇంటికి వెళ్ళావు అనుకో నీకు ఆయన ఇంట్లో ఒక కుక్క వున్నదని తెలుసు కాబట్టి నీవు గేటు వద్ద కనిపిస్తే అది నీ మీద దాడి చేస్తుంది, అందుకని నీవు కష్టమే అయినా నీవు కూడా పొలిసు దుస్తులు ధరించి గేటు తీసుకొని నీ మిత్రుని మాదిరిగా దైర్యంగా కుక్క వైపు చూడకుండా నీ మిత్రుడి ఇంట్లోకి వచ్చాడనే భావన కుక్కకు కలిగేలాగా లోపలికి వెళ్లి నీ మిత్రుణ్ణి కలుస్తావు. ఈ విధమైన ప్రయత్నంలో ఎంతో ప్రమాదం (RISK) వున్నది ఎందుకంటె ఆ కుక్క నిన్ను ఏమాత్రం పసిగట్టినా నిన్ను కరవటం ఖాయం. ఇది మర్కట కిశొరా న్యాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ సాధకుడు ఎటువంటి కష్టాన్నయినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాడు. దీనిని మనం జ్ఞ్యానమార్గంగా పేర్కొనవచ్చు. జ్ఞ్యాన మార్గం చాలా కఠినమైనది కానీ తొందరగా మోక్షం లభిస్తుంది. ఎందుకంటె ఇక్కడ సాధకుని ప్రయత్నం తీవ్రంగా ఉంటుంది కాబట్టి. త్వరగా భగవంతుని చేరుకోగలడు .
ఇక ఇదే ఉదాహరణతో రెండో న్యాయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేద్దాము. నీకు నీ మిత్రుని ఇంట్లో వున్న కుక్క గూర్చి బాగా తెలుసు. నీ మిత్రుడు కాకుండా అయన ఇంట్లోకి ఎవ్వరు వచ్చినా అది కరుస్తుంది. కాబట్టి నీవు ఇంటి గేటువద్దనే నిలబడి నీ మిత్రుని పదే పదే పెద్దగా అరుస్తూ పిలుస్తావు నీ పిలుపు ఆయనకు వినబడితే అప్పుడు నిన్ను ఇంటిలోపలికి తనతో తీసుకొని వెళతాడు. నీ మిత్రుడు నీతోడుగా వున్నాడు కాబట్టి అక్కడి కుక్క నిన్ను ఏమి అనదు .దీనిని మార్జాల కిశోర న్యాయంగా పేర్కొన వచ్చు. ఈ విధానంలో ప్రమాదం ఏమాత్రం లేదు కానీ నిన్ను భగవంతుడు గుర్తించినదాకా ఎదురు చూడాలి. ఈ న్యాయంలో భక్తుడు పూర్తిగా భగవంతుని మీదనే ఆధారపడి ఉంటాడు. కేవలం భగవంతుడే భక్తుని మోర ఆలకించాలి. దీనిని మనం భక్తి మార్గంగా పేర్కొనవచ్చు. ఈ ,మార్గం జ్ఞ్యానమార్గం అంత కఠినమైనది కాదు. కానీ ఇక్కడ పూర్తిగా భక్తుడు దేముడి అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంటాడు. కాబట్టి ఇది చాలా సుదీర్ఘమైనది. త్వరగా సిద్దించదు.
ఈ రెండు న్యాయాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే మొదటిది నిన్ను నీవు భగవంతుడు గుర్తించేలా చేసుకోవటం. ఇక రెండోవది నిన్ను భగవంతుడు గుర్తించేదాకా ఎదురు చూడటం లాంటిది.
సాధక మిత్రమా నీకు రెండు న్యాయాలు తెలిసాయి కదా ఇప్పుడు నీవు ఏ న్యాయానికి మద్దతు ఇస్తావో వివరణాత్మకంగా తెలపండి.
ఓం తత్సత్
ఓకే శాంతి శాంతి శాంతిః
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి